హాలీవుడ్ తారలంతా ఈ ఇండియన్ లేడీ కోసం క్యూ కడ్తారు !
చిన్నవయసులోనే పెద్ద కలదాని సాకారానికి 20 ఏళ్లుఇప్పుడు హాలీవుడ్ అందగత్తెలంతా రమోనా క్లయింట్లే3-2-1 సిగ్నేచర్ మెథడ్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
జెస్సికా అల్బా, హల్లెబెర్రీ, స్కార్లెట్ జాన్సన్, కేటె బెకిన్ స్లే... ఈ హాలీవుడ్ తారలందరికీ సంబంధించిన ఏదైనా ఉమ్మడి అంశం చెప్పగలరా ? ముఫ్పయ్యేళ్లు, నలభయ్యేళ్లు పైబడిన వయసులో సైతం ఇంత ఫిట్‌నెస్‌తో ఉండటానికి కారణాలేమై ఉండవచ్చు? లేటువయసులో ఉన్న వీరు ఇప్పుడు స్క్రీన్ పై కనపడినా అభిమానులు ఆనందంతో కేరింతలు కొడతారనడంలో సందేహం లేదు. వీరు ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే... రమోనా బ్రగాంజా.
3-2-1 ఫిట్‌నెస్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, 3-2-1 ట్రైనింగ్ మెథడ్ సృష్టికర్త... రమోనా బ్రగాంజా. భారతీయ సంతతి దంపతులకు జర్మనీలో పుట్టి అమెరికాలో పెరిగి వాంకోవర్‌లో నివసిస్తున్న రమోనా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారడానికి కారణం ఆమె తల్లి. 1980.. కాలంలో ట్రైనర్‌గా ఉన్న తన తల్లి స్ఫూర్తితోనే తాను 3-2-1 ని స్థాపించినట్లు చెబుతారు రమోనా. తన శిక్షణ అనుభవాలతో “ఫీల్ ఫిట్, లుక్ ఫెంటాస్టిక్ ఇన్ 3-2-1” అనే ఓ అద్భుతమైన పుస్తకాన్ని కూడా రాశారు రమోనా బ్రగాంజా. ఇటీవల రమోనా భారత్ సందర్శించినప్పుడు “హెర్ స్టోరీ” బృందం ఆమెను పలకరించింది. ఆ సందర్భంగా రమోనా వెలిబుచ్చిన అభిప్రాయాలు మీకోసం...
హాలీవుడ్ నా కల
రమోనా బ్రగాంజా తొమ్మిదేళ్ల వయసులో ఉండగానే తన బెడ్ రూమ్ గోడలన్నీ హాలీవుడ్ నటుల పోస్టర్లతో నింపేసేది. ఎప్పటికైనా వారందరినీ కలుసుకోవాలని, తను కూడా వారిలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కలలు కనేది. ఆ కల నిజం చేసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఇంక వెనుదిరిగి చూడలేదు. ఈ రోజు ఎంతోమంది నటులు తమ అందంతో, ఫిట్‌నెస్‌తో లక్షలు, కోట్లాది అభిమానుల్ని సంపాదించుకోగలిగారంటే దానికి కారణం రమోనా ఫిట్‌నెస్ మంత్ర, సూచించిన ఆహార నియమాలను పాటించడమేనని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
తొలి అడుగులు
నాలుగేళ్ల వయసులో ఉండగానే రమోనాను ఆమె తల్లి జిమ్నాస్టిక్స్ శిక్షణకు పంపించింది. ఎప్పటికైనా తన కుమార్తే ఓ మంచి జిమ్నాస్ట్ కావాలనేది ఆమె కోరిక. కానీ దురదృష్టవశాత్తూ 18వ ఏట తగిలిన ఓ గాయం... రమోనాను జిమ్నాస్టిక్స్ కి దూరం చేసింది. కానీ రమోనా నిరాశ చెందలేదు. వెంటనే తన ఆసక్తిని డాన్స్ పైకి మళ్లించింది. ఆ తర్వాత 1985లో వీరి కుటుంబం లాస్ ఏంజెల్స్ కి వెళ్లి అక్కడే స్థిరపడింది.
