స్కూలు నుంచి పిల్లలను భద్రంగా ఇంటికి తీసుకొచ్చే టెక్నాలజీని కనిపెట్టారు వీళ్లు..
పిల్లలు స్కూల్ కు… తల్లిదండ్రులు ఆఫీస్ కు… ఇప్పుడు సిటీస్ లో ఇదే ట్రెండ్. భార్యా భర్తలిద్దరూ పనిచేస్తే తప్ప బతుకుబండి సాఫీగా నడవని పరిస్థితి. స్కూల్ కు వెళ్లే పిల్లలు సేఫ్ గా తిరిగివస్తారో … రారో… అసలు వాళ్లు ఎక్కడున్నారో సమాచారం లేక ఆఫీసులో తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అవసరంలేదంటోంది బెంగళూరు స్టార్టప్ పూర్ణత్వ.
టెక్నాలజీని అర్థవంతంగా ఉపయోగిస్తే… ఏ సమస్య అయినా పరిష్కారమవుతుందని బలంగా నమ్మే వ్యక్తి వంశీ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పూర్ణత్వ స్టార్టప్ ను ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో పదేళ్లపాటు ఉన్నత ఉద్యోగం చేసిన వంశీ.. ఏడాదిన్నర క్రితం ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూలాల్ దగ్గరకు వెళ్లి తన స్టార్టప్ ఐడియాను ఆయన ముందుంచారు. ఫ్యాక్టరీలు, ఆఫీసుల్లో ఉద్యోగుల రియల్ టైం డేటా కోసం ఇది ఉపయోగపడుతుందని వివరించారు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఒకప్పుడు స్టార్టప్సేనంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంతేకాదు… స్కూల్ పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా చేయాలంటూ శిబూలాల్ సలహానిచ్చారు.
పిల్లలు ఎక్కడున్నారో … ఏంటో తెలుసుకోవడం చాలా చిన్న వ్యవహారమే అనుకున్నాను. బెంగళూరులోని ఒక పెద్ద స్కూల్ కు వెళ్లాను. సమస్యకు పరిష్కారాన్ని పేపర్ మీద రాసుకున్నాను… అయితే దాన్ని అమలుచేయడం అంత తేలికకాదని తెలుసుకున్నాను. ఐటీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నానంటారు వంశీ.
వేరబుల్స్ తో సమస్య
పిల్లల వివరాలు తెలుసుకునేందుకు చాలా స్కూల్స్ వేరబుల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నాయి. పిల్లలకు స్మార్ట్ కార్డులు ఇస్తున్నాయి. దాన్ని స్వైప్ చేస్తూ అటెండెన్స్ వేయిస్తున్నాయి. దీన్ని బట్టి పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుంటున్నాయి. అయితే ఆ కార్డును విద్యార్థులే స్వైప్ చేస్తున్నారా… లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా అన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండదు. అంతా గందరగోళమే. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే పూర్ణత్వ స్టార్టప్ పెట్టారు వంశీ. స్వైప్ చేసేబదులు ఫొటోలను తీస్తూ… ఫింగర్ ప్రింట్స్ ని ఉపయోగిస్తారు. పిల్లాడు ఎక్కడున్నాడో ఇంటి దగ్గర ఉండి పూర్ణత్వ యాప్ లో చూసుకోవచ్చు. తల్లిదండ్రుల ట్యాబ్ లేదా మొబైల్ కు ఈ యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు.
చిన్నారి స్కూల్ వ్యాన్ ఎక్కగానే… వ్యాన్ లో పెట్టిన ట్యాబ్ లో పిక్ రికార్డవుతుంది. స్కూల్ యాజమాన్యం దాన్ని గుర్తిస్తుంది. అసలు పాప కేటాయించిన బస్సులోనే ఎక్కిందా లేదా అన్నది తెలుసుకుంటుంది. దీన్ని అటెండెన్స్ రిజిస్టర్ కు లింక్ చేస్తారు. ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఇదే ప్రక్రియ. పిల్లలు తమ పిక్ ను టచ్ చేస్తేనే బస్సులోకి ఎంట్రీ ఉంటుంది.
చెప్తుంటే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ చాలా డేటాను సేకరించాలి. రియల్ టైంలో స్కూల్ కు, పేరెంట్స్ కు పంపాలి. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇదే విధానాన్ని హెల్త్ కేర్ రంగంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ ఉపయోగించవచ్చు. ఉద్యోగి కదలికలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చంటారు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ అజయ్ ప్రసాద్.
వినియోగదారులు
ప్రీస్కూల్స్ కూడా పూర్ణత్వ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. పూర్ణత్వతో టై అప్ అయ్యాక తమ పని మరింత తేలికయ్యిందంటున్నారు కిడ్డో ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ వీకే మణికందన్. ప్రీస్కూల్ వారికే ఈ సేవలు ఎక్కువ అవసరం అంటారాయన. ఎందుకంటే పసివారి సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనేది మణికందన్ ఉద్దేశం. పూర్ణత్వ వచ్చాక తమ స్కూల్ అటెండెన్స్ మొత్తం ఆన్ లైన్లోనే వేస్తున్నామన్నారు మణింకందన్.
గత ఏడాది వరకు బెంగళూరులోని సంహిత అకాడమీ ట్రాన్స్ పోర్ట్ వ్యవహారం మొత్తం పేపర్లపై మాన్యువల్ గా మెయింటెయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ బాధ తప్పింది. తమ 9 వందల మంది విద్యార్థుల అటెండెన్స్ యాప్ ద్వారా చేసేస్తున్నామని మేనేజ్ మెంట్ తెలిపింది.
పూర్ణత్వ సొల్యూషన్స్ రాకముందు చాలా స్కూళ్లలో సమస్యలుండేవి. పిల్లలు డ్రాపింగ్ పెద్ద సమస్యగా ఉండేది. ఒకచోట దిగాల్సిన విద్యార్థులు వేరే స్టాప్ లో దిగడం, రాంగ్ రూట్ లో వెళ్లిపోవడం, బస్సులో నిద్రపోవడం. ఎంత మంది పిల్లలు బస్సెక్కారో తెలియకపోవడం ఇలాంటి సమస్యలుండేవి. ఇప్పుడు అవన్నీ పరిష్కారం అయ్యాయంటారు సంహిత అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా థోమస్.
ఈ స్టార్టప్ బెంగళూరుతోపాటు ఐదు సిటీల్లోని 25 స్కూల్స్ కు సేవలందిస్తోంది. యూజర్ల ఆధారంగా ఛార్జ్ చేస్తోంది. అయ్యే ఖర్చు చాలా తక్కువే. దాన్ని విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది. దీన్ని రీటైల్, ఆటో మొబైల్, ప్రభుత్వ సంస్థలకు కూడా అందించనున్నారు. అయితే ప్రస్తుతానికి స్కూల్స్ నుంచి చాలా డిమాండ్ ఉందని చెబుతున్నారు వంశీ.
మార్కెట్లో పోటీ
ఐఓటీ రంగంలో చాలా స్టార్టప్స్ ఉన్నాయి. నార్త్ స్టార్, హ్యాండ్స్ టెల్, ట్రాక్ మ్యాటిక్స్ లాంటి స్టార్టప్స్ చాలా స్కూల్స్ తో టై-అప్ అయ్యాయి. సరైన కస్టమర్లు లేకపోతే మాత్రం ఐఓటీ కంపెనీలకు చాలా కష్టం. ప్లాన్ ఈజీయేగానీ అమలు మాత్రం చాలా కష్టం. స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ డెడికేషన్ అవసరం. పూర్ణత్వలో నలుగురు సభ్యుల కోర్ టీం ఉంది. పది లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. నెల నెలా మంచి ఆదాయమే వస్తోంది. త్వరలోనే పూర్ణత్వ పెద్ద ఐఓటీ కంపెనీగా అవతరిస్తుందనడంలో సందేహం లేదు.