కార్ సర్వీసింగ్‌లకు కేరాఫ్‌గా మారుతామంటున్న 'మోటార్ ఎక్స్పర్ట్'
కారులో షికారు ఎంత బావుంటుందో, దాని బాగోగులు చూడడానికి నమ్మకస్తుడైన సర్వీస్ సెంటర్ వెతక్కోవడం అంత కష్టంగా వుంటుంది. ఫలానా సెంటర్ బావుంటుందని ఎవరైనా చెప్పాలి. లేదా, బాగానే వుంటుందిలే అని మన అదృష్టాన్ని నమ్ముకుని కారును అప్పజెప్పాలి. నిజానికి సర్వీస్ సెంటర్ల మార్కెట్ ఇంకా అవ్యవస్థీకృతంగానే వుంది. ఇక్కడ సెంటర్ల విశ్వసనీయత చాలా సమస్య. సరైన ట్రెయినింగ్ లేని మెకానిక్‌లు, నాణ్యత లేనిసర్వీస్, అసలు ఒకసారి కారు సెంటర్‌కి ఇచ్చాక, వాళ్ళేం చేసారో ఏం చేయలేదో మనకి తెలియదు. వాళ్లేం చేసామంటే అది నమ్మాల్సిందే, అడిగినంతా ఇవ్వాల్సిందే. వాహనం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు.
2013 జులైలో రునాల్ దహివాడె, అల్పేష్ జైన్ కలసి మోటర్ ఎక్స్పర్ట్ పోర్టల్ ప్రారంభించారు. కార్ల జనరల్ సర్వీస్‌తో పాటు, బ్రేకులు, సస్పెన్షన్, బాడీ వర్క్ లాంటి అన్ని సర్వీసులనూ అందించే కంప్లీట్ సొల్యూషన్ ఈ పోర్టల్. ఫ్రాంచైజ్డ్, నాన్ ఫ్రాంచైజ్డ్ సర్వీస్ సెంటర్లన్నిటినీ ఒక నెట్‌వర్క్‌గా మార్చి ఈ పోర్టల్ రూపొందించారు.
'' హోటల్స్‌లో ఓయో రూమ్స్ ఎలానో, కార్ సర్వీస్ రంగంలో మేం అలాంటి వాళ్లం. ఇందులో మాదే మొదటి పోర్టల్. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లోని బ్రాండెడ్ వర్క్ షాపులన్నీమా నెట్‌వర్క్‌లో వున్నాయి '' అని చెప్పారు మోటర్ ఎక్స్పర్ట్ ఇన్ కో ఫౌండర్, సిఇఓ రునాల్.
ఈ పోర్టల్ పెట్టుబడి 2015 ఆగస్టు నాటికి 3.8 కోట్లకు చేరింది. ఇటు కస్టమర్లకు (కార్ ఓనర్లకు) అటు, వర్క్ షాప్ ఓనర్లకు ఉపయోగపడేలా, సరికొత్త ఫీచర్లతో ఈ మధ్యే మోటోఎక్స్పర్ట్ యాప్ కూడా మార్కెట్లోకి వచ్చింది.
ఈ యాప్ ద్వారా కస్టమర్లతో వర్క్ షాప్‌లు చాట్ చేయొచ్చు. కారు మంచి చెడ్డలు, సర్వీస్ బుకింగ్‌లు చేసుకోవచ్చు. సర్వీస్ ప్రోగ్రెస్‌కి సంబంధించి ఎప్పటికప్పడు కస్టమర్లకు లైవ్ అప్డేట్స్ ఇవ్వొచ్చు. దీంతో పాటు వర్క్ షాపులకు ఇంకో ఉపయోగకరమైన ఫీచర్ కూడా వుంది. స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ కొనుగోళ్ళు, సిబ్బంది నియామకాలు కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా దగ్గరలో స్పెషలిస్టు సర్వీస్ సెంటర్ ఎక్కడుందో లొకేట్ చేయొచ్చు. ఆ సర్వీస్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవడం, ఫాలో అప్ చేయడం, చివరికి పేమెంట్లు కూడా ఈ యాప్ ద్వారా చేయొచ్చు. మొత్తం మీద సర్వీస్ రంగాన్ని ఈ యాప్ తో ఒక పద్ధతిలోకి తేవాలని ఈ పోర్టల్ నిర్వాహకులు అంటున్నారు.
ప్రస్తుతానికి ఈ యాప్ సేవలు ముంబై వరకే పరిమితం చేసారు. త్వరలో దీని పరిధిని మరింత విస్తృత పరిచి ఇతర నగరాలకు కూడా తీసుకెళ్తారు. ప్రస్తుతానికి 25 వర్క్ షాపులతో టై అప్ పెట్టుకున్న ఈ యాప్, త్వరలోనే ఈ సంఖ్యను 65కి పెంచాలని ప్లాన్ చేస్తున్నారు.
