గురుశిష్యుల స్టార్టప్ ఏడాదిలోనే ఎంత సక్సెస్ అయిందో చదవండి..!

బైక్ రెంటల్ రంగంలో దూసుకెళ్తున్న బెంగళూరు స్టార్టప్

గురుశిష్యుల స్టార్టప్ ఏడాదిలోనే ఎంత సక్సెస్ అయిందో చదవండి..!

Thursday August 25, 2016,

5 min Read

క్లాస్ రూముల్లో పుట్టిన ఐడియాలు స్టార్టప్ లుగా ఎదిగిన విజయగాథలు ఎన్నో చూశాం. వన్ బై టు టీలు తాగే మిత్రులు రూపాయి రూపాయి పోగేసుకుని కంపెనీలు ప్రారంభించి కోటీశ్వరులైన కథనాలూ చదివాం. అయితే ఇలాంటివన్నీ విద్యార్థుల నేపధ్యంగానే ఉంటాయి. ముగ్గురు నలుగురు మిత్రులు కలిసో.. లేక ఒంటరిగానే స్టార్టప్ రన్ లో పాల్గొనేందుకు సిద్ధపడతారు. కానీ బెంగళూరుకు చెందిన "రాయల్ బ్రదర్స్" అనే స్టార్టప్ ని మాత్రం గురుశిష్యులు కలిసి ప్రారంభించారు. సెల్ఫ్ రైడ్ బైక్ రెంటల్ ఫ్లాట్ ఫామ్ అయిన రాయల్ బ్రదర్స్ కు ఫౌండర్ ఓ లెక్చరర్ అయితే... సీవోవో అతని దగ్గర చదువుకున్న స్టూడెంట్.

స్టూడెంట్ -ప్రొఫెసర్ పెట్టిన స్టార్టప్

మంజునాథ్ ఓ ప్రొఫెసర్. విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీంగ్ చదివారు. మెషిన్ డిజైన్ లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత బెంగళూరులో పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయడం ప్రారంభించారు. ఎనిమిదేళ్లు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న మంజునాథ్ ఆర్వీ ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెబుతున్న సమయంలో స్టూడెంట్ అభిషేక్ పరిచయం అయ్యాడు. అభిషేక్ కూడా మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మోటార్ బైక్స్ పై అమితమైన ఆసక్తి కూడా ఉంది. అంతకు మించి అంట్రప్రెన్యూర్ గా మారాలన్న పట్టుదల కూడా ఉంది. తను ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు మిత్రునితో కల్సి కార్డ్ డిజైనింగ్ స్టార్టప్ ను నెలకొల్పిన అనుభవం కూడా ఉంది. మంజునాథ్ కు కీలకమైన ప్రాంతాల్లో ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ను ఇంప్రూవ్ చేసేలా ఓ కొత్త కాన్సెప్ట్ తో స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన చేస్తూంటారు. ఓసారి మాటల సందర్భంలో మంజునాథ్, అభిషేక్ ఇద్దరూ తమ ఆలోచనల్ని పంచుకున్నారు. తాము గురుశిష్యులమైనా మంచి వ్యాపార భాగస్వాములమవుదామనే అంచనాతో రాయల్ బ్రదర్స్ స్థాపనకు ముందుకొచ్చారు.

జూలై 2015లో రాయల్ బ్రదర్స్ స్టార్టప్ ను ప్రారంభించారు. ఇది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఆర్టీవో ఆథరైజేషన్ అందుకున్న మొట్టమొదటి సెల్ఫ్ రైడ్ బైక్ రెంటల్ ఫ్లాట్ ఫామ్. ఈ స్టార్టప్ ను ట్రాక్ లోకి తీసుకెళ్లడానికి వీరు చాలా క్లిష్టమైన పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో మొదటిది.. మంచి క్వాలిటీతో ఉండే రెంటల్ బైక్స్ ను పొందడమే. అది వారికి మొదటి సవాల్ గా మారింది. రమేష్ బాబు దగ్గర సలహాలు తీసుకుని కొన్ని అడ్డంకులు అధిగమించారు. ఇంతకీ ఈ రమేష్ బాబు ఎవరో కాదు. బార్బర్... రోల్స్ రాయిస్ సహా లగ్జరీ కార్ల యజమాని. వాటిని రెంట్ కి ఇచ్చే బిజినెస్ లో కోట్లు గడిస్తున్న వ్యక్తి. బెంగళూరులో ఫోర్ వీలర్స్ ను అద్దెకు ఇచ్చే పర్మిట్ ను ఆర్టీవో నుంచి పొందిన మొట్టమొదటి వ్యక్తి రమేష్. రమేష్ చెప్పిన సంగతులు ఈ గురుశిష్యులకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి.

