దేశ,విదేశాల్లోని హోటళ్లకు అధినేత... ఒకప్పుడు సర్వర్
హోటల్లో సర్వర్‌గా మొదలై, 82 హోటళ్లకు అధిపతిగా మారిన పి రాజగోపాల్.
1981 లో శరవణ భవన్ స్ధాపించి, ఈ రోజు దేశ విదేశాల్లో విస్తరణ.
నాణ్యమైన ఆహారం అందించడం ఆయన ప్రత్యేకత.
ఓ సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఆయన జీవిత చరిత్ర.
ప్ర: మీ ఏరియాలో రెస్టారెంట్లు లేవని ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు మీరేంచేస్తారు ?
జ: ఓ రెస్టారెంట్ ప్రారంభిస్తా. అదొక్కటే కాదు. మీ ఏరియాలో రెస్టారెంట్ ప్రారంభించడంతో పాటు, దేశ, విదేశాల్లో కూడా ప్రారంభిస్తా అనే సమాధానం వచ్చింది.
ప్రశ్న అడిగిన వ్యక్తి ఓ సేల్స్ మెన్ అయితే.. సమాధానం చెప్పిన వ్యక్తి మాత్రం పి. రాజగోపాల్. ఓ వ్యక్తి లంచ్ చేయడానికి చెన్నైలోని కేకే నగర్‌లో రెస్టారెంట్లు లేక టీ నగర్ వెళ్లాల్సి వచ్చిందని తెలుసుకుని.. వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి రాజగోపాల్.
పి. రాజగోపాల్ కథ ఓ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. ఓ విజయవంతమైన జీవితంతో పాటు, కింది స్ధాయి నుండి ఎదగడం, నేరారోపణలు, పోరాటం వంటి ఎన్నో అంశాలు ఈయనలో కనిపిస్తాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33 బ్రాంచులు ఉన్న శరవణ భవన్‌కు, విదేశాల్లో కూడా 47 బ్రాంచీలు నిర్వహిస్తోందని తన ఆటోబయోగ్రఫీ “I set my heart on victory” లో చెప్పారు.
1947లో తమిళనాడులోని పున్నైయాడి గ్రామంలో జన్మించారు రాజగోపాల్. ఆ టైమ్‌లో వాళ్ల ఊరికి కనీసం బస్ స్టాప్ కూడా లేదు. 7వ తరగతితోనే తన చదువు ఆపేసిన రాజగోపాల్, బతకడానికి ఓ చిన్న హోటల్లో చేరి టేబుళ్లు తుడుస్తూ, రాత్రిపూట వాటి కిందే పడుకునే వారు.
చిన్న చిన్న పనులు చేస్తూ టీ చేయడం నేర్చుకున్నారు. ఆ తరువాత ఓ కిరాణా కొట్టులో సహాయకుడిగా చేరిన రాజగోపాల్, కొంత కాలం తరువాత తన తండ్రి, బావ సహకారంతో సొంత షాప్ ప్రారంభించారు. తన తొలి ప్రయత్నం ఎంతో కష్టంగా గడిచినా, అనుకున్నట్టుగా పనులు జరగకపోయినప్పటికీ, యువ రాజగోపాల్ తన ఆత్మస్ధైర్యంతో సవాళ్లను ఎదురుకున్నారు. మెల్లిగా సమస్యలు తగ్గుముఖం పట్టి పరిస్ధితి కాస్త మెరుగుపడింది.
1979 లో ఓ సేల్స్ మ్యాన్‌తో జరిగిన సంభాషణే 1981లో ‘శరవణ భవన్’ స్ధాపనకు దారితీసింది. అప్పట్లో బయట తినడం అంటే ఓ అవసరం, ఆ డిమాండ్‌ను చూసిన రాజగోపాల్, వెంటనే ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన భోజనం వ్యాపారంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు రాజగోపాల్.
