ఇద్దరు మిత్రుల ఆలోచన చిన్న సంస్థల హెచ్ఆర్ బాధలు తీరుస్తోంది
రమేష్ ఎంటర్ ప్రైజెస్... చాలా చిన్న సంస్థ. పదిహేను మంది ఉద్యోగులు. కానీ వారికి పేరోల్స్ సృష్టించడం, టాక్సేషన్ లాంటివి ఆ సంస్థ అకౌంటెంట్లకు పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. పైగా మ్యాన్ పవర్ కూడా వృధా అయిపోతోంది.
సురేష్ టెక్నాలజీస్.. మధ్యస్థాయి సంస్థ. రెండు వందల మంది ఉద్యోగులున్నారు. ఇక్కడా అదే సమస్య. హెచ్ఆర్ కు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ఉంటే ఎంత బాగుంటుంది అని యజమానులు అనుకోని సందర్భం లేదు.
ఇలాంటి చిన్న, మధ్యస్థాయి కంపెనీల హెచ్ఆర్ సమస్యలను పరిష్కరించేందుకు దూసుకొచ్చిన స్టార్టప్ వర్క్ జిప్పి. ఇద్దరు మిత్రుల ఆలోచన. పదహారేళ్ల స్నేహం కారణంగా విరబూసిన టెక్నాలజీ స్టార్టప్.
ఫ్రెండ్ షిప్ స్టార్టప్
జస్పాల్ సింగ్ సేథీ, జస్పీత్ సింగ్ మంచి మిత్రులు. ముఫ్పై ముడేళ్ల వయసున్న వీరు పదహారేళ్ల నుంచి ప్రాణమిత్రులుగా ఉన్నారు. కాలేజీ రోజుల్లో భవిష్యత్ లో ఏం చేద్దామనే చర్చ వీరి మధ్య రోజూ జరిగేది. ఇద్దరు కలిసి ఓ సంస్థను ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత వేర్వేరు కెరీర్లను ఎంచుకున్నారు. జస్పీత్ సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం సంపాదించి టెకీగా స్థిరపడిపోయాడు. జస్పాల్ మాత్రం సొంతంగా ఓ టాక్స్ సర్వీస్ కంపెనీ పెట్టుకున్నాడు. అయితే ఖండాల దూరం వీరి స్నేహాన్ని మాత్రం దూరం చేయలేదు. రోజులు గడిచేకొద్దీ వీరు కలసి ఏదైనా చేద్దామనే ఆలోచనకు పదును పెట్టుకుంటూనే ఉన్నారు. ఓ సారి జస్ ప్రీత్ ఇండియాకు వచ్చినప్పుడు జస్పాల్ సింగ్ ఆఫీస్ కు వెళ్లాడు.
అలా వెళ్లడమే పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే జస్పాల్ సింగ్ తన క్లయింట్లకు టాక్స్ ఫైలింగ్, పే రోల్ మేనేజ్ మెంట్ సేవలు అందించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సరైన టెక్నాలజీ లేక ఉద్యోగులకూ జస్పాల్ గైడ్ చేయలేకపోవడాన్ని చూసి జస్పాల్ సింగ్ ఆశ్చర్యపోయాడు. దీనికి సరైన ఈఆర్పీ ( ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ) సొల్యూషన్ లేకపోవడమే కారణమని అంచనాకు వచ్చాడు.
ఈ సమస్య ఒక్క మిత్రుని కంపెనీకే కాదు... చిన్న,మధ్యస్థాయి కంపెనీలన్నింటికీ ఉంటుందని కొంత పరిశోధన ద్వారా తెలుసుకుని తన ఆలోచనను జస్పాల్ సింగ్ కు వివరించాడు జస్ ప్రీత్. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న జస్ పాల్.. మిత్రుల ఆలోచనకు సై అన్నాడు.
తన సిలికాన్ వ్యాలీ అనుభవంతో జస్పాల్ సింగ్, తన టాక్స్ సర్వీస్ సంస్థను నిర్వహించిన ఎక్స్ పీరియన్స్ తో జస్ ప్రీత్ ట్యాక్స్ జిప్పిని మొదటగా లాంచ్ చేశారు. గత ఏడాది జూలైలో లాంఛ్ చేసిన ట్యాక్స్ జిప్పి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ లో వచ్చే సాంకేతిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుంది. ఇది యూజర్లను బాగా ఆకర్షించడంతో ఈప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మిత్రద్వయం నిర్ణయించుకుంది.
