ఒకప్పుడు బిచ్చమెత్తుకున్నాడు.. ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు..
యాచించడం నుంచి ప్రారంభించి అంట్రప్రెన్యూర్ గా ఎదిగిన రేణుక ఆరాధ్య విజయగాథ
"పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం కచ్చితంగా నీ తప్పే"
ఈ కొటేషన్ కర్నాటకు చెందిన ట్రాన్స్ పోర్ట్ అంట్రప్రెన్యూర్ రేణుకా ఆరాధ్యకు తెలుసో లేదో కానీ... ఆయన గురించి తెలుసుకునే సయమంలో మాత్రం మనం తప్పక గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రేణుక ఆరాధ్య జీవనం అంత దిగువస్థాయి నుంచి ప్రారంభమయింది. గౌరవంగా చెప్పుకోవాలంటే ఇలా.. కానీ వాస్తవంగా చెప్పుకోవాలంటే మాత్రం బిచ్చమెత్తుకోవడం నుంచి ప్రారంభమయింది..!
వెయ్యి కార్లు ఆపరేట్ చేస్తున్న ప్రవాసీ ట్రావెల్స్..!
అమెజాన్ సహా పదుల సంఖ్య ఎమ్మెన్సీ కంపెనీల ట్రావెల్ ఆపరేటర్
కర్నాటకలో పదుల స్కూళ్లకు బస్ ఆపరేటర్
30 కోట్ల రూపాయల టర్నోవర్, 150 మందికిపైగా ఉద్యోగులు
మూడు స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టిన సీరియల్ అంట్రప్రెన్యూర్
ఈ విశేషణాలన్నీ రేణుకా ఆరాధ్యవే. కూటికి తిప్పలు పడాల్సిన పరిస్థితి నుంచి.. చదువుకోలేక పోయిన దుస్థితులను అధిగమించి.. కృషి, పట్టుదలతో స్ఫూర్తిదాయక విజయాలు సాధించారు రేణుకా ఆరాధ్య. ఓలా, ఉబర్ లాంటి ఆన్ డిమాండ్ సర్వీస్ సంస్థల పోటీని సమర్థంగా ఎదుర్కొంటూ ఐపీవోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇది కష్టాలతో ఇష్టంగా తెచ్చుకున్న విజయ సంకల్పం ..!
ఇది జీవిత అనుభవాలు నేర్పించిన విజయపథం .. !!
ఇది పేదరికంపై పట్టుదల సాధించిన విజయం ..!!!
పూజారి కుమారుడు.. తిండి కోసం యాచన
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడు ఇది టెక్నాలజీ వండర్స్ క్రియేట్ చేస్తున్న ప్రాంతం. రాత్రికి రాత్రి మామూలు అంట్రప్రెన్యూర్లు మిలియనీర్లు, బిలియనీర్లుగా మారుతున్న లక్కీ ప్లేస్. ఎంతోమంది కొత్తతరం టెక్ రంగంలో తమదైన ముద్ర వేసేందుకు నిరంతరం తరలి వస్తున్న ప్రదేశం. కచ్చితంగా ఇదే ప్రాంతంలో రేణుకా ఆరాధ్య జీవితం ప్రారంభమయింది. అప్పటికీ ఎలక్ట్రానిక్ సిటీ ఊసే లేదు. అవన్నీ కొన్ని కుగ్రామాల సమూహం. గోపసంద్ర అనే ఊరిలో ఓ నిరుపేద పూజారి ఇంట్లో మూడో సంతానం రేణుక. తండ్రి గ్రామంలో ఉన్న గుళ్లో పూజాధికాలు నిర్వహించేవాడు. భక్తులు ఇచ్చే తృణమో పణమో తప్ప.. స్థిరమైన ఆదాయం అంటూ లేదు. ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి అవి ఏ మాత్రం సరిపోయేవి కావు. అందుకే పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత చుట్టుపక్కల ఊళ్లలో బియ్యం, రాగి, జొన్నలను యాచించేవారు. కొన్నింటిని కుటుంబ అవసరాలను ఉంచుకుని, మిగతా వాటిని అమ్మేవారు. అలా ఇతర అవసరాలకు కొంత సొమ్ము సేకరించుకునేవారు. ఆ పనిలో రేణుక కూడా సాయంచేసేవాడు.
