విభిన్న రుచుల లోగిళ్లు... ఆన్ లైన్ వంటిళ్లు
వంటచేయడం రాదనే బెంగ అవసరం లేదుబంధువులొచ్చినా భయం వద్దుపిల్లలకు రోజూ వెరైటీ వంటకాల విందుఆన్ లైన్ లో వెలిసిన కిచెన్లుఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న మహిళలు
మనకు ఎన్నో పండుగలున్నాయి. పండుగల రోజు మనం ఏం చేస్తాం ? కేవలం పూజలు, వ్రతాలతోనే సరిపెడతామా? పండుగలనేవి.. రకరకాల పిండివంటలు, రుచికరమైన ఆహార పదార్ధాలను తయారుచేసుకుని కడుపారా ఆరగించి ఆనందించే సందర్భాలు. ఆ రోజుల్లో పేద, ధనిక తేడాలేకండా అందరి ఇంటి వంటగదులూ హడావుడిగా ఉంటాయి. గిన్నెలు, గరిటెల శబ్దాలు వినసొంపుగా చెవులను చేరుతుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... వెంటనే లాగిన్ అవ్వండి... నోరూరించే వంటలను చూసి నేర్చుకోండి.
ఇలాంటి సందర్భాల్లో కొత్తగా ఏం వంటలు చేయవచ్చు? కుటుంబ సభ్యులకు కొత్త రుచులను ఏ రకంగా అందించాలి ? ఇవి సాధారణంగా ప్రతి మహిళకీ, ప్రతి గృహిణికీ ఎదురయ్యే సందేహాలు. అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. చదవండి. ఆన్ లైన్ వంట ఇళ్లలో లాగిన్ అవ్వండి. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఆన్ లైన్ కిచెన్‌ని ప్రారంభించి, వంటలు, చెఫ్‌ల సమాచారాన్ని సృజనాత్మకంగా అందించి, తమ ప్రొడక్ట్‌కి బ్రాండ్ వేల్యూ పెంచుకుంటున్నారు. పాతకాలం అమ్మమ్మలు, బామ్మల కాలం నాటి పిండివంటల నుంచి నేటి తరం ఆధునిక యువత ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్ వరకూ అన్ని రకాల సమాచారం ఒక్క క్లిక్ లో లభ్యం.
అర్చనాస్ కిచెన్: అర్చన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, యోగా టీచర్. కొద్ది కాలానికి వివాహం, తల్లిగా కొత్త బాధ్యతలు. అంతటితో ఆగలేదు. మరో కొత్త విభిన్న పాత్రకు సిద్ధమయ్యారు అర్చన. అలా మొదలైంది... అర్చనాస్ కిచెన్. ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యంపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందనేది కాదనలేని సత్యం. దీనిలో ముఖ్యమైనది ఫాస్ట్ ఫుడ్స్. అందుకే అర్చన దీనిపైనే దృష్టిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ రెసిపీలకి పోషక విలువలను జోడించి తన వెబ్ సైట్లో పోస్ట్ చేయసాగారు. అంతేకాదు... వివిధ సందర్భాలకు తగిన రెసిపీలు, సీజనల్ వంటలు... మరెన్నో రకాలు అర్చనాస్ కిచెన్ లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
సుబ్బూస్ కిచెన్: దక్షిణ భారత వంటల ప్రత్యేకం “సుబ్బూస్ కిచెన్”. దక్షిణ భారత ఆహార పదార్థాలకు ఎంతో పురాతన ప్రాశస్త్యం ఉన్నవి. ఆ సంప్రదాయ వంటకాలను తన సైట్ లో ఉంచారు సుబ్బు. “ఇవన్నీ నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నా” అని గర్వంగా చెబుతారు ఆమె. చాలామందికి వంట చేయడం అంటే ఇష్టం ఉండదు. అలాంటివారికి దానిపై ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ బ్లాగ్ ప్రారంభించారు. వంట అంటే బ్రహ్మవిద్యేమీ కాదు... ఇష్టంతో చేస్తే ఎంతో ఆనందంగా, సులభంగా నచ్చిన వంటకాన్ని వండివార్చేయొచ్చు. దానికి కావలసినదంతా సుబ్బూస్ కిచెన్ లో చూడవచ్చు.
మంజులాస్ కిచెన్: జైనుల సిద్ధాంతం... “లివ్ అండ్ లెట్ లివ్” (బ్రతకండి, బ్రతకనివ్వండి). ఇదే మంజులాస్ కిచెన్‌ని నడిపించే మూలసూత్రం. కూరలు అందంగా కనబడేందుకు ఫ్లేవర్లను కలిపే బదులు... రుచి పెంచేందుకు కొద్ది మొత్తంలో మసాలా దినుసులు, సుగంధ దినుసులు కలపడం ఉత్తమం. పైగా ఇది పురాతన కాలం నుంచీ వస్తున్న అలవాటు. ఈ రకంగా సహజసిద్ధమైన పద్ధతుల్లో తయారయ్యే పదార్ధాల వివరాలెన్నో మనం ఈ సైట్ ని బ్రౌజ్ చేస్తుంటే తెలుసుకోవచ్చు. ఇక్కడున్న వీడియోలు, ట్యుటోరియల్స్ చూసి ఎవరైనా... చాలా సులభంగా రుచికరమైన పదార్ధాలు తయారుచేయవచ్చు.
బేకర్ ఇన్ డిస్గైజ్: బేకింగ్... ఇదొక ఆర్ట్. మన చుట్టూ ఎన్నో బేకరీలు ఉంటాయి... కానీ అన్నింట్లో ఐటమ్స్ రుచిగా ఉండవు కదా. అందుకే బేకింగ్ ఈజ్ యాన్ ఆర్ట్. ఆ ఆర్ట్‌లో ప్రత్యేకత సాధించింది శర్వాణి. ఏ పదార్థాన్ని ఎంత పాళ్లలో కలపాలి, ఏ టెంపరేచర్ వద్ద ఎంతసేపు ఒవెన్‌లో ఉంచాలి... ఇవన్నీ ఒకరు చెబితే వచ్చేవి కాదు అంటారు శర్వాణి. చేస్తున్న పనిపై ఆసక్తి, అభిరుచి ఉన్నప్పుడే ఫలితం కూడా గొప్పగా ఉంటుందనేది ఆమె నమ్మకం. ఈ నమ్మకమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. బేకర్ ఇన్ డిస్గైజ్‌లో మీరు శర్వాణి సొంత రెసిపీలతో పాటు మరెన్నో రెసిపీల గురించి తెలుసుకోవచ్చు.
శైలూస్ ఫుడ్: ఫుడ్ బ్లాగుల్లో ప్రముఖమైన వాటిలో శైలూస్ ఫుడ్ ఒకటి. ఇలా ఎందుకంటున్నామో తెలియాలంటే ఓసారి మీ కంప్యూటర్లో “శైలూస్ ఫుడ్” ఓపెన్ చేయండి. కంప్యూటర్ స్క్రీన్ పై ఫొటోలు చూస్తుంటేనే మనకు నోరూరుతుంది. అంత అందంగా ఉంటాయి శైలూస్ కిచెన్ లో సిద్ధమైన ఆహారపదార్థాలు. ఈ బ్లాగ్ లో భారత్ లోని అన్ని ప్రాంతాల ఫుడ్ ఐటమ్స్ వివరాలు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రా రెసిపీలకు ఇది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.
