Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube

వ్యవసాయ భూముల లావాదేవీల్లో సరికొత్త విప్లవానికి తెరతీసిన పారిశ్రామికవేత్త

వ్యవసాయ భూముల లావాదేవీల్లో సరికొత్త విప్లవానికి తెరతీసిన పారిశ్రామికవేత్త

Thursday November 11, 2021 , 4 min Read

''నేను వ్యవసాయాధారిత కుటుంబం నుంచి వచ్చాను. మాకు అదే జీవనం. మా తండ్రి ఒకసారి మా వ్యవసాయ భూమిని విక్రయించాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. సదరు భూమికి మంచి విలువ ఉన్నప్పటికీ కొనుగోలుదార్లను చేరడం చాలా కష్టమైంది. అప్పుడు నాకు వచ్చిన ఈ ఆలోచనే ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ రూపకల్పనకు కారణమైంది. కొనుగోలుదార్లు, అమ్మకందార్లను కలిపాలని అప్పుడే నిర్ణయించుకున్నా'' అంటారు దేశంలో మొదటి వ్యవసాయ భూముల మార్కెట్ ప్లేస్ అయిన ఎస్‌ఫార్మ్స్ఇండియా సీఈఓ, కో ఫౌండర్ కామేష్ ముప్పరాజు.


ఎస్‌ఫార్మ్స్ఇండియా సంస్థ కామేష్ 2018లో స్థాపించారు. కొనుగోలుదార్లను, భూ యజమానులతో అనుసంధానించే వేదిక ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఎస్‌ఫార్స్ ఇండియా వివిధ అంశాలను క్రోడీకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా సమాచారాన్ని ఉపయోగించుకుని భూములకు సరైన విలువ కట్టడం వల్ల ఇది బయర్స్, సెలర్స్‌కు పూర్తిస్థాయిలో ఉపయోగపడ్తోంది.


''దేశంలో వ్యవసాయ భూముల ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొనుగోలు, అమ్మకందారు మధ్య అగాధం కూడా విస్తృతమవుతోంది. భూవిక్రయదారులంతా అధిక శాతం గ్రామాల్లో ఉంటే, కొనాలని అనుకునే వాళ్లంతా నగరాలు, పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించి, ఇద్దరినీ అనుసంధానించడమే మా ఆలోచన'' అంటారు కామేష్.


రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటలైజేషన్ సరికొత్త ఒరవడి. గృహ, వాణిజ్య ఆస్తుల కొనుగోలు, అమ్మకం కోసం ఇప్పటికే అనేక ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి, అయితే అగ్రి రియాల్టీలో ఇంకా ఎవరూ గుర్తించని విస్తృత అవకాశాలున్నాయి. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూముల లావాదేవీలు కొనసాగుతున్నా, అందులో 95 శాతం మధ్యవర్తుల ద్వారా సాగుతున్నవే. అయితే ఇంటర్నెట్ ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోవడం వల్ల అగ్రి రియాల్టీ రంగంలో అనూహ్య మార్పులను చూడొచ్చు.

వినూత్న పరిష్కార మార్గాలు

భారతీయ వ్యవసాయ రంగాన్ని మార్చే సామర్థ్యం అగ్రిరియాల్టీకి ఉందని బలంగా నమ్ముతారు కామేష్. ఈ రంగంలోకి మొదటగా వచ్చిన నేపధ్యం, అనుభవంతో ఆయన ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఆరోగ్యంలో ఫార్మ్ ఫ్రెష్ ఫుడ్ (తాజా ఆహారం) ప్రధాన పాత్ర పోషిస్తుందనే నమ్మకంతో ముఖ్యంగా హైనెట్వర్త్ ఇండివిడ్యుయల్స్ (HNIs) నుంచి వ్యవసాయ భూముల కోసం మంచి గిరాకీ ఏర్పడ్తోంది. సహజ ఉత్పత్తులపై జనాల్లో అవగాహన పెరగడంతో పాటు వినియోగదారు ఆలోచన సరళిలో కూడా మార్పులు రావడం అగ్రి రియాల్టీకి బలం చేకూరుస్తోంది.


వ్యవసాయ భూములను కనుగొని, కొనుక్కునే వేదికగా ఎస్‌ఫార్మ్స్ ఇండియాను తీర్చిదిద్దారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా విక్రేతలు తమ భూములను ఈ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. అవసరమైన సమాచారాన్ని నింపడంతో పాటు ఫోటోలను జత చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాట్సాప్ ద్వారా సదరు సమాచారాన్ని ఎస్‌ఫార్మ్స్ ఇండియా ప్రతినిధులకు అందజేసినా సరిపోతుంది. ఎలాంటి భూమి కావాలి, ఏ రాష్ట్రం, ఏ జిల్లాలో కావాలి అనే వివరాల ఆధారంగా కొనుగోలుదార్లు ఈ వేదిక ద్వారా భూములను శోధించి గుర్తించవచ్చు.


ఎస్‌ఫార్మ్స్ ఇండియా నమ్మకమైన చిన్న వ్యవసాయ డెవలపర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొంత మంది డెవలపర్స్ భూ విక్రయమైన తర్వాత కూడా ఐదేళ్ల పాటు వాటిని నిర్వహించే బాధ్యతను తీసుకోవడంతో నగరంలో ఉన్న చాలా మంది ప్రొఫెషనల్స్ ఇలాంటి భూములపై ఆసక్తిని కనబరుస్తున్నారు.


