భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు.. మీ బిజినెస్ బిందాస్..!!
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత.
బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.
ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.
సపోజ్- వ్యాపారమే తీసుకుందాం. అందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బిజినెస్ గురించి దిగ్గజాలంతా చెప్పిన సూత్రాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అర్జెంటుగా గూగుల్ లో వెతకుతాం. అంతేగానీ మనకు ఇన్ బిల్ట్ ఉన్న మేథోవారసత్వాన్ని పట్టించుకోం.
ఇక్కడ సమస్య అదే. ఒక మంచిమాట తెలుసుకోడానికి టెక్నాలజీ మీద ఆధారపడతాం కానీ- వారసత్వ మూలల్లోకి ఎందుకు వెళ్లం? సార్వజనీన సత్యాలను సెర్చింజన్ లో దేవులాడుతాం కానీ- పుస్తకాల్లోంచి ఎందుకు కోట్ చేసుకోం? మనకు ఎన్నో గొప్పగొప్ప గ్రంధాలున్నాయి. (మతపరమైనవి కావొచ్చు, కాకపోవచ్చు) వాటిద్వారా నాలెడ్జ్ ఎందుకు సమపార్జించుకోం?
ఇందాక, పైన పేర్కొన్నట్టు భగవద్గీత ఉంది. అది ఒక్క మనకే కాదు. యావత్ ప్రపంచానికీ ఆ బుక్ యాక్సెస్ అవుతుంది. ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం. వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు. అవి డీకోడ్ చేసుకుంటే బస్. వ్యాపారం మూడు పువ్వులు - ముప్పై ఆరు కాయలవుతుంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. అయితే ఒక్కసారి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||
అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.
ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి. అంతేకానీ అమ్మో అని భయపడి మధ్యలోనే జారుకుంటే ఎన్నటికీ గమ్యం ముద్దాడలేం.
వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||
అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.
ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి
అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.
ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.
తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||
కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు
వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||
అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.
ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.
ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. విచక్షణా జ్ఞానమే వ్యాపారం.