Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

కొన్నాళ్లు నేనెందుకు అజ్ఞాతంలో ఉన్నానంటే..??

కొన్నాళ్లు నేనెందుకు అజ్ఞాతంలో ఉన్నానంటే..??

Sunday August 28, 2016 , 4 min Read

అన్నా హజారే... అహింసే ఆయన మార్గం. శాంతి దూతగా పేరుతెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పోలీసు లాఠీతో ఓ పోలీసును చితగ్గొట్టాడు. అలా ఇలా కాదు. అన్నా కొట్టిన దెబ్బలకు పోలీసు తలకు ఎనిమిది కుట్లు పడ్డాయి. అన్నా మూడు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అహింసా మార్గంలో నడిచిన అన్నా రక్తం వచ్చేలా పోలీసులను ఎందుకు కొట్టాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోండి.

అన్నా హజారేను ఆయన మామ తన వెంట ముంబైకి తీసుకెళ్లాడు. ముంబైలో అన్నా హజారే ఏడో తరగతి వరకు చదివాడు. ఇంట్లోని కష్టాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నా చిన్నతనంలోనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అన్నా ముంబైలో పువ్వులను మాలలుగా తయారుచేసి అమ్మేవాడు. పువ్వుల వ్యాపారం చేయడం వెనుకా ఓ కారణం ఉంది. పాఠశాల సెలవు రోజుల్లో అన్నా హజారే ఓ పూల దుకాణానికి వెళ్లి కూర్చునేవాడు. అక్కడ పనిచేసేవాళ్లను చూసిన అన్నా... తను కూడా పూలమాలలు, గుచ్ఛాలు తయారుచేయడం నేర్చుకున్నాడు. ఆ షాపు యజమాని ఐదుగురు పనివాళ్లను నియమించుకొని వాళ్ల కష్టాన్ని సొమ్ము చేసుకోవడాన్ని అన్నా గమనించేవాడు. అప్పుడే తను సొంతగా షాపు తెరిచి తనే పనిచేస్తే బాగుంటుందని అన్నాకు అనిపించింది.

"పువ్వుల వ్యాపారం దైవభక్తితో కూడుకున్నది. నేను తయారుచేసే పూలమాల దేవుడి మెడలోకి వెళ్తుంది. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది కూడా ఓ కారణం" అంటారు అన్నా.

ముంబై మహానగరం అన్నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. కొద్ది రోజుల్లోనే కిసన్ బాబు రావ్ హజారేను... అన్నా హజారేగా మార్చేసింది ముంబై. అక్కడ ఆయన సామాజిక కార్యకర్తగా, ఆందోళనకారుడిగా మారిపోయాడు. యువకుడిగా ఉన్నప్పుడే అన్నా హజారే అన్యాయంపైన, లంచగొండితనంపైన గళమెత్తడం గొప్ప విషయం. వయస్సు చిన్నదే అయినా, అన్యాయంపై ఆయన పోరాటం, నాయకత్వ లక్షణాలు చూసి బాధితులంతా సాయం కోసం అన్నా హజారే దగ్గరకు వచ్చేవాళ్లు. అన్నా హజారే ఎక్కడ పువ్వులు అమ్మితే అక్కడ పళ్లు, కూరగాయల వ్యాపారులు దుకాణాలు తెరిచేవాళ్లు. ప్రతీరోజూ పోలీసులు వచ్చి పేదలు, చిరువ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేయడం చూస్తుండేవాడు అన్నా. డబ్బు ఇవ్వనివాళ్ల దగ్గర బలవంతంగా తీసుకునేవాళ్లు. చిరుద్యోగులు, స్త్రీలు అని కూడా చూడకుండా పోలీసులు చేయి చేసుకునేవారు. అన్నా దీన్ని కఠినంగా వ్యతిరేకించేవాడు. బాధితులకు అన్నా మద్దతివ్వడంతో అంతా ఆయన దగ్గరకు రావడం మొదలుపెట్టారు.

ఇలా అన్యాయంగా డబ్బు గుంజడం మంచిది కాదని మొదట్లో పోలీసులకు కాస్త నెమ్మదిగానే చెప్పి చూశాడు అన్నా. పోలీసుల్లో ఒకరిద్దరు తప్ప మిగతావాళ్లెవరూ ఆయన మాటలు పట్టించుకునేవాళ్లు కాదు. కొన్నిరోజుల్లోనే పోలీసుల బాధితుల నాయకుడిగా మారిపోయాడు అన్నా. అన్యాయాన్ని సహించడం అన్నా వ్యవహారశైలి కాదు. అసలే కుర్రాడు. ఉడుకు రక్తం. జనానికి వీలైనంత సాయం చేయాలన్న తల్లి నేర్పించిన మాటలు తరచూ గుర్తొచ్చేవి. అలా అన్యాయాన్ని ఎదిరించే నాయకుడయ్యాడు. ఈ పోరాటంలో ఓసారి ఏం జరిగిందంటే... ఏకంగా ఓ పోలీసునే చితగ్గొట్టేశాడు అన్నా. ఒకసారి ఓ పోలీసు మామూలు ఇవ్వనందుకు పూలవ్యాపారిని కొట్టాడు. పోలీసు చేతిలో దెబ్బలు తిన్నవ్యక్తి అన్నా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ బాధితుడిని తీసుకొని అన్నా పోలీసుల దగ్గరకు వెళ్లాడు. వ్యాపారిని కొట్టిన పోలీసు దగ్గరకు వెళ్లి... పేదల్ని ఇలా వేధించొద్దని చెప్పాడు. అప్పుడు ఆ పోలీసు అన్నాతో వాదనకు దిగాడు.

