మీ వీధి చివర్లోనే బ్యాంకింగ్ సేవలు అందించే 'ఎకో'
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో కొత్త విధానాలని మనకు అందిస్తోంది. మన రోజువారీ కార్యకలాపాల్ని సరళతరం చేయడానికి ఎంతో ఉపయోగ పడుతోందనడానికి మొబైల్ ఫోన్ ద్వారా ఎకో అందిస్తున్న బ్యాంకింగ్ సదుపాయాలే ఓ చక్కటి ఉదాహరణ.
రోజువారీ ఆర్ధిక లావాదేవీలు జరుపుకునేందుకు ఇక గంటల తరబడి బ్యాంకుల్లో క్యూలో నిలబడనవసరంలేదు. పట్టణ పేదలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సదుపాయాన్ని పలు బ్యాంకులతో కలిసి ఎకో సంస్థ అందిస్తోంది. దగ్గరలో ఉన్న కిరాణా షాపు లో ఉన్న ఎకో బ్రాంచ్ ద్వారా బ్యాంకు ఖాతా తెరవడం, ఖాతా లోంచి డబ్బు తీసుకోవడం లేదా జమ చేయడం వంటి బ్యాంకు లావాదేవీలన్నీ సులువుగా జరుపుకోవచ్చు.
ఆర్ బి ఐ నివేదిక ప్రకారం, భారత్ లో కేవలం 59% కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఈ సంఖ్య డిమాండ్- సప్లై అంతరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించడానికీ, సామాన్య ప్రజానీకానికి బ్యాంకు ఖాతా తెరవడం, నగదు జమ చేసుకోవడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎకో ప్రయత్నిస్తోంది. ఎకో కౌంటర్ల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సురక్షితమైన విధానంలో బ్యాంకింగ్ సేవలను, రిటైల్ దుకాణాల్లోని వినియోగించుకోవచ్చు.
కేవలం మొబైల్ ఫోన్ సహాయంతో ఎకో కౌంటర్లో కొత్త సేవింగ్స్ ఖాతా తెరవడం, డబ్బు జమ - డ్రా చేసుకోవడంతో పాటు ఇతరుల ఖాతాలకు నగదును ట్రాన్స్పర్ చేసే వెసులుబాటు కూడా ఉంది. వీటితో పాటు ఫిక్సెడ్ డిపాజిట్, రికరింగ్ డిపౌజిట్ సౌకర్యాలూ పొందొచ్చు.
స్మార్ట్ ఫోన్‌తో పనిలేకుండా కేవలం సాధారణ ఫీచర్ మొబైల్ ఫోనుతోనూ ఈ సేవలన్నీ ఎకో కౌంటర్లో వినియోగించుకోవచ్చు. ఇలా మొబైల్ ఫోను ద్వారా బ్యాంక్ లావాదేవీలని జరిపే సదుపాయం కోసం ఎకో, ఒక మల్టీ మోడల్ విధానాన్ని(USSD, SMS, IVR and Application) పాటిస్తోంది. దీనితో, ఏ రకమైన మొబైల్ ఫోను నుంచైనా ఈ సదుపాయాలు వినియోగించుకోడానికి వీలవుతుంది. ఇలా చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సురక్షితంగా ఉండడానికి ఎకో వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అమలు చేస్తోంది. సొంత పేటెంట్ కలిగిన, తక్కువ ఖర్చు తో కూడుకున్న "OkeKey " అనే ప్రమాణిక వన్ టైమ్ పాస్ వర్డ్ జనరేటర్‌ను వినియోగిస్తున్నారు. ఈ సదుపాయాలను వినియోగించుకోవడానికి పెద్దగా అక్షరాస్యులై ఉండాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఫోన్లో నంబర్ డయల్ చేయడం వస్తే చాలు. ఆధునిక సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం మా ఎకో సంస్థకు వెన్నెముక అంటారు సంస్థ సహ వ్యవస్థాపకులు, CEO అభినవ్ సిన్హా.
