గంగను కాపాడుతున్న నేటి తరం భగీరథులు
గంగను మన భూమి పైకి తెచ్చిన భగీరథుడి కధ అందరికీ తెలిసిందే ! అయితే ఇప్పుడు, ఆ గంగా నదీమ తల్లి ఉనికి కాపాడడానికి కొంతమంది అపర భగీరథులు తమ ప్రయత్నం చేస్తున్నారు. రోజురోజుకీ ఎండిపోత్తూ గంగానది వినాశనానికి కారణమవుతున్న అంశాలు ఏమిటి ? వాటిని ఎలా ఎదుర్కోగలం అనే విషయం పై వచ్చిన మూడు భాగాల డాక్యుమెంటరీ " రిటర్న్ ఆఫ్ ద గంగ".
కాలుష్య కాసారంగా మారుతున్న గంగను శుద్ధి చేసే కార్యక్రమాన్ని మోదీ సర్కార్ ఇప్పుడు చేపట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లకు పైగా కేటాయించింది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున గంగపై హంగామా జరుగుతోంది కానీ.. కొన్నేళ్లు క్రితమే ఓ అన్నాచెల్లల బృందం ఈ జీవనదిపై ఓ పెద్ద కార్యక్రమాన్నే తలెకెత్తుకుంది.
మార్తాండ్ బిందన, వల్లీ బిందన. వీరిద్దరూ అన్నా చెళ్ళెళ్ళు. గంగా నది పై ఉన్న ప్రేమతో ఓ ప్రాజెక్టు చేపట్టారు. పర్యావరణం పై వారికున్న అపార అభిమానం, వారి దగ్గరున్న కాస్త అనుభవం, అతి కొద్ది డబ్బు పెట్టుబడిగా ఈ ప్రాజక్టు ప్రారంభించామంటారు. గంగను రక్షించుకోవాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి ? ఆ చర్యలు చేపట్టాలంటే అవకాశాలు ఏంటి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వల్లీ, మార్తాండ్‌లు “రిటర్న్ ఆఫ్ ది గంగ” అనే కార్య క్రమాన్ని చేపట్టారు.
భారతదేశంలోనే పొడవైన మరియు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నది గంగా నది. ఇది, కొన్ని కోట్ల మందికి జీవనాధారం. ఒక్క మానవ దేహమేకాదు, ఆత్మను సైతం పునీతం చేసే నదిగా గంగను భావిస్తారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న గంగా నది ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయి ఎండిపోయే పరిస్థితిలో ఉంది. దీనికి కారణం, ఈ నది పై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజక్టులు, ఇతర పర్యావరణ ప్రతికూల చర్యలు . ప్రపంచంలో అత్యంత కలుషితమైన ఐదు నదుల్లో ఒకటి మన గంగా నది.. అని తెలిసాక కూడా సంరక్షణ చర్యలు చేపడ్తున్న దాఖలాలు లేవు.
గంగా నది ప్రక్షాళనపై ఎన్నో పరిశోధనలు, నివేదికలు, పలు ప్రణాళికలు, చేపట్టవలసిన సంరక్షణ చర్యల గురించి కథనాలు రాని వార్తా పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు, ప్రముఖ వార్తా ఛానల్స్ లో ప్రైమ్ టైమ్‌లో ప్రముఖ చర్చనీయాంశం అయ్యింది. ఈ నది ఒడ్డున జీవించే ఎంతో మంది ఔత్సాహికులు, రాజకీయ నాయకులు, పలు విద్యుత్ సంస్థలు, పర్యావరణ విశ్లేషకులు, కొన్ని మత ప్రచార సంస్థలు, జియాలజిస్టులు, భూకంప శాస్త్రవేత్తలు అందరూ, గంగా నది సంరక్షణ, ఉనికిని కాపాడడం అనే అంశాన్ని తలో దృష్టితో చూస్తూ అసలే దురవస్థలో ఉన్న గంగా నది ఉనికిని మరింత క్లిష్టపరిస్థితుల్లో పడేస్తున్నారు. అసలు విషయం మరుగున పడిపోవడమూ, సామాన్య ప్రజానీకానికి అర్ధం కాకపోవడమూ జరుగుతోందన్నది నిజం.
