లెక్కతప్పిన జీవితాన్ని రెక్కపట్టి నిలబెట్టిన మోరంభాయి
బాల్యవివాహం చేసుకుని..అత్తింటి ఆరళ్లు అనుభవించి..మొండిధైర్యంతో బటయకి వచ్చి..ఇప్పుడు 26 పంచాయితీలకు పంచాయితీ సెక్రటరీ
కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదొచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని మాత్రం ఈదలేం! అన్నీ సరిగా ఉండటానికి జీవితం ఎక్కాల పుస్తకం కాదు. ఒక్కోసారి లెక్కలు తప్పుతాయి. నిచ్చెనలతో ఎక్కినట్టే ఎక్కుతాం... పామునోట్లో పడిపోతాం! మోరంభాయి జీవితంలో కూడా ఇలాంటి ఫిలాసఫీ బోలెడంత ఉంది. కష్టాలు కన్నీళ్లు చుట్టుముట్టి, భద్రగుండె భీతిల్లి శూన్యం ఆవహించిన ఆమె జీవితంలో ఒకవెలుగు రేఖ సర్రున దూసుకొచ్చింది. ఆ వెలుగే ఇప్పుడందరికీ పంచుతోంది.
తనొకటి తలిస్తే దైవం మరొకటి
బండెడు సంతానం. దానికి తోడు కటిక పేదరికం. ఆ ఇంట్లో పుట్టింది మోరంభాయి తన్వర్. 8వ తరగతి వరకు చదవడమే గగనమైంది. అక్కడితో పుస్తకాలు అటకెక్కాయి. ఊహ తెలియని ఆ వయసులోనే మెడలో పుస్తలతాడు పడింది. స్తోమత లేకున్నా కట్నం తాహతుకు మించి ఇచ్చారు. బిడ్డ సుఖపడుతుందని ఆశించారు. కానీ తనొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. అత్తవారింట్లో అష్టకష్టాలు పడింది. చివరికి మోరంభాయిని వాళ్లు ఇంటినుంచి వెళ్లగొట్టారు.
సంకల్పమే బలం
చేతిలో డబ్బులేదు. చదువు అంతంత మాత్రం. అయినా గుండెలో ఏదో ధైర్యం. అంతులేని ఆత్మవిశ్వాసం. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. అది నిరూపించింది మోరంభాయి. లిటరసీ ఇండియా అనే ఎన్‌జీవోలో జాయిన్ అయ్యారు. చదువుకోసం రోజూ 16 కిలోమీటర్లు నడక. ఒకపక్క చదువుకుంటూనే మరో పక్క కుట్టుపని, కంప్యూటర్ నేర్చుకుంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి లిటరసీ ఇండియా వారే తమ సంస్థలోనే టీచర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మోరంభాయి జీవిత లక్ష్యం ఒకటే. తనలా ఏ స్త్రీ కష్టాలు పడొద్దు. మహిళలు స్వయంశక్తి తో ఎదగాలి.
ఎందరికో ఆదర్శం
కేవలం చదువు, ఉద్యోగమే కాదు. ప్రజా జీవితంలో కూడా మోరంభాయ్ ఎందరికో ఆదర్శం. రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లా, మనోహర్ ఠాణాకు ఆమె ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ. ప్రాంతంలో 26 పంచాయితీ కమిటీలు ఆమె ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. పారశుద్ధ్యం, స్త్రీ విద్య వంటి అంశాల్లో ఎంతో చైతన్యం వచ్చింది. చుట్టు పక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచారు. ఇదంతా మోరం భాయి సాధించిన ఘనత. అక్కడి ప్రజల దృష్టిలో ఆమె దేవత. అయినా ఆమె తన మూలాలు మరిచిపోలేదు. ఆడంబరాలకు అవకాశం ఇవ్వలేదు. సాధారణ జీవితం. అసాధారణంగా ఆలోచించడం, అందరికీ ఆదర్శంగా నిలవడం.. ఇదే ఆమె జీవనశైలి.
ప్రజలు బ్రహ్మరథం
అంతా బాగుంది అనుకునేలోగా విధి మరోసారి ఎదురు తిరిగింది. కుటుంబ పరిస్థితుల వల్ల కష్టపడి సంపాదించిన ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అయినా ఆమె తోటి మహిళలకు చదువు చెప్పడం ఆపలేదు. అంతలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసింది. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, తోటి మహిళలకు సేవ చేయాలంటే ఇదో మంచి అవకాశం అనుకుంది. ఒక టీచరుగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా అప్పటికే మోరంభాయి ఆ ప్రాంతంలో అందిరకీ తెలుసు. అందుకే నామినేషన్ వేసిన దగ్గర నుంచి గెలిపించేంత వరకు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. పదివేల వోట్ల మెజారిటీతో ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ప్రధాన కమిటీ ఎన్నికల్లో గెలిచి, జిల్లా పంచాయితీ సెక్రటరీ పదవి చేపట్టారు.
పదిమందికీ ఆదర్శప్రాయం.
స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద ప్రతి ఇంట్లోనూ టాయిలెట్ల నిర్మాణం ఆమె ప్రస్తుత లక్ష్యం. ఆమె నాయకత్వంలోని 26 పంచాయితీల్లో రెండింట్లో ఒకరికి మరుగుదొడ్డి వుంది. మిగిలిన పంచాయితీల్లో కూడా పనివేగంగా జరుగుతోంది. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్కాలర్ షిప్స్, ఉపాధి హామీ, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో పథకాలను పేదలకు చేరేలా కృషి చేస్తోంది. బాల్యవివాహం చేసుకుని, అత్తింటి ఆరళ్లు అనుభవించి, మొండిధైర్యంతో బటయకి వచ్చి- చివరికి 26 పంచాయితీలకు పంచాయితీ సెక్రటరీ అయిన మోరంభాయి తన్వర్ జీవితం పదిమందికీ ఆదర్శప్రాయం.