ఆరో తరగతి తర్వాత చదువు మాన్పించి.. ఎవరింట్లో అయినా రేణుకను పనిలో పెట్టాలని తండ్రి భావించాడు. అయితే అతనికి మాత్రం చదువుకోవాలని ఉంది. విషయం తెలిసిన కొందరు ఉపాధ్యాయుల పాతబట్టలు, పుస్తకాలు ఇచ్చారు. ఊరికే కాదు.. అలా ఇచ్చినందుకు టీచర్లు తమ ఇంటిపని, వంటపని, అంట్లు తోమడం గట్రా పనులు చేయించుకునేవారు. ఒకపక్క పంతుళ్ల ఇళ్లలో పాచి పని చేస్తూనే, ఓ సేవలు చేసే పని కూడా చేశాడు. ఆ ముసలివ్యక్తికి భీకరమైన చర్మవ్యాధి. ఒళ్లంతా పుళ్లు. అలాంటి మనిషికి శుభ్రంగా స్నానం చేయించి, ఆయిట్మెంట్లు రాసి కట్లు కట్టేవాడు. మధ్యలో ఓ గుడిలో పూజాధికాలు కూడా నిర్వహించే వచ్చేవాడు. ఇదంతా చేస్తూనే బడికి వెళ్లేవాడు.
ఆకలితో నిత్యం పోరాటం
ఇలా అయితే లాభం లేదని తండ్రి చిక్ పేటలోని ఓ ఆశ్రమంలో చేర్పించాడు. అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు.. రాత్రి 8 గంటలకు.. రెండుసార్లు మాత్రమే భోజనం పెట్టేవారు. మధ్యలో ఆకలయ్యేది. దాన్ని మరిచిపోవడానికి ఏదో ఓ పని పెట్టుకునేవాడు. ఇక చదువు గురించి పట్టించుకునే తీరిక దొరికేది కాదు. ఇలా మూడేళ్ల పాటు ఆ ఆశ్రమంలోనే గడిచిపోయింది. కానీ ఆశ్రమంలో ఉండాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పని- వేదాలు,సంస్కృతం నేర్చుకోవడం. రేణుక ఆ విషయంలో రాణించాడు. ఎందుకంటే పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎవరైనా సీనియర్లు వెళ్తుంటే వాళ్లకు అసిస్టెంటుగా వెళ్లొచ్చని. అక్కడేతే కాస్త కడుపు నిండా అన్నం పెడతారని ఆశ. అందుకే వేదాలు, ఉపనిషత్తుల మీద కొంచెం గ్రిప్ సాధించాడు. అయినా అవకాశాలు అంత సులువుగా వచ్చేవి కావు. బట్టలు ఉతకడం, చిన్నాచితకా పనులు చేసిపెడితే గానీ సీనియర్లు తమవెంట తీసుకెళ్లేవారు కాదు.
ఇన్ని వ్యవహారాల మధ్య చదువు గాలికి కొట్టుకుపోయింది. ఫలితం పదో తరగతి ఫెయిల్. లక్కీగా సంస్కృతంలో మాత్రం మంచి మార్కులు వచ్చాయి. ఆ బాధ అలావుంటే.. అదే సమయంలో తండ్రి హఠాత్తుగా కన్నుమూశారు. కుటుంబానికి పెద్దదిక్కు లేదు. తల్లి బాగోగుల బాధ్యత భుజాల మీద పడింది. దాంతో పెట్టేబేడా సర్దుకుని ఇంటికి వచ్చాడు.