తమ అనుభవాలకు పదును పెట్టి తీవ్రంగా శ్రమించి ఈ ఏడాది మేలో వర్క్ జిప్పిని లాంఛ్ చేశారు. ఇది చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎలాంటి సమస్యలు లేకుండా చిటికెలో సొల్యూషన్స్ అందిస్తుంది.
సింగిల్ క్లిక్ - టోటల్ ప్రాసెసింగ్
వర్క్ జిప్పి ఎంత స్మూత్ గా పనితనం చూపిస్తుందంటే ఒక్కసారి డిటైల్స్ ఎంటర్ చేస్తే చాలు సంస్థకు చెందిన రోజువారీ హెచ్ఆర్ కార్యకలాపాలన్నింటినీ ఆటోమేటిక్ గా నిర్వహించేస్తుంది. పే రోల్ మేనేజ్ మెంట్, ఉద్యోగుల హెల్త్ బెనిఫిట్ రోల్ అవుట్స్, ఉద్యోగులు అవుట్ స్టేషన్ కు వెళ్లినప్పుడు వారి ఖర్చులు నమోదు చేయడం, శాలరీ డాటా మేనేజ్ మెంట్, అటెండెన్స్, ఉద్యోగుల టాక్స్ ఫైలింగ్.. అన్నీ ఆటోమేటిక్ గావర్క్ జిప్పి చేసి పెడుతుంది.
ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి అప్ లోడ్ చేస్తేచాలు. ఓ తేదీ సెట్ చేసి పెడితే ఆ సమయానికల్లా ఆటోమేటిక్ గా పే రోల్స్ రెడీ అయిపోతాయి. ఇందులో అద్భుతమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే.. జీతాలు చెల్లించాల్సిన తేదీని కూడా సెట్ చేసి పెడితే... ఆటోమేటిక్ గా జీతాలు ఉద్యోగుల అకౌంట్లలో క్రెడిట్ చేసేస్తుంది కూడా. దీని కోసం సంస్థ బిజినెస్ అకౌంట్ ను, ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేస్తే చాలు.
ఇలా చేసి పెట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. సెట్ చేసిన తేదీన బ్యాంక్ హాలీడే వస్తే ఎలా..? దీన్ని పరిష్కరించడానికి కూడా వర్క్ జిప్పిలో చాన్స్ ఉంది. బ్యాంక్ హాలీడే రోజు జీతాలు క్రెడిట్ చేయాల్సి వస్తే వారం ముందుగానే అలర్ట్స్ పంపుతుంది. ఈ ప్లస్ పాయింట్ వల్ల ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం మరింత మెరుగైన సేవలు అందించగలుగుతుంది.
దీంతో పాటు ఎంప్లాయ్ మేనేజ్ మెంట్ టూల్స్ అంటే.. క్యాలండర్స్, టైమ్ షీట్స్, ఎక్స్ పెన్స్ మేనేజ్ మెంట్ లాంటి వాటితో రోజువారి వ్యాపార నిర్వహణ విషయాలను వివరంగా యాజమాన్యం తెలుసుకోవచ్చు కూడా. దీనిలో ఉన్న ఎంబెడెడ్ ఎనలిటికల్ సామర్థ్యంతో ఖర్చులు, ఇతర పనులను ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవచ్చు.
ఆదాయ మార్గాలు బోలెడు..!
వర్క్ జిప్పి రెవిన్యూ మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పలు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. పది మంది లోపు ఉద్యోగులతో ఉన్న స్టార్టప్ కు సెల్ఫ్ సర్వీస్ బేసిస్ మీద ఉచితంగా కూడా సేవలు అందిస్తుంది వర్క్ జిప్పి. పేరోల్ ప్లాన్ కింద ఓమాదిరి సంస్థలకు యూజర్ కి రూ.25 చార్జ్ చేస్తారు. అయితే ఇది సెల్ఫ్ సర్వీస్ కేటగిరి కిందకే వస్తుంది. మేనేజర్ ప్లాన్ కింద వర్క్ జిప్పి మేనేజర్ స్వయంగా ఆ కంపెనీకి వెళ్లి ఉద్యోగులకు సంబంధించిన పేరోల్స్ సర్వీస్ ను స్వయంగా నిర్వహిస్తారు. ఈ డీల్ కింద ప్రతి వంద మంది ఉద్యోగులకు రూ.3000 చొప్పున కంపెనీ చార్జ్ చేస్తుంది. అదే సమయంలో ఎలాంటి కంపెనీకైనా ఉచితంగా సేవలు అందించే ఫెసిలిటీ కూడా ఉంది. ఏ కంపెనీ అయినా వర్క్ జిప్పి ఫ్లాట్ ఫాం నుంచి ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే ఆ సంస్థకు సేవలు ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీలతో వర్క్ జిప్పి నేరుగా ఒప్పందాలు చేసుకుంది. సామూహిక ఇన్షూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకమైన ప్యాకేజీలను కూడా వర్క్ జిప్పి తన క్లైంట్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇలా చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కూడా మంచి కమిషన్ లభిస్తోంది.
