ఆన్లైన్లో చాందినీ చౌక్ స్వీట్స్ రుచులు
వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చాందినీ చౌక్ ఫుడ్స్సాంప్రదాయ పద్ధతులను మార్చుకోడానికి ఇష్టపడని అమ్మకందారులుఅందరినీ ఒప్పించి వెంచర్ సక్సెస్ చేసిన రాహుల్ బ్రదర్స్దేశం మొత్తం చాందినీ చౌక్ స్వీట్స్ సరఫరా
మీరు ఒకవేళ చాందినీ చౌక్‌కి వెళ్లకుండా ఢిల్లీ అంతా తిరిగినా.... మీ టూర్ పూర్తయినట్లు కాదు. ఎందుకంటే ఇది దేశంలోనే అతి ప్రాచీనమైన మార్కెట్లలో ఒకటి. మొఘలుల కాలం నుంచి ఈ ప్రాంతం స్వీట్లకు ఫేమస్. దాదాపు వెయ్యికి పైగా రకాలు చాందినీచౌక్ మార్కెట్లో దొరుకుతాయి. తరతరాలుగా ఇక్కడున్నవారికి ఇదే వృత్తి, ప్రవృత్తి, జీవితం కూడా. 16, 17శతాబ్ద కాలం నాటి మూలాలు కూడా ఇక్కడ కనిపిస్తాయంటే ఆశ్చర్యం వేయకమానదు.
రాహుల్ గార్గ్... ఈయన చాందినీ చౌక్‌కు చెందిన రెండో తరం పారిశ్రామిక వేత్త. తన వెంచర్ chandnichowkfood.com ద్వారా తన చుట్టూ ఉన్న రుచికరమైన మిఠాయిలను మొత్తం దేశానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా చాందినీ చౌక్‌లోని ప్రఖ్యాత షాపులనుంచి స్వీట్లను దేశంలోని అనేక ప్రాంతాలకు డెలివరీ చేస్తుంది.
ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి 2011లో రాహుల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. అలాగే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగంలో పని చేశారు. 2012 డిసెంబర్లో జాగృతి యాత్రలో భాగంగా దేశమంతా తిరుగుతున్న సమయంలో ఏదైనా సొంత వెంచర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది ఆయనకు. అంతే ఆ యాత్ర పూర్తి కాగానే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు గుడ్‌బై చెప్పేశారు.
అనుభవం సంపాదించడం కోసం అప్పుడో స్టార్టప్‌లో జాయిన్ అయ్యారు రాహుల్. ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ నిర్వహణ కోసం తనవంతు సాయం చేశారు. తన సోదరుడితో కలిసి పలు ఆలోచనలు చేసి చివరకు చాందినీ చౌక్ ఫుడ్‌ని ప్రపంచానికి అందించే వ్యాపారానికి సిద్ధపడ్డారు.
రాహుల్, అతని సోదరుడు అన్షుల్ కలిసి చాందినీచౌక్ఫుడ్.కాం ను ప్రారంభించారు. మొదట్లో అక్కడి విక్రేతలను ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తమ సాంప్రదాయ పద్ధతులను దాటి రాబోమని చెప్పేశారు వారంతా. తమ విధానాలనుంచి బయటకు రావడానికి ఒప్పుకోలేదు. కానీ వారందరినీ ఒప్పించడంలో ఈ సోదరులు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు స్వీట్ల తయారీలో దేశంలోనే అత్యంత పేరున్న వారితో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోగలిగారు. సోహన్ హల్వా... ఇది 1790 నుంచి వ్యాపారం నిర్వహిస్తున్న సంస్థ. అలాగే కరాచీ హల్వా తయారీలో పేరు గడించిన చీనారామ్తోనూ ఒప్పందం చేసుకున్నారు రాహుల్ బ్రదర్స్.
2014, జనవరి 14న తమ వెబ్సైట్ లాంఛ్ చేసిందీ సోదర ద్వయం. మొదట్లో స్థానిక మార్కెట్‌పై దృష్టి పెట్టిన వీరి ప్లాన్... అంతగా వర్కవుట్ కాలేదు. అమ్మకాలు జరిపే వస్తువులన్నీ త్వరగా పాడయ్యేవి కావడం, అలాగే త్వరగా డెలివరీ చేయాలంటే ఇతరుల మీద ఆధారపడాల్సి ఉండడం బాగా ఇబ్బందిపెట్టాయి. అయితే సమస్యలన్నిటికీ తగ్గట్టుగా చర్యలు చేపట్టి అధిగమించగలిగారు. ఇప్పుడు త్వరగా చెడిపోని పదార్ధాలనే ఎంపిక చేసుకుని దేశం మొత్తం డెలివరీ చేస్తున్నారు.
మార్కెటింగ్ విషయంలోనూ వీరికి మంచి జోష్ దొరికింది. వెబ్సైట్ లాంఛింగ్‌కు ముందే రాయిటర్స్ న్యూస్ కవరేజ్ ఇచ్చింది. దీంతో ఈ సైట్‌కు విపరీతమైన ట్రాఫిక్ వచ్చింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో వచ్చిన న్యూస్ ఐటెంతో సైట్‌కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది.
సవాళ్లేంటి ?
ఇతర ఈ-కామర్స్ వ్యాపారాల మాదిరిగానే.. వీరు ఎదుర్కున్న అతి పెద్ద ఛాలెంజ్ సమయానికి డెలివరీ చేయగలగడం. ఆహార పదార్ధాల విషయంలో ఇది ఇంకా కష్టం. అయితే అదృష్టం కొద్దీ ఇప్పటివరకూ ఒక్క కస్టమర్ నుంచి కూడా కంప్లెయింట్ రాలేదంటారు రాహుల్.
“త్వరగా పాడుకాని పదార్ధాల లైఫ్ 7 రోజుల నుంచి నెల వరకూ ఉంటుంది. అప్పుడే తయారు చేసిన వస్తువులనే షాపుల నుంచి సేకరించి, వీలైనంత త్వరగా డెలివరీ చేస్తాం. మాతో ఉన్న విక్రేతలందరూ నాణ్యతలో రాజీపడని వారే ఉన్నారు ” - రాహుల్.
సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలకు డెలివరీ చేయడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. అయితే అక్కడి కస్టమర్లు కూడా తాము అందించే పదార్ధాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాహుల్.
ప్రస్తుతానికి వీరు నిర్వహిస్తున్న సైట్, వ్యాపారం అంతా సొంత నిధులతోనే. విస్తరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి.
ఈ ప్రయాణంలో 2 పాఠాలు నేర్చుకున్నానంటున్నారు రాహల్ గార్గ్.
1) ఏ వెంచర్లో అయినా టీం చాలా ముఖ్యం. వన్ మ్యాన్ ఆర్మీగా అన్నీ చేసేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. దీర్ఘకాలంపాటు మనగలగడానికి ఇది పనికిరాదు.
2) సర్దుబాట్లు కూడా చాలా ముఖ్యం. ప్రధానంగా అమ్మకందారుల విషయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మీరు కూడా చాందినీచౌక్ ఫుడ్ రుచి చూడాలంటే ఆర్డర్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి... chandnichowkfood.com