కుటుంబ బాధ్యతలు మీదపడటంతో ఓ ఫ్యాక్టరీలో కార్మికునిగా చేరాడు. తర్వాత కొన్నాళ్లు ఐస్ ఫ్యాక్టరీ, ఇంకొంత కాలం ప్లాస్టిక్ పరిశ్రమల్లోనూ పనిచేశాడు. ఆ తర్వాత యాడ్ ల్యాబ్స్ ఆఫీసులో స్వీపర్ గా ఉద్యోగం దొరికింది. పనితనం చూసి హెల్పర్ గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ అక్కడ ఉద్యోగులు కొన్ని అక్రమాలు చేయడం.. అందులో తనను భాగస్వామిని చేసే ప్రయత్నం చేయడంతో రేణుకకు నచ్చలేదు. ఉద్యోగం మానేశాడు. అదే మంచిదయింది. ఎందుకంటే కొద్ది రోజులకే వారి బండారం బయటపడింది. వారందర్నీ ఉద్యోగం నుంచి తీసేసింది యాజమాన్యం.
వరుస ఎదురుదెబ్బలు
ఆ తర్వా శ్యామ్ సుందర్ ట్రేడింగ్ కంపెనీలో హెల్పర్ గా చేరాడు. బ్యాగులు, సూట్ కేసులు అమ్ముతుందా సంస్థ. ఐటెమ్స్ బండిలో నింపి దాన్ని తోసుకుంటూ బెంగళూరులో వివిధ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో వేసేవాడు. అలా మొదటిసారి రోడ్ జర్నీ మొదలైంది. ఫ్యాక్టరీ నుంచి దుకాణాల వరకూ తోపుడు బండిని నెట్టుకుంటూనే సాగిపోయేవాడు. రేణుక పనితీరు నచ్చడంతో యాజమాన్యం ఆ తర్వాత సేల్స్ పొజిషన్ లోకి మార్చింది. కొన్నాళ్లు సేల్స్ మెన్ గా పనిచేశాడు. ః
సొంతంగా ఎందుకు వ్యాపారం చేయకూడదు..? రేణుకుకు ఇదే అలోచన వచ్చింది. వెంటనే ఉద్యోగం మానేసి సొంతంగా బ్యాంగులు, సంచులు, వ్యానిటీ బ్యాగ్స్ తయారు చేసి సైకిల్ పై అమ్మడం ప్రారంభించారు. అయితే అదృష్టం వెక్కిరించింది. రూ.30 వేల రూపాయలు నష్టం. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. లాభం లేదని తమ్ముడు సెక్యూరిటీ గార్డు జాబ్ ఇప్పించాడు. అయితే అతను సెక్యూరిటీ గార్డుగా చేరింది మద్యం అమ్మకాలు, గ్యాంబ్లింగ్ చేసే ఓ కంపెనీకి. రేణుకకు ఇదంతా నచ్చలేదు. పైగా సెక్యూరిటీ గార్డుగా వస్తున్న ఆదాయం నెలకు రూ.600 మాత్రమే. వచ్చే డబ్బు చాల్లేదు. డ్యూటీ అవగానే కొబ్బరికాయలు కోయడం లాంటి పనులు చేసేవాడు. అదనంగా మూడు వందల వరకు వచ్చేవి.
ఎంత కాలం ఇలా..?
ఆలోచించాడు. డ్రైవర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ డ్రైవింగ్ రాదు. అత్తింటివారు పెట్టిన చిన్న ఉంగరాన్ని మిత్రుల వద్ద తాకట్టు పెట్టి కొంత అప్పుగా తీసుకున్నారు. దాంతో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకున్నాడు. వెంటనే డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోయాడు. మొదటి రోజే రేణుకకు నిజమైన డ్రైవింగ్ అంటే ఎంత కష్టమో అర్థమయింది. కారు రివర్స్ చేయబోయి గేట్లను ఢీకొట్టాడు. కారుతో పాటు గేటు కూడా డ్యామేజ్ అయింది. రేణుక ఉద్యోగం పోయింది. మళ్లీ సెక్యూరిటీ గార్డు అవతారం.