రాయల్ బ్రదర్స్ బృందం - షెరిక్ షంషుద్దీన్, అభిషేక్ చంద్రశేఖర్, మంజునాథ్, నిఖిల్ రాజ్

ఎన్నో ఆలోచనలు ..కానీ కలసికట్టుగా ఒకే నిర్ణయం

సీఈవోగా మంజునాథ్, సీవోవోగా అభిషేక్ వ్యవహరిస్తున్నారు. వీరు ఆలోచనలు కలిసినంతనే స్టార్టప్ ప్రారంభించలేదు. సుదీర్ఘ సమయం చర్చల్లోనే గడిపేవారు. స్టార్టప్ పెట్టడం దగ్గర్నుంచి కార్యకలాపాలు కొనసాగించడం... వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం దగ్గర్నుంచి.. ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. లెక్చరర్ గా తన పెద్దరికంతో పాటు అనుభవాన్ని కూడా జోడించి.. స్టార్టప్ ఎంత సవాలుతో కూడుకున్నదో మంజునాథ్... అభిషేక్ కు చాలాసార్లు వివరించారు.

" స్టార్టప్ నడుస్తున్న కాలంలో మా మధ్య ఎన్నో అభిప్రాయబేధాలు వచ్చాయి. మిస్ కమ్యూనికేషన్ ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చకపోవడం లాంటివి చోటు చేసుకున్నాయి. అయితే మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మా నిర్ణయాలు కంపెనీ బాగుకోసమే అని మాకు తెలుసు. గత ఏడాది గా నాకు మంజనాథ్ తండ్రితో సమానంగా మారారు" అభిషేక్, సీవోవో, రాయల్ బ్రదర్స్

రాయల్ బ్రదర్స్ లో ప్రస్తుతం ఐదుగురు సభ్యుల బృందం ఉంది. వీరిలో మంజునాథ్, అభిషేక్ ఇద్దరు. శంషుద్దీన్ అనే మరో టీమ్ మేట్ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారు. నిఖిల్ రాజ్, ఆకాష్ సురేష్ అనే మరో ఇద్దరు టెక్నాలజీ విషయాలను డీల్ చేస్తూంటారు. గత ఏడాది కాలంలో రాయల్ బ్రదర్స్ ఏడు వేల మంది కస్టమర్లకు సేవలు అందించింది. రాయల్ బ్రదర్స్ నుంచి రెంట్ కు తీసుకున్న ద్విచక్రవాహనాలు 1.3 మిలియన్ కిలోమీటర్లు తిరిగాయి.

ప్రస్తుతం రాయల్ బ్రదర్స్ ఆరు నగరాల్లో సేవలు అందిస్తోంది. బెంగళూరు, మణిపాల్, ఉడిపి, మంగుళూరు, మైసూర్, గోవాల్లో సొంత బైక్ లేకపోయినా... అటూ ఇటూ తిరగాలనుకునేవారు రాయల్ బ్రదర్స్ యాప్ ఓపెన్ చేసి బైక్ బుక్ చేసుకుంటే చాలు. రాయల్ ఎన్ ఫీల్డ్, సుజుకి యాక్సెస్, హోండా యాక్టివా లాంటి బైకుల్ని రాయల్ బ్రదర్స్ గంటలు లేదా రోజుల లెక్కన అద్దెకిస్తుంది. రాయల్ బ్రదర్స్ లో బైకుల్ని అద్దెకు తీసుకోవాలంటే వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా ఆయా నగరాల్లో ఉన్న ఆఫ్ లైన్ స్టోర్లలోనూ అద్దెకు తీసుకోవచ్చు. నెలకు ప్రస్తుతం 1300 బుకింగ్స్ వస్తున్నట్లు రాయల్ బ్రదర్స్ స్టార్టప్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బుకింగ్ నుంచి సగటున 900 వరకు లభిస్తున్నాయి. ఈ రంగంలో వచ్చిన అనుభవంతో ఆశాభావంతో ముందడుగు వేశారు. అయితే వీరు అద్దెకు తీసుకునే టూ వీలర్స్ సరైన కండిషన్ లో లేకపోవడమే పెద్ద సమస్య అవుతోంది.

మైసూరులో కొత్తగా బైక్ రెంటల్స్ ప్రారంభించినప్పుడు...

రాయల్ బైకింగ్ ఎక్స్ పీరియన్స్

బైకులు అద్దెకు ఇవ్వడమే కాదు.. తీసుకున్నవారి సెక్యూరిటీని కూడా ఎప్పుడూ పట్టించుకుంటుంది రాయల్ బ్రదర్స్. అందుకే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కు 90 కిలోమీటర్ల వేగం, హోండా యాక్టివా బైకులకు అరవై కిలోమీటర్లు మాత్రమే వేగాన్ని నిర్ణయించారు. బైకుల్లో బిల్ట్ ఇన్ గా రెడీ చేసిన జీపీఎస్ తో వాహనం ఎక్కడ ఉందో కనిపెడతారు. వేగంగా వెళితే వెంటనే వార్నింగ్ ఇస్తారు. అంతే కాదు బర్డ్స్ ఐ టెక్నాలజీ ద్వారా రెంట్ కి ఇచ్చిన బైకుల తాజా పరిస్థితిని అంచనా వేసుకుంటారు. డిమాండ్-సప్లయ్ లను సమన్వయం చేసుకుంటారు.