బ్యాంకింగ్, మనీ ట్రాన్స్ఫర్స్ తో పాటు ఎకో అందిస్తున్న ఇతర సదుపాయాల జాబితాలో పేమెంట్స్, సింప్లి బ్యాంక్ ప్లాట్ ఫార్మ్, క్యాష్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ప్రధమ శ్రేణి నగరాలతో పాటు, ఢిల్లీ, ముంబయ్, హైదరాబాద్, యుపి, పంజాబ్ బీహార్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న సుమారు 2,000 ఎకో రిటైల్ అవుట్ లెట్లు ద్వారా 20 లక్షల మందికి పైగా ఈ సదుపాయలను వినియోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబ్తున్నారు.
ఎంతో వ్యూహాత్మకంగా ఎకో సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,Yes బ్యాంకు, HDFC బ్యాంకులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ''స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్‌లోనే అతిపెద్ద బ్యాంక్, ప్రైవేటు సెక్టార్లో HDFC ముందుంది, యస్ బ్యాంక్ లేటుగా వచ్చినా లేటెస్టు టెక్నాలజీతో వేగంగా దూసుకెళ్తోంది. ఈ బ్యాంకులతో భాగస్వామ్యం, మేం మార్కెట్లోకి బలంగా దూసుకుపోవడానికి ఉపకరిస్తుంది. పేమెంట్స్ అందించే సంస్థలు, క్యాష్ కలక్షన్, పంపిణీ సర్వీసులతో కూడా ఎకో భాగస్వామ్యం కలిగి ఉంది'' అంటారు అభినవ్.
NSIH 2013 అవార్డు, ఎకో ను మరింత మందికి చేరువ చేయడమే కాదు, వినూత్న సాంకేతికతకూ దగ్గర చేసింది. ప్రస్తుతం ఎకో, భారత్‌లో ఫోన్ సహాయంతో బ్యాంకింగ్ సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థ. త్వరలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ తమ విస్తరించే పనిలో ఉన్నామని ఎకో నిర్వాహకులు చెబుతున్నారు. రోజురోజుకీ మారుతున్న సాంకేతికత ను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా నిరంతరం సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక పరిజ్ఞానం పై భారీగా పెట్టుబడులు ఈ రెండూ తమ సర్వీసులను మరింత భధ్రంగా చేస్తూ, ఇంకా సరళతరం చేయడానికి వీలవుతాయనీ వారు అభిప్రాయ పడ్డారు.
భారత్ లో ఆర్ధికరంగంలో ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ విషయంలో ఇంకా ఎంతో మార్పు రావల్సి ఉంది. అయితే, ఎకో లాంటి సంస్థల ఏర్పాటు ఈ రంగంలో భారీ గా మార్పును తెచ్చే అవకాశం ఉంది.
నానాటికీ బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు ప్రజలకు ఎంతవరకు తెలుసు అంటే, ఆ మార్పులు పై ఉన్న అవగాహన బహు తక్కువనే చెప్పాలి. ఆ మార్పుల వేగానికి తగ్గట్టుగా ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించడం, మౌలిక సదుపాయాలూ, మద్దతు విషయాల్లో, సకాలంలో వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించడం ఎంతో అవసరం. అలాగే ఎటి ఎం, ట్రాన్సాక్షన్ సెంటర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విషయాలు ఈ రంగంలో మరింత అభివృద్ధికి దారి తీస్తాయని ఎకో అభిప్రాయపడింది. భారత్‌లో ఇప్పటికే 6.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ మొబైల్ ద్వారా జరిపామని చెబుతూ ప్రపంచంలోనే ఈ రకమైన ఆర్ధిక లావాదేవీలను మొబైల్ ద్వారా నడిపించే ఏకైక సంస్థ ఎకో అని నిర్వాహకులు చెబుతున్నారు.