షో మి ద కర్రీ: వంట ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వంట ఎలా చేయకూడదు అనేది తెలుసుకోవడం అంతకన్నా ముఖ్యం. హేతల్, అనూజ... వీరిద్దరూ తమ పిల్లలకి, కుటుంబానికి చాలా సంవత్సరాలు ఆహారం వండిపెట్టారు. ఎవరికైనా సర్వసాధారణం... అప్పుడప్పుడూ రుచి కొద్దిగా అటూఇటూ అవ్వడం. దీనికి వీరిద్దరూ అతీతులేమీ కాదు. అలా వారి కుటుంబం, పిల్లలూ నిత్యం ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వారిలో ఓ కొత్త ఆలోచన రేకెత్తించింది. ఎందుకు ఓ వెబ్ సైట్ ప్రారంభించకూడదు అని. అంతే... దక్షిణ భారత వంటల రెసిపీలతో సైట్ సిద్ధం చేశారు. ఇందులో కేవలం వారి రెసిపీలే కాదు... వంట చేస్తున్న సమయంలో మీ అనుభవాలు, అభిప్రాయాలు ఇతరులతో పంచుకోవచ్చు. అలాగే మీ కొత్త వంటలు, ఫెయిలైన రెసిపీలు... తద్వారా కలిగిన అనుభవాలను సరదాగా వీడియోలు, పాడ్ కాస్ట్‌ల రూపంలో పోస్ట్ చేయవచ్చు.
మై డైవర్సిటీ కిచెన్: ఇది కేవలం ఓ రెసిపీ బ్లాగ్ మాత్రమే కాదు... అపర్ణ జీవితం. అపర్ణకి ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అదేమిటంటే... రకరకాల ఆహార పదార్థాలను తయారుచేసి, వాటిని తన సొంత కెమెరాతో ఫొటోలు తీసుకుని చూసి మురిసిపోయేది. ఆ ఆసక్తే ఈరోజు “మై డైవర్సిటీ కిచెన్”లో విస్తృత ఫొటో లైబ్రరీ ఏర్పాటుని సులభం చేసింది. ఈ బ్లాగ్‌కి ఉన్న మరో ప్రత్యేకత... ఇందులో ఉన్నవన్నీ వెజిటేరియన్ రెసిపీలు మాత్రమే. బియ్యం, కూరలు, పప్పులు, కొబ్బరి... ఇలా సాధారణంగా ఇంట్లో లభించేవాటితోనే విభిన్న రుచులను సిద్ధం చేసే మెళకువలు ఎన్నో ఈ బ్లాగ్ లో లభ్యమవుతాయి. కేవలం భోజన సంబంధ పదార్థాలే కాదు... వెనిలా వంటి వివిధ ఫ్లేవర్ల ఐస్ క్రీమ్, చాక్లెట్ తయారీ వంటివి కూడా “మై డైవర్సిటీ కిచెన్” మనకు నేర్పిస్తుంది.
ఎడిబుల్ గార్డెన్: నాగ్స్... ఈమె కేరళ, హైదరాబాద్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల్లో వివిధ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ... పెళ్లి, భర్త, పిల్లలు... ఇవే జీవితంగా గడిపేవారు. అయితే ఇది ఆమెకు సంతృప్తి నివ్వలేదు. ఇంకా ఏదో ప్రత్యేకంగా చేయాలని నిరంతరం తపనపడేవారు. ఆ తపన నుంచి పుట్టినదే “ఎడిబుల్ గార్డెన్”. ఆన్ లైన్ లో విహరించే మహిళల్లో ఈ బ్లాగ్ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తన కేరళ, తమిళనాడు వంటకాలకు, విదేశీ రెసిపీలను జతచేసి అందించడమే ఈ గార్డెన్ ప్రత్యేకత. కొత్త కొత్త వంటకాలను ఎలా తయారుచేయాలనేదానిపైనే నాగ్స్ దృష్టి. అందుకే ఈ బ్లాక్ మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుంది.
నిషా మధులిక: నిషా వివరించే వంటకాలను మనం కూడా చాలా సులభంగా మన ఇళ్లలో తయారుచేసుకోవచ్చు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధిచెందిన వంటలను అందించడమే ఈ వెబ్ సైట్ ప్రత్యేకత. మొదట్లో కేవలం రెసిపీలకు సంబంధించిన ఆర్టికల్స్ మాత్రమే ఈ సైట్ లో ఉండేవి. క్రమంగా వీడియో ట్యుటోరియల్స్ కూడా పోస్ట్ చేయసాగారు. ఈ వీడియోలు, రెసిపీలు అన్నీ హిందీభాషలో ఉండటం ఈ సైట్ ప్రాచుర్యానికి మరింత దోహదపడింది.