క్రియేటివ్ అమ్మాయిల కేరాఫ్ 'పింక్ లెమనేడ్'
ఇక్కడి ఉద్యోగుల్లో మహిళలే ఎక్కువపురుషులతో సమానంగా మహిళలకూ అవకాశాలునిర్ణయాల్లో భాగస్వామ్యంఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి సైతం తగిన ప్రాధాన్యం
సాధారణంగా ఏ కార్పొరేట్ కంపెనీ చూసినా... ఉన్నత స్థానాల్లో పురుషులే ఉంటారు. సాధారణ ఉద్యోగుల్లో సైతం పురుషులతో పోల్చి చూస్తే మహిళల సంఖ్య అంతంతమాత్రమే. దీనికి ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేదు. అన్ని శాఖల్లో, కంపెనీల్లో ఇదే పరిస్థితిని మనం చూస్తుంటాం. “మహిళలకు కూడా పురుషులతో సమాన అవకాశాలు ఉండాలి” అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారు సైతం తమ కంపెనీల్లో దాన్ని అమలు చేయడానికి ముందుకు రారు. ఎందుకు ఈ దుస్థితి ? మహిళలకు నైపుణ్యాలు లేవా ? వారు పురుషులతో సమానంగా ప్రజ్ఞ చూపలేరా ? అంటే సమాధానం “కాదు” అనే వస్తుంది. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రాదు. “మేం మాత్రం అలా కాదు” అని నవ్వుతూ చెప్తారు “పింక్ లెమనేడ్” సీఈవో టీనా గార్గ్.
పింక్ లెమనేడ్... కంటెంట్, కమ్యూనికేషన్స్, డిజైన్ రంగాల్లో సేవలందిస్తున్న ఏజెన్సీ. కార్పొరేట్ ఐడెంటిటీ, మార్కెటింగ్, వెబ్ సర్వీసెస్ అంశాల్లో “పింక్ లెమనేడ్” పూర్తిస్థాయి సేవలను అందిస్తోంది. టీనా గార్గ్ సారథ్యంలోని ఈ ఏజెన్సీలో ప్రస్తుతం 25 మంది అమ్మాయిలుండగా... 8 మందే అబ్బాయిలు. “సైన్యంలో కొద్దికాలంపాటు పనిచేసిన అనుభవం నాకు ఇక్కడ బాగా ఉపయోగపడుతోంది. ఏదైనా సాధించేవరకూ వదిలిపెట్టకపోవడం, అపజయాలకు కుంగిపోకుండా మరింత ఉత్సాహంగా పనిచేయడం... ఇవన్నీ అక్కడినుంచే అలవాటయ్యాయి” అంటారు టీనా. “పింక్ లెమనేడ్” ప్రారంభించకముందు “జామ్” అనే ఓ మ్యాగజైన్‌కి రైటర్‌గా పనిచేశారు టీనా. జర్నలిజంపై అవగాహన పెంచుకోవడానికి లండన్ వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన కంపెనీలో మహిళలకు ఎక్కువ అవకాశాలివ్వడం, దానితో కలిగిన అనుభవాలను “యువర్ స్టోరీ” రీడర్స్ కి అందించేందుకు మా బృందం టీనా గార్గ్ తో ముచ్చటించింది. ఆ వివరాల్లోకి వెళ్తే...
“పింక్ లెమనేడ్” అంటే...
“ఎర్నెస్ట్ అండ్ యంగ్” కంపెనీలో కమ్యూనికేషన్స్ పై పనిచేస్తున్నప్పుడు, ఆ తర్వాత మరో కంపెనీలో క్రియేటివ్స్పై పనిచేస్తున్న నాటినుంచే నాకు డిజైనింగ్ పై అవగాహన, పరిజ్ఞానం ఉన్నాయి. చాలాసార్లు మేం పూర్తి చేయలేనంత పని మా చేతినిండా ఉండేది. అదే నాలో ఆలోచన రేకెత్తించింది... ఓ క్రియేటివ్ ఏజెన్సీ ప్రారంభించాలని. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటని ఎవరైనా అడిగితే... “నేను చేసే ప్రతి పనిని ఎంతో ఇష్టంగా చేస్తా. అందువల్ల ఫలితం కూడా అనుకూలంగానే వస్తుంది. అదే మా విజయరహస్యం” అని చెప్తాను.
“లెమనేడ్ (పానకం/పాయసం) మనందరికీ బాగా ఇష్టమైనది, తెలిసినది, తరతరాలుగా మనందరికీ సుపరిచితమైనది. కానీ “పింక్ లెమనేడ్” మాత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుంది. కొత్త డిజైన్లు, కొత్త కంటెంట్, క్రియేటివ్స్, ఓ సరికొత్త అనుభూతి కావాలనుకునేవారందరి డెస్టినేషన్... “పింక్ లెమనేడ్”. మా పనితీరు అంత సృజనాత్మకంగా ఉంటుంది. మా గురించి తెలిసినవాళ్లు కచ్చితంగా తమ స్నేహితులు, భాగస్వాములు ఎంతోమందిని మా వద్దకు పంపిస్తుంటారు. ఇది చాలు... మా ప్రత్యేకత అర్థం చేసుకోవడానికి”... ఆత్మవిశ్వాసంతో టీనా చెప్పే మాటలివి.
పింక్ లెమనేడ్లో ఎక్కువమంది మహిళలే!
