కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లా అభినవ అశోకుడు
పుడమి తల్లికి నిత్యహరితాభిషేకం చేస్తున్న వనజీవి రామయ్య
వనజీవి రామయ్య. అని గూగుల్లో కొడితే ఫటాఫట్ ఒక పది పేజీల ఆర్టికల్స్ కనిపిస్తాయి! సినిమా పర్సనాలిటీ కాదు. వ్యాపారవేత్త అంతకన్నాకాదు. విద్యావేత్త అనుకోడానికి వీల్లేదు. రాజకీయనాయకుడు అసలే కాదు. ముతక ధోతీ, లాల్చీ, మెడలో ఒక ప్లకార్డు! ఇంత సాధారణ వ్యక్తి గురించి పేజీల పేజీలు వ్యాసాలు, ఒక వికీపీడియా! చదివినా కొద్దీ ఆశ్చర్యమేస్తుంది. వెళ్లి కలుసుకుని మాట్లాడాలనిపిస్తుంది! ఆయన సైకిలెక్కి ఒక రోజంతా తిరగాలనిపిస్తుంది.
మాటలు చాలామంది చెప్తారు! చేసి చూపించినవాడే నిజమైన ఆదర్శవంతుడు! రామయ్య సరిగ్గా అలాంటి ఇన్స్పిరేషనే! వృక్షోరక్షతి రక్షితః! ఈ సూక్తి రామయ్య నరనరాల్లో స్ఫూర్తి నింపింది. అశోకుడో-ఇంకెవరో! అడుగుజాడ ఎవరిదైతే ఏంటి? ఆ జాడ నీడనిచ్చిందా లేదా అన్నది ముఖ్యం! నీడ అనే పదం రామయ్య జీవితం నిండా పరుచుకుంది! చల్లగా, హాయిగా, వెచ్చగా, పచ్చగా. అసలు పచ్చదనం అనే పదం నిత్యం ఆయన పెదాలమీద ఆడుతుంది! ఆయనకు ధనం లేదు. పచ్చదనమే ధనం. ఆకు-మొక్క-చెట్టు-నీడ-ఈ నాలుగు మాటల్ని రామయ్య నుంచి ఎవరూ విడదీయలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రామయ్య పుడమి తల్లికి నిత్యం పత్రాభిషేకం చేసే వనపూజారి. రాముడి పాదధూళి సోకి రాయి అహల్య అయిందంట. నిజమో కాదో తెలియదు కానీ- ఈ రామయ్య చేతి స్పర్శకు మాత్రం ప్రతీ విత్తనం వటవృక్షమవుతోంది!
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. దరిపెల్లి రామయ్య అంటే ఎవరికీ తెలియదు. అదే వనజీవి రామయ్య అనండి! చిన్నపిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు. భార్య పేరు జానమ్మ. ముగ్గురు కొడుకులు, ఓ కూతరురు. సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో నుంచి ఎవరూ కదలరు. కానీ రామయ్య మాత్రం అసలు ఇంట్లోనే ఉండడు. అడవుల్లోకి వెళ్తాడు. అన్వేషణ. పత్రాఅన్వేషణ, వృక్షాన్వేషణ, విత్తనాన్వేషణ. ఒకటా రెండా. బోలెడన్ని చెట్ల గింజలు. రకరకాల గింజలు. ఎవరికీ తెలియని పేర్లు. ఎవరూ చూడని విత్తనాలు. వాటన్నిటినీ సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేస్తాడు. తొలకరి చినుకులు పడ్డతర్వాత వాటిని నాటే కార్యక్రమంలో మునిగిపోతాడు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ ప్రదేశాలు, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. కొన్ని వందల రకాల విత్తనాలు- అడవుల్లో తప్ప జనారణ్యంలో పెద్దగా తెలియని చెట్లెన్నో రామయ్య చేతుల మీదుగా పురుడు పోసుకున్నాయి. వృక్షోరక్షతి.. రక్షితః’ అని రాసి ఉండే అట్ట ముక్కలను తలకు తగిలించుకుని ప్రచార పర్వంలో మునిగిపోతాడు. ఎక్కడ చిన్నబోర్డు కనిపించినా, పాతరేకులు కనిపించినా ఈ సూక్తి రాయందే రామయ్యకు మనసొప్పదు. రామయ్య ఇంటి నిండా ఇలాంటి రాతలే కనిపిస్తాయి. సినిమా పాటలను, విప్లవ గీతాలను పేరడీ చేసి మొక్కల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా అన్వయించి పాడుతాడు. అంతెందుకు మనుమళ్లు, మనుమరాళ్లకుకూడా చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశాడు. ప్రపంచంలో చాలామంది సంపాదించిన దాంట్లోంచి స్థిరాస్తులు కూడబెడతారు. కానీ రామయ్య అలాకాదు. అవసరమైతే పస్తులుండి మొక్కలు సేకరిస్తాడు. జేబులో ఇరవై రూపాయలుంటే అందులో పదిహేను రూపాయలు చెట్ల కోసమే ఖర్చు చేస్తాడు.
మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, ఆఖరికి ప్రధాని చేతుల మీదుగా కూడా రామయ్య అవార్డులు, పురస్కారాలు, జ్ఞాపికలు ఎన్నో అందుకున్నాడు. అయినా ఏ పూటకు ఆ పూట వంటగిన్నెలు వెతుక్కోవాల్సిన దుస్థితి. కడుపు నింపని దైన్యం అనుక్షణం వెనక్కులాగుతునే ఉంటుంది. ఆ జ్ఞాపికలన్నీ జ్ఞాపకాలుగా మిగిలాయి తప్ప పట్టెడన్నం పెట్టలేకపోయాయి. 1995లో కేంద్ర నుంచి వనసేవా అవార్డు దక్కింది. సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ వనమిత్ర పురస్కారంతో సత్కరించింది. కోటి మొక్కలు నాటినందుకు ఢిల్లీలో సన్మానం జరిగింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆ మధ్య డాక్టరేట్ ప్రదానం చేసింది. రామయ్య మంచి పనిని ప్రపంచానికి పరిచయం చేసే ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కినా- ఆయన లక్ష్యానికి మాత్రం తగిన ప్రోత్సాహం ఏనాడూ లభించలేదు. మెచ్చుకుంటారే కానీ ఆశయానికి చేయూతనివ్వరు. అదే రామయ్య బాధ. వయసు మీద పడింది. శరీరం సహకరించడం లేదు. బొటాబొటీ జీవితం. చాలీచాలని ఇంట్లో బతుకుతున్నాడు. అయినా రామయ్య భార్య ఏనాడూ ఇదేంటని ప్రశ్నించలేదు. భర్త కంటున్న పచ్చటి కలను ఆమె ఏనాడూ చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నా- మొక్కల కోసమే బయటకు వెళ్లిన మనిషిని- పల్లెత్తు మాట అనలేదు. కడుపు మాడినా- చెట్టు మాడొద్దు అనుకునే రామయ్య ఆశయాన్ని ఆమె ఎప్పుడూ అవమానపరచలేదు. పళ్లెంలో అన్నం మెతుకులు కూడా రామయ్యకు మొలకెత్తే గింజల్లాగే కనిపిస్తాయంటే- ఆయనెంత నిత్యహరితస్వాప్నికజీవో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు కాదు-అప్పుడు కాదు. 50-55 ఏళ్ల శ్రమ. సామాజిక స్పృహ మీద నిత్యం లెక్చర్లు దంచుతూ పేపర్లలో ఫోటోలు వేయించుకొనే మనుషులున్న ఈ రోజుల్లో -ఒక నిరుపేద గ్రామీణుడు పుడమితల్లికి పచ్చటి పందిరి వేయడమే జీవితాశయంగా పెట్టుకున్నాడంటే వింటుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రాముడి కోసం అందరూ రామకోటి రాస్తారు. కానీ ఈ రాముడు మాత్రం వృక్షకోటి రాస్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లె నుంచి మహబూబాబాద్ రూట్ లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ రామయ్య నాటినవే! అభినవ అశోకుడిగా ఖమ్మం జిల్లా ఖ్యాతిని పెంచాడు రామయ్య.
"రామకోటి రాస్తే మోక్షం వస్తుందో రాదో దేవుడెరుగు.. కానీ దరిద్రం పోవాలంటే మాత్రం కోటి మొక్కలు నాటాలి. అలా నాటిన వ్యక్తికి కచ్చితంగా మోక్షం వస్తుందని నా నమ్మకం. బడి, గుడి, రహదారి ఎక్కడైతే ఏంటి.. నీడనిచ్చే చెట్లు నాటాలి" అంటాడు రామయ్య.
ఇక్కడ ఇంకో మాట.. కెన్యా దేశంలో ఇలాగే కోటి మొక్కలు నాటినందుకు వంగరిమాతాయికి నోబెల్ బహుమతి వచ్చింది. మరి మన దగ్గర..? రూపాయి ఆశించకుండా కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్యను ఏమిచ్చి సత్కరించాలి. ఆ ధన్యజీవికి ఏ పచ్చటి హారాన్ని మెడలో వేయాలి..?