డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహా సభలు

12th Sep 2017
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు భాగ్యనగరంలో మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాస్తవానికి అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. అక్టోబర్ 5 నుంచి 9వరకు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాదులోనే జరుగుతున్నది. నవంబర్ 28 నుంచి 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు కూడా హైదరాబాదే వేదిక. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంటుంది కాబట్టి, తెలుగు మహాసభలు అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

image


వీటి నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్ల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కేసీఆర్ విద్యా సంస్థలను ఆదేశించారు. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఆ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధిచిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని సీఎం ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్ నే అన్ని పాఠశాలల్లో బోధించాలని సీఎం స్పష్టం చేశారు.

ఇకపోతే తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను కచ్చితంగా తెలుగులో రాయాలని సీఎం పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డులపై పైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం నిర్ణయించారు.

ఇక ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషా వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉంటాయి.

ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి.

ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథా ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శిస్తారు. పద్యగానం, సినీ పాటల విభావరి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోతల పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలు లాంటి అంశాలు ప్రదర్శిస్తారు. వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసీ, గిరిజన, జానపద నృత్యాలు లాంటివి ఉంటాయి. మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా అందజేయబడ్డాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి.

దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానిస్తారు. దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికా, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ నలుమూలల్లో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరుగుతాయి.

కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషా వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేస్తారు. అతిథులందరికీ ప్రభుత్వం తరుఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు ఉంటాయి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్దికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరుగుతుంది.

మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేస్తారు. తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శిస్తారు.

నగరంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మిస్తారు. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణలో తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహిస్తాయి. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధరకాల పోటీలు నిర్వహిస్తారు. వాటిలో వ్యాస రచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన, నాటకాలు లాంటి ప్రక్రియలుంటాయి.

తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని వర్ణశోభితంగా అలంకరిస్తారు. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో కూడా అలంకరణలు ఉంటాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close