దీనికి టీనా ఏం చెప్తారంటే... నిజం చెప్పాలంటే... మాకు ఎక్కువమంది అమ్మాయిలను చేర్చుకోవాలనే ప్రత్యేక ఉద్దేశం ఏమీ లేదు. కాకపోతే... మేం నిర్వహించిన పరీక్షలు, ఇంటర్వ్యూలలో వాళ్లే ఎంపికయ్యారు. మాతో చేరారు. ఆనందంగా కొనసాగుతున్నారు. వారితోగానీ, వారి పనితీరుతోగానీ ఎలాంటి సమస్యలూ లేవు. మాది విమెన్-ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్. మేమంతా ఏ విషయాన్నైనా ఓ పద్ధతిలో నిర్మాణాత్మకంగా చర్చిస్తాం... అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం.
నేను కచ్చితంగా చెప్పగలను... మాతో పనిచేసే వాళ్లంతా ఇష్టంతో పనిచేస్తున్నవాళ్లే తప్ప “ఏదో ఒకటి చేద్దాంలే” అనుకునేవాళ్లు కాదు. ఇది మాకు ఓ పెద్ద అడ్వాంటేజ్. వాళ్లందరిలో వ్యక్తిగతంగా... “ఇది మనది, వీరంతా నా వాళ్లు” అనే ఓ అనుభూతి ఉంటుంది. అది కేవలం మహిళల వల్లే వస్తోంది. ఒకర్నొకొకరు అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ సంతోషంగా తమ విధులు నిర్వహిస్తారు. ఇది నిజంగా ఆనందించదగిన అంశమే కదా!
టీ-ఎల్-సీ
ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడటం అంత సులువేమీ కాదు. కానీ టీనా తమ “లెమనేడ్”లో దీన్ని సులువుగా సాధించారు. “సాధారణంగా ఏ ఉద్యోగైనా టీ-ఎల్-సీ కోసం ఎదురు చూస్తాడు. అది ఇస్తే... వాళ్లే ఉత్సాహంగా పనిచేస్తారు”.... అంటారు టీనా. మరి టీ-ఎల్-సీ అంటే ఏంటో తెలుసా?
ట్రస్ట్ & ట్రాన్స్పరెన్సీ (నమ్మకం & పారదర్శకత):
ఉద్యోగుల్లో నమ్మకం కలిగించాలి. జరుగుతున్న పరిణామాలన్నీ వారికి తెలియచేయాలి. వారిని కూడా సమావేశాల్లో, చర్చల్లో, నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలి.
లెర్నింగ్ & గ్రోత్ (నేర్చుకునేందుకు అనువైన వాతావరణం):
మీతోపాటు, మీ సంస్థతోపాటు మీ ఉద్యోగులు కూడా ఎదగాలి. ఈ ఎదుగుదల రెండు రకాలుగా ఉండాలి. అంటే... ఉద్యోగులు కొత్త అంశాలను నేర్చుకుంటూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే సంస్థ కూడా వారి నైపుణ్యాల్ని గుర్తించి తగిన రీతిలో వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకునేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలి. పరిస్థితులను బట్టి సంస్థ లాభాల వివరాలను కూడా అందరితో పంచుకోవాలి.
సెలెబ్రేషన్ & ఫన్:
పనిలో ఆనందాన్ని వెతుక్కునేలా ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉండాలి. ఎంత స్వేచ్ఛ, సంతోషం ఉంటే అంత మంచి వాతావరణం ఏర్పడుతుంది. “మేం ఒక్కొక్కరికీ ఒక్కో రోజుని పింక్ హాలిడే అని ఇస్తాం. ఆ రోజు వారు డ్యూటీలో ఉన్నట్లే లెక్క. తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి సరదాగా తిరిగి, భోజనం చేసి లేదా షాపింగ్ చేసుకుని లేదా స్పా కి వెళ్లి రిఫ్రెష్ అయ్యి రావచ్చు. ఈ ఖర్చుని కూడా పింక్ లెమనేడ్ భరిస్తుంది. ఆఫీసులోనే వివిధ సందర్భాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన ఆటలు ఆడుకుంటాం. అప్పుడప్పుడూ నిర్ణీత సమయానికంటే ముందే అందరినీ ఇళ్లకు పంపేస్తాం. దీనివల్ల కుటుంబ సభ్యులతో సరదాగా ఎక్కువసేపు గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మనందరికీ ఆఫీసు, పని... ఇవే జీవితం కాదు... మనకంటూ ఓ కుటుంబం, వ్యక్తిగత జీవితం ఉంది. వాటికి కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వాలనేదే మా సిద్ధాంతం” అని తమ వద్ద ఉద్యోగం ఎలా ఉంటుందో వివరించారు.
“మొదట్లో క్లయింట్లంతా ఆశ్చర్యపోయేవారు... ఇంతమంది అమ్మాయిలా అని. కానీ తర్వాత మా పని, ఫలితాలు చూసిన తర్వాత వారంతా తమ నిర్ణయాల్ని మార్చుకున్నారు. ఇంక చివరగా మా మేల్ కొలీగ్స్. వారిని చూసి మేమంతా గర్వపడతాం. మహిళల పట్ల వారి వైఖరి, వారిచ్చే గౌరవం వారి ప్రతి కదలికలో మాకు స్పష్టంగా తెలుస్తుంది. అమ్మాయిలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు వీరంతా ఎప్పటికప్పుడు వారికి అవకాశాలిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారు”.
సాధారణంగా మహిళలు కొంచెం సిగ్గరులు. వారు వచ్చి అడిగితే చూద్దాంలే అనుకుని వారికి అవకాశాలు కల్పించకుండా చేస్తుంటారు చాలామంది పురుషులు. అందువల్ల మనమే (అమ్మాయిలు) ధైర్యంగా ముందుకు రావాలి. ఏ పనైనా చేయడానికి మేం సిద్ధం అనే భరోసాని మేనేజ్ మెంట్ కి కల్పించాలి.. అని ఈతరం అమ్మాయిలకు ధైర్యం నూరిపోస్తారు టీనా గార్గ్.