ఆర్థిక శక్తిగా ఎదిగాలనుకునే మహిళలకు మార్గాలివిగో..!
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ సత్తాను చాటేలా ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తోంది. ఈ ప్రయత్నంలో కర్నాటక సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. మహిళల కోసం ప్రత్యేక టెక్నాలజీ పార్క్ ను స్థాపించబోతోంది. బెంగళూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపుర తాలుకాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 300 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ టెక్నాలజీ పార్కు మహిళల సాధికారత కోసం దేశంలోనే ఒక కొత్త ఒరవడి సృష్టించనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మొదటి దశలో 100 ఎకరాల్లో అభివృద్ది చేసి.. 2016 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తిచేస్తారు.
ఈ టెక్నాలజీ పార్క్ లో కాన్ఫరెన్స్ హాల్స్, రెస్టారెంట్లు, గ్రాసరీ షాప్స్ ఏర్పాటు చేస్తారు. ఇక ప్రతిభ, ఆసక్తి గల కొత్త మహిళా ఆంట్రప్రెన్యూర్లకు కర్నాటక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. ఇక ఇదే తరహాలో మైసూరు, హుబ్లీ, ధార్వాడ్, బెలగావి, బళ్లారిలో మహిళల కోసం భవిష్యత్తులో క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం దేశంలో ఉన్న స్కీంలు...!
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ మరియు చిన్నతరహా పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్లు, జాతీయ బ్యాంకులు, ఇంకా కొన్ని ఎన్జీవోలు మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నాయి. అంతేకాదు చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అభివృద్ధి చేస్తున్నారు.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు శిక్షణ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. వారికి టీవీ రిపేరింగ్, లెదర్ సామాన్లు, సర్క్యూట్ బోర్డుల తయారీ లాంటివి నేర్పి చిన్న పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నాయి.
మహిళా ఉద్యమ్ నిధి..!
పుదుచ్చేరి ప్రభుత్వం మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న పథకాలను తెరపైకి తెచ్చింది. చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకువస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఈ స్కీం ప్రకారం పుదుచ్చేరి ప్రభుత్వం ఒక్కో యూనిట్ స్థాపనకు పదిలక్షల వరకూ ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. ఇందులో 75 శాతం రుణంగానూ, మిగితా 25 శాతం ప్రభుత్వం పెట్టే సీడ్ కాపిటల్‌గా వ్యవహరించనున్నారు.
మహిళా వికాస్ నిధి..!
ఈ స్కీం కింద ప్రభుత్వం మహిళలకు ఉపాధి అందించేందుకు వారికి ట్రెయినింగ్, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధులను మహిళలకు ఉపాధి మార్గాలు అందించేందుకు మాత్రమే వినియోగించడం విశేషం.
మహిళలకు ట్రెడ్ సబ్సిడీ స్కీం..!
ట్రేడ్ రిలేటెడ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అసిస్టెన్స్ ఆండ్ డెవలప్‌మెంట్ (ట్రెడ్) స్కీం ఈ పథకాన్ని మహిళను పారిశ్రామికరంగంలో ప్రోత్సహించేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఇందులో భాగంగా మహిళలు అప్లై చేసిన ప్రాజెక్టులకు 30 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు 70 శాతం నిధులను రుణంగా ఇస్తున్నారు. ఈ పథకం చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు తోడ్పాటును అందిస్తుంది. సాధారణంగా బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలు లేని వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
భారతీయ మహిళా బ్యాంకు..!
ఈ తరహా బ్యాంకు మహిళలను ఆర్థిక శక్తిగా మార్చేందుకు ఉద్దేశించినది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ఈ బ్యాంకునుర స్థాపించారు. 2013లో స్థాపించిన భారతీయ మహిళా బ్యాంకు 45 బ్రాంచీలకు విస్తరించింది. అంతేకాదు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేశారు. సుమారు ఒక కోటి రూపాయల వరకూ ఫ్రీ లోన్స్ అవకాశం ఉంది.
• బీఎంబీ శ్రింగార్ పథకం- ఈ క్రింద బ్యూటీ పార్లర్, స్పా లాంటివి ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నారు.
• బీఎంబీ అన్నపూర్ణ - ఆహార ఉత్పత్తుల వ్యాపారం కోసం రుణసదుపాయం
• బీఎంబీ పర్వరిష్ - డేకేర్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రుణసదుపాయం
మహిళా కాయిర్ యోజన
ఈ పథకం కింద కొబ్బరి పీచు, నార సంబంధిత ఉత్పత్తుల కుటీర పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తున్నారు. కొబ్బరి పంట విరివిగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉంది.