మీక్కావల్సిన డైట్.. మా దగ్గర వుంది!!
బిట్స్ పిలానీలో చదివారు.... ఫుడ్ టెక్ స్టార్టప్ ని పట్టాలెక్కించారు..
ఒకప్పుడంటే తిండికి తగ్గ పనుండేది. కాయకష్టం చేసే వాళ్లు.. కాబట్టి రోగాలు అంత తేలిగ్గా దగ్గరకొచ్చేవి కావు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. చిన్నతనం నుంచే లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు.. స్కూల్లో ఆడుకోటానికి ప్లే గ్రౌండ్ ఉండదు. అపార్ట్ మెంట్లలో ఇరుకిరుకు ఫ్లాట్ లలో కుర్చీలు మంచాలకే జాగా సరిపోదు. ఇక ఆటపాటలెక్కడ? కాస్త పెద్దైతే పోటీ పరీక్షలు, మార్కులు, ర్యాంకుల హడావుడి. మెట్రో నగరాల నుంచి చిన్నపాటి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒకవేళ కాలేజ్ డేస్ వరకు ఫిజికల్ యాక్టివిటీస్ అంతంత మాత్రంగా సాగినా, ఒక్కసారి జాబ్ లో జాయిన్ అయితే, అంతే సంగతులు. రోజులో సగం కంప్యూటర్ మానిటర్ కి తల అతికించి, కీ బోర్డ్ పై టకటకలాడిస్తూ బతికేయటమే. మరి అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ లో రోగాలు రావటంలో ఆశ్చర్యమేముంది. చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్...ఒకటా రెండా... అంతంకంతకూ పెరిగే బరువు, పేరుకునే కొవ్వు, చివరికి ఒళ్లంతా రోగాల కుప్పవుతుంది.
ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు నగరాల్లో చాలా మంది కనిపిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ వచ్చిన వాళ్లు కొందరైతే, వాటికి కాస్త దూరంలో ఉన్న వాళ్లు మరికొందరు. మరి ఇలాంటప్పుడు కూడా రెగ్యులర్ డైట్ తీసుకుంటానంటే ఎలా? డాక్టర్ లేదా డైటీషియన్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ఫాలో అవక తప్పదు. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలువుతుంది. ఆ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకుని, ప్రతి పూటా తీసుకోవాలంటే కష్టమే. టైమ్ సహకరించదు కూడా.
మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా.. ? అంటే ఎందుకు లేదు ఉంది.. మీక్కావలసిన డైట్ మా దగ్గరుంది...!! మీ మెనూని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేలా ప్రతి పూటా రుచిగా శుచిగా వేడివేడిగా అందిస్తాం..!! అంటోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఫిట్ గో .
అనుపమ్ గార్గ్, అంకిత్ అగర్వాల్, నరేంధిరన్... ఈ ముగ్గురూ బిట్స్ పిలానీలో చదువుకుని కార్పొరేట్ ఉద్యోగాల్లో టైమ్ తెలియకుండా గడుపుతూ అనేక ఆరోగ్య సమస్యలు చూసినవారే. పనికి, తిండికి వేళాపాళా లేని జీవితం. మధ్యలో జంక్ ఫుడ్.. వెరసి అనేక హెల్త్ ఇస్యూస్.
అప్పుడే వీళ్లకో ఆలోచన వచ్చింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా మంది బిజీ స్కెడ్యూల్ తో అన్ హెల్దీగా తయారవుతూ, సరైన ఫుడ్ టైమ్ కి దొరక్క, ఇబ్బందిపడుతున్నారని గ్రహించారు. అంతే కాదు.. అనుపమ్ తాను స్వయంగా ఓ డైట్ ప్లాన్ ఫాలో అయి తన హెల్త్ ని , ఫిజిక్ ని మళ్లీ కాపాడుకోగలిగాడు.
కానీ, ఇలాంటి అవకాశం టైమ్ అందరికీ ఉండదు కదా, వారికి సరైన ఆహారాన్ని అందించగలిగితే..?? ఇలాంటి ఆలోచన నుండే ఫిట్ గో ఆవిర్భవించింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి బాలన్స్డ్ డైట్ అందిస్తూ, లైఫ్ స్టైల్ మూలంగా వచ్చే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా, ఆల్రెడీ సమస్యలున్నవాళ్లకి స్పెషల్ డైట్ తీసుకోగలిగేలా సర్వీస్ ఇవ్వడమే ధ్యేయంగా ఫిట్ గోని మొదలు పెట్టారు.
"ఆలోచనైతే వచ్చింది కానీ, ఇంప్లిమెంట్ చేయటం ఎలా? కస్టమర్లు ఎంత మంది దొరుకుతారు? అసలీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఇలా మాకు చాలా సందేహాలు వచ్చాయి. ఈ క్రమంలో చేసిన సర్వేలో ఆశ్చర్యపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. బెంగళూరులో ప్రతి పదిమందిలో నలుగురు ఒబెసిటీతో బాధపడుతున్నారు. నగరంలో 70శాతంమంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. 26 శాతం మంది డయాబెటీస్ తో బాధఫడుతుంటే, ప్రతి నలుగురిలో ముగ్గురు గుండె సంబంధమైన సమస్యలొచ్చే డేంజర్ లో ఉన్నారు. ఇదంతా లైఫ్ స్టైల్ మూలంగా, అన్ హెల్దీ ఫుడ్ హాబిట్స్ మూలంగా వచ్చినవే" -అనుపమ్.