ఈ ఘటన రేణుకలో పట్టుదల మరింత పెంచింది. పోగొట్టుకున్న చోటే సాధించాలని మనసులో బలంగా నిర్ణయించుకున్నారు. సెక్యూరిటిగార్డుగా చేస్తూ డ్రైవింగ్ నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేశాడు. కొత్త అవకాశాలు వెదుక్కున్నాడు. అలాంటి సందర్భంలో పరిచయమైన ఓ టాక్సి ఆపరేటర్ రేణుక పట్టుదలను గుర్తించి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. డ్రైవింగ్ లో రేణుక మొదటి అనుభవం పూర్తిగా తెలిసినా అతను లెక్కచేయలేదు. అతని మంచితనం చూసి.. జీతం ఏమీ అక్కర్లేదని రేణుక చెప్పేశాడు. రోజువారి బాటా ఇస్తే చాలని.. డ్రైవింగ్ లో నిరూపించుకున్న తర్వాతే జీతం తీసుకుంటానని తేల్చి చెప్పాడు.
ఇక ఏమైనా జరగనీ.. ఇక సెక్యూరిటి గార్డుగా మాత్రం వెళ్లకూడదని డిసైడయ్యాడు. రాత్రుళ్లు కారు రివర్స్ చేయడం, పార్కింగ్ చేయడం, ఎత్తుపల్లాల దగ్గర చాకచక్యంగా హ్యాండిల్ చేయడం లాంటివి ప్రాక్టీస్ చేసేవాడు. నెమ్మదిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఒక రోజు గోకర్ణకు పర్యాటకుల బృందాన్ని తీసుకెళ్లే అవకాశం వచ్చింది. ఆ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతి ట్రిప్ లోనూ మంచి రివ్యూస్ వచ్చేవి. అందువల్లే నేనే డ్రైవర్ గా ఉండాలని చాలా మంది కోరుకునేవాళ్లు. అలా ఆ సంస్థలోనే నాలుగేళ్లు పనిచేశాడు. పర్యాటకులకు వెహికల్స్ ఆరెంజ్ చేయడమే కాదు.. హాస్పిటల్స్, శ్మశానాలకూ కూడా వాహనాలను పంపించేది. అలాంటి వాటికీ ఎన్నోసార్లు వెళ్లాడు రేణుక.
అంట్రప్రెన్యూర్ గా ఆవిర్భావం
ఆ తర్వాత రేణుక ఆరాధ్య ఓ గార్మెంట్ కంపెనీలో హెల్పర్ గా పనిచేస్తూ టైలర్ గా పదొన్నతి పొందాడు. దాంతో ఇద్దరూ కలిసి నెలకు 900 రూపాయలు సంపాదించడం ప్రారంభించారు. కొన్నాళ్లకే మరో ట్రావెల్ కంపెనీలో చేరాడు రేణుక. ఆ కంపెనీకి ఎక్కువగా విదేశీ పర్యాటకులు వస్తూంటారు. దాంతో రేణుక ఆ తర్వాత విదేశీ పర్యాటకను ప్రసిద్ధ క్షేత్రాలకు తీసుకెళ్లడానికి అలవాటుపడిపోయాడు. డ్రైవర్ గా మంచి రివ్యూలు ఉండటంతో రేణుక కోసం విదేశీ టూరిస్టులు కూడా ఆసక్తి చూపించేవారు. వారంతా డాలర్ల రూపంలో టిప్పులు అందించేవారు. అలా నాలుగేళ్ల పాటు కొంత సొమ్ము కూడబెట్టిన తర్వాత సొంతంగా ట్రావెల్ కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చాడు. భార్య పీఎఫ్ సొమ్మును డ్రా చేసి.. తనకు టిప్పుల రూపంలో వచ్చిన సొమ్ము కలిపి .. సిటీ సఫారీ అనే ట్రావెల్స్ సంస్థను ప్రారంభించాడు. అయితే ఇందులో మరికొంత మంది పార్ట్ నర్స్ కూడా ఉన్నారు.
అనుభవం ఉన్న రంగం కావడంతో కంపెనీ కొంతకాలానికే లాభాల్లోకి వచ్చింది. గతంలో ట్రిప్ షీట్ సమర్పించేటప్పుడు.. ఎప్పటికైనా నేను ట్రిప్ షీట్ తీసుకునే మేనేజర్ రేంజ్ కి వెళ్లాలి అనుకునేవాడు. సొంత కంపెనీ పెట్టిన తర్వాత ఆ కలను నిజం చేసుకున్నాడు.