సెల్ఫ్ బైక్ రెంటింగ్ సంస్థలకు బెంగళూరు డ్రీమ్ మార్కెట్. మంగుళూరు, ఉడిపి, మణిపాల్ లలో కూడా మంచి బుకింగ్స్ నమోదవుతూంటాయి. అయితే అభిషేక్ మొదట ఒక్క బెంగళూరుకే పరిమితమవ్వాలనుకున్నాడు. ఈ విషయంపై కో ఫౌండ ర్అయిన గురువుతో వాదన కూడా పెట్టుకున్నాడు. కానీ మంజనాథ్ ఇతర నగరాల్లో ఉన్న మార్కెట్ ను వివరించి అభిషేక్ ను ఒప్పించగలిగాడు. ఏడాది తర్వాత ఇప్పుడు అభిషేక్ గురువును అభినందించకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఇతర నగరాల్లోనూ రాయల్ బ్రదర్స్ కు విపరీతమైన పాజిటివ్ అప్లాజ్ వచ్చింది మరి.

రాయల్ బ్రదర్స్ రెంట్ కి ఇచ్చే బైక్ లు

ఏడాదిలో బ్రేక్ ఈవెన్ - ఇక నుంచి లాభాల ట్రాక్

సోషల్ మీడియా మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మౌత్ టాక్ వంటి వాటిపైనే రాయల్ బ్రదర్స్ ఆధారపడుతోంది. ఒకసారి బైక్ రెంట్ కి తీసుకున్నవారు రాయల్ బ్రదర్స్ గురించి చెప్పి రిఫర్ చేయకుండా ఉండలేదు. పైగా రాయల్ బ్రదర్స్ ఖాతాదారులంతా యువతే. వీరికి సర్వీస్ నచ్చితే తమ మిత్రులందరికీ చెబుతారు. ఇలా ఒకరికొకరు చెప్పడం వల్ల రాయల్ బ్రదర్స్ డిమాండ్ కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్లింది. వారాంతాల్లో మిత్రులతో సరదాగా వెళ్లాలనేవారికి రాయల్ బ్రదర్స్ మంచి అవకాశం కల్పిస్తోంది. యువతే కాదు బిజినెస్ ట్రిప్పుల మీద ఆయా నగరాలకు వచ్చే మధ్య వయసు వాళ్లు కూడా రాయల్ బ్రదర్స్ బైకులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రెంటల్ ద్వారా వస్తున్న ఆదాయంతో పాటు ఫ్రాంఛైజీ మోడల్ లోకి అడుగు పెట్టాలని రాయల్ బ్రదర్స్ గురుశిష్యులు భావిస్తున్నారు.

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలన్నా... మార్కెట్ కు వెళ్లాలని క్యాబ్ అగ్రిగ్రేటర్లయిన ఓలా, ఉబర్ లపైనే ఎక్కువ అధారపడుతున్నారు. సొంత వాహనాలు కొనాలనే ఆలోచనను దూరం పెడుతున్నారు. ఒకవేళ సొంత వాహనం ఉన్నా... అవుట్ స్టేషన్లకు వెళ్లాలన్నా.. చాలా మంది రెంటల్ వెహికల్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూమ్ కార్ ఈ రంగంలో మంచి పనితీరు కనబరుస్తోంది.

విస్తరణ ప్రణాళికలూ ఉన్నాయి...!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ మార్కెట్ పైనే రాయల్ బ్రదర్స్ దృష్టి పెట్టింది. ఏడాదిలో బ్రేక్ ఈవెన్ సాధించడంతో.. వచ్చే ఏడాది కల్లా దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీని కోసం ఏ-రౌండ్ ఫండింగ్ కోసం పలు సంస్థలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఆదాయాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంలో సెమీ ఫ్రాంచైజీ, ఫ్రాంచైజీ మోడల్ ను పరిశీలిస్తున్నారు. సెమీ ఫ్రాంఛైజీ మోడల్ లో సగం సగం పెట్టుబడులు పెట్టడం, ప్రాంఛైజీ మోడల్ లో బిజినెస్ కమిషన్ తీసుకునే పద్దతి మీద రెవెన్యూ పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఇండియన్ మార్కెట్ లో పట్టు సాధించిన తర్వాత శ్రీలంక పై దృష్టి సారించాలని రాయల్ బ్రదర్స్ ఫౌండర్స్ నిర్ణయించుకున్నారు. బైక్ రెంటల్ విభాగంలో శ్రీలంకలో అద్భతమైన అవకాశాలున్నాయని వీరు అంచనా వేస్తున్నారు. ఈ గురుశిష్యులు ఈ ఘనతను సాధించడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.

వెబ్ సైట్