"నేను అక్కడికి వెళ్లా. పేదవాళ్లను ఎందుకు వేధిస్తారని పోలీసును ప్రశ్నించా. వాళ్లు నాపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోలీసు చేతిలో ఓ లాఠీ ఉంది. ఆ లాఠీ తీసుకొని ఆ పోలీసును ఎంతలా కొట్టానంటే... అతని తలకు ఎనిమిది కుట్లు పడ్డాయి" అంటూ ఆ రోజు జరిగిన ఘటనను వివరిస్తారు అన్నా.

అహింస, శాంతిదూతగా పేరున్న అన్నా హజారే ఓ పోలీసు రక్తాన్ని కళ్లచూశాడంటే ఆశ్చర్యమేస్తుంది. పోలీసు లాఠీతోనే పోలీసును చితగ్గొట్టాడు.

గాంధేయవాది భావజాలాన్ని విశ్వసించే అన్నా... ఆ ఘటనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటాడు.

"వాస్తవానికి అక్కడ హింస జరిగింది. కానీ ఆ సమయంలో గాంధీజీ నా జీవనంలో లేడు. నేనప్పుడు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకున్నా. ఎవరైనా తప్పు చేస్తే ఆ సమయంలో కఠినంగా ఉండాల్సిందేనని అనుకున్నా" అంటారు అన్నా.

పోలీసును కొట్టినందుకు అన్నాకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అరెస్టును తప్పించుకునేందుకు అన్నా అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఒక్కోసమయంలో ఒక్కో ప్రదేశంలో ఉండేవాడు.

"రెండుమూడు నెలల వరకు నేను అజ్ఞాతంలోనే ఉన్నా. నా పూల దుకాణానికి చాలా నష్టం వచ్చింది. పువ్వులు అమ్మేవాళ్లెవరూ నా చుట్టాలు కాదు. దాంతో దుకాణం మూతపడింది. అన్యాయంపై పోరాడటమే నా కర్తవ్యం. నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను" అని వివరిస్తారు అన్నా.

అన్నా అజ్ఞాతంలో ఉన్నన్ని రోజులు కష్టాలు ఎదుర్కొన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలాసార్లు రైల్వేస్టేషన్ లో నిద్రపోయాడు.

కొన్నిసార్లు స్నేహితుల దగ్గర ఉండేవాడు. పోలీసునే కొట్టడంతో పోలీసులందరూ అన్నాను పట్టుకునేందుకు ఎదురుచూస్తుండేవాళ్లు. పూలదుకాణం మూతపడటంతో తినడానికీ ఇబ్బందులు వచ్చాయి.

"అవన్నీ చాలా దారుణమైన రోజులు. ఎంతో భయానకంగా ఉండేది పరిస్థితి. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ పోలీసులు నన్ను పట్టుకోలేకపోయారు" అంటారు అన్నా.

భారత ప్రభుత్వం యువతను సైన్యంలోకి ఆహ్వానం పలుకుతోందన్న విషయం అన్నా అజ్ఞాతంలో ఉన్నప్పుడు తెలిసింది. దీంతో సైన్యంలో చేరి సైనికుడు కావాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే అన్నా సైనికుడు అయ్యాడు. అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ముంబై మాత్రం అన్నాను దోపిడీకి గురవుతున్న పీడితులకు నాయకుడిని చేసింది. అలా అన్నా ఆందోళనకారుడిగా, సామాజిక కార్యకర్తగా ఎదిగాడు. పోలీసును చితగ్గొట్టడం, అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి ముందు అన్నా ముంబైలో అద్దెకున్నవారి సమస్యలపై పోరాటం చేశాడు. ఆ రోజుల్లో ముంబైలో కొందరు గూండాలు, దాదాలు కిరాయికున్నవాళ్ల దగ్గరకు వచ్చి బెదిరించేవాళ్లు. డబ్బులివ్వాలని అడిగేవాళ్లు. లేకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరించేవాళ్లు. ఈ బెదిరింపుల గురించి అన్నాకు తెలియడంతో అన్నా తన సహచరులు, తనలా ఆలోచించే స్నేహితులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డాడు. సహచరులతో కలిసి వెళ్లిన అన్నా... కిరాయిదారుల నుంచి వసూళ్లు ఆపేయ్యాలని గట్టిగా హెచ్చరించాడు. అన్నా బెదిరింపు, తెగింపు చూసి పెద్దపెద్ద గూండాలు కూడా భయపడిపోయారు.

"నేను చిన్నప్పటి నుంచే అవినీతిపై పోరాటం మొదలుపెట్టాను. అప్పట్నుంచే అన్యాయాన్ని ఎదిరిస్తున్నాను. నేనప్పుడు చిన్నగా ఉన్నా. గూండాగిరీ నాకూ వచ్చని గూండాలను బెదిరించా. ఈ మాటలతో వాళ్లు భయపడిపోయారు" అని గర్వంగా చెబుతారు అన్నా.

రచయిత: డా. అర్వింద్ యాదవ్, మేనేజింగ్ ఎడిటర్ (ఇండియన్ లాంగ్వేజెస్), యువర్ స్టోరీ.

అనువాదం: సంతోష్ కుమార్