మొదటి అడుగుతో చరిత్ర సృష్టించిన మహిళా మణులు!
ఆధునిక యుగంలో స్త్రీ వంటిల్లు దాటి ప్రపంచాన్ని జయించేందుకు ముందడుగు వేసింది. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించింది. మగమహారాజులమంటూ విర్రవీగే వారికి సైతం సవాల్ విసురుతూ ముందుకు కదిలింది. వేల సంవత్సరాలుగా సామాజిక వెనుకబాటుతనానికి గురైన స్త్రీ వేసే తొలి అడుగు ముళ్లబాటే అనేది అందరికీ తెలిసింది. ఆ ముళ్లబాటలోనే నడుస్తూ తన వెనుక నడిచే వారికి రహదారిని మలిచిన ఘనత కొందరికే దక్కింది. వారే చరిత్రలో నిలిచిపోయారు. మనదేశంలో పురుషాధిక్య సమాజపు సంకెళ్లను తెంచి తొలి అడుగు వేసిన కొందరు రోల్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.
సురేఖా యాదవ్ - భారతదేశపు తొలి రైల్ డ్రైవర్ !
ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. అత్యధిక ఉద్యోగులను కలిగిన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఈ వ్యవస్థలో పురుషులతో పాటు ఎందరో మహిళలు రాణించారు..రాణిస్తున్నారు. సురేఖా యాదవ్ తొలిసారిగా అసిస్టెంట్ ట్రెయిన్ డ్రైవర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు 2000 సంవత్సరంలో రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన సెంట్రల్ రైల్వేస్ కు చెందిన లోకల్ ట్రెయిన్ కు సురేఖా యాదవ్ ట్రెయిన్ అసిస్టెంట్ డ్రైవర్ గా పనిచేశారు. ఇక 2011 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖయాదవ్ పుణె నుంచి ముంబై మీదుగా ప్రయాణించే డెక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్‌గా నియమితులయ్యారు. విచిత్రమైన విషయం ఏమిటంటే దేశంలో తొలి మహిళా ట్రెయిన్ డ్రైవర్ అయినప్పటికీ సురేఖా యాదవ్‌కు ఆ సంగతి తెలియదు. నేడు దేశవ్యాప్తంగా సుమారు 50 మందికి పైగా లోకో పైలట్‌లు విధుల్లో ఉన్నారు.
తొలి మహిళా ఒలింపియన్ కరణం మల్లీశ్వరీ !
ఆంధ్రప్రదేశ్ ఉక్కు మహిళగా పేరొందిన కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో దేశం గర్వపడేలా ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి కావడం విశేషం. మల్లీశ్వరి తన పదేళ్ల కెరీర్‌లో మొత్తం 11 బంగారు, మూడు రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఒక భారతీయ మహిళగా పురుషాధిక్య సమాజంలో వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలను సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయం కాదు. ఆమెలాంటి వారు రానున్న రియో ఒలింపిక్స్‌లో ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఖాయం.
గోబీ ఎడారిని జయించిన సుచేతా కేడథాన్‌కర్ !
సాహస క్రీడల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణించారు. దృఢసంకల్పంతో సుచేతా కేడథాన్‌కర్ ఏకంగా మంగోలియాలోని అత్యంత క్లిష్టమైన, ప్రతికూల వాతావరణం కలిగిన గోబీఎడారిని నడిచుకుంటూ దాటి రికార్డు సృష్టించింది. సుమారు 1600 కిలోమీటర్ల ప్రయాణాన్ని కాలినడకన ముగించింది. ఈ సాహసయాత్రలో సుమారు తొమ్మిది దేశాలకు చెందిన 13 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ రికార్డును 2011లో నెలకొల్పారు. 13 మంది సభ్యుల్లో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు పాల్గొనగా సుచేతా భారత్‌కు చెందిన వారు కావడం విశేషం. 2008లో సుచేతా ఎవరెస్ట్ పర్వతాన్ని సైతం అధిరోహించారు.
తొట్ట తొలి ఐపీఎస్ కిరణ్ బేడీ !
మన దేశంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ. 1972లో ఐపీఎస్‌గా సెలెక్ట్ అయింది. ముస్సోరిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో కిరణ్ ట్రెయినింగ్ తీసుకుంది. 80 మంది పురుషులు ఉన్న బ్యాచ్‌లో కిరణ్ ఒక్కరే మహిళ కావడం విశేషం. 1975లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ఢిల్లీ పోలీస్ దళం నిర్వహించిన కవాతుకు కిరణ్ బేడీ సారథ్యం వహించడం విశేషం. ఆ కవాతులో పాల్గొన్న వారిలో కిరణ్ ఒక్కరే మహిళ కావడం విశేషం. కిరణ్ బేడీ ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన అకాలీ - నిరంకారీ అల్లర్ల అణచివేతలో కిరణ్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో సాహసోపేతమైనవి. ఇక ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలను మెరుగుపరచడంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు. కిరణ్ తీహార్ జైలు ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తీహార్ జైలులో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. కిరణ్ బేడీ 1994లో రామన్ మెగసెసె అవార్డును తీసుకున్నారు.
తొలి ఫైర్ ఫైటర్ హర్షిణీ కన్హేకార్ !
అత్యంత క్లిష్టమైన ఫైర్ సర్వీసెస్ విభాగంలోనూ మహిళలు అడుగుపెట్టి తామేమి తక్కువ కాదని నిరూపించారు హర్షిణి. దేశపు తొలి మహిళా అగ్నిమాపక దళ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఫైర్ సర్వీసెస్ విభాగంలో తొలి మహిళగా హర్షిణీ కన్‌హేకార్ అడుగుపెట్టారు. 2005లో ఓఎన్‌జీసీ కార్పొరేషన్లో సెక్యురిటీ ఆఫీసర్‌గా జాయిన్ అయి చరిత్ర సృష్టించారు. చాలామంది ఈ ఫీల్డ్ వద్దని హెచ్చరించారు. కానీ హర్షిణీ మొక్కవోని ధైర్యంతో తొలి అడుగు వేసింది.
ఈ ఐదుగురు మహిళలు దేశంలోని కోట్లాది మందిమహిళలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు వీరి ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. వీరి బాటలో పయనించి మరెందరో పురుషాధిక్య సమాజంలో సవాలుగా నిలిచారు.