మా అమ్మానాన్నల వ్యక్తిత్వమే నాకు సంస్కారాన్ని నేర్పింది
అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను... సజ్జనుండు పల్కు చల్లగానూ. నిజమే అల్పులకు ఆడంబరం, హడావిడి ఎక్కువ. కానీ సంస్కారవంతుడు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడు. సంస్కారవంతంగా మాట్లాడతాడు. అచ్చం మన అన్నా హజారేలా. సంస్కారం బట్టీ పడితే వచ్చేది కాదు. స్వతహాగా అలవడాలి. అన్నాకు కూడా అలాగే తన తల్లిదండ్రుల నుంచి సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్నాడు.
అన్నా హజారే... నిరాడంబరతకు నిలువెత్తు రూపం. ఆయన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, చేసే పనులన్నింటిలో నిరాబండరత ఉట్టిపడుతుంది. ఎప్పుడూ ఖాదీ దుస్తులే ధరిస్తాడు. తెల్లని పంచె, కుర్తా, తలపై గాంధీ టోపీ... ఆయన వేషభాషలకు నిలువెత్తు నిదర్శనం. శాకాహారమే తీసుకుంటాడు. మద్యం అలవాట్లు, ఎలాంటి దుర్వ్యసనాలు లేవు. ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైతే ఎప్పుడూ ముందుంటారాయన. ఇలా అన్నా హజారే ఏం చేసినా దానిపై ఆయన తల్లిదండ్రుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నా హజారే తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారమే ఆయన అన్యాయంపై పోరాడేలా చేసింది. వాళ్లు నేర్పిన సంస్కారమే స్కూల్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. పాఠశాలలో ఎలాంటి నిందలు లేకుండా చేసింది ఆ సంస్కారమే. వాళ్లు నేర్పిన పాఠాలతో అన్నా హజారే సాధించిన విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక్కసారి తన తప్పు దాచుకోవడానికి తల్లితో అబద్ధమాడిన అన్నా హజారే ఆ తర్వాత ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. తన తల్లి చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు, సంస్కారం నేర్పిందని చెబుతారు అన్నా.
"నా చిన్నప్పుడు నా తల్లి ఎప్పుడూ ఒక విషయం చెప్పేది- ఎవరికీ చెడు చేయకూడదు, ఎవరి వస్తువులూ దొంగిలించకూడదు, ఎవరితో పోట్లాడకూడదు, సమాజానికి మంచి చేయాలి"- అన్నా.
అన్నా హజారే తల్లి లక్ష్మీబాయి హజారే. చిన్ననాటి నుంచి అన్నాకు మంచి విషయాలు నూరిపోసేది. ఎవరికైనా సాయం చేయలేకపోయినా... ఎంత చేయగలిగితే అంత చేయడం మర్చిపోవద్దని ఆమె చెప్పేవారు. ఇతరుల దుఖాన్ని దూరం చేయాలి అని తల్లి చెప్పిన మాటలే అన్నాహజారే పసిమనసుపై చిన్నమనసుపై ఎంతో ప్రభావం చూపాయి. అన్నా హజారేది పేద కుటుంబం. ఈ పేదరికంతో అన్నా ఎంతో బాధపడ్డాడు. ఇల్లు, కుటుంబాన్ని నడపడానికి అందరూ చాలా కష్టపడేవాళ్లు. అన్నా తల్లి లక్ష్మీ భర్తకు చేదోడువాదోడుగా నిలిచేందుకు ఇళ్లల్లో అంట్లు తోమేది.
"మా అమ్మ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. ఆమె ధనవంతురాలేమీ కాదు. కానీ ఆమె నా వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దేది. అమ్మ చెప్పిన మాటల వల్లే నా ఆలోచనలన్నీ సమాజం గురించిన ఆలోచనలుగా మారాయి" అని తల్లి గురించి గర్వంగా చెబుతారు అన్నా హజారే.
అన్నాపై ఆయన తండ్రి బాబు రావ్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. తన తండ్రి పగలూరాత్రి ఎంతలా కష్టపడేవాడని అన్నా గమనించేవాడు. చాలాసార్లు తండ్రిని అనుకరించేవాడు.
"మా తండ్రి చాలా సాధారణమైన వ్యక్తి. ఎప్పుడూ మత్తు జోలికి వెళ్లలేదు. ముక్కుసూటి మనిషి. ఎవరితో అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఇతరుల ఆస్తి దోచుకునేందుకు ప్రయత్నించలేదు. మా నాన్న వ్యక్తిత్వం నాపై ప్రభావం చూపించింది. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కూడా. ఆయన ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా తిరుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తుండేవాడిని. అవన్నీ నాపై చాలా ప్రభావం చూపాయి" అంటారు అన్నా హజారే.
ఈరోజుల్లో చాలామంది తమ పిల్లలకు సంస్కారం నేర్పించడానికని సంస్కార కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులకు పంపిస్తున్నారు. అయితే సంస్కార కేంద్రాల్లో చేర్పించినంత మాత్రానా సంస్కారం రాదని అంటారు అన్నా. పిల్లలకు సంస్కారం అనేది వారి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ప్రతీ కుటుంబం సంస్కార కేంద్రం కావాలన్నది అన్నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి.
రచయిత: డా. అర్వింద్ యాదవ్, మేనేజింగ్ ఎడిటర్ (ఇండియన్ లాంగ్వేజెస్), యువర్ స్టోరీ.
అనువాదం: సంతోష్ కుమార్