అపార్ట్‌మెంట్ వాసుల అవసరాలన్నీ తీర్చే వేదిక 'అపార్ట్‌మెంట్ అడ్డా'
అపార్ట్‌మెంట్ అడ్డాను 3 లక్షల మంది నివాసితులు ఉపయోగించుకుంటున్నారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన వివరాలను నిర్వహించుకునేందుకు అనువైన సాఫ్ట్‌వేర్ అపార్ట్‌మెంట్ అడ్డా. 2009 జూలైలో వెంకట్ కందస్వామి, సంగీతా బెనర్జీలు దీన్ని ప్రారంభించారు. శరద్ శర్మ, భూపేన్ షా, స్లింగ్ మీడియాకు చెందిన రఘు తారా... దీనికి ఏంజల్ రౌండ్ ఫండింగ్ చేశారు. ఇప్పుడీ అడ్డా.. బజర్ అనే మార్కెట్ ప్లేస్‌తో ముందుకొచ్చింది.
అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న అపార్ట్‌మెంట్ అడ్డా యూజర్స్ అందరికీ ఉపయోగపడుతుంది బజర్. ప్లంబర్స్, కార్పెంటర్స్, ట్యూటర్స్.. ఇలాంటి సేవలను బజర్ ద్వారా పొందచ్చు. “ తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న సర్వీసులను యూజర్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇరుగు పొరుగులకు ఆయా సేవల నాణ్యతను తెలిపేందుకు రేటింగ్ ఇవ్వచ్చ”ని చెప్పారు సంగీత. అర్బన్ క్లాప్ మాదిరిగా పోటీని పెంచి సర్వీసుల్లో నాణ్యత పెరిగేందుకు ఇది సహాయపడుందని అంటున్నారు నిర్వాహకులు. ఒక రకంగా ఇది వాస్తవమే అయినా.. కేవలం అపార్ట్‌మెంట్ అడ్డా యూజర్లకు మాత్రమే పరిమితం చేయడం.. కొంత నిరుత్సాహకరమైన విషయం.
ఇరుగుపొరుగులే బలం
“గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఇరుగుపొరుగున గుంపుగా ఉండే ప్రాంతాల నుంచి ఆర్డర్స్ పొందగలగడం.. స్థానికంగా సేవలు అందించేవారికి ఎంతో ఉపయోగం. వారి నుంచి అందే రేటింగ్, ఫీడ్‌బ్యాక్‌ల కారణంగా.. తమ సేవల్లో క్వాలిటీ పెంపొందించుకుని కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంద”ని అంటున్నారు సంగీత.
స్థానిక సర్వీసుల మార్కెట్ ప్లేస్ సామాజిక జీవనంపై ప్రభావం చూపుతుందని.. ఇలాంటి సంస్కృతి భారత దేశంలో చాలా సహజమని విశ్వసిస్తోంది అపార్ట్‌మెంట్ అడ్డా. రోజుకు 2వేల ఆర్డర్లను ప్రాసెస్ చేయగల స్థాయిని ఇప్పటికే అధిగమించింది ఈ స్టార్టప్. ఇప్పటివరకూ ఈ కంపెనీ ఎదుగుతున్న తీరు చూస్తే.. ఈ సంఖ్య పెరగడమే తప్ప.. తగ్గబోదనే విషయం స్పష్టంగానే అర్ధమవుతుంది. గత ఏడాదిలోనే ₹రూ. 720 కోట్ల రూపాయలను నిర్వహణ కోసం వెచ్చించారు యూజర్లు. అపార్ట్‌మెంట్ అడ్డా సాఫ్ట్‌వేర్ ద్వారా చేసిన చెల్లింపుల మొత్తం ఇది. బజర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కలే ఉన్న ఫ్రీలాన్స్ సర్వీస్‌రుల వివరాలను పొందచ్చు. అంతే కాదు యూజర్లు బొమ్మల నుంచి ఫ్లాట్స్ వరకూ ఏ వస్తువునయినా ఇరుగుపొరుగుల నుంచి కొనుగోలు చేయచ్చు, అమ్మచ్చు కూడా.
ఆదాయ మార్గాలు
క్లాసిఫైడ్స్, మార్కెట్ ప్లేస్‌ల కారణంగా.. తమ సాఫ్ట్‌వేర్‌కి యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని చెబ్తున్నారు అపార్ట్‌మెంట్ అడ్డా నిర్వాహకులు. ప్రస్తుతం ఈ వెంచర్‌కి 3 లక్షల మంది అపార్ట్‌మెంట్ నివాసితులు యూజర్లుగా ఉండగా... 80 నగరాల్లోని 8వేలకు పైగా కమ్యూనిటీలకు.. యాప్, పోర్టల్ ద్వారా సేవలు అందిస్తున్నారు. “ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా ప్లంబింగ్ సర్వీసులు, లక్షన్నరకు పైగా విద్యుత్ సంబంధిత సేవు, 35వేలకు పైగా కార్పెంటర్ సేవలను అపార్ట్‌మెంట్ అడ్డా ద్వారా పూర్తి చేశామ”ని తెలిపారు సంగీత.
