సంకలనాలు
Telugu

బచ్చన్‌లు, అంబానీలకు ఈమె వాస్తు, జ్యోతిష్య సలహాదారు

జ్యోతిష్యం కూడా ఓ శాస్త్రమేవాస్తుతో కలిపి చెబితే అది మరింత ప్రభావం చూపిస్తుందిఇంటిలో చేసే చిన్న మార్పులతో సుఖసంతోషాలు సాధ్యమే అంటున్న నీతా సిన్హాఈమె క్లయింట్స్ లిస్ట్ లో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలునమ్మకం లేకపోయినా పాటించండంటున్న నీతా

Malavika P
29th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

“ప్రతి ప్రదేశం చుట్టూ 3 ఋణ (నెగటివ్), 9 ధన (పాజిటివ్) ప్రాంతాలుంటాయి. అందుకే నేను ముందుగా ఇంటి ప్లాన్, కట్టిన విధానానికి సంబంధించిన పేపర్లను చూస్తాను. ఆ తర్వాత నెగటివ్ ప్రదేశాల ప్రభావాన్ని తగ్గించడానికి, వీలైతే వాటిని కూడా పాజిటివ్ ప్రాంతాలుగా మార్చడానికి ఏం చేయాలనేదానిపై దృష్టిసారిస్తాను” అని నీతా సిన్హా తన విశ్లేషణా విధానాన్ని వివరిస్తారు.

నీతా సిన్హా, ఆస్ట్రో ఆర్కిటెక్ట్

నీతా సిన్హా, ఆస్ట్రో ఆర్కిటెక్ట్


సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ నీతాకి ఇలాంటి వాటిపై ఏమాత్రం నమ్మకం లేదు. ఆ సమయంలోనే ఆమె హోమియోవైద్యం, వేదిక్ ఆస్ట్రాలజీలో నిపుణుడైన కేఎస్ కృష్ణమూర్తి వద్ద చదువుకున్న డాక్టర్ ఎల్ ఎన్ కుసుమను కలిశారు. నీతా గత జీవితం, భావి జీవితం గురించి ఆమె చెప్పిన అంశాలన్నీ నిజం కావడంతో వేదిక్ ఆస్ట్రాలజీపైన ఎలాగైనా పట్టుసాధించాలని నీతాలో పట్టుదల, కోరిక కలిగాయి. దీంతో ఆమె వాస్తు ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి దాదాపు 30000 ఇళ్లను, వాటి నిర్మాణ పద్ధతిని అధ్యయనం చేశారు. అన్ని నిర్మాణాలు సరైన రీతిలో ఉంటే అందరూ ఎందుకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం లేదు అనే ప్రశ్న, దానికి సమాధానం కనుక్కోవడానికి ఆమె చేసిన కృషే ఈ రోజు నీతా సిన్హాను ఈ స్థితిలో నిలిపాయి.

నీతా పాటించే ఆస్ట్రో ఆర్కిటెక్ట్ విధానం

నీతా పాటించే ఆస్ట్రో ఆర్కిటెక్ట్ విధానం


నీతా సిన్హా వద్దకు వచ్చేవారు వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందినవారు, ప్రముఖులే ఉంటారు. 25 సంవత్సరాల తన కెరియర్లో ఎందరో గొప్పవారికి జ్యోతిష్యం చెప్పిన అనుభవం నీతా సిన్హాది. వారిలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలతో పాటు అంబానీ, బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఉండటం విశేషం. అయితే ఇదంతా చూసిన కొందరికి “నీతా కేవలం ప్రముఖులు, డబ్బున్న వారికే జ్యోతిష్యం చెబుతుంది” అనే అపోహలుండేవి. కానీ ఎవరు తన సాయం కావాలని వచ్చినా చేయడానికి తాను సిద్ధమని చెబుతారు నీతా.

జ్యోతిష్యానికి ఉన్న ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే... ఎవరైనా సైన్స్ తో ముడిపెట్టి, దీని విశ్వసనీయతని, సాధ్యాసాధ్యాల్ని ప్రశ్నించడం. అలాంటప్పుడే నిజమైన జ్యోతిష్యుడి అనుభవం, పరిజ్ఞానం బయటపడతాయి. వివేకంతో, ప్రశాంతంగా సమాధానం చెప్పగలగాలి. ఇలాంటి పరిస్థితి నీతాకు కూడా ఎన్నోసార్లు ఎదురైంది. తన సుదీర్ఘ అనుభవంతో వాటిని చాలా సులభంగా ఎదుర్కొన్నారు నీతా.

“విమర్శలకు, సవాళ్లకు నేనెప్పుడూ భయపడను. జ్యోతిష్యం కూడా ఓ సైన్సే. ఇంటిలో ఏది ఎక్కడ ఎలా నిర్మిస్తామనే దానిపైనే ఇంట్లో నివసించేవారి స్థితిగతులు, సిరిసంపదలు, ఆరోగ్యం వంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి మనిషి చుట్టూ ఓ అంతర్లీనమైన శక్తి ఉంటుంది. ఇంటి యజమాని చుట్టూ ఉన్న అతని శక్తిని విశ్వంలో ఉన్న శక్తి క్షేత్రంతో అనుసంధానం చేస్తాను. ఇందులో ఊహలకు తావులేదు. గ్రహాల స్థితిగతులు, గమనాన్ని శాస్త్రీయంగా లెక్కించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది దైవ సంబంధమైన శాస్త్రం అని నేను బలంగా నమ్ముతాను” అని చెప్తారు నీతా సిన్హా.

