ఆడవాళ్లకు వంటిల్లే వైకుంఠం.. కత్తిపీటే కైలాస్ అని వెక్కిరించే రోజులు పోయాయి. మహిళలు ఏదో మొక్కుబడిగా రాజకీయాల్లోకి వస్తున్నారు అనే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు దేశంలో నలు మూలలా ఎక్కడ చూసినా ఆడవాళ్లు సమర్థవంతంగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఎవరి సహాయం సహకారం లేకుండానే స్వయంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యల్లా మారుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ రాజకీయాలను శాసించారు. అంతే కాదు ప్రపంచంలో గొప్ప మహిళా రాజకీయవేత్తల్లో ఆమె పేరు చిరస్థాయిలో నిలిచిపోయింది. ఇప్పటి వరకూ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 15 మహిళలు ముఖ్యమంత్రులుగానూ, ఒకరు రాష్ట్రపతిగానూ, మరెందరో కీలక పదవుల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం దేశంలో ఓ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రులుగా ఉండి చక్రం తిప్పుతున్న వారి గురించి ఓ లుక్కేద్దాం..
మమతా బెనర్జీ..
పశ్చిమబెంగాల్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాలీలంతా ఆమెను దీదీ అని పిలుస్తారు. మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు చేసి మమత అధికారం చేపట్టారు. అంతకు ముందు కేంద్రంలో రైల్వే మంత్రిగానూ చక్రం తిప్పారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన మమత 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మమత తన మార్గాన్ని నిర్దేశించుకున్నారు. దేశంలోనే అత్యంత నిజాయితీ గల రాజకీయ నేత అని ఓ సర్వేలో తేలింది. అత్యంత పిన్నవయస్సుల్లోనే పార్లమెంటులో అడుగు పెట్టిన ఘనత కూడా దీదీదే.
జయలలిత
పురుచ్చి తలైవి. తమిళనాట అమ్మగా నీరాజనాలందుకుంటున్న నేత. రాజకీయ దురంధురలను మట్టికరిపించిన ధీశాలి. వెండితెర నుంచి రాజకీయంలోకి అడుగుపెట్టిన జయ- 1982లో తొలిసారి పబ్లిక్ స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకర్షించారు. ప్రతిపక్ష నేతగానూ, ముఖ్యమంత్రిగానూ జయలలిత సత్తా చాటారు. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధితో ఢీ అంటే ఢీ అంటూ జయ రాజకీయ ప్రస్థానం సాగుతోంది. మహిళా ముఖ్యమంత్రిగా తన మార్క్ పథకాలను ప్రవేశపెట్టారు. తమిళనాడులో 57 మహిళా పోలీస్ స్టేషన్లను ప్రవేశపెట్టడమే కాకుండా.. మహిళల కోసం ప్రత్యేక లైబ్రరీలు, స్టోర్స్, బ్యాంకులు, కో ఆపరేటివ్ ఎలక్షన్స్ ప్రారంభించారు. అలాగే పోలీస్ ఉద్యోగాల్లో 30 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. జయలలిత ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటీన్లు తమిళనాట అత్యంత జనాదరణ పొందాయి. విజయానికి ముందు ఎన్నో అవమానాలు. 989లో నిండుసభలో డీఎంకే సభ్యులు ఘోరంగా అవమానించారు. ఏకంగా ఒక సభ్యుడు జయ చీరను చించేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. జయపట్ల సానుభూతిని పవనాలు రాష్ట్రమంతటా వీచాయి. అలా జయలలిత.. అత్యంత పిన్న వయస్సులో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు జయలలిత తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆనంది బెన్ పటేల్
ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం గుజరాత్ పగ్గాలు ఎవరికి ఇస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ సమయంలోనే తెరమీదకి వచ్చిన పేరు ఆనంది బెన్ పటేల్. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆనందీ బెన్ పనితీరు అందరినీ ఆకర్షించింది. 1994లో పార్లమెంట్‌లో అడుగు పెట్టిన ఆనంది.. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గుజరాత్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేపట్టిన మహిళా అక్షరాస్యత కార్యక్రమం విజయవంతమైంది. వంద శాతం మంది బాలికలు బడికి వచ్చారు. అలాగే రహదారుల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు నర్మదా కెనాల్ అభివృద్ధి చేశారు. తద్వారా పొలాలన్నీ సస్యశ్యామలమయ్యాయి. ఎందరో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. 700 కిలోమీటర్ల రోడ్లతో పాటు రక్షిత మంచినీటి పథకాలతో అభివృద్ది పథాన నడిచారు. ఆనంది రాజకీయ ప్రవేశం ఒక సాహసమే. సర్దార్ సరోవర్ రిజర్వాయర్‌లో మునిగిపోతున్న ఇద్దరు స్కూల్ విద్యార్థులను నీళ్లలో దూకి మరీ కాపాడిన ఆనందీ సాహసం వార్తల్లోకెక్కింది. రాష్ట్రపతి నుంచి బ్రేవరీ అవార్డు కూడా లభించింది. అనంతరం బీజేపీలో చేరి.. మహిళా మోర్చ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఆనంది చిన్నతనంలో పాఠశాల స్థాయిలో అథ్లెట్‌గా పేరొందారు.
వసుంధరా రాజే..
రాజస్థాన్ మొట్టమొదటి మహిళా సీఎం వసుంధరా రాజే. 1985లో రాజకీయాల్లో ప్రవేశించిన వసుంధరా ఎంపీగానూ, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2003లో తొలిసారి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజస్థాన్ ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. వాస్తవానికి వసుంధర రాజస్థాన్ రాజుల వంశస్తురాలు. రాజస్థాన్ సీఎంగా వసుంధరా కార్మిక చట్టాల సవరణలతో పరిశ్రమలను ఆకర్షించారు. అలాగే కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి వసతులను చేపట్టి తన మార్కు పాలన చూపించారు .
మెహబూబా ముఫ్తీ..
జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ ఒక సంచలనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మెహబూబా 1996 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. మాజీ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురైన మెహబుబా.. రెండుసార్లు ఎంపీగానూ, రెండుసార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. బీజేపీ, పీడీపీలు రెండూ భిన్న ధృవాలు అయినప్పటికీ మెహబూబా చాకచక్యంగా పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దడంలో మెహబూబా ప్రముఖ పాత్ర వహించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.