క్వాలిటీ ఫుడ్, కస్టమర్ అనుభవం లాంటి అంశాలు పెద్దగా లేనప్పుడు కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. తక్కువ క్వాలిటీ సరుకులు వాడి, స్టాఫ్‌కు అరకొర జీతాలతో సరిపెట్టమని సలహా ఇచ్చిన ఓ ఉన్నతోద్యోగిని ఉద్యోగం నుండి కూడా తీసేసారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ప్రయత్నంలో కొంత కాలం వ్యాపారాన్ని నష్టాల్లో కూడా నడిపించారు. నెలకు సుమారు రూ.10 వేల వరకు నష్టం కలిగేది. కానీ కొంత కాలంలోనే ఆయనపై ప్రజలు ఉంచిన నమ్మకం నష్టాల నుంచి లాభాల బాటలోకి మార్చింది.
ఉద్యోగులు సంక్షేమం
శరవణ భవన్ విజయం వెనుక కేవలం మంచి క్వాలిటీ ఆహారం మాత్రమే కాకుండా, తను ఉద్యోగులు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతారు. అరటి ఆకులపై భోజనం వడ్డించడం ప్రారంభించారు. ఎవరో తిన్న ప్లేట్స్‌లో ఎలా తినాలని కస్టమర్లలో నిరుత్సాహాన్ని తగ్గించడంతో పాటు వాటిని ఎంతో సులువుగా కడగడంలో కూడా ఆకులు ఉపయోగపడ్తాయని తమ స్టాఫ్‌కూ వివరించారు.
ఉద్యోగులందరికి నెలకో సారి తప్పకుండా హెయిర్ కట్ చేయిస్తూ.. భోజనంలో వెంట్రుకలు పడ్డాయనే ఫిర్యాదు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త పాటిస్తారు. దాని వల్ల ఉద్యోగులు అందంగా కూడా కనిపిస్తారు. ఇక ఎవరు కూడా అర్ధ రాత్రి వేళ్లల్లో సినిమాలు చూడటానికి రాజగోపాల్ ఒప్పుకోరు, దీని వల్ల మరుసటి రోజు వారి పనితీరుపై ప్రభావం పడుతుందని అంటారు.
తన స్టాఫ్‌కు ఉద్యోగ భద్రత కలిగించిన రాజగోపాల్, వారికి ఉండే చోటుతో పాటు, వేతనాలు కూడా సక్రమంగా పెంచే వారు. గ్రామల్లో తమ వారిని చూడాలనుకునే వారికి ప్రతీ ఏటా సెలవులు కూడా ఇస్తారు. పెళ్లైన ఉద్యోగుల ఇద్దరు పిల్లల వరకు చదువు బాధ్యత కూడా యాజమాన్యం చూసుకుంటుంది. ఒకవేల ఉద్యోగుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడితే వెంటనే అతన్ని చూసుకోవడానికి ఇద్దరిని పంపిస్తారు. ఉద్యోగ సంక్షేమం అంటే ఆయన కుటుంబ సంక్షేమంలా చూస్తారు.
నేర చరిత్ర
ఇదంతా ఒవైపైతే, రాజగోపాల్ నేర చరిత్ర ఆయనపై ఓ మచ్చగా మిగిలింది. శాంతారామ్ అనే వ్యక్తి మరణానికి రాజగోపాల్ కారణమని 2009 లో అతనికి జైలు శిక్ష కూడా పడింది. కొద్దికాలం జైల్లో ఉండి తరువాత సాక్ష్యాలు లేని కారణంగా బెయిల్ పై విడుదలయ్యారు. అప్పట్లో ఆయనపై తీవ్రమైన దుమారం రేగి కొద్దికాలం పాటు మిన్నకుండి పోయారు. మళ్లీ ఈ మధ్యే వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి విదేశాల్లో శాఖల విస్తరణపై ఆలోచనలు చేస్తున్నారు.
వెజిటేరియన్ బిజినెస్‌లో ట్రేడ్ మార్క్‌గా మారిన శరవణ భవన్ ఇప్పుడు హాంకాంగ్, ఆస్ట్రేలియాలో కూడా శాఖలు ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. అన్నీ అనకూలిస్తే ఓ లగ్జరీ హోటల్ కట్టాలనే యోచన రాజగోపాల్‌కు ఉంది. నేరచరిత్ర మచ్చ మినహా.. ఆయన దక్షిణాది రెస్టారెంట్ల వ్యాపారంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. శుభ్రమైన, నాణ్యమైన వంటలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న శరవణ భవన్.. ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటూనే ఉంది.