1999వ సంవత్సరంలో ఓ రోజు జిమ్ లో రమోనా ప్రాక్టీస్ చేస్తుండగా ఓ నిర్మాత ఆమె వద్దకు వచ్చాడు. “17 ఏళ్ల వయసున్న ఓ బాలికకి జిమ్నాస్టిక్స్ లో శిక్షణ ఇవ్వగలవా?” అని అడిగాడు. ఆ బాలిక ఎవరో కాదు... జెస్సికా అల్బా. ఇదే హాలీవుడ్ లో రమోనా తొలి అడుగు. అప్పటి నుంచి రమోనా దాదాపు ఓ దశాబ్ద కాలం పైనా జెస్సికాకు శిక్షణనిచ్చింది. హల్లెబెర్రీ, స్కార్లెట్ జాన్సన్, అన్నె హాతవే, జెస్సికా బీల్, కేటె బెకిన్ స్లే, అమండా సీఫ్రెడ్, ఎవా మెండెజ్ వంటి ఎందరో టాప్ స్టార్లు రమోనా వద్ద శిక్షణ తీసుకున్నవారిలో ఉన్నారు. కేవలం ఫీమేల్ స్టార్లే కాదు... జాక్ ఎఫ్రాన్, ర్యాన్ రేనాల్డ్స్, బ్రాడ్లీ కూపర్ వంటి మేల్ స్టార్లు కూడా ఈమె క్లయింట్స్ జాబితాలో చేరిపోయారు.
3-2-1 సిగ్నేచర్... రమోనా మార్క్
3-2-1 శిక్షణ పద్ధతి, 3-2-1 ఆహార నియమాలు... వీటిని ఎన్నో సంవత్సరాలపాటు తన శిక్షణలో అమలుచేసి, సత్ఫలితాలు సాధించారు. తన విజయ రహస్యం ఏమిటని ఎవరు ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పని రమోనా బ్రగాంజా... అది మన మెదడుని, శరీరాన్ని, మనసుని కలిపి ఉంచే ఓ విభిన్న పద్ధతి... అంటూ తన పుస్తకంలో దాని గురించి విపులంగా వివరించింది. ఆ పుస్తకం మన మార్కెట్లో కూడా లభిస్తోంది.
పశ్చిమ దేశాల ప్రజల ఫిట్‌నెస్ రహస్యాలను తూర్పు దేశాల ఆరోగ్య, ఆహారపు అలవాట్లకు జోడించి, వాటికి తన అనుభవాలను జతచేసి ఈ పుస్తకంలో వివరించారు రమోనా. వాటిని క్రమపద్ధతిలో పాటిస్తే... తప్పకుండా ఎవరైనా సరే... మంచి ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకుంటారని హామీ ఇస్తూ... ఇంతకు మించి తన శిక్షణలో సీక్రెట్లేమీ లేవని నవ్వుతూ చెబుతుంది రమోనా.
“శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అది సాధించగలం” అని బలంగా నమ్ముతుంది రమోనా. తన వెబ్ సైట్ ద్వారా రమోనా... ఫిట్ నెస్, ఆరోగ్యం, ఆహార నియమాలు, వ్యాయామం వంటి అంశాలపై ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. రమోనా సాధించిన విజయాలు, అవార్డులు, తన వద్ద శిక్షణ తీసుకున్న స్టార్లు, శిక్షణ పద్ధతులు... వంటి ఎన్నో వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
52 ఏళ్ల రమోనా చూడటానికి ఏమాత్రం అలా కనిపించదు. అంతేకాదు... యువతకు శిక్షణనివ్వడానికి ఆమె నిరంతరం నేర్చుకుంటూ ఉంటుంది, సాధన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తన పద్ధతులను పాటించడానికి ఎందరో భారత మహిళలు కూడా ముందుకువస్తున్నారు. ఇది నిజంగా ఓ మంచి పరిణామమే.