కళాకారులను కలిపే నెట్వర్క్ 'యాహవి'
కళాకారులకు కళే ప్రపంచం. ముఖ్యంగా సంగీతప్రపంచంలో వుండే వాళ్ళకి బయట ప్రపంచం పట్టదు. తమ పాటలలోకంలో విహరిస్తూ వుంటారు. అయితే, పోటీ విపరీతంగా వున్న ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే, మనకి సంగీతం ఒక్కటే తెలిస్తే చాలదు. అవి వినేవాళ్ళ దగ్గరకి మన టాలెంట్ చేరాలి. మనలోని కళను సానపెట్టేవాళ్లు, ప్రోత్సహించే వాళ్ళు వేరే వుంటారు. అలాంటి వారిని నేరుగా కలుసుకోవడం, నెట్వర్క్ మెయింటెయిన్ చేయడం ఆర్టిస్టులకు అంత ఈజీ కాదు. కానీ ఈ పని చేసిపెట్టే వాళ్ళు ఎవరైనా వుంటే కళాకారులకు అంత కంటే కావలసింది ఏముంటుంది ? ఢిల్లీలోని యాహవి.కామ్ ఈ పనే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చేసిపెడుతోంది. అది కూడా ఉచితంగా ! కళాకారులను ఇటు ఆడియన్స్, ఫ్యాన్స్తోనూ, అటు ప్రమోటర్లతోనూ అనుసంధానం చేయడమే ఈ వెబ్ సైట్ లక్ష్యం.
తోటి కళాకారుల ప్రపంచంతోనూ, విని ఆనందించే ఆడియన్స్‌తోనూ అనుసంధానం చేసే ఆ యాహవి పోర్టల్‌లో కళాకారులు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అలాగే, క్లబ్స్, రెస్టారెంట్లు, కార్పొరేషన్లు .. ఎవరైనా ఈ పోర్టల్ ద్వారా కళాకారులను నేరుగా సంప్రదించి ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు.
ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన రోజు నుంచే ఇది సూపర్ సక్సెస్ అనిపించుకుంటోంది. ఇప్పటికే 2000 మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో సోలో పెర్ఫార్మర్లు, బ్యాండ్స్, మ్యూజిషియన్లు .. అందరూ వున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్యను త్వరలోనే 10 వేలకు చేర్చాలన్నది సంస్థ నిర్వాహకుల లక్ష్యం.
'' కళాకారులకి, ఆడియన్స్‌కి మధ్య కొందరు దళారీలు చేరారు. వీరివల్ల కళాకారులకు ఏ ఉపయోగం లేకపోయినా.. వారి ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు. అందుకే ఈ దళారీలు లేని వ్యవస్థ కోసం మేం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కళాకారులకు వారి సామర్థ్యం మేరకు డిమాండ్ వుంటుంది.. అని తమ పోర్టల్ గురించి వివరించారు '' యాహవి సిఇవో దివ్యేష్ శర్మ.
ఓ వైపు కమర్షియల్‌గా సక్సెస్ అవుతూనే, సమాజానికి మేలు చేయగలిగే పని ఏదైనా చేయాలని దివ్యేశ్ శర్మ అనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 10 లక్షల డాలర్ల పెట్టుబడితో యాహవి.కామ్ ప్రారంభించారు. ప్రతిభావంతులైన కళాకారుల గురించి తెలుసుకోవాలనుకునే ఆడియన్స్‌కి, వారి కళను పది మందికి అందించాలనుకునే ప్రమోటర్లకు , తమ ప్రతిభ ద్వారా ప్రజలకు దగ్గర కావాలనుకునే కళాకారులకు ఉమ్మడి వేదిక ఈ వెబ్ సైట్.
ఇండియాలో ఇప్పడిప్పుడే, పబ్స్, రెస్టారెంట్లలో లైవ్ పెర్ఫార్మన్స్‌లు పెరుగుతున్నాయి. దీంతో ప్రదర్శన కళలను ఒక సీరియస్ జీవనోపాధిగా ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
గత రెండు మూడు సంవత్సరాలుగా Qyuki, Gigstart లాంటి సంస్థల రాకతో ఈ రంగంలో మార్కెట్ బాగా పెరిగింది. ఏడాదికి వెయ్యికోట్లు రెవెన్యూ వస్తోందని ఒక అంచనా.
ప్రదర్శనకు మార్కెట్ అన్వేషించడం దగ్గర నుంచి, ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ వరకు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారంగా యాహవి పోర్టల్‌ను తీర్చి దిద్దుతున్నారు.
మొదట్లో ఆర్టిస్టుల ఫేస్ బుక్ పేజీల ఆధారంగా యాహవిని ప్రమోట్ చేసారు. ఆర్టిస్టుల ఎంపికలో పెద్దగా నిబంధనలేమీ పెట్టుకోలేదు. అలాగే, ఆర్టిస్టుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వసూలు చేయట్లేదు.
ప్రగతి దారిలో...
ఒక్క నెలలోనే యాహవి సంస్థ దక్షిణ ఢిల్లీలో నాలుగు ఈవెంట్లను నిర్వహించింది. నగరంలో మ్యూజిక్ కల్చర్ విస్తృతి పెంచేందుకు జాజ్, హెవీమెటల్ లాంటి విభిన్న జానర్స్‌లో సంగీతోత్సవాలను నిర్వహిస్తోంది.
మరి ఆదాయమేలా ?.. దానికి శర్మ సమాధానం ఇది...
'' ప్రస్తుతానికి మేం ఇటు ఆర్టిస్టుల నుంచి, అటు క్లబ్స్ .. రెస్టారెంట్లనుంచి రిజస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయడం లేదు. ముందుముందు ఇటు సబ్ స్ర్కిప్షన్ల ద్వారా, అటు యాడ్స్ ద్వారా ఆదాయం సమీకరించాలనుకుంటున్నాం''.
ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితమైన యాహవిని, త్వరలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్‌కొతా, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 40 మంది పనిచేస్తున్నారు. బిజినెస్, ఆపరేషన్స్, ప్రోడక్ట్స్ మార్కెటింగ్ హెడ్స్ గా కోర్ టీం బాద్యతలు తీసుకుంది. ప్రతి శాఖలోనూ, ఆయా రంగాల్లోని స్పెషలిస్టులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు
టెక్నాలజీ, మేనేజ్మెంట్ విభాగాల్లో అపార అనుభవం వున్న టీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్నయాహవి.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. వచ్చేఏడాదికల్లా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నామని శర్మ చెప్పారు. ఆగ్నేయ ఆసియా దేశాలతో మొదలు పెట్టి, మధ్య ఐరోపా వరకు విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక.