లారీ డ్రైవర్లను 'స్మార్ట్' గా మార్చిన స్టార్టప్..!!
అదొక టోల్ గేట్! ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారులతో సందడిగా ఉంది! దస్ కిలోమీటరీ హై నా! దో సౌ లేలో! ఒక వ్యాపారి బేరమాడుతున్నాడు! ట్రక్కు వాడు గిట్టుబాటు కాదన్నాడు! మరో లారీ డ్రైవర్ అదే రెండొందలకు సవారీ కుదుర్చుకుని లోడ్ తీసుకెళ్లాడు! పాపం మొదటి ట్రక్కు డ్రైవర్ కు ఆ రోజంతా గిరాకీ దొరకలేదు! మొన్నటిదాకా చాలా మంది డ్రైవర్లది ఇదే పరిస్థితి! కానీ మూవ్ 10 ఎక్స్ వచ్చాక వారికిప్పుడు చేతినిండా పని దొరుకుతోంది! ఇంతకూ ఏమిటా కంపెనీ? ఎవరు దాని సృష్టికర్తలు? అది తెలియాలంటే లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటరైపోండి!
ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వే! రవాణా వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే రహదారి! లారీల్లో ముంబైకి తరలిపోయే తాజా కూరగాయల పరిమళం ఉదయపు గాలిని సమ్మోహనంగా మారుస్తుంటుంది! ఒక్క ముక్కలో చెప్పాలంటే వందలాది మందికి అన్నం పెట్టే మార్గం అది! ఈ రూట్లో కొందరు ట్రక్కు డ్రైవర్లు ఏజెంట్ల కింద పనిచేస్తుంటే, మరికొందరు సొంతంగా నడుపుకుంటున్నారు. ఒక్కోసారి కొన్ని ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు కూడా దొరకదు. ఎప్పుడో ఓసారి మహా అయితే రెండు ట్రిప్పులు పడతాయి. ఆరు వందల దాకా వస్తాయి కానీ డీజిల్ ఖర్చులు పోను మిగిలేది ఏమూలకు? దాంతో కుటుంబాన్ని పోషించడమంటే కష్టమే! ఇండియాలో ఏటా ఎంతో మంది నిరుద్యోగులు లారీ డ్రైవర్లుగా మారిపోతున్నారు. ఏడాదికి నాలుగు లక్షల దాకా ట్రక్కులు కొనుక్కెళ్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ డ్రైవర్స్..!
ఆకాశ్ బన్సల్, మహమ్మద్ ఇస్రాలీ షేక్! ముంబైలో సరుకు రవాణా వ్యవస్థ క్రమబద్దంగా లేదని వీళ్లిద్దరూ గుర్తించారు. ట్రక్కు డ్రైవర్లందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదికి తెస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా పుట్టిందే మూవ్ 10 ఎక్స్ కంపెనీ! 2015లో ప్రారంభమైన వ్యాపారం ఆరు నెలల్లోనే ఎక్కడికో వెళ్లిపోయింది. రూ.50 లక్షల పెట్టుబడితో మొదలై, ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. ఫౌండర్లు ప్రస్తుతం ఫండ్ సేకరించే పనిలో ఉన్నారు.
మూవ్ టెన్ ఎక్స్ లో చేరిన దగ్గర్నుంచి బతకు బండి సాఫీగా నడిచిపోతుందంటాడు టాటా ఏస్ డ్రైవర్ మనూ. అంతకుముందు పరిస్థితి దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రోజుకు నాలుగైదు ట్రిప్పులు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇండియాలో మార్కెట్ వ్యవస్థ క్రమబద్దంగా ఉండదు. రవాణాలో సరుకులకు గ్యారంటీ కూడా ఇవ్వరు. కానీ మూవ్ 10 ఎక్స్ ద్వారా అవి రెండూ కల్పిస్తున్నాం- మహమ్మద్ షేక్
అమెరికాలో పుట్టిన ఐడియా..
ఆకాశ్ బన్సల్ కాలిఫోర్నియాలో చదువుతున్నప్పుడే ఈ ఐడియా తట్టింది. ఇండియా వచ్చిన తర్వాత షేక్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి ముంబై మార్కెట్ ను జల్లెడ పట్టారు. సరుకు రవాణా గురించి చిన్నపాటి పరిశోధన చేశారు. వ్యాపారులతో మాట్లాడారు. సేకరించిన వివరాలన్నీ క్రోడీకరించి ఒక ఐడియాకు వచ్చారు. ముందుగా ఆకాశ్ ఒక వెబ్ సైట్, యాప్ డిజైన్ చేశాడు. నెల తర్వాత కంపెనీ ప్రారంభించాడు. మొదట్లో ఐదుగురు డ్రైవర్లే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య నాలుగు వందలకు చేరింది. డ్రైవర్లందరినీ స్మార్ట్ ఫోన్లతో అనుసంధానం చేశారు. యాప్ లో నేరుగా డ్రైవర్ తోనే కాంటాక్ట్ కావొచ్చు. మూవ్ 10 ఎక్స్ డ్రైవర్లు ముంబైలో వంద మంది వ్యాపారులకు నిత్యం సరుకులు ట్రాన్స్ పోర్ట్ చేస్తుంటారు.
