ఇండియన్ స్టార్టప్స్.. లండన్ డ్రీమ్స్
లండన్… ఇదో మినీ భారతం. ఎవరైనా వెళ్లి స్వేచ్ఛగా … ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోగల నగరం. పెట్టుబడులు పెట్టాలేగానీ… మహరాజులా చూసుకుంటారక్కడ. అందుకే విదేశాల్లో విస్తరించాలనుకునే భారతీయ కంపెనీలు… లండన్ ను ఒక లాంచింగ్ ప్యాడ్ లా ఉపయోగించుకుంటున్నాయి. అక్కడివారికి అత్యధికంగా ఉద్యోగాలిస్తున్న విదేశీ కంపెనీల్లో ఇండియన్ కంపెనీలు రండో స్థానంలో ఉన్నాయి. ఒకప్పుడు మన దేశానికి వచ్చి కంపెనీలు పెట్టిన గడ్డనే మనవాళ్లిప్పుడు దున్నేస్తున్నారు. అలాంటి లండన్ మహానగరం మన స్టార్టప్స్ కు మరో గొప్ప అవకాశం కల్పించింది.
దేశంలోని ఎమర్జింగ్ స్టార్టప్స్ కు లండన్ లో నిర్వహించనున్న ఎగ్జిబిషన్ ఒక గొప్ప వేదిక అయింది. విదేశాల్లోనూ సత్తా చాటాలనుకునే కంపెనీలకోసం ఐఈ 20 (ఎమర్జింగ్ ఇండియా ట్వంటీ) పేరుతో భారీ ఎగ్జిబిషన్ కమ్ ఫెయిర్ నిర్వహించారు. దీనికి బ్రిటన్ ప్రభుత్వంతోపాటు బీడీఓ ఇండియా, న్యూల్యాండ్ ఛేజ్, యూకే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ , బ్రిటిష్ ఎయిర్ వేస్ మద్దతిచ్చింది.
ప్రమోషనల్ కంపెనీ లండన్ అండ్ పార్టనర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. 2 వేల ఇంటర్నేషనల్ బిజినెస్ సంస్థలతో ఇది కలిసి పనిచేసింది. అవి దేశ విదేశాల్లో విస్తరించేందుకు ప్రమోట్ చేసింది. విదేశాల్లో అడుగుపెట్టాలన్న ఉత్సాహం, నూతనత్వం, ప్రతిభ, పనితీరు ఆధారంగా ఒక స్టార్టప్ ను అంచనా వేసి ఒక జాబితా తయారు చేసింది. అలాంటి 20 ఇండియన్ ఎమర్జింగ్ కంపెనీల ప్రోడక్ట్స్ ను మార్చి 14 -15 తేదీల మధ్య లండన్ లో ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు బడా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. భవిష్యత్ లో వారు పెట్టుబడులు గుమ్మరించే అవకాశం లేకపోలేదు. పార్టనర్స్ గానూ చేసుకునే ఛాన్సుంది. లేదా టేకోవర్ చేయనూవచ్చు.
“అంతర్జాతీయ మార్కెట్ లో ఎదిగేందుకు లండన్ ను భారతీయ స్టార్టప్స్ వేదికగా ఉపయోగించుకోవాలి… ఇక్కడ అడుగుపెట్టాక వివిధ దేశాల్లో విస్తరించాలి” డేవిడ్
బిజినెస్ ఫ్రెండ్లీ సిటీగా లండన్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. కొత్త ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలతో విదేశాల్లో విస్తరించాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం. ఈ 20 స్టార్టప్స్ లో బెస్ట్ కంపెనీని ఒక ప్యానల్ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ఇండియా అంటే వ్యాపార మెళకువలు బాగా వంటబట్టించుకున్న దేశంగా పేరుంది. దేశంలో 4 కోట్ల 80 లక్షల చిన్న వ్యాపార సంస్థలున్నాయి. మొత్తం బ్రిటన్ లో ఉన్న చిన్న కంపెనీలు 2 కోట్ల 30 లక్షలు మాత్రమే. అంటే బ్రిటన్ కన్నా మనదేశంలో రెట్టింపు సంస్థలున్నాయన్నమాట.