ఇవే కాదు.. అకౌంటెట్ ప్లాన్ కూడా అమలులో ఉంది. ఏదైనా కంపెనీ బాధ్యతలు వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అకౌంటెంట్లు కూడా వర్క్ జిప్పిని వాడుకోవచ్చు. ఇలా ఇరవై ఐదు కంపెనీల బాద్యతలు చూస్తున్న అకౌంటెంట్ వర్క్ జిప్పి ఫ్లాట్ ఫాంను ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి పది వేల రూపాయలను చార్జ్ గా నిర్ణయించారు.
టీ హబ్ తో టైఅప్
ప్రస్తుతం 1200 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీల కేటగిరిలో వర్క్ జిప్పికి 15 క్లైంట్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో దూసుకొచ్చిన కొన్ని స్టార్టప్స్ కూడా వర్క్ జిప్పి ఖాతాదారుల జాబితాలో ఉన్నాయి. లీన్ యాప్స్, వెంబ్లీ పెయింట్స్, జోష్ టెక్నాలజీ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పుడు వర్క్ జిప్పి క్లైంట్లు. కొత్త స్టార్టప్ ను మరింత ప్రొత్సహించేందుకు హైదరాబాద్ లో స్టార్టప్స్ కు పుట్టినిల్లుగా ఉన్న టీహబ్ తో పాటు 91స్పింగ్ బోర్డ్ అనే ఇంక్యూబేటర్ తోనూ టైఅప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.
మిత్రులిద్దరూ మొదట్లో ప్రారంభించిన ట్యాక్స్ జిప్పి ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. దీని ద్వారా సెల్ఫ్ ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్ ఫ్రీగా అందిస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, ట్యాక్స్ నిపుణుల సలహాలతో ట్యాక్స్ ఫామ్ ఫైల్ చేయాలంటే ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు.
వచ్చే రెండు మూడు నెలల్లో వర్క్ జిప్పి ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెల్త్ కన్సల్టెన్సీ సేవల్లోకి అడుగుపెట్టే విషయంపైనా పరిశోధన చేస్తున్నారు. యూజర్లకు పన్ను మినహాయింపు ఉత్పత్తులు అందించడానికి కసరత్తు చేస్తున్నారు. స్టార్టప్ ను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆరుగురు సభ్యుల బృందం నిరంతరం శ్రమిస్తోంది.
మార్కెట్ పెద్దదే...
ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్... మార్కెట్ భారత్ లోచాలా పెద్దదే. వచ్చే ఐదేళ్లలో వృద్ధి ఇరవై ఐదు శాతంపైనే ఉంటుందని అంచనా. పెద్ద కార్పొరేట్ కంపెనీల కన్నా.. చిన్న, మధ్యతరహా సంస్థలే ఈ సేవలకు అతి పెద్ద మార్కెట్ గామారుతున్నాయి. అయితే కాంపిటిషన్ కూడా ఈ రంగంలో ఎక్కువే ఉంది. క్లియర్ ట్యాక్స్, మేక్ యువర్ ట్యాక్స్, ట్యాక్స్ టు విన్.. ఇప్పటికే పరుగు పోటీలో దూసుకెళ్తున్నాయి.
అయితే వర్క్ జిప్పికి ప్లస్ పాయింట్ ఉంది. మిగతావన్నీ వ్యక్తిగతంగా ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్స్ అందిస్తూంటాయి. కానీ వర్క్ జిప్పి మాత్రం ఈఆర్పీ సొల్యూషన్స్ పైనా ఫోకస్ చేసింది.