ఇది ప్రారంభించిన కొన్నాళ్లకు మొదటిసారి ఇండికా కారు కొన్నాడు ఏడాదిన్నర తర్వాత మరో కారుకు యజమాని అయ్యాడు. ఈ కార్లు కొనేటప్పుడు గ్యారంటీగా ఉండటానికి సోదరుడు కూడా అంగీకరించలేదు. అయితే తెలిసినవాళ్ల సాయంతో ముందడుగు వేశాడు. సొంత కార్లు సిద్ధమవడంతో తనే స్వయంగా ఓ ట్రావెల్స్ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం కొంచెం ప్రయత్నం చేయడంతో ఇండియన్ సిటీ టాక్సీ అనే మూతపడటానికి సిద్ధంగా ఉన్న కంపెనీ గురించి తెలిసింది. ఆరున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఆ కంపెనీని కొనేశాడు. దానికోసం అప్పటి వరకు కష్టార్జితమైన కార్లన్నింటినీ అమ్మేశారు. అయితే కంపెనీకి అనుబంధంగా వంద కార్లు ఉన్నాయి. ఒక్కో కారుకి వెయ్యి రూపాయల కమిషన్ వస్తుంది. అంటే నెలకు కచ్చితంగా రూ.35వేల లాభం వస్తుంది. దాంతో ఇబ్బందేమీ ఉండదని భావించి ముందడుగు వేశాడు. కంపెనీ పెడితే కచ్చితంగా దానికి ప్రవాసీ క్యాబ్స్ అనే పేరు పెట్టాలనకున్నాడు. విదేశీ టూరిస్టులను టూర్లకు తీసుకెళ్లినప్పుడు వచ్చిన ఆలోచన అది. అందుకే కొత్త కొన్న ట్రావెల్స్ కంపెనీకి ప్రవాసీ క్యాబ్స్ అని పేరు మార్చేశాడు. మొట్టమొదటిసారిగా అంట్రపెన్యూర్ ని అయ్యాననే సంతోషం కలిగింది.
సవాళ్లే అవకాశాలుగా పయనం
అంట్రప్రెన్యూర్ గా రేణుక ప్రయాణం సవాళ్లతోనే నడిచింది. వాటినే అవకాశాలుగా మలుచుకున్నాడు. ప్రవాసీ క్యాబ్స్ కు మొట్టమొదటి ఎమ్మెన్సీ కస్టమర్ అమెజాన్ ఇండియా. చెన్నైలో అమెజాన్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఉద్యోగుల కోసం క్యాబ్స్ సేవల్ని రేణుక సంస్థకే అప్పగించారు. ప్రవాసీ సంస్థ సేవలను విస్తరించేందుకు కూడా అమెజాన్ ఇండియా సాయం చేసింది. కార్పొరేట్ కంపెనీలు మూడు నెలలకోసారి పేమెంట్ చేస్తూంటాయి. ఒక్కోసారి ఆరు నెలలు కూడా కావొచ్చు. దాంతో నిర్వహణ కోసం చాలా అప్పులు చేయాల్సి వచ్చేది. లక్షల కొద్దీ వడ్డీల రూపంలో చెల్లించేవాడు. ఎంత ఆదాయం వచ్చినా..ఎన్ని అప్పులు చేసినా.. కంపెనీ, ఇంటి అవసరాల కోసం మాత్రం నెలకు ఇరవై వేల రూపాయలు భార్యకు ఇచ్చేవాడు. నిద్రాహారాలు మాని, రేయింబవళ్లు కంపెనీ కోసం కష్టపడేవాడు. కొంతకాలానికి కంపెనీ రెవిన్యూ కొంచెం కొంచెం పెరగడం ప్రారంభమయింది.
అప్పటికి అమెజాన్ నే ప్రధానమైన కస్టమర్. కానీ ఆ కంపెనీ ఇక తన అవసరం లేదని చెప్పేస్తే ఏం చేయాలి..? ఈ ఆలోచనే కంపెనీకి మరిన్ని కొత్త క్లైంట్లను వెతికి పట్టుకునేందుకు సాయం చేసింది. వాల్ మార్ట్, అకమాయ్, జనరల్స్ మోటార్స్ లాంటి ఎమ్మెన్సీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ప్రవాసీ క్యాబ్స్ క్లైంట్ల జాబితాలో చేరాయి. ప్రత్యేకంగా మార్కెటింగ్, సేల్స్ బృందాలను రేణుక నియమించుకోకుండానే కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు.