ఈ క్రమంలో చాలామంది డాక్టర్లని కలిశారు. పేరొందిన డైటీషియన్ల సలహాలు తీసుకున్నారు. ఫలితంగా ఎక్స్ పర్ట్ డైట్ రికమండెడ్ మీల్స్ డిమాండ్ ఆకాశంలో ఉంటే, సప్లై దానికి ఏ మాత్రం తగ్గట్టు లేదని గ్రహించారు. అలా మొదలైన ఈ ప్రాజెక్టులో రుచికరమైన ఆహారాన్ని, సరైన సమయానికి వేడివేడిగా, అప్పటికప్పుడు తినేలా అందించటానికి పలువురు సర్టిఫైడ్ డైటీషియన్స్ ని సంప్రదించి ఓ అవగాహనకి వచ్చారు.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా...
"అందరికీ ఒకే రకమైన ఆహారం సరిపడదు. వాళ్ల వాళ్ల అవసరాలకు, రుచులకు తగ్గట్టు వేరియేషన్ ఇవ్వక తప్పదు. కొందరికి స్ట్రెస్ మేనేజ్ మెంట్ ప్లాన్ అవసరమైతే, మరికొందరికి ఇమ్యూనిటీ బూస్టర్ ఫ్లాన్ అవసరం ఉంటుంది. అలా రకరకాల కస్టమర్లకోసం నిపుణులను కలిసి పలురకాల డైట్ ప్లాన్స్ సిద్ధం చేశాము.." -అనుపమ్
ఫిట్ గో మెనూలో
1.జనరల్ ప్లాన్.. ఇందులో రోజుకి 299 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇందులో, మజిల్ బిల్డింగ్, వెయిట్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్ మెంట్, ఇమ్యూనిటీ పెంచుకోవటం, లో కొలెస్ట్రాల్ ఇన్ టేక్ లాంటి అవసరాలు ఉన్న వారికి ఇది సరిపోతుంది.
2.స్పెషల్ కన్సల్టేషన్ బేస్డ్ ప్లాన్స్. ఇది కస్టమర్ల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు, ఆల్రెడీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికోసం జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటుంది. వారి హెల్త్ ఇష్యూస్, మెడికల్ హిస్టరీని బట్టి, ఆన్ లైన్ లో లేదా, పర్సనల్ గా స్పెషలిస్ట్ ని కలిసి డైట్ ఫ్లాన్ చార్ట్ ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది..
ఈ రెండు కేటగిరీలే కాకుండా, కస్టమర్ల ఇష్టాలు, అవసరాలను బట్టి రెడీమేడ్ గా ఆహారాన్ని అందించేందుకు ఫిట్ గో సన్నద్ధమవుతోంది. అంతే కాదు.. కొత్త కస్టమర్లెవరు ఆర్డర్ ఇచ్చినా అప్పటికప్పుడు కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఫిట్ గో పబ్లిక్ లోకి దూసుకుపోతోంది..
ఈ రోజు ఓకే.. మరి రేపటి సంగతేంటి?
''ఫిట్ గో సంస్థ గత మూడునెలల్లో బెంగళూరులో 2వేలమందికి తమ డైట్ సప్లై చేసింది. వారిలో సగంమంది పైగా రెగ్యులర్ కస్టమర్లుగా మారారు. ప్రస్తుతం మా రెవెన్యూ రన్ రేట్ కూడా లక్షల్లోకి చేరింది..'' అనుపమ్
భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇక్కడ డైట్ ప్లాన్స్, మీల్స్ అనుభవజ్ఞులైన ఛెఫ్ లు ఫిట్ గో కిచెన్ లోనే తయారు చేస్తారు. తయారీ వరకు ఫర్వాలేదు. కానీ, క్వాలిటీ ఏ మాత్రం చెడకుండా, ఇన్ టైమ్ లో కస్టమర్ కు సప్లై చేయటం ఛాలెంజింగ్ గా కనిపించే అంశమనే చెప్పాలి.
ప్రస్తుతం బెంగళూరులో కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లే-అవుట్, బీటీఎం లే అవుట్, బెల్లందూర్, సర్జాపూర్ రోడ్, ఎమ్లూర్, బొమ్మనహళ్లి, మారతహళ్లి ప్రాంతాల్లో తమ సర్వీసుని అందిస్తోంది ఫిట్ గో. ఈ ఏడాది చివరికి బెంగళూరు నగరమంతా తమ సర్వీసుని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.
హెల్త్ ని, ఫుడ్ టెక్ ప్లాట్ ఫాం ని కలిపి ఫిట్ గో కొత్త బిజినెస్ మోడల్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికైతై, ఈ స్టార్టప్ ఫలితాలు, కస్టమర్ల ఆదరణ చూస్తే ఆశావహంగా కనిపిస్తోంది. కానీ, డిమాండ్ మరింత పెరిగినపుడు ఫిట్ గో బలంగా నిలబడాల్సి ఉంటుంది. అంతే కాదు, ఫుడ్, హెల్త్ ప్లాట్ ఫామ్ లలో స్టార్టప్ లకు బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో కొత్తలో ఆదరణ లభించటం చాలా తేలిక. కానీ, ఆ సర్వీసులని విస్తరించటం మాత్రం ఛాలెంజింగ్ మారే అంశం. పైగా, ఫుడ్ బిజినెస్ తేలిగ్గా కనిపించినా, దాన్ని నడపటానికి, సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగటానికి గట్టి టీమ్ కూడా అవసరం. ఈ సమస్యలను ఎదుర్కొని ఫిట్ గో పరుగులు తీస్తుందని ఆశిద్దాం..