గంగలో రోజు రోజుకీ పెరుగుతున్న అసంఖ్యాకమైన కలుషిత పదార్ధాలు, స్వార్ధపూరిత ప్రయోజనాలతో, ఈ నది పై కట్టిన ఆనకట్టల సంఖ్య చూస్తే గంగా నది ప్రస్తుత దారుణ పరిస్థితి అర్ధం అవుతుంది. ప్రక్షాళనకై చేపట్టే వైరుధ్యమైన సంరక్షణ చర్యల అమలు కంటె చురుగ్గా ఈ పనుల్లో అవినీతి, లంచగొండితనం చోటు చేసుకుంటున్నాయన్న విషయం మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.
“రిటర్న్ ఆఫ్ ది గంగ” అనేది మూడు భాగాల డాక్యుమెంటరీ. మనం ఉంటున్న ఈ భూమిని, చుట్టూ ఉన్న నీటిని ఎలా సంరక్షించుకోవాలి అన్న అంశం పై ప్రజల్లో నెలకొని ఉన్న పలు సందేహాలను నివృత్తి చేసే డాక్యుమెంటరీగా దీనిని రూపొందిచారు. ఓ పక్క సంరక్షణ చర్యలంటూనే మరో పక్క, స్వార్ధ పూరిత చర్యలతో మన భూమిని, నీటిని, దోచుకుంటున్న దోపిడీదారుల వైనాన్ని తెలియచేసేదిగా రిటర్న్ ఆఫ్ ది గంగ కు రూపకల్పన చేశారు. వైరుధ్య ప్రకటనలు, చర్యలతో విషయం అర్ధంకాక, గజిబిజికి లోనయ్యి అసలు విషయాన్నే వదిలేసే ప్రజానీకానికి సరైన అవగాహన కల్పించాలన్నదే ఈ ప్రాజక్టు లక్ష్యమని వల్లీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం త్వరితగతిన మనప్రపంచంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల నేపధ్యంలో, మనం మన జీవ నది పై కట్టిన 600 ప్రాజక్టుల ఫలితాల్ని తెలియచేస్తూ, మన మరియు మన తర్వాతి తరాల మనుగడ కొనసాగించాలంటే ఏం చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ? లాంటి ఎన్నో విషయాలను వివరించే డాక్యుమెంటరీగా వల్లీ, మార్తాండ్ లు "రిటర్న్ ఆఫ్ ది గంగ"ను రూపొందించారు.
కేవలం ఇద్దరి సభ్యుల టీమ్‌గా వల్లీ, మార్తాండ్ లు, 2012 సెప్టెంబర్ లో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ పరిశోధన చేసి, స్క్రిప్ట్ తయారు చేసుకుని డాక్యుమెంటరీ షూటింగ్ కై వారి ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నిధుల లేమి వారికి ప్రధాన సమస్యే అయినా ఆశయ సాధనకి అది అడ్డంకి కాలేదన్నది గమనార్హం. గంగా నది పరిరక్షణకై ఎన్నో వందల ప్రణాళికలు ప్రాజక్టులు ఉన్నా, ఏ ఒక్క ప్రాజక్టూ, ఉద్దేశించిన ఫలితాలివ్వలేదన్నది వాస్తవం. అసలు ప్రజలు పరిరక్షణ చర్యలకు సుముఖంగా లేరనే వాదనకు భిన్నమైన వాదన వినిపిస్తుంది వల్లీ.
“రిటర్న్ ఆఫ్ ద గంగ” కు పలు జాతీయ అంతర్జాతీయ పర్యావరణవేత్తలనుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. అయితే ఎంత ప్రయత్నించినా పర్యావరణ, శక్తి వనరులు, గామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖలు మాత్రం తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం లేదనీ, ఈ విషయం పై వారి దృష్టి కోణాన్ని తెలుసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాం అంటారు వల్లీ.
సమాజం నుంచి కానీ, పలు అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడమే కాదు, ఈ ప్రాజక్టు కోసం నిధుల సమీకరణ కూడా క్లిష్టమైన సమస్యే! ఓ పక్క షూట్‌కి కావాల్సిన పరికరాలను కొనడం, వాటి వినియోగించే పద్ధతులు తెలుసుకోవడం, దశాబ్దాలుగా ఈ సమస్య పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వారిని కలుసుకోవడం, వారి నుంచి విలువైన సమాచారాన్ని సంపాదించి, విషయం పై అవగాహన కల్పించుకుంటూ మరోపక్క నిధుల కోసం వేట అంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపధ్యంలో సమయాన్ని నష్టపోతున్న మాట వాస్తవమేనని చెబుతూ వర్షాకాలం లో శ్రీనగర్ లోయను వరద ముంచెత్తే సమయంలోనో, ఆ తర్వాత కానీ ఈ డాక్యుమెంటరీని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వల్లీ పేర్కొన్నారు. ఇంకా షూటింగ్ మిగిలి ఉందని చెబుతూ లక్ష రూపాయలు కూడా లేకుండా పని చేపడుతున సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని నవ్వుతూ, ఈ ప్రాజక్టు చేయడంలో భావోద్వేగాలకు గురయిన క్షణాలు ఎన్నో ఉన్నాయన్నారు.
పనిలో భాగంగా వారు ఎన్నో రకాల వ్యక్తులను కలుసుకున్నారు. కొంతమంది, ఇది అనవసరమైన ప్రాజక్టు అంటూ నిరుత్సాహపరిస్తే మరికొంతమంది వృధా ప్రయాస, విలువైన సమయం వృధా చేసుకోవడమనీ కొట్టి పడేశారు. మరో వైపు భుజం తట్టి ప్రోత్సహించిన వారు లేకపోలేదు. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా, ఈ ప్రాజక్టుకు తన బేషరతు మద్దతును ప్రకటించారు.
నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ''ఈ ప్రాజక్టుకు తను మద్దతు తెలపడం పై ఎటువంటి రభస చేయవద్దనీ అంటూ, ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన విపత్తు లేదా ఏటా దేశంలో పలు చోట్ల పలు రకాలుగా ప్రకృతి చేస్తున్న విలయ తాండవాల్ని దృష్టిలో ఉంచుకుని, భూమాతకు, ప్రకృతికి మనం చేస్తున్న నష్టాన్ని పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేయడం అందరి బాధ్యత. స్వార్ధ ప్రయోజనాలకోసం చేపడుతున్న పలు ప్రాజక్టులను, అడవుల నరికివేతను అరికట్టాలి. గనుల కోసమంటూ కొండలను పిండి చేసే దోపిడీని ఆపాలి. ఇప్పటికే చాలా నష్టపోయాం. అది పూడ్చలేని నష్టమే అయినా, కనీసం, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అసలు మనం ప్రయత్నించలేదు అనుకునే కన్నా, జరిగిపోయిన నష్టాన్ని, జరగబోతున్న నష్టాన్ని గురించి అవగాహన కల్పించడం మేలు'' అంటారు.
ఒక్క గంగా నదే కాదనీ, ఇతర పెద్ద నదులు కూడా ఈ రకమైన వినాశనానికే గురవుతున్నాయని, అయితే గంగ మనకి అత్యంత ముఖ్యమైన జీవనది కావడం వల్లే దీన్ని ఎంచుకున్నామని వల్లి, మార్తాండ్‌లు అన్నారు. మనందరం కలిసి కట్టుగా గంగ వినాశనాన్ని అడ్డుకో గల్గితే, ఇతర నదులను కాపాడుకునే అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ.
ఈ ఫిల్మ్‌ను ప్రభుత్వ శాఖలలోని ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలనేది వీళ్ల ఆలోచన. దీనితో ప్రభుత్వంలోనే పర్యావరణం గురించి ఆలోచించే ఛాంపియన్లను తయారు చేయడానికి, పర్యావరణ విషయాలను రోజువారి చర్యల్లోనూ, చర్చల్లోనూ భాగం చెయ్యడానికి వీలవుతుంది.
“రిటర్న్ ఆఫ్ ద గంగ” ప్రాజక్టు కు సహకరించాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.