కస్టమర్ల సంఖ్య పెంచుకోవడానికి మోటార్ ఎక్స్పర్ట్ పోర్టల్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. క్లయింట్ వర్క్ షాప్‌ల ద్వారా తొలి దశ ప్రయత్నాలు జరిగాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్స్, పి ఆర్ క్యాంపెయిన్స్, ప్రింట్, టీవీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు.
ఆదాయం ఎలా ?
ఆటోమెటివ్ స్పేర్‌పార్ట్స్, యాక్సెసరీస్ మార్కెట్ ఏడాదికి 20 బిలియన్ డాలర్ల దాకా వుంటుందంటారు రునాల్. ఈ మార్కెట్‌నే మోటో ఎక్స్పర్ట్ ప్రస్తుతం టార్గెట్ చేస్తోంది. ఈ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అమ్మే వారికి, కొనే వారికీ( వర్క్ షాప్ లు) మధ్య వారధిలా వుండబోతోంది.
వీరి మధ్య జరిగే ప్రతీ కొనుగోలుకీ కమిషన్ వసూలు చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటోంది.
మార్కెట్ సైజ్ , కాంపిటీషన్
2013లో ప్రపంచంలో కార్ల ఉత్పత్తిలో ఇండియా ఆరవ స్థానం లో వుంది. ఇక ఆ తర్వాత సంవత్సరం రికార్డు స్థాయిలో 23.4 మిలియన్ల కార్లను ఇండియా ఉత్పత్తి చేసింది. 2012-13లో ఆటో మ్యానుఫాక్చరర్ల టర్నోవర్ 67 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత సంవత్సరం ఆటోమేటివ్ కాంపొనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ 35 బిలియన్ డాలర్లుగా అంచనా వేసారు. ఇక ఆటో ఆధారిత ఎగుమతుల వల్ల 10.2 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2013లో ఇండియన్ రోడ్ల మీద రిజిస్టర్ అయిన మోటర్ వాహనాల సంఖ్య 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్ల వరకు కార్లు, జీపులు,టాక్సీలే వున్నాయి.
దాదాపు 12 మిలియన్ల వరకూ వారంటీలేని కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయని ఒక అంచనా. వీటి సంఖ్య ప్రతి ఏడాది రెండేసిమిలియన్ల చొప్పున పెరుగుతోంది.
ఈ లెక్కలన్నీ చూస్తే, ఇండియాలో ఆటోమేటివ్ సెగ్మంట్ ఆఫ్టర్ సేల్స్ మార్కెట్ ఎంత భారీగా వుందో అర్థమవుతోది. రోజు రోజుకూ ఈ మార్కెట్ పెరుగుతూ వుండడంతో ఫ్రాంచైజ్, నాన్ ఫ్రాంచైజ్ వర్క్‌షాపుల సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. పెద్ద పెద్దనగరాల్లో దాదాపు 60 శాతం మంది ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్లు అసంఘటితంగానే వున్నారు. వీరినందరినీ ఆర్గనైజ్ చేసి,ఒక తాటి మీదకి తీసుకొస్తే, ఈ రంగంలో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశాలు వుంటాయి. ఈ పని మేమే చెయ్యాలనుకుంటున్నామని రునాల్ అంటున్నారు.
అయితే, ఈ మార్కెట్లో మోటార్ ఎక్స్పర్ట్ ఒక్కటే లేదు. మేరీ కార్, కార్టిసన్ లాంటి మరికొన్ని పోర్టల్స్ కూడా వున్నాయి. వారికి కూడా ఫండింగ్ వుంది. మేరి కార్.కామ్ కి ఇప్పటికే రెండు రౌండ్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మరింత ఎక్కువ ఫండింగ్ కోసం చూస్తున్నారు.
బెంగళూరుకు చెందిన కార్టిసన్కు కూడా ఈ మధ్య యువికెన్ వెంచర్స్ , గ్లోబల్ ఫౌండర్స్ కాపిటల్, టాక్సీ ఫర్ స్యూర్ లాంటి సంస్థలు ఫండింగ్ అందించాయి.
భవిష్యత్తులో కార్ దేఖో, కార్నేషన్, లాంటి మరికొందరు కూడా రావచ్చని, అయితే, భారీ ఎత్తున బిజినెస్ జరుగుతున్న ఈ మార్కెట్ లోకి ఎందరొచ్చినా అవకాశాలుంటాయని అంటున్నారు.. రునాల్.
ఈ మధ్యే, ఏంజల్ గ్రూప్స్, హెచ్ ఎన్ ఐ ఆటొమేటివ్ ఇండస్ట్రీ దిగ్గజాలు కలసి మోటార్ ఎక్స్‌పర్ట్‌లో రూ. 1.7 కోట్ల వరకూ ఫండింగ్ చేసారు.