సింపుల్ బిజినెస్ మోడల్!
ఇదొక సింపుల్ బిజినెస్ మోడల్. ఫోన్ కాల్, యాప్, వెబ్ సైట్ ద్వారా వెహికిల్ బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ వెళ్లిన తర్వాత నిమిషాల మీద ఇంటికి బండి పంపిస్తారు. మినీ, మ్యాక్స్, మాక్స్ ప్లస్, మెగా ట్రక్కులు రెంటుకు దొరుకుతాయి. ఎండా, వాన, దుమ్మూ ధూళి బారిన పడకుండా సామగ్రిని సురక్షితంగా గమ్యానికి చేర్చడం వీరి స్పెషాలిటీ! వాహనం ఎక్కడుందో ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. దూరం, సమయం ఆధారంగా బిల్లింగ్ ఉంటుంది. మొదటి రెండు కిలోమీటర్లకు ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. బేసిక్ ఫేర్ రూ.50 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ప్రతీ ట్రాన్జాక్షన్ లో కొంత పర్సంటేజీని డ్రైవర్ కు చెల్లిస్తారు.
వెంచర్ క్యాపిటల్ సేకరణ
మూవ్ 10 ఎక్స్ తరహా కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. రోడ్ రన్నర్, డెలివరీ, పెప్పర్ ట్యాప్, పోర్టర్, గో గో ట్రక్, లాజీష్యూర్, షిప్పర్ ఆ కోవలోకే వస్తాయి. ఇందులో కొన్ని బిజినెస్ టూ కన్జ్యూమర్ , బిజినెస్ టు బిజినెస్ మోడల్ లో పనిచేస్తున్నాయి. వీటన్నింటితో పోలిస్తే మూవ్ 10 ఎక్స్ వాళ్లు బెటర్ సర్వీసెస్ అందిస్తున్నారు. యువర్ స్టోరీ పరిశోధన ప్రకారం ఇండియన్ స్టార్టప్ లు 317 మిలియన్ డాలర్ల నిధులు సేకరించాయి. ఒక్క ఈ-కామ్ ఎక్స్ ప్రెస్ కంపెనీయే 137 మిలియన్ డాలర్లు సేకరించింది. ఏ కంపెనీ అయినా మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెంది, దేశమంతా వ్యాపారాన్ని విస్తరించాలంటారు ఢిల్లీలోని ఛార్టర్ మెంబర్ బోర్డు సభ్యుడు సుబిందర్ ఖురానా. మార్కెట్లో ఖర్చులు తగ్గించుకుంటూ, ట్రక్కు డ్రైవర్లతో తెలివైన సంబంధాలు కొనసాగించాలన్నది ఆయనిచ్చే సలహా!
ఇకపోతే ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం.. లాజిస్టిక్స్ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లు! అందులో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ వ్యాల్యూ 50 బిలియన్ డాలర్లు! మార్కెట్ ఎంత పెద్దగా విస్తరించి ఉన్నా- కేవలం ఐదు శాతం కంపెనీలు మాత్రమే వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నాయి. ఇండియాలో 4.30 మిలియన్ల అంతర్రాష్ట, జిల్లా, గ్రామీణ రోడ్లు ఉన్నట్టు ఎర్న్స్ అండ్ యంగ్ కన్సల్టెన్సీ లెక్కలేసింది. రవాణా రంగంలో వ్యాపారానికి మంచి అవకాశాలున్నాయని పేర్కొంది. ట్రక్కు డ్రైవర్లను స్మార్ట్ ఫోన్లతో అనుసంధానం చేయడం వినూత్నమైన ఆలోచన అని కితాబిచ్చింది. అయితే డేటా నిర్వహణలో వైఫల్యాల కారణంగా చాలా కంపెనీలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయని వెంచర్ ఈస్ట్ మేనేజింగ్ పార్ట్నర్ శరథ్ నారూ విశ్లేషిస్తారు.
యువర్ స్టోరీ సేకరణ
ఏ వ్యాపారమైనా సరే ఆంట్రప్రెన్యూర్లు మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మంచి ప్రోడక్ట్, కత్తిలాంటి టీమ్, తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి ఎంట్రీ- ఈ మూడింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడ తేడా కొట్టినా బిజినెస్ పునాదులు కదిలిపోతాయి. నాణ్యమైన సేవలకు తోడు ట్రక్కు డ్రైవర్లను కూడా సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే వ్యాపారం విజయవంతం అవుతుంది. ఆకాశ్, మహమ్మద్ షేక్ ల స్టార్టప్ జర్నీ ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంది. వారి వ్యాపారం మూడు ట్రాలీలు, ఆరు ట్రక్కులుగా వర్ధిల్లాలని ఆశిద్దాం!