నిరంతరం నేర్చుకోవడమే..!
పదో తరగతిలో కేవలం సంస్కృతంలోనే పాసయ్యాడు రేణుక. కానీ ఇంగ్లిష్ మాత్రం అనర్గళంగా మాట్లాడతాడు. విదేశీ పర్యాటకులకు డ్రైవర్ గా వ్యవహరించిన సమయంలో వారి మాటలను విని.. ఇంగ్లిష్ పేపర్లు చదివి భాషపై పట్టు సాధించారు. అదే పట్టుదల ప్రతీ విషయంలోనూ చూపిస్తాడు.
" వ్యాపారం పెరుగుతున్న సందర్బంలో నెట్ వర్క్ సెషన్స్, మార్కెటింగ్ క్లాసులు, వర్క్ షాపులకు హాజరవుతూ ఉండేవాడిని. వ్యాపారంలో ఆర్థికపరమైన అంశాలు, కస్టమర్ రిలేషన్ షిప్ వంటి వాటిని తెలుసుకునేవాడిని. నా వ్యాపార పెరుగుదల అంతా దీని వల్లే సాద్యమైంది. మరో విశేషం ఏమిటంటే.. నేను ఎలాంటి గాడ్జెట్ ని అయినా వాడగలను. టెక్నాలజీకి అనుగుణంగా నా పనితీరును మార్చుకుంటాను" రేణుక ఆరాధ్య
మూడేళ్ల క్రితం స్కూళ్లు, కాలేజీలకు బస్సులను ప్రొవైడ్ చేయడం ప్రారంభించాడు. దాని కోసం స్కూళ్లకే కొద్దిగా ఎదురు మొత్తం కట్టి పిల్లల్ని చేరవేసేవారు. మొదటి ఏడాదే పది లక్షల రూపాయల నష్టం వచ్చింది. దాంతో స్కూళ్లకు వచ్చిన మొత్తంలో పదేళ్ల పాటు 35శాతం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. దాంతో మొదటి ఏడాదే బ్రేక్ ఈవెన్ సాధించాడు.
ఓలా,ఉబెర్ కు సవాల్
ఆన్ డిమాండ్ క్యాబ్ సర్వీసుల్లో ఇప్పుడు ఓలా, ఉబర్ ఓ సంచలనం. చిన్న చిన్న ట్రావెల్ ఆపరేటర్లు వీటి దెబ్బకు కుదేలయిపోయారు. ఓ మాదిరి ట్రావెల్ సంస్థలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఈ సంస్థల ప్రభావం ప్రవాసీ క్యాబ్స్ పైనా పడింది. ఈ సంస్థలు మొదలైనప్పుడు ఏడు వందల కార్లతో ఉండే ఒప్పందాలు..ఆ తర్వాత ఐదు వందలకు పడిపోయాయి. అయినా రేణుక చలించలేదు. తన వ్యాపార వ్యూహాలకు పదను పెట్టాడు. అందుకే కొత్తగా ఓనర్ కమ్ డ్రైవర్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. యాభైవేల రూపాయలు కడితే... తన సంస్థ తరపున సొంత కారు కొనిస్తాడు. మూడేళ్ల తర్వాత కారు- ఆ డ్రైవర్ సొంత మవుతుంది. ఆ క్యాబ్ నుంచి వచ్చే ఆదాయంలో ఈఎంఐ మాత్రమే ప్రవాసీ క్యాబ్స్ మినహాయించుకుంటుంది. ఇలా కొద్ది రోజుల్లో సంస్థకు మూడు వందల కార్లు వచ్చి చేరాయి.
కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే విషయంలో రేణుక ఎక్కడా రాజీపడడు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు కొత్త తరహా శిక్షణ, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలనే దానిపై విస్త్రతంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తూంటాడు. ప్రస్తుతం ప్రవాసీ క్యాబ్స్ కు వెయ్యికిపైగా కార్లతో ఒప్పందాలున్నాయి.
మహిళా స్పెషల్
ట్రావెల్స్ విభాగంలో మహిళలను ప్రొత్సహించడానికి రేణుక ప్రత్యేక ఆసక్తి చూపిస్తూంటాడు. క్యాబ్స్ విషయంలో డ్రైవింగ్ కు ముందుకు వస్తే ఉచితంగానే శిక్షణ ఇచ్చి కారు అందించేందుకు సిద్ధంగా ఉంటాడు. పురుష డ్రైవర్ల దగ్గర యాభైవేలు డిపాజిట్ తీసుకుంటాడు. కానీ మహిళల విషయంలో ఆ సొమ్ము కూడా తీసుకోడు. మూడేళ్ల ఒప్పందం తర్వాత ఆ కారును ఆ మహిళ పేరు మీదనే బదలాయిస్తాడు. ఇలా ప్రత్యేకమైన మహిళా డ్రైవర్లతోనే ఓ క్యాబ్ బృందం ప్రవాసీ క్యాబ్స్ కు ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు మాత్రమే ఉండేలా కార్వూర్ లో ఓ కాల్ సెంటర్ ని కూడా నిర్వహిస్తున్నాడు.
స్టార్టప్ పెట్టుబడులు - ఐపీవో ప్రణాళికలు
కొత్తతరం టెక్నాలజీ సాయంతో విసురుతున్న సవాళ్లకు రేణుక తన అనుభవంతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ముఫ్పై కోట్ల రూపాయలు ఉన్న టర్నోవర్ ను మూడేళ్లలో వందకోట్లకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. తన కోడలికి కంపెనీలో కీలక భాగస్వామ్యం కల్పించాడు. పేదరికం నుంచి వచ్చిన రేణుక కోడలిలో కూడా సాధించాలనే పట్టుదల ఎక్కువే. ఆమె ఆలోచనలు..తన ఆనుభవంతో ముందుడుగు వేస్తున్నారు. కంపెనీ టర్నోవర్ వంద కోట్లు చేరిన వెంటనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం మూడు స్టార్టప్ లలో పెట్టుబడులు కూడా పెట్టారు. వీటిలోడైరక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. గూడ్స్ వెహికల్స్ అగ్రిగ్రేటర్ స్టార్టప్ లోడ్ డయల్.కామ్, ఇళ్లను అద్దెకి వెతికి పెట్టే మరో స్టార్టప్, ఫుడ్ పాండా లాంటి సేవలు అందించే మరో స్టార్టప్ లోనూ పెట్టుబడులు పెట్టారు.
ఇందులో నాకు అనుభవం లేదు కదాఅని వెనక్కి అడుగు వేయలేదు. మొదట ఏ పని ప్రారంభించినా విమర్శించేవాళ్లూ ఎప్పుడూ ఉంటారు. కానీ వారే తర్వాత పొగడ్తలు ప్రారంభిస్తారని తన అనుభవాలను గమ్మత్తుగా వివరిస్తారు రేణుక.
"పుట్టుక నుంచే కష్టాలెన్నో అనుభవించా. దేవుడు నాకే ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే పడిన కష్టానికంతటికీ... రెట్టింపు ప్రయోజనం ఎప్పటికైనా ఇస్తాడని నా నమ్మకం.అదే నిజమైంది. లేకపోతే ఓ సెక్యూరిటీ గార్డు.. పాతిక లక్షల విలువైన లగ్జరీ కారుకి ఓనర్ కాగలడా..?" రేణుక ఆరాధ్య..
యాచన నుంచి జీవితం ప్రారంభించినా.. ఇప్పుడు కొత్తతరానికి ధీటుగా పనిచేస్తున్నా.. రేణుక ఎప్పుడూ తన పని మీద నిర్లక్ష్యం చూపించలేదు. అందుకే ఇప్పుడు రేణుక ఆరాధ్య... యువతరానికి ఆరాధ్యంగా నిలుస్తున్నాడు.