18 సార్లు ఫెయిలయ్యాడు…చివరకు అనుకున్నది సాధించాడు..
అది బెంగళూరులోని ఒక చిన్న రూం. కిటికీలు కూడా లేవు. మిణుకు మిణుకుమంటూ వెలిగే చిన్న లైట్. ఆ వెలుగులో 35 ఏళ్ల మహమ్మద్ ముజాకిర్ షరీఫ్ అనే యువకుడు సీరియస్ గా పనిచేసుకుంటున్నాడు. రాత్రి – పగలు అన్న తేడా తెలియడం లేదు. 10 ఏళ్ల నుంచి ఇలాగే. చిన్న గదినే ప్రయోగశాలగా మార్చేశాడు. నిద్రాహారాలు లేవు. టైం తెలియడం లేదు. చివరికి అనుకున్నది కనుగొన్నాడు.. ఇప్పడు దానిమీదనే దర్జాగా తిరుగుతున్నాడు..!! ఇంతకూ ఏం కనిపెట్టాడు..!? దేనిమీద తిరుగుతున్నాడు..?
ఎలక్ట్రిక్ సైకిల్
మధ్యతరగతి వారికోసం లక్ష రూపాయల కారును తయారు చేసింది టాటా కంపెనీ. అదే స్ఫూర్తితో ఎలక్ట్రిక్ బైక్ రూపొందించాలనుకున్నాడు ముజాకిర్ షరీఫ్. సామాన్యులకోసం అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయోగాలు చేశాడు. పదేళ్లపాటు కష్టపడి అనుకున్నది సాధించారు. దానికోసం చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా గానీ, సాంకేతికంగా గానీ ఎవరూ సాయం చేయలేదు. గైడ్ గానీ, ఆదుకునేవారు గానీ లేరు. అయినా ఒంటరిగానే ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నాడు ముజాకిర్ షరీఫ్.
భార్య అర్ధం చేసుకుంది
చాలా సమయం ముజాకిర్ ప్రయోగశాలలోనే గడుపుతారు. ఇంటికి అప్పుడప్పుడూ వస్తుంటాడు. అర్థం చేసుకునే భార్య దొరకడంన అదృష్టం అంటాడు. భర్త అనుకున్నది సాధిస్తాడన్న నమ్మకం ఆమెది. ఇంట్లో అంతమంది ఉన్నా భర్తను అర్థం చేసుకున్నది మాత్రం భార్య సాల్మానే. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుందన్న నమ్మకమే తనను పదేళ్లు నడిపిందని నవ్వుతూ చెప్తారు సాల్మా.
ఇంట్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ముజాకిర్ ను సోదరులు, చెల్లెళ్లు చిన్న చూపు చూశారు. హాయిగా ఉద్యోగం చేసుకోక ఇదేం పనంటూ నవ్వుకున్నారు. ఇంట్లో పోరు భరించలేక కొంతకాలం గల్ఫ్ దేశాల్లో గడిపారు. కొంత సంపాదించుకున్నాక ఆ డబ్బును భార్యకు ఇచ్చారు. దీంతో కొంతకాలం గడిచింది. మళ్లీ ప్రయోగాలకు అంకితమయ్యాడు.
ఆకాశమే హద్దు
ఒకసారి ప్రయాణం ప్రారంభించాక మళ్లీ దాన్ని ఆపలేదు. ప్రయోగాలు చేయకముందు హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో కొంతకాలం పనిచేశారు. లైఫ్ 9 టూ 5 కి పరిమితమైతే కొత్తగా ఏమీ చేయలేమని జాబ్ మానేశాడు.
పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే ప్రయోగాల మీదకి మనసు మళ్లింది. ఆ కారణంతోనే చాలా సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టుకున్నాడు. అయినా ప్రయోగాలు మానలేదు. మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు కనిపెట్టకూడదు అనుకున్నాను. అలా ముజాకిర్ పాత సామాన్లతో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశాడు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మన్ననలు అందుకున్నాడు. దీనికి సోదరుడు సాయం చేశాడు. ఎయిర్ క్రాఫ్ట్ కు బజాజ్ స్కూటర్ ఇంజన్ వాడారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సాయం లేకుండానే ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశారు. జీవితంలో ఏదో ఒకటి కనిపెడతానని అప్పుడే అనుకున్నాడు.
చిన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసినప్పుడు ముజాకిర్ షరీఫ్ ను అందరూ విజ్ కిడ్ అన్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హెచ్ఏఎల్ లో ఉద్యోగం ఇప్పించారు. అయాం ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ ప్రశంసా పత్రాలను పంపారు.
హెచ్ఏఎల్ లో హెలికాప్టర్ డివిజన్ లో కొన్నేళ్లు పనిచేశారు ముజాకిర్. విమానం రోటర్ బ్లేడ్ గేర్ బాక్స్ తయారు చేశాడు. రాత్రనక పగలనక పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. జీతం తప్ప గుర్తింపు రాలేదు. బాగా ఆలోచించి ఉద్యోగం మానేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఇంట్లో అందరూ తిట్టారు. స్నేహితులు కూడా ఎందుకురా కెరీర్ పాడుచేసుకుంటావని తిట్టిపోశారు. అయినా తన నిర్ణయానికి కట్టుబడి హెచ్ఏఎల్ లో జాబ్ కు గుడ్ బై చెప్పాడు.
ఒకసారి సైంటిస్ట్ అయితే జీవితాంతం సైంటిస్టుగానే
హైస్కూల్ విద్య తర్వాత ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేశాడు ముజాకిర్. ఫైనల్ ఇయర్ లో ఉండగానే తోటి విద్యార్థులతో కలిసి మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశారు. అయితే అది విజయవంతం కాలేదు. విద్యార్థులు క్రికెట్, పార్టీలకిచ్చిన ప్రాధాన్యత ప్రయోగాలకు ఇవ్వడం లేదని, అందుకే ప్రయోగం విఫలమయ్యిందంటాడు ముజాకిర్ షరీఫ్.
జీవితంలో ఎన్ని వైఫల్యాలు వెక్కిరించినా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేశాక చిన్నారులు, పేదల కోసం ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారు చేయాలనుకున్నాడు. అలా బెంగళూరులోని చిన్న రూంలోనే ప్రాజెక్టు ప్రారంభించాడు. అహోరాత్రులు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఎటైనా వెళ్లాలనుకుంటే షరీఫ్ దానిమీదనే దర్జాగా తిరుగుతాడు.
ఇది ఒక సామాన్యుడి విజయం. సిన్సియర్ గా పనిచేస్తే విజయం దానంతట అదే వస్తుందని నిరూపించాడు ముజాకిర్. తన కుమార్తెను కూడా సైంటిస్టును చేస్తానని గర్వంగా చెప్తున్నాడు.