పొరుగువారితో డిస్కస్ చేయడానికి, స్థానిక సర్వీసులు తెలుసుకోవడానికి, సమాచారం తెలియచేయడానికి, సొసైటీ కార్యాలయం నుంచి అలర్ట్స్ పొందడానికి, మెయింటెనెన్స్, బిల్ పేమెంట్స్‌కు అడ్డా యాప్‌ను ఉపయోగిస్తున్నారు యూజర్లు. ప్రస్తుతం క్లాసిఫైడ్ విభాగం తమ మార్కెట్‌ను, లాభదాయకతను పెంచుతుందని ఆశిస్తున్నారు అపార్ట్‌మెంట్ అడ్డా నిర్వాహకులు. ఒక్క బెంగళూరులోనే 6వేలకు పైగా ఫ్రీలాన్సర్లు తమ సేవలను రిజిస్టర్ చేసుకున్నారు.
ఆన్‌లైన్ బిల్లింగ్, అకౌంటింగ్ మినహా.. అన్ని సర్వీసులను పోర్టల్/యాప్ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. ప్రీమియం వెర్షన్‌కు అపార్ట్‌మెంట్‌లోని ఒక్కో ఫ్లాట్‌కు నెలకు 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుందంతే. “తమ సొసైటీకి సంబంధించిన అన్ని విషయాలకు ఇది వన్ స్టాప్ షాప్ లాంటిది. ప్రతీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు ఇదో ప్రైవేట్ ఫేస్‌బుక్, ఆన్‌లైన్ యాప్ వంటిది”అంటున్నారు సంగీత. సర్వీసుల బుకింగ్ నుంచి కమీషన్, ప్రీమియం సర్వీసుల లిస్టింగ్ ద్వారా బజర్‌కు ఆదాయం లభిస్తోంది.
సెగ్మెంట్ అండ్ ఫండింగ్
ఈ కంపెనీ ఏ రంగంలో ఉందో స్పష్టంగా చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయమే. రియల్ ఎస్టేట్, సోషల్ నెట్వర్కింగ్, హైపర్ లోకల్ సర్వీసుల మార్కెట్ ప్లేస్‌లను కమ్యూనిటీలకు అనువుగా మలిస్తే... అపార్ట్‌మెంట్ అడ్డా రూపొందిందని చెప్పచ్చు. స్థానిక సర్వీస్‌గా మొదలైన బజర్‌కు.. విపరీతమైన స్పందన వస్తోంది. 10 మిలియన్ యూఎస్ డాలర్ల ఫండింగ్ పొందిన అర్బన్ క్లాప్.. హైపర్ లోకల్ సర్వీసులకు రోల్‌మోడల్‌గా నిలిచింది. అలాగే టైగర్ గ్లోబల్ నుంచి 5 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పొందింది లోకల్ ఓయే. ఇలా ఇన్వెస్ట్‌మెంట్స్ సమీకరించిన కంపెనీలు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే అపార్ట్‌మెంట్ అడ్డా.. వీటిలో దేనితోనూ నేరుగా పోటీ పడ్డం లేదు. అపార్ట్‌మెంట్స్ నిర్వహణ సర్వీసులు ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యాప్‌ఫోలియో.. ఇలాంటి అపార్ట్‌మెంట్ సర్వీసులకు బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది.
ఫ్యూచర్ అడ్డా
56మంది టీం ఉన్న అపార్ట్‌మెంట్ అడ్డా.. ప్రస్తుతం బెంగళూరు, ముంబైల్లో సర్వీసులు అందిస్తోంది. ఏ సిరీస్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రతీ ఇంటికీ ఉపయోగపడేలా యాప్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
“రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘకాలంగా ఇంటి అమ్మకం, కొనుగోళ్లపైనే దృష్టి పెట్టారు. అయితే.. ఆ ఇంటికి సంబంధించిన అవసరాలను పెద్దగా పట్టించుకోలేదు. అపార్ట్‌మెంట్ అడ్డా ఇంటి నిర్వహణకు ఉపయోగపడే యాప్. స్థానికంగా ఉండే సర్వీసుల ఆధారంగా.. చక్కని సేవలు పొందగలిగేందుకు అపార్ట్‌మెంట్ అడ్డా ఉపయోగపడుతుంది” అన్నారు కో ఫౌండర్ సంగీత.