జ్యోతిష్యం అంటేనే వ్యక్తిగత విషయాలతో ముడిపడి ఉన్న శాస్త్రం. భారతదేశంలో జ్యోతిష్యం, వాస్తులను కలిపి సలహాలు, సూచనలు ఇచ్చే వ్యక్తులు చాలా తక్కువ. అందువల్ల ఒకేసారి ఎక్కువమందికి న్యాయం చేయలేకపోవచ్చు. దానికి అవకాశం కూడా ఉండదు. నాకు కూడా అందరిలాగే రోజుకు 24 గంటలే ఉంటాయి. పైగా నా పనిని, ప్రాజెక్టులను మరొకరితో చేయించుకునే వెసులుబాటు ఉండదు. పూర్తిగా నేనే సమయం వెచ్చించాలి. ఈ మధ్య మా అమ్మాయి అన్షు పొప్లి కొంచెం కొంచెం నా మార్గంలోకి వస్తోంది. అందువల్ల ఆమెకు కొద్దిగా నా పనిని అప్పగిస్తుంటాను అను తన పనితీరును వివరిస్తున్నారు నీతా సిన్హా.

నీతా టీం

నీతా టీం


25 సంవత్సరాల తన సుదీర్ఘ వృత్తి జీవితాన్ని ఓసారి అవలోకించుకుంటే... నీతా ద్వారా లాభపడిన, జీవితాల్లో అనూహ్య మార్పులు పొందినవారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు... సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ షైమక్ దావర్ ఢిల్లీలోని ఓ నగల వ్యాపారి కుటుంబంలోని ఓ మహిళకు నీతాను పరిచయం చేశాడు. అప్పటికి ఆ మహిళ తీవ్రమైన లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. దానికి ఏకైక చికిత్స... బోన్ మేరో మార్పిడి. కానీ అది అప్పట్లో చాలా అరుదైన, కష్టమైన చికిత్స. అయినా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి వైద్యులు ఇక ఆమె 6 నెలలకు మించి బతకడం కష్టమని తేల్చి చెప్పేశారు. ఆ సమయంలోనే నీతా వారికి పరిచయమయ్యారు. నేను ఆ మహిళను మొదటిసారి కలిసినప్పుడు ఏదో ఒకటి చేయండి అన్నట్లున్న ఆమె చూపుల్లోని భావాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచి పెద్దచేయాలంటే ఆమె బతికితీరాలి. నేను వారి ఇంటిని నిశితంగా పరిశీలించాను. ఇంటి ఓ మూలలో నిర్మాణానికి సంబంధించి పెద్ద సమస్య ఉందన్న విషయాన్ని గ్రహించాను. దానివల్లే ఈ ఆరోగ్యపరమైన సమస్యలు. వెంటనే దాన్ని సరిచేయడానికి చేయవలసిన పనులను పురమాయించాను. ఇది జరిగిన 15 రోజుల్లోనే నాకు ఓ శుభవార్త వచ్చింది. ఆ మహిళకు సరిపడే ఆరోగ్యకరమైన బోన్ మేరో లభించింది అని. మరికొద్ది రోజులకు మరో వార్త... చికిత్స విజయవంతంగా పూర్తైంది అని. దీంతో ఆమె కనీసం మరో 15 ఏళ్లు జీవించగలుగుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.

జ్యోతిష్యం-వాస్తు... ఇవి మానవ జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల జీవితాల్లో. ఎందుకంటే మగవారితో పోలిస్తే ఇంట్లో ఎక్కువ సమయం ఉండేది వారే కాబట్టి. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ప్రయోజనాల్ని కలిగిస్తాయనడానికి ఇదే ఓ పెద్ద ఉదాహరణ అంటారు నీతా సిన్హా. ఎవరైనా కొత్త ఇల్లు లేదా వ్యాపార సముదాయాలు, షాపులు వంటివి కొంటున్నపుడు ఆ ప్లాను ఓసారి తనకు చూపిస్తే... అవసరమైన మార్పులు సూచిస్తామంటారు నీతా. "ఇల్లు ఎవరి పేరు మీద ఉంది ? ఇంటికి పెట్టుకుంటున్న పేరు వంటి విషయాలు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు నీతా. నేను చెప్పేవి కచ్చితంగా నిజం అవుతాయి. ఒకవేళ మీరు నమ్మకపోయినా, నేను చెప్పేవి పాటించడం వల్ల మీకు చెడు అయితే జరగదు. ఏదైనా ఉంటే అది మంచే జరుగుతుంది"... అని తనపైనా, తన శాస్త్రంపైనా ఎంతో విశ్వాసం ఉంచుతారు నీతా సిన్హా.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags