ఆస్తులు కుదవ పెట్టుకునే స్థితి నుంచి.. 250 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. శ్రీధర్ పిన్నపురెడ్డి విజయగాధ..!!
జీవితంలో ఎత్తుపల్లాలు ఎంతో ముఖ్యమైనవి. అవే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఈసీజీ లో కూడా స్ట్రెయిట్ లైన్ ఉంటే ఆ పేషెంట్ మరణించినట్లు లెక్క. ఎత్తుపల్లాలు లేని జీవితాన్ని ఊహించలేమని ఓ సందర్భంలో రతన్ టాటా అన్న మాటలివి. దీనికి అతికినట్లు సరిపోయే జీవిత ప్రయాణం శ్రీధర్ పిన్నపురెడ్డిది. ఈ పేరు చెబితే బహుశా గుర్తు పట్టలేని వారికి కంట్రోల్ఎ స్(crtls) అంటే టపీ మని సర్వర్ అనే పదం గుర్తొస్తుంది. అమెరికా, యూరప్ తర్వాత టైర్4 డేటా సెంటర్ ఉన్న నగరాలుగా ముంబై, మన హైదరాబాద్ లు గుర్తింపు పొందాయంటే దానికి కారణం కంట్రోల్ ఎస్.
చిన్ననాటి నుంచి సిగ్గరి
“ చాలా విషయాల్లో నాకు చాలా సిగ్గు. నా పనిచేసుకోవడం తప్పితే పెద్దగా దాని గురించి ఎవరి దగ్గరా చర్చించను” -శ్రీధర్
గడిచిన ఏడేళ్లుగా శ్రీధర్ సాధించిన అవార్డులు, రివార్డులు గురించి మనకు తెలియక పోడానికి ఇది కూడా ఒక కారణం. దీంతో పాటు ఓడిన ప్రతిసారీ సిగ్గుపడి ఎవరికీ చెప్పేవారు కాదు. అలా ఓటమి నుంచి గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచలోనే అత్యున్నత డేటా సెంటర్ కి మన హైదరాబాద్ కేంద్రంగా మారేలా చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో పొద్దున్నే వాకింగ్ చేస్తూ కొందరు, సైక్లింగ్ చేస్తూ మరికొందరు కనిపిస్తారు. అందులో బహుశా శ్రీధర్ కూడ ఒకరు కావొచ్చు. అలా చూసి సైక్లిస్ట్ అనుకుంటే పొరపాటే. 250కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అతను. ఒకానొక దశలో సర్వం కోల్పోయి తన తండ్రిగారికి ఉన్న భూమి తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. తర్వాత ఈ స్థాయికి రాగలిగానని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.
శ్రీధర్ కంపెనీల గురించి
శ్రీధర్ కి ఇప్పుడు మూడు కంపెనీలున్నాయి. అందులో ఒకటి క్లౌడ్4సి(Cloud4C). రెండేళ్ల స్టార్టప్ కంపెనీ అయిన క్లౌడ్ 4సి డిజాస్టర్ రికవరీ సర్వీసును అందిస్తోంది. త్వరలోనే ఈ కంపెనీ 400 కోట్ల ఫండ్స్ ని రెయిజ్ చేయనుంది. దీంతో ఈ కంపెనీ ఈ దశాబ్దాంతానికి 500మిలియన్ డాలర్ల కంపెనీగా మారనుంది.
ప్రపంచ టెలికాం కంపెనీల స్థాయిలోనే డేటా సెంటర్ వ్యాపారాన్ని నడిపిస్తున్న శ్రీధర్ భారతదేశం నుంచి వచ్చిన ఓ గేమ్ చేంజర్. గూగుల్, అమెజాన్, ఏడబ్ల్యూఎస్, ఫేస్ బుక్ లాంటి కంపెనీల స్థాయిలో టియర్4 డేటా సెంటర్ ను తీసుకురాగలిగారు. జీరో డౌన్ లోడ్ స్పీడ్ తో, తక్కువ ఎనర్జీ వాడకం కలిగిన ఆటోమేటెడ్ టెక్నాలజీ గల డేటా సెంటర్ ముంబైలో ఉంది. 57 బ్యాంక్ లు, 2వేలకు పైగా కస్టమర్లు తమ అప్లికేషన్స్ కోసం ఈ కంట్రోల్ఎస్ పై ఆధారపడుతున్నారు.
యువర్ స్టోరీతో తన వ్యాపార అనుభవాలను పంచుకున్నారు ఆ ఇంటర్వ్యూ
యువర్ స్టోరీ : మీ వ్యాపారం గురించి మాట్లాడే ముందు మీమ్మల్ని వ్యాపార వేత్తగా నిలబెట్టిన కొన్ని అంశాలు చెబుతారా?
శ్రీధర్: నా జీవితంలో ఏదీ అంత సులభంగా రాలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది. 2001లో నేను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (పాయింట్ టు పాయింట్) వ్యాపారం నడిపేవాడ్ని. మొత్తానికి మొత్తం నష్టం వచ్చింది. సర్వం కోల్పోయా. అప్పట్లో మాకు ఫండింగ్ అందించే కంపెనీ పయనీర్ డబ్బులు ఇవ్వడం ఆపేసింది. ఐటి రంగం క్రైసిస్ లో నడుస్తున్న రోజులవి. ఆ తర్వాత అప్పులు తీర్చడానికి చాలా కష్టపడ్డా. నేను నష్టపోయినా నాకు అప్పిచ్చిన వారికి మాత్రం రిటర్న్ ఇచ్చా. అందుకే ఈరోజు కూడా వాళ్లు నన్ను నమ్ముతున్నారు.
“ కాలం అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది. మనం చేయలేమని ఏరోజు వెనకడుగు వేస్తామో అక్కడితో మన ప్రయాణం ఆగినట్లే. ఇక మనం లేనట్లే”- శ్రీధర్
అందుకే నేను ఏనాడూ వెనకడుగు వేయలేదు. జీవితం నేర్పిన పాఠాలు బహుశా ఎవరూ నేర్పలేరు. 2008-09 అనుకుంటా. ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా పీఈ ఫండ్ కంపెనీ మమ్మల్ని విడిచిపెట్టింది. ఇది నా జీవితంలో రెండోసారి వచ్చిన క్రైసిస్. అయితే అప్పట్లో నాపైన నాకు నమ్మకం ఉండింది. బ్యాంక్ లు తమ అప్లికేషన్స్ భద్రపరచడానికి ఔట్ సైడ్ డేటా సెంటర్లకు ఇస్తున్నాయి. ఈ కారణంగా మేం వ్యాపారం చేయగలమనే దీమా నాలో ఉండేది. కంట్రోల్ఎస్ ఈ అవకాశాన్ని చాకచక్యంగా వినియోగించుకుంది. ఆరేళ్ల ప్రయాణం విజయవంతమైంది. మళ్లీ ఆ పీఈ సంస్థ మాతో 2013లో కలసింది( సంస్థ పేరు నేను బయటపెట్టను)
యువర్ స్టోరీ : మీ మేనేజ్మెంట్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది అంటారు. మీరు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలకు మీ బోర్డ్ రూంలోనే వ్యతిరేకత వచ్చేదంటారు? అవే లాంగ్ రన్ లో అవే మిమ్మల్ని లాభాల్లోకి తీసుకెళ్లాయా? మిమ్మల్ని మీరు స్వతంత్రుడిగా ప్రకటించుకుంటారా?
శ్రీధర్: ఈ విషయంలో నేను లక్కీ అనే చెప్పాలి. నేను డబ్బుల కోసం ఏ రోజూ ఆలోచించ లేదు. మొదటిసారి నాకొచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టాయి. నిన్ను నువ్వు నమ్ముకుంటే జనం నమ్మడం ప్రారంభిస్తారు. ఇదే నా ఫిలాసఫీ. నేననుకున్న నిర్ణయాన్ని తీసుకుంటా. ఆరకంగానే అన్ని చేసుకుంటూ పోతున్నా. నా మేనేజ్మెంట్ స్టైల్ చాలా కష్టమైంది. నేనేదైతే నమ్ముతానో దానికోసం నా టీంని నేను తయారుచేసుకుంటా. నేను గంతు వేయమంటే వాళ్లు దానికి సిద్ధంగా ఉండాలి. దీనర్థం నువ్వు నమ్మిన సిద్ధాంతన్ని నమ్మే వ్యక్తులు నీ వెనకున్నట్లు. కంట్రోల్ఎస్ ప్రారంభించడానికి ముందు టియర్4 డేటా సెంటర్ గురించి నేను ప్రతిపాదించా. 2006లోని మాట ఇది. అయితే మా టెక్నికల్ టీం దీన్ని అంగీకరించలేదు. అయితే ఆ నిర్ణయం అప్పుడు వాయిదా వేసినా 2008లో మాత్రం ఆలోచించకుండానే ప్రారంభించా. ఎందకంటే టియర్4 డేటా సెంటర్ లో భవిష్యత్ కనిపించింది. 2014లో కూడా ఇదే జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లౌడ్ 4సి ప్రారంభిచాలని ప్రతిపాదించా. మార్కెటింగ్ టీం వద్దంది. అయితే నేను అనుకున్నది చేయగలిగే టీంని నేను అపాయింట్ చేసుకుని ఇప్పుడు ఫండింగ్ కు సిద్ధపడ్డా. మా వ్యాపారాన్ని విస్తరించబోతున్నాం.