ప్రత్యామ్నాయ పెట్టుబడిగా భూముల కొనుగోలు కేవలం హైనెట్వర్క్ ఇండివిడ్యుయల్స్‌కు మాత్రమే అనే రోజులు మారిపోతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్లకు, ఉద్యోగస్తులకు (వైట్ కాలర్ ప్రొఫెషనల్స్‌) కూడా వ్యవసాయ భూములను పెట్టుబడి సాధనంగా మార్చే విధంగా ఎస్‌ఫార్మ్స్ ప్రణాళిక సిద్ధం చేసింది అంటారు కామేష్.

*వైవిధ్యానికి మారుపేరు ! *

ఇంతవరకూ ఎవరూ పెద్దగా దృష్టి సారించని వ్యాపారంలో విభిన్నమైన ప్రోడక్టును నిర్మించడం అంత సులువేం కాదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా కామేష్ ప్రయాణం ఎన్నో సవాళ్లను విసిరింది. కేవలం ఆంట్రప్రెన్యూర్ మాత్రమే ధైర్యంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ముందుకు సాగుతారు అంటారు. ''వ్యవసాయాన్ని, రియల్ ఎస్టేట్‌ను మిళితం చేస్తూ ఓ సంస్థను నిర్మించడానికి ఎంతో ఓర్పు, పట్టుదల కావాలి. ఈ వేదికలోకి జనాలను తీసుకువచ్చే ముందు వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించడం అన్నింటికంటే పెద్ద సవాల్'' అంటారు కామేష్.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పటిష్టమైన ఫ్రీలాన్స్ నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది ఎస్‌ఫార్మ్స్ ఇండియా. ప్రస్తుతం వెబ్ సైట్‌లో నగరాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను లిస్ట్ చేస్తున్నారు. కోరా, యూట్యూబ్ వంటి డిజిటిల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది ఈ సంస్థ. ''కోరా అనే డిజిటల్ వేదిక ద్వారా జనాలకు వ్యసాయ భూముల లావాదేవీల గురించి విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నాం. వీటికి వస్తున్న స్పందనను చూస్తే.. మేం సరైన దారిలోనే ప్రయాణిస్తున్నాము'' అని అనిపిస్తోంది అంటారు కామేష్.


హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలను అందిస్తున్న ఎస్‌ఫార్మ్స్ ఇండియా ప్లాట్‌ఫాంలో ఇప్పటికే 21వేల మంది బయర్స్, సెలర్స్ ఉన్నారు. వార్షికంగా 220 శాతం వృద్ధితో లిస్టింగ్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే సుమారు 5000 వ్యవసాయ భూముల లిస్టింగ్స్ సైట్‌లో ఉన్నాయి. 2021 పూర్తయ్యే నాటికి కామేష్ అండ్ టీమ్ తమ సేవలను తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలకు విస్తరించాలని చూస్తోంది.


ఈ ఏడాది మరిన్ని కొత్త ప్రోడక్టులను తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ఎస్‌ఫార్మ్స్ ఇండియా. వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలకు (అగ్రి ఎంట్రప్రెన్యూర్స్) ఉపయోగపడే విధంగా త్వరలో ఆగ్రో ఇండస్ట్రీ భూముల సేవలను కూడా ప్రారంభించబోతోంది ఈ సంస్థ. దీని వల్ల ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లు, మెగా ఫుడ్ పార్క్స్‌ ఏర్పాటు చేయాలని అనుకునే వాళ్లకు భూముల గుర్తింపు, కొనుగోలు సులువవుతుంది.

ఇక టెక్ యుగమే !

ప్రైస్ ప్రెడిక్షన్ మోడల్ (ధరలను ఊహించగలిగే సామర్ధ్యం)ను టాప్ మేనేజ్మెంట్ సంస్థలతో కలిసి ఎస్‌ఫార్మ్స్ ఇండియా రూపొందిస్తోంది. వివిధ పారామీటర్ల ఆధారంగా అగ్రి రియాల్టీ డేటాను సమీకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్‌తో ఈ మోడల్‌ను రూపొందిస్తోంది. ''వ్యవసాయ భూములకు రుణాలు ఇప్పించేందుకు ఆర్థిక సంస్థలతో, భూ-నీటి నిర్వాహణ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామంటారు'' కామేష్.


అగ్రి భూముల ఆన్ బోర్డింగ్, రియల్ టైంలో ఆదాయాన్ని తెలుసుకునేందుకు ఫ్రీలానర్స్ కోసం అత్యంత సులువైన ఇంటర్‌ఫేజ్, డాష్ బోర్డ్ రూపొందించామని చెప్తారు కామేష్.


రియల్ టైమ్ పద్ధతితో అత్యంత తక్కువ భూమిని కూడా కొనుగోలు, అమ్మకం చేసే విధంగా ల్యాండ్ ఫ్రాక్షన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఎస్‌ఫార్మ్స్ ఇండియా సిద్ధం చేస్తోంది. ''ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కోసం వేచి చూస్తున్నాం. ఇది అమల్లోకి వస్తే.. ఎకరాల్లో వెయ్యో వంతు (1/1000) భూమిని కూడా కస్టమర్లు కొనుగోలు, అమ్మకం చేసుకోవచ్చు'' అంటారు కామేష్.


భవిష్యత్ లక్ష్యాలు, ప్రణాళిక గురించి కామేష్ మాట్లాడుతూ.. ''మాకు స్పష్టమైన విస్తరణ వ్యూహం ఉంది. 2023 నాటికి ప్రతీ పిన్ కోడ్‌లో ల్యాండ్ లిస్టింగ్స్ అందుబాటులోకి తీసుకురావడమే టార్గెట్'' అంటారు.