“ భారత్ నుంచి చాలా నామినేషన్లు వచ్చాయి… చాలా సంతోషం. మొత్తానికి 20 కంపెనీలు ఎంట్రీ సాధించాయి. వీటిలో బెస్ట్ కంపెనీని ఎంపిక చేయడం అంత తేలిక కాదు. ఇది చాలా కష్టమైన పని.” మోరన్ బిర్జర్ , బ్రిటిష్ ఎయిర్ వేస్ రీజినల్ కమర్షియల్ మేనేజర్ సౌత్ ఏషియా
టాప్ 20లోకి వెళ్లిన కంపెనీలన్నీ సాంకేతికంగా, ఇన్నోవేషన్ లో గట్టిపట్టున్న కంపెనీలే. లైఫ్ సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, స్పోర్ట్స్ టెక్, ట్రావెల్ టెక్, యాడ్ టెక్, ఈ కామర్స్, అనలిటిక్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచే కంపెనీలే ఫైనల్స్ వరకు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్ ను తమవైపు తిప్పుకోదన్న ఉత్పత్తులు సేవలు అందిస్తేనే అంతర్జాతీయంగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందంటున్నారు బీడీఓ గ్రూప్ ఇండియా అడ్వైజరీ హెడ్ అర్బిందర్ చట్వాల్. భారత కంపెనీలు తమ అంతర్జాతీయ కలలను నెరవేర్చుకునేందుకు ఐఈ 20 ఒక మార్గమని చెబుతున్నారు. ఈ ఇరవై కంపెనీలు విదేశాల్లో విస్తరించే సత్తా ఉన్నవే. వీటి దగ్గర అద్భుతమైన విస్తరణ వ్యూహాలున్నాయి. వీటిలో దాదాపు 80 శాతం కంపెనీలకు విదేశాల్లోనూ అంతో ఇంతో అనుభవం ఉంది.
“గత ఏడాది నేను బెంగళూరు, హైదరాబాద్,ఢిల్లీ,గుర్గావ్, ముంబై వెళ్లాను. టెక్నాలజీ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిశాను. ఈ కామర్స్ నుంచి సాస్, ఈ హెల్త్ దిగ్గజాలతో బేటీ అయ్యాను. టెక్నాలజీ రంగంలో యూత్ చాలా డైనమిక్ గా ఉన్నారు. భారత్ లో వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. భారత్ లో టెక్ కంపెనీల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి.” డేవిడ్
డబుల్ ధమాకా
భారతీయ కంపెనీలకు లండన్ చాలా అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచ వ్యాపారానికే కేంద్రం ఈ మహా నగరం. ఎఫ్డీఐలకు యూరప్ గమ్యస్థానం. ఆసియా అవతల భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు అత్యుత్తమ నగరం లండన్. మన దేశంతో చాలా బలమైన, పురాతనమైన వాణిజ్య సంబంధాలున్న నగరం ఇది. టెక్నాలజీ, నాలెడ్జ్ ఆధారిత వ్యాపారాల్లో భారత్ తో గట్టి సంబంధాలున్న దేశం బ్రిటన్. లండన్ లోనున్న ఫ్రీ మార్కెట్ … ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. లండన్ స్టాక్ ఎక్సేంజ్ - నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మధ్య ఎంఓయూలు కూడా ఉన్నాయి.
భారత్ లో స్మార్ట్ సిటీల అభివృద్ధికి లండన్ సహాయ సహకారాలు అందిస్తోంది. ప్లానింగ్, టెక్నాలజీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలికాలంలో బ్రిటన్, భారత్ మధ్య పర్యాటకుల రాకపోకలు బాగా పెరిగాయి. భారత్ నుంచి విదేశాలకు వెళ్లి పనిచేసేవారి సంఖ్య బాగా పెరిగింది.
“ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ముఖ్యంగా… యంగ్ ప్రొపెషనల్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతుంది. యువతలో నేర్చుకోవాలన్న, విదేశాల్లోనూ విజయం సాధించాలన్న తపన బాగా పెరిగింది” మోరన్ .
లండన్ ట్రేడ్ ఎగ్జిబిషన్ లో విజయం సాధించిన కంపెనీలకు… ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారదిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం దక్కుతుంది. విదేశీ మీడియాలోనూ పబ్లిసిటీ వస్తుంది. లండన్ ఫెయిర్ కు వెళ్లిన కంపెనీల వివరాలను తెలుసుకోవాలంటే www.indiaemerging20.com వెబ్ సైట్లో చూడవచ్చు.