మీరు మొక్కలు నాటండి... మేం పెంచుతాం అంటున్న సంకల్పతరు..!!

మీ సంకల్పాన్ని మేం నెరవేరుస్తాం.. రండి పచ్చదనాన్ని పెంచుదాం..!!

మీరు మొక్కలు నాటండి... మేం పెంచుతాం అంటున్న సంకల్పతరు..!!

Friday February 05, 2016,

4 min Read

ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఎండలు మంటలు రేపుతున్నపుడు కాసేపు బయటనడిచి చూడండి.. ఒఖ్కచెట్టన్నా లేదే అనిపించదూ... ఇప్పుడు నగరాల్లోనే కాదు... ఉన్న నాలుగు చెట్లూ అడ్డంగా నరికేస్తున్న పల్లెల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి టైమ్ లో దారిలో ఏ మర్రిచెట్టో కనిపిస్తే అంతకంటే పరమానందమేముంది. ప్రకృతి మనిషికి ఎంత మేలు చేస్తోందో గ్రహించే తత్వం బోధపడటం ఖాయం.

image


కానీ, మానవాళికి ఇంత ఉపయోగపడుతున్న ప్రకృతికి మనం ఎలా కృతజ్ఞత చెప్తున్నాం..? పచ్చదనాన్ని నాశనం చేస్తూ, చెట్టూ చేమా మాయం చేస్తూ, అడవులు కొట్టేస్తూ భూమండలాన్ని ఎడారిగా మార్చేస్తున్నాం. ఈ నిజాల్ని గ్రహించి ఎవరైనా, మొక్కలు నాటేద్దాం.. చెట్లు పెంచేద్దాం అని ఉత్సాహంగా ముందుకొచ్చారే అనుకోండి... వాళ్లముందు ఎన్నో ప్రశ్నలు నిలువెత్తు చెట్టులా నిలబడుంటాయి. 

image


ఎక్కడ మొక్కలు నాటాలి? వాటిని ఎలా పెంచాలి? వీటికి సమాధానం దొరకదు. ఇంటి పెరట్లోనో, వాకిట్లోనో పెంచే చిన్నా చితకా పూల మొక్కలో, క్రోటన్స్ సంగతో కాదు... కాస్త పెద్ద చెట్లు పెంచాలంటే ఎలా? మొదటి విషయం చాలా మందికి ప్లేస్ ఉండదు. రెండవది ఆ జోష్ లో మొక్కను నాటినా, దాన్ని కాపాడే తీరికా ఉండదు... ! మరి దీనికి పరిష్కారం లేదా? ఎందుకు లేదూ.... దానికి మేమున్నాం కదా...అంటోంది సంకల్పతరు.

సంకల్పతరు 

కార్పొరేట్ కంపెనీల నుండి, సాధారణ వ్యక్తుల వరకు.. మీకు చెట్లను పెంచాలనుందా? అయితే మమ్మల్ని సంప్రదించండి.. మీ ఆలోచననుంచి ఓ వటవృక్షాన్ని నిలబెట్టే పూచీ మాది అంటోందీ సంస్థ. పేరులాగే ఈ సంస్థ కూడా నామ్ కే వాస్తే మొక్కలు పెంచటం కాదు.. దాని ద్వారా సమాజానికి మరింత ఉపయోగపడాలనే తపన పడుతోంది. ఉపాధి అవకాశాలు పెంచటం ద్వారా గ్రామీణ భారతానికి తనవంతు తోడ్పాటునివ్వాలని భావిస్తోంది.

ఈ స్టోరీ కూడా చదవండి

సంకల్పతరు. ఈ సంస్థను అపూర్వ భండారి 2013లో స్థాపించాడు. అపూర్వ ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో మంచి ఉద్యోగం. ఉత్తరాఖండ్ లోని ప్రకృతి అందాల నడుమ పుట్టి పెరిగిన అపూర్వ.. నగర వాతావరణంలో కాంక్రీట్ జంగిల్ ని చూడగానే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. చెట్ల నరికివేతతో వాతావరణంలో వస్తున్న మార్పులను గురించి ఆలోచించాడు. తనవంతు ఏదైనా చేయాలనుకున్నాడు. స్నేహితుడు బాలచంద్ర భట్ తో కలిసి ఈ విషయాన్ని చర్చించాడు. బాలచంద్ర ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చదివాడు. ఆ రోజు సాయంత్రానికే మొక్కలను పెంటానికి ఆన్ లైన్ ప్లాట్ ఫాం గురించి స్పష్టత వచ్చింది. వారం తిరిగే సరికి సంకల్పతరు పట్టాలెక్కే దిశగా సాగింది. ఈ సంస్థకు సీటీవో బాలచంద్రభట్.

image


మొక్కలు మీవి.. పెంపకం మాది..

ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచటం అంటే ఆషామాషీ కాదు. మొండిగా పెరిగే కొన్ని మినహాయిస్తే, చాలా వాటికి ఓ దశ వరకు పరిరక్షణ అవసరం. సంకల్పతరు ఈ సమస్యకు టెక్నాలజీని వాడి ఓ సృజనాత్మక పరిష్కారాన్ని కనిపెట్టింది. నిజానికి మొక్కల పెంపకానికి భూమిని ఎంచుకోవటం కొంచెం క్లిషమైన పనే. సంకల్పతరు టీమ్ దీనిపై చాలా వర్క్ చేస్తుంది. లక్ష్యం పర్యావరణానికి మేలు చేయటమే కాదు.. సామాజికంగా కూడా ప్రభావం చూపటం. అంటే మొక్కలు పెరిగి పచ్చదనం విస్తరించటం మాత్రమే కాదు.. వాటి ద్వారా కొన్నయినా జీవితాలు కూడా బాగుపడాలి.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా లోని సంకల్పతరు ప్లాంటేషన్ సైట్ ని పరిశీలిస్తే, ఇది పచ్చదనంతో పాటు ఆ ప్రాంతాల్లోని గిరిజనులకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. అదే విధంగా ఉత్తరాఖండ్ , లడఖ్ ప్రాంతాల్లో పెంచుతున్న మొక్కలు కొండవాలు ప్రాంతాల్లో భూ క్షయాన్ని నిరోధించగలుగుతున్నాయి. మొక్కలను పెంచాలనే ఆసక్తి ఉన్న వ్యక్తులైనా సంస్థలైనా... ఎవరైనా సంకల్పతరుని సంప్రదిస్తే చాలు.. వారి ఆకాంక్షను నెరవేరుస్తారు. ఈ సంస్థ మొక్కలను పెంచటానికి స్థానికంగా ఉన్న పంచాయితీలు, రైతులతో కలసి పనిచేస్తోంది.

సంకల్పతరు సంకల్పం ఎలా నెరవేరుతోంది? 

సంకత్పతరు అనుసరించే విధానం చాలా సింపుల్. ఈ సంస్థ వెబ్ సైట్ లో మొక్కను కొనుగోలు చేసి ఏ ప్రాంతంలో పెంచాలో చెప్పవచ్చు. అదే సమయంలో జీపీఎస్ కు అనుసంధానమైన ఈ సైటని గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ ద్వారా ఆ మొక్క ఎదుగుదలను ఎప్పటికప్పుడు మానిటర్ కూడా చేయవచ్చు. మరో పక్క ఈ వెబ్ సైట్ ప్రతి వ్యక్తి యొక్క కార్బన్ ఫూట్ ప్రింట్ ని కూడా కాలుక్యులేట్ చేసి ఆ కర్బన పాపాన్ని కడుక్కోవాలంటే ఎన్ని చెట్లు నాటాలో కూడా చెప్తుంది.

ఈ ఎన్ జీవో ఇప్పటికి 12 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పచ్చదనాన్ని విస్తరిస్తోంది. లడఖ్, ఉత్తరాఖండ్, థార్ ఎడారి, మహారాష్ట్ర లోని సంగ్లి, ఆంధ్ర ప్రదేశ్ లోని తలుపుల గ్రామం, తమిళనాడు లోని పల్లిపట్టు, ప.బెంగాల్ లో బంకుర గ్రామాల్లో పచ్చదనాన్ని విస్తరిస్తోంది. ఏదో నామ్ కే వాస్తే మొక్కలు పెంచామన్నట్టు కాకుండా, ఆయా గ్రామాల్లో సమూల మార్పులు రావటానికి శాయశక్తులా కృషి చేస్తోంది సంకల్పతరు.

"ఇప్పటివరకు వంద ప్రత్యక్ష, ఐదువందల పరోక్ష ఉపాధి అవకాశాల ద్వారా 25వేల మందికి ప్రయోజనం చేకూర్చాము. ఇప్పటివరకు దాదాపు మూడున్నర లక్షల మొక్కలు, 35 రకాలవి 300కు పైగా ఎకరాల్లో నాటాము. ఇవి 40వేల టన్నుల కర్బన ఉద్గారాల్ని సంగ్రహించి ఉంటాయని అంచనా.. "--అపూర్వ
image


సంకల్పతరు దాదాపు 30కి పైగా కార్పొరేట్ కంపెనీలతో భాగస్వామిగా ఉంటూ పచ్చదనాన్ని పెంచటంలో కృషి చేస్తోంది. యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ బయోడైవర్సిటీ లాంంటి అనేక ఇతర పర్యావరణ పరిరక్షణ సంస్థలతో కూడా కలసి పనిచేస్తోంది. ఈ సంస్థకు ఆదాయ వనరులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఈ సైట్ ద్వారా మొక్కలు నాటటానికి ఆసక్తి చూపే ఇండివిడ్యువల్స్.. రెండు పచ్చదనం బాధ్యతగా భావించి తమ లాభాల్లో ఎంతో కొంత కేటాయించే కార్పొరేట్ సంస్థలు. 

సంకల్పానికి సవాళ్లు అనేకం..!!

దేశంలో సామాజిక సేవా సంస్థలను నడిపించటం చాలా సవాళ్లతో కూడుకున్న పని. నిధుల సేకరణ నుండి, వాటి ఖర్చు వరకు పారదర్శకత చూపటం కత్తిమీద సాము లాంటిదే. అదే సమయంలో ఈ నాన్ ప్రాఫిట్ వెంచర్స్ ని నాలుగు కాలాలు నిలబడేలా తీర్చి దిద్దటం కూడా పెద్ద విషయమే. ఈ సవాళ్లను అధిగమిస్తూ, సంకల్పతరు తన లక్ష్యాలను సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అనేక అవార్డులు రివార్డులూ వరిస్తున్నాయి. యాక్షన్ ఫర్ ఇండియా 2015 ఎడిషన్ లో విన్నర్ గా, ఎమ్ బిలియంత్ సౌత్ ఏషియా మొబైల్ ఇన్నొవేషన్ అవార్డ్ 2014, మంథన్ అవార్డ్ 2015 లాంటివి అనేకం సాధించింది.

image


సామాజిక రంగాల్లో పోటీదారులు ఉండరని బలంగా నమ్మే అపూర్వ, రాబోయే మూడేళ్లలో పదిలక్షల చెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తున్నారు. ఈ సంస్థద్వారా మొదటి చెట్టుని భారత్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నాటారు. ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని సంకల్పతరు అంటోంది.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి