దేశమంతా వేసవి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వేసవి తాపానికి గ్రామాల్లో తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా నేలంతా బీటలు వారింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కరువయ్యాయి. బిందెడు నీళ్ల కోసం మహిళలు మైళ్ల దూరం నడవాల్సి పరిస్ధితి. దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణ పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఏ ఊరు చూసినా...ఏ వాడకెళ్లినా....గుక్కెడు నీటి కోసం జనం విలవిల్లాడుతున్నారు.
సుమారు 33 కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్, మహారాష్ట్రలోని మరఠ్వాడా, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కరువు చాలా తీవ్రంగా ఉంది. ప్రజలకు తాగునీరు లభించడం గగనమయింది. కర్ణాటక, ఒడిషాలోని వేలాది గ్రామాలు తాగునీరు లేక విలవిలలాడుతున్నాయి. ఇష్టారీతిన బోర్లు వేయడం ప్రధాన కారణమని చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాలు సరిగ్గా పడకపోవడం కూడా ఇంకో అతిపెద్ద కారణం.
నీటికోసం ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు. చెలిమలు తవ్వి మరీ నీటిని ఒడిసిపట్టుకుంటున్నారు. బిందెలు, కంటెయినర్లలో పట్టుకొని కిలోమీటర్ల కొద్ది ఎండలో నడవడం నరకమే. కానీ తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఈ పనులు మహిళలే బాధ్యత తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక నీరు తెస్తూ వడదెబ్బ తాకి మరణించింది. అంతేకాదు సరైన రక్షణ గోడలు లేని బావుల్లో నీరు తోడుతూ ఎందరో మహిళలు మరణించిన సంఘటనలు ఉన్నాయి.
అలాగే ఎక్కువ మొత్తంలో నీటి తలపై పెట్టుకొని మోయడం మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో ఆడవారు కుప్పకూలిపోతున్నారు. వారి జననాంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. గర్భంతో ఉన్న మహిళలు బరువులు మోయడం వల్ల గర్భవిచ్ఛిత్తి జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా దక్షిణ అమెరికా దేశాల్లో మహిళలు, పిల్లలు సుమారు 125 మిలియన్ గంటలను నీటిని తీసుకురావడంలోనే గడిపేస్తున్నారు.
నీటి ఎద్దడికి పరిష్కార మార్గాల్లో ప్రధానమైనది ముందు జాగ్రత్త!
నీటి కాపాడవలసిన బాధ్యత మనందరిదీ. ముఖ్యంగా భూగర్భ జలాలను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రధానంగా భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. బీహార్లోని సీతామర్హి జిల్లాలో స్థానిక యంత్రాంగం ప్రతీ ప్రభుత్వ పాఠశాల, పోలీస్ స్టేషన్లలో ఇంకుడు గుంతలను తవ్వించింది. ఇలా సుమారు రెండు వేలకు పైగా ఇంకుడు గుంతలను తవ్వి భూగర్భ జలాలను పెంచే పనిలో ఉన్నారు. లోహియా స్వచ్ఛ అభియాన్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యూనిసెఫ్ సైతం ఈ కార్యక్రమాన్ని గుర్తించింది.
వాటర్ వీల్ తో తాత్కాలిక పరిష్కారం !
నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వాటర్ వీల్ తాత్కాలిక పరిష్కారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా నీటిని బిందెలతో కంటెయినర్లతో మోసుకుంటూ వెళ్లడం చాలా కష్టం. ఇలాంటి ప్రాంతాల్లో వాటర్ వీల్ ఓ పరిష్కార మార్గం అనే చెప్పవచ్చు. వాటర్ వీల్ లో కంటెయినర్ ఒక చక్రంలా ఉంటుంది. దీన్ని రోడ్డు మీద దొర్లించుకుంటూ వెళ్లవచ్చు. తద్వారా నీటిని మోసే పని తప్పుతుంది. రాజస్థాన్ లో ఈ వాటర్ వీల్ ప్రయోగం విజయవంతం అయింది. ఎన్జీవోలు కానీ, ప్రభుత్వం కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ ముందుకు వస్తే మిగితా ప్రాంతాల్లో ఈ వాటర్ వీల్ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు.
టెక్నాలజీ వాడకంతో నీటి వినియోగం !
ముంబైలోని ధారవి మురికి వాడల్లోని బాలికలు పానీ ఆప్ పేరిట ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేశారు. ఇది వాటర్ వచ్చే సమయాన్ని మొబైల్ కి అలర్ట్ చేస్తుంది. ఇది నిజంగా ధారవిలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. నీరు వచ్చే దాకా ఎదురు చూడటం వల్ల బస్తీల్లోని మహిళల సమయం రోజంతా వృధా అవుతోంది. ఈ సమస్య నుంచి పరిష్కారం కోసమే పానీ యాప్ చాలా బాగా పనిచేస్తోంది.
వర్షాలు లేని సమయంలో సముద్రుడే దిక్కు..!
వర్షాలు సరిగ్గా పడక తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటే మాత్రం సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చడమే పరిష్కారం. డీ సలైనేషన్ అనే పద్ధతి ద్వారా నీటిని మంచినీటిగా మార్చే అవకాశం ఉంది. దుబాయిలోని జెబెల్ అలీ డీసలైనేషన్ ప్లాంట్లో ప్రతి రోజు 2.13 బిలియన్ల నీటిని ప్రతిరోజు మంచినీటిని సేకరిస్తున్నారు.
నీరు ప్రాణాధారం అందుకే మనిషి తన జీవితంలో నీటి కోసం ఎంత సమయం అయినా వెచ్చిస్తాడు. కానీ ఆధునిక యుగంలోనూ మహిళలు నీటిని వినియోగం కోసం ఇన్నేసి గంటలు సమయం వృధా చేసుకోవడం బాధాకరం. నీటి సంరక్షణ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసి, నీటిని కాపాడుకుంటే భవిష్యత్ బంగారు బాట అవుతుంది.