ఐఐఎంలో చదివి- పేదపిల్లలకు పాఠాలు చెప్తున్నాడు! ఓ మహారాష్ట్ర శ్రీమంతుడి కథ !!
ఐఐటిలో బీటెక్, ఐఐఎంలో ఎంబీఏ చదివిన ఓ యువకుడు సాధారణంగా ఏం చేస్తుంటాడు..? ఎప్పుడో విదేశాలకు ఎగిరిపోయుంటాడనో, లేక ఇక్కడే ఓ మంచి కార్పొరేట్ జాబ్ లో సెటిల్ అయ్యుంటాడనో అనుకుంటాం... కానీ, అతడి లక్ష్యం వేరు. అతడి ట్రాక్ వేరు. అందుకే పేద విద్యార్థులకు విద్యాగంధాన్ని పంచుతూ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తున్నాడు.
అజింక్య దేశ్ ముఖ్. మహారాష్ట్ర లోని అంబర్ నాధ్ ప్రాంతానికి చెందిన యువకుడు... ఐఐటి మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత దేశంలోని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అత్యంత టఫ్ అయిన క్యాట్ లో 100 పర్సెంటైల్ సాధించి, ఐఐఎం బెంగుళూరు నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. ఏస్ క్రియేటివ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో డిప్యూటీ జనరల్ మేనేజన్ గా పనిచేస్తున్నాడు.
సింపుల్ గా చెప్పాలంటే, దేశంలోని టాప్ ఇన్ స్టిట్యూషన్ లో చదువు, ఆ తర్వాత కార్పొరేట్ ఉద్యోగం, వెరసి సంపాదనకు కొదవ లేదు. బిందాస్ లైఫ్..! కానీ, అజింక్య అక్కడితో ఆగలేదు. సమాజానికేదైనా చేయాలనుకున్నాడు. ఓ పక్క జాబ్ చేస్తూనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. సక్సెస్ అయ్యాడు.
డీ4ఏ ఎడ్యుకేషన్ ఫౌండేషన్..
పేద విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ప్రతిభ ఉన్న విద్యార్ధులు అన్నిచోట్లా ఉంటారు. కానీ, వాళ్ల ఎదుగుదలకు తగిన వాతావరణం, ప్రోత్సాహం మాత్రం ఉండదు. ఇక మన దేశంలో సర్కారీ బళ్లు ఎలా ఉంటాయో తెలియనిదేముంది. ఓ లైబ్రరీ ఉండదు, ల్యాబ్ ఉండదు. ఇవన్నీ ఉంటే అంకిత భావంతో పాఠాలు చెప్పే టీచర్లు ఉండరు. అలాంటి పాఠశాలల విద్యార్ధులే లక్ష్యంగా అజింక్య ఈ సంస్థను మొదలు పెట్టాడు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్. ఇది కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008లో మొదలు పెట్టింది. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్ధుల్లో డ్రాపవుట్ నిరోధించటానికి 9వ తరగతి నుండి ఇంటర్ వరకు నెలకు 500చొప్పున ఏటా 6వేల ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీనికి గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష నిర్వహించి విద్యార్ధులను సెలక్ట్ చేస్తాయి. డీ4ఏ సంస్థ మొదటి ప్రాజెక్ట్ గా ఈ ఎగ్జామ్ ని తీసుకుంది. ప్రతియోగిత పేరుతో కోచింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. దీనిలో భాగంగా బెంగుళూరులోని కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులు సుమారు 500మందికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వారిలో 100మందిని సెలక్ట్ చేసి, 60రోజుల పాటు కోచింగ్ ఇచ్చారు. వారిలో 53మంది ఈ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని బెంగుళూరుకు మాత్రమే పరిమితం చేయకుండా త్వరలో కర్ణాటక గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని అజింక్య యోచిస్తున్నాడు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. పీపీటీలు, ఆడియో విజువల్ క్లాసెస్ లు కూడా ప్రవేశపెట్టి, ఈ ప్రోగ్రామ్ ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. అంతే కాదు. స్కూల్ విద్యార్ధులతో మొదలైన ఈ కార్యక్రమాన్ని కళాశాల విద్యార్ధులకూ విస్తరించాలనే ప్రణాళికలో అజింక్య ఉన్నాడు. జీ మ్యాట్, శాట్ లాంటి ప్రవేశ పరీక్షలే ప్రతియోగితకు భవిష్యత్ లక్ష్యాలని చెప్తున్నాడు. తాను ఉన్నత విద్యను అభ్యసించి కెరీర్ లో నిలదొక్కుకోవటమే కాదు.. సమాజానికి, మరీ ముఖ్యంగా పేద విద్యార్ధులకు ఉపయోగపడే పని చేయాలని ప్రయత్నిస్తున్న అజింక్య దేశ్ ముఖ్ ప్రయత్నం అభినందనీయం కదా...!!