యువర్ స్టోరీ: మీ వ్యాపారం గురించి మాట్లాడుదాం. 250 కోట్ల డేటా సెంటర్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు కదా. ఇది మార్గదర్శకమైన ఐఎస్పీ బిజినెస్. తర్వాత క్లౌడ్ 4సి కూడా ప్రారంభించి ఓ స్థాయికి తెచ్చారు. వీటిలో మీరెలాంటి సారూప్యాన్ని చూశారు?
శ్రీధర్: ఐఎస్పీ బిజినెస్ చాలా స్లో. కానీ క్రిటికల్ అప్లికేషన్స్, డిజాస్టర్ రికవరీ సర్వీసనేది ఎంతో వేగంగా ఎదుగుతున్న వ్యాపారం. అనతి కాలంలోనే అదొక పెద్ద వ్యాపారంగా మారనుంది. మా డేటా సెంటర్ లో మీరు చూసే ఉంటారు.. దాన్ని రెండు మూడు రకాలుగా చెప్పగలను. క్రిటికల్ అప్లికేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. వీటి ద్వారా కార్పొరేట్ కంపెనీలకు వాటిపై పెట్టాల్సిన ఖర్చుని మేం తగ్గిస్తున్నాం. మా టెక్నాలజీ సాయంతో వారి పునరుక్తిలో ఎలాంటి మార్పుండదు. ఐటి సర్వీసు బిజినెస్ వారు సైతం మాతో కలసి పనిచేస్తున్నారు. ఎప్పుడూ ఉపయోగించని క్రిటికల్ అప్లికేషన్స్ మా దగ్గర ఉండటం వల్ల వారి పని మరింత సులువు అవుతుంది. దాని ఉపయోగించుకున్నంత ఉపయోగించుకొని, వదిలేసే దానికోసం కొనుగోలు చేయడం ఎందుకు. అవసరం వుంటే మాలాంటి డేటా సెంటర్ దగ్గర తీసుకొని పని కానీయొచ్చు కదా. అనుకున్న ధరలో సెక్యూరిటీ ఉన్న కాపీ డేటా అందిస్తాం. ఇలా అన్ని రకాలుగా చూస్తే మేం కార్పొరేట్ కంపెనీలకు టైలర్ మేడ్ సర్వీస్ ని అందిస్తున్నామన్న మాట.
యువర్ స్టోరీ : భారత దేశంలో ఐటి రంగంలో వచ్చే మార్పుల గురించి చెప్పగలరా?
శ్రీధర్: పాత తరం ఐటి సర్వీసు అనేది దాదాపు మాయమైపోయింది. సిస్టమ్ ఇంటిగ్రేషన్, హర్డ్ వేర్ ఇంటిగ్రేషన్ అనేది బహుశా కనిపించక పోవచ్చు. 65మంది కలసి ఓ ఈఆర్పీని తయారు చేయాలంటే అందులో 15మంది ఆన్ సైట్ ఉండేవారు. అయితే ఇది బహుశా గతం కానుంది. కొన్నాళ్లకు ఈ పద్దతి పూర్తిగా మారిపోతుంది. ప్రాజెక్టులో కొద్దిమంది ఉండి మిగిలిన సాఫ్ట్ వేర్ విషయంలో మొత్తం ఆటో మేషిన్ రానుంది. ఇది పూర్తిగా వారి బ్యాలెన్స్ షీట్ ని మార్చేస్తుంది. వారిదగ్గరున్న వారి సంఖ్యతో పాటు ఉన్న లైసెన్స్ ఆధారంగా వ్యాపారం సాగించిన ఐటి కంపెనీలు ఇప్పుడా లైసెన్స్ పద్దతికి దూరం కానున్నాయి. దీన్ని విడిచిపెట్టి సరికొత్త ఆదాయ మార్గాలను వెతకనున్నాయి. లైసెన్స్ తో వచ్చే రెవెన్యూ తగ్గి మరో మార్గంలో ఆదాయం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా జరగడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు. ఓ ఇంటిగ్రేటెడ్ ఆటోమేషిన్ ప్రపంచంలోకి ఐటి రంగం వెళ్లిపోతుంది. దాంతో ఐటి కంపెనీలు నష్టపోతాయని అనడం లేదు. ఎందుకంటే వాటి రెవెన్యూ మోడ్ ని మార్చుకుంటాయి అంతే.
యువర్ స్టోరీ: ఆంట్రప్రెన్యూర్లకు మీరిచ్చే సలహా?
శ్రీధర్: ఆంట్రప్రెన్యూర్ కి కుటుంబ మద్దతు చాలా అవసరం. కష్టకాలంలో కుటుంబ మద్దతుంటేనే భారత దేశంలో ఆంట్రప్రెన్యూర్షిప్ పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం తన సొంతింటిని తనఖా పెట్టి మానాన్న నన్ను వ్యాపార వేత్తను చేశారు. నేను రైతు కుంటుం నుంచి వచ్చా. మానాన్న గారికి డ్రిల్లింగ్ బిజినెస్ ఉండేది. భారతదేశంలో ఆంట్రప్రెన్యూర్ కి తన కుటుంబమే శ్రీరామ రక్ష. విద్యార్థుల చదువుల కోసం బ్యాంక్ లోన్లు ఇవ్వడం ద్వారా దేశంలో ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ లోన్ తీర్చడానికి కాలేజీ చదువు తర్వాత ఉద్యోగంలో చేరడం, దానిలోనే కంటిన్యూ అయిపోవడం జరుగుతోంది. ఇన్నోవేషన్ అక్కడే ఆగిపోడానికి ఇదే ప్రధాన కారణం. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న రోజుల్లో చాలారకాల ఆలోచనలు ఉంటాయి. ఆ తర్వాత వాటికి కుటుంబ మద్దతు లభించిప్పుడు సరికొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయి. ప్రపంచాన్ని ఏలే వ్యాపారవేత్తలు తయారవుతారు. ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని స్టార్టప్ లు చూస్తున్నా. ఫండ్స్ ని రెయిజ్ చేస్తున్నా.. సరైన సస్టేయినబుల్ బిజినెస్ మోడల్ లేకపోవడంతో కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ముందుగా సస్టేయినబుల్ రెవెన్యూ వచ్చే మోడల్ లోకి ఆంట్రప్రెన్యూర్ ఆలోచించినప్పుడే ఈకో సిస్టమ్ కు మద్దతు లభిస్తుంది.
యువర్ స్టోరీ : స్టార్టప్ లకు మీరు మెంటార్ చేస్తున్నారా?
శ్రీధర్: మెంటారింగ్ చేసేంత సమయం ప్రస్తుతానికి నా దగ్గర లేదు. అయితే మా దగ్గర ఉన్న వారిని మాత్రం ప్రోత్సహిస్తా. ఆంట్రప్రెన్యూర్షిప్ అనేది చాలా కష్టమైన పని. జీవితంలో ఎక్కువ బాధ పడకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా సాధ్యపడనప్పుడు వదిలేయకుండా మళ్లి మళ్లీ ప్రయత్నించాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి. గడిచిన రోజుల్ని విడిచిపెట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. అయితే ఇది అందరిలో ఒకేలా ఉంటుందని నేననుకోవడం లేదు. చివరికి నువ్వేం సాధించావనేదే లెక్క.
యువర్ స్టోరీ : కోటి రూపాయిల నుంచి 300 కోట్లకు చేరిన మీ ప్రయాణంలో మీరేం నేర్చుకున్నారు?
శ్రీధర్: డబ్బుల గురించి ఆలోచించడం మానేసి ప్రాడక్టు గురించి చర్చించాలి. మీ ప్రాడక్టు లేదా సర్వీసు వయబుల్ అయితే క్లయింట్ కచ్చితంగా పే చేస్తారు. అన్ని రకాలుగా వ్యాపారం వయబుల్ చేయడానికి నేను ప్రయత్నించా. మేం చేసిన దాని ప్రతిఫలం ఇప్పుడు డబ్బు రూపంలో మాకు తిరిగి వచ్చింది. నేను అనారోగ్యంగా ఉన్నా నేనేం చేస్తున్నాననేది మర్చిపోలేదు. పని ఎంత ముఖ్యమో, జీవితం కూడా అంతే ముఖ్యం. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. నేను సైక్లింగ్ చేస్తా. ఉద్యోగులతో, కుటుంబంతో గడపడానికి సమయం వెచ్చిస్తా. ప్రతి ఆంట్రప్రెన్యూర్ సంస్థను ఏర్పాటు చేయాలి. అదే గొప్ప ప్రపంచానికి దారులు చూపుతుంది. అమెరికాలో సంస్థలు ఆదేశాన్ని గొప్ప అనేలా చేశాయి. ఆంట్రప్రెన్యూర్షిప్ లో అందరికంటే ముందు ఉండేలా చేశాయి.
“నేను నమ్మేవి.. నా సామర్ధ్యాన్ని నమ్ముకుంటా. భవిష్యత్ పై పందెం వేస్తా. నా కుటుంబం నుంచి స్ఫూర్తి పొందుతా. నా టీంలో నేనే స్ట్రాంగ్ గా ఉంటా.. అని ముగించారు శ్రీధర్”