పాత పేపర్లు కొంటాం.. పర్యావరణాన్ని కాపాడతాం..!! వ్యాపారం కమ్ సోషల్ మెసేజ్!
నేటి న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్ అంటారు. అలాంటి కాయితాల వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతోంది. ఇండియాలో రోజుకు కొన్ని వేల టన్నుల కాగితం వినియోగిస్తున్నారు. ప్యాకేజింగ్ లో , పొట్లాలు కట్టడంలో పేపర్లు వాడడం ఇండియన్స్ లైఫ్ స్టైల్ లో భాగం..అలా వాడిన పేపర్లలో 20 శాతం రీసైకిల్ అవుతుండగా మిగిలిన 80 శాతం చెత్త ద్వారా డంప్ యార్డ్ కు తరలిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 కల్లా పేపర్ వినియోగం డబుల్ అవుతుందని ఓ సర్వే అంచనా. అంటే వేస్టేజ్ కూడా డబుల్. అంటే పేపర్ కోసం నరికే చెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది . అంటే పొల్యూషన్ కూడా డబుల్. ఈ పరిస్థితిని మార్చాలన్న ఆలోచన ఆ ఇద్దరినీ లక్ష్యంవైపు నడిపేలా చేసింది. పేపర్ రీ సైక్లింగ్ తో సరికొత్త స్టార్టప్ కి ప్రాణం పోసింది.
ఇంటిదగ్గరే..కొంటాం
కపిల్ బజాజ్,సందీప్ సేథీ ఇద్దరూ మంచి మిత్రులు. చదువు పూర్తి చేసుకుని ఐటీ, ఫైనాన్షియల్ మార్కెట్ రంగాల్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వీరిద్దరికీ మొదటి నుంచి సామాజిక బాధ్యత ఎక్కువ. వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు .ఓ రోజు రోడ్డుపై వెళుతుంటే కొన్ని వందల వేస్ట్ పేపర్స్ కనబడ్డాయి. వీటి తయారీకి ఎన్నిటన్నుల కాగితం వృధా అవుతుందో, ఆ కాగితాన్ని తయారు చెయ్యటం లో ఎంత పొల్యూషన్ పెరిగి వుంటుందో -ఇంకా ఇట్లా ఎనెన్ని నగరాల్లో ఎంత కాగితం వేస్ట్ అవుతుందో కదా.. అన్న ఆలోచనలు వారిని వెంటాడాయి. అదే పేపర్ రీసైక్లింగ్ స్టార్టప్ ఆలోచనకి బీజం వేసింది .
ఇండియాలో ప్రతి కుటుంబం సంవత్సరానికి 100 కేజీల పేపర్ వాడుతోంది. ప్రస్తుత రీసైక్లింగ్ స్థితిని చూస్తే కొత్త పేపర్ తయారుచేయాలంటే పెద్ద మొత్తంలో చెట్లను నరకాల్సి ఉంటుంది.లేదా ఇతర దేశాల నుండి వేస్ట్ పేపర్ ని దిగుమతి చేసుకోవాలి. ఇది మన పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. జనాల్లో అవగాహన కల్పించి పేపర్ వృథా తగ్గిస్తే చెట్లు నరకాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఇదే మమ్మల్ని ఆలోచింపచేసింది.-కపిల్ బజాజ్
అనుకున్నదే ఆలస్యం.. వీరిద్దరూ కార్యాచరణ ప్రారంభించారు. కబాడీ ఎక్స్ ప్రెస్ పేరుతో డొమైన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పేపర్ సేకరించడం, తరలించడం వంటి వాటితో పాటు మార్కెటింగ్, కస్టమర్ మైండ్ సెట్ వంటి విషయాలపై బాగా స్టడీ చేసి నాలుగు నెలల క్రితం ఈస్ట్ ఢిల్లీలో ఆపరేషన్స్ ప్రారంభించారు.
వర్కింగ్ స్టైల్
కబాడి ఎక్స్ ప్రెస్ నగరంలోని పెద్ద పెద్ద హౌసింగ్ సొసైటీస్, అపార్ట్ మెంట్స్ కమిటీస్ తో సమావేశాలు నిర్వహించి వారికి తామందించే సేవల వివరాలను తెలియజేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఇంటికి 15 కేజీల వరకూ వేస్ట్ పేపర్ నిల్వచేసే బ్యాగ్ లను అందిస్తారు. ఆ బ్యాగ్ నిండిన వెంటనే వారు కబాడి ఎక్స్ ప్రెస్ కి కాల్ చెయ్యాలి. కస్టమర్ కాల్ అందుకున్న వెంటనే కంపెనీ టీం అక్కడికి చేరుకుని ఆ బ్యాగ్ ని కలెక్ట్ చేసుకుంటారు. పారదర్శకత కోసం డిజిటల్ వెయింగ్ మిషన్ల తో పేపర్ బ్యాగ్ బరువును తూచి దానికి ప్రైస్ తోపాటు రిసీట్ కూడా వెంటనే ఇస్తారు. ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణ కు వారి వంతు సహాయం చేస్తున్నందకు ధన్యవాదాలు అంటూ ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపుతుంది. చెత్త బుట్ట ఎలాగైతే వేస్టేజ్ ని కలెక్ట్ చేసే పనిచేస్తుందో అలాగే మేం కూడా పాత పేపర్లను పారెయ్యకుండా ఒకచోట ఉంచేలా వారికి అలవాటు చేయడానికి బ్యాగ్ లను అందిస్తున్నాం . అది మంచి ఫలితాల్ని ఇస్తోందంటున్నారు కపిల్.
మేం కస్టమర్స్ నుంచి మార్కెట్ ధర చెల్లించి పేపర్ సేకరించి వాటిని రీసైకిల్ మిల్లులకు అమ్ముతాం. కస్టమర్ నుంచి కిలో 10 రూపాయలకు కొని రీసైక్లింగ్ మిల్లులకు పదమూడున్నర రూపాయలకు విక్రయిస్తున్నాం. దీనివల్ల మధ్య దళారుల ప్రమేయం తగ్గి.. కస్టమర్లకు కూడా ఎక్కువ ప్రయోజనం అందుతుంది-కపిల్
అలాగని కేవలం పేపర్ సేకరణ మాత్రమే మా ప్రధాన ఆదాయ వనరు కాదు. పేపర్ సేకరించే బ్యాగ్ లపైనా ప్రకటనలు ముద్రించి ఆదాయం పొందుతున్నారు. దీనివల్ల ఆయా కంపెనీలకు పబ్లిసిటీతో పాటు సేవల్ని మరింత విస్తరించడానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఇతర రీసైక్లింగ్ బేస్డ్ స్టార్టప్స్ కి కబాడీ ఎక్స్ ప్రెస్ కి ఇదే ప్రధాన తేడా. కస్టమర్స్ ని ప్రత్యక్షంగా కలిసి.. రీసైక్లింగ్ , పర్యావరణ హితానికి చేస్తున్న కార్యక్రమాల్ని వివరించి.. వారిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు నెలల కాలంలో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే కబాడీ ఎక్స్ ప్రెస్ 2 వేల మంది కస్టమర్స్ ని సంపాదించుకుంది. రాబోయే ఆరు నెలల్లో ఘజియాబాద్ తో పాటు రోహిణి, ద్వారక వంటి నగరాలకు విస్తరించాలని కబాడి ఎక్స్ ప్రెస్ ప్రణాలికలు రచిస్తోంది.
మరి వేస్ట్ పేపర్ వాలాల బతుకుదెరువు?
కబాడీ ఎక్స్ ప్రెస్ ఇంటింటికీ తిరిగి పేపర్ తీసుకునే కబాడీ వాలాల బతుకుదెరువును దెబ్బతిస్తుందా అంటే కాదనే అంటున్నారు .
"మేం లోకల్ గా ఉండే కబాడీ వాలాలతో టచ్ లో ఉండి మా చానల్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించే మార్గాల్ని వివరించి వారిని మాతో కలిసి పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ధరలో తూకంలో కబాడీ ఎక్స్ ప్రెస్ అనుసరిస్తున్నపారదర్శకమైన కొత్త పద్దతి వారికి నచ్చడం లేదు. అందుకే మాతో కలిసి పనిచేసేందుకు అంతగా ఇష్టపడట్లేదు. కానీ తొందర్లోనే వారిలో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం - కపిల్.
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా నగరాల్లో పాత పేపర్లు కొనడానికి దరలో తూకంలో ప్రమాణాలు పాటించని లోకల్ స్క్రాప్ వ్యాపారులే దిక్కుగా ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చి గుడ్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్అందించే దిశగా కృషి చేస్తోంది కబాడి ఎక్స్ ప్రెస్. సేవ్ పేపర్- సేవ్ నేచర్ నినాదంతో వ్యర్థాలను సమర్థంగా ఉపయోగించి ఆదాయం పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతోంది.