మందాకిని గుప్తా.. మన వంటిళ్ల నుంచి పుట్టుకొచ్చిన సాధారణ చెఫ్ కాదు. ఆమె తన ఐదేళ్ల ప్రాయం నుంచి, వంట చేసే వాళ్ల అమ్మను చూసి, ఎప్పటికైనా చెఫ్ కావాలనే బలీయమైన ఆకాంక్షను మనసులో పాదుకొల్పుకుంది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి పట్టా పుచ్చుకున్న ఆమె, టెలివిజన్ జర్నలిస్ట్‌గా కెరియర్‌కి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల కిందటి వరకూ ఒక చిన్న చాకొలేట్ కేకును కూడా తయారు చేయగలిగే దానిని కాదని చెప్పుకున్న ఆమె... ఇప్పుడు మాత్రం పేరున్న ఓ పేస్ట్రీ చెఫ్‌గా రాణిస్తోంది. ఆమె టెలివిజన్ జర్నలిజం కెరియర్లో ఉన్న ఎన్నో అద్భుతమైన ఉన్నతావకాశాలను వదులుకుని, పేస్ట్రీ తయారీ రంగంలో ఎదగాలని ప్రయత్నంచింది. ఒక పేస్ట్రీ తయారీ చెఫ్‌గా మెళకువలు నేర్చుకునేందుకు ఆమె... ఢిల్లీలో పార్క్ హోటల్లో గంటల తరబడి నిలబడటమే కాదు, అక్కడ మురికి పట్టిన ఫ్రిడ్జ్‌లను కూడా శుభ్రం చేసింది. వాటి ఫలితం ఇప్పుడు ఆమెకు కనిపిస్తోంది. ఒకప్పుడు వారానికి పది ఆర్డర్లు కూడా రాని రోజుల నుంచి... గత మూడేళ్లుగా ఆమె ఇప్పుడు వందలాది ఆర్డర్లే కాదు.. అంతకు మించిన నమ్మకమైన కస్టమర్లను కూడా సంపాదించుకోగలిగింది. ఢిల్లీలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వివాహానికి రుచికరంగా అలంకరించిన చాకొలెట్ లెమన్ టార్ట్ల ఆర్డర్ కూడా దక్కించకుంది.
ఆమె తన కిచెన్ నుంచే స్మిటన్ అనే కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎదిగింది. ఇప్పటికీ ఆమె తయారు చేసే నాణ్యమైన సాల్టెడ్ కారెమిల్ చాకొలెట్ టార్ట్‌లు, డార్క్ చాక్లెట్ సీసాల్ట్ కుకీలు, లెమన్ పాపీ సీడ్ కేకులు, ఒవెన్ నుంచి బయటకు తీసేలోగానే అమ్ముడైపోయేంత ఆర్డర్లు వస్తాయి.
సరదాగా తిరిగే ఓ టీనేజర్ అమ్మాయి నుంచి ఒక విజయవంతమైన బిజినెస్ విమెన్‌గా, తన వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించేంత స్థాయికి మందాకిని ఎలా ఎదిగిందని అడిగితే ఆసక్తికరమైన సమాధానం వస్తుంది. బేకింగ్ అంటే ఆమెకు అమితాసక్తి. కానీ ఆమె తన షాపును వంద శాతం నిర్వహించేంత సామర్థ్యం వచ్చేంత వరకూ సొంతంగా షాప్ పెట్టుకోవాలని మాత్రం అనుకోలేదు.
మందాకిని ఇదంతా సొంతంగా సాధించుకుంది. జర్నలిస్టుగా విధులు నిర్వహించి ఇంటికొచ్చి ఆమెకు సాయం చేసే చక్కటి భర్త, ఒక్క సహయకురాలు తప్ప ఆమెకు బయటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. ఆమె భర్త, కుకింగ్ అంటే ఆమెకున్న అమితాసక్తి రెండూ ఏకమై... ఆమెను తమ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేలా స్ఫూర్తి నింపాయి. ఇక ఆమె ట్రైనింగ్ గురించి కూడా ఆసక్తికరంగానే చెప్పుకొచ్చారు.
"నేను ఫ్రాన్స్ వెళ్లలేదు.. నాకు ఫ్రాన్స్ రాదు.. ఇప్పుడేంటి ?" అన్న ప్రశ్నకు సమాధానమే తన విజయం అంటారామె. ప్రఖ్యాత పాకశాస్త్ర కళాశాలలో పాఠాలు నేర్చుకునే కోర్సుకు ఏడాదికి 50 లక్షలు చెల్లించేంత స్థోమత ఆమెకు లేదు. అందుకే ఆమె తొలినాళ్లలో ముంబైలోని ఇండిగో డెలీ, న్యూయార్క్ లోని WD50 వంటి కమర్షియల్ హోటళ్ల కిచెన్లలో ఎక్కువ సేపు నేర్చుకునేవారు. ఆ తర్వాత మన్హట్టన్లో ఉన్న ఒక ఫ్రెంచ్ పాకశాస్త్ర ఇన్స్టిట్యూట్లో మూడు నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేశారు. భారత్ తిరిగి వచ్చి స్మిటన్ అనే సొంత కంపెనీ మొదలు పెట్టే ముందు, తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని పరిపుష్టం చేసుకునేందుకు పేస్ట్రీ చైన్ అయిన ఎల్ ఒపేరాలో పనిచేశారు. ఇది కాకుండా మందాకిని గురించి కొద్దిమందికే తెలిసిన విషయం మరొకటి ఉంది. అదేంటంటే ఆమె మూగజీవుల్ని అమితంగా ప్రేమిస్తుంది. ఆమె ఇంట్లో ఐదు కుక్కల్ని కూడా పెంచుకుంటోంది. ఊపిరి సలపని బేకింగ్ పని నుంచి కాస్తంత వీలు దొరికినప్పుడల్లా వీధి కుక్కల్ని రక్షిస్తూ ఉంటారు. ఇక బేకరీ ప్రపంచంలో మందాకినీ విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించడానికి ఆమె వేసిన అడుగులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి.
పాత్రికేయం ఎందుకు వదిలిపెట్టానంటే..?
నేను ఇప్పుడున్న స్థాయికి రావడానికి ముందు ఎంతో ఆలోచించాను, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. నన్ను నేను ఎన్నో సార్లు నిరూపించుకున్నాను. నేను ఒక ప్రొఫెషనల్ కిచెన్‌లో ఇంటర్న్ షిప్కి వెళ్లినప్పుడు అక్కడ ఏకధాటిగా పన్నెండు గంటల పాటు బేకింగ్ ప్రక్రియలో ఉన్నా...అలసిపోను, సంతోషంగానే ఉంటాను అని నన్ను నేను ఒప్పించుకోగలగాలి అనుకున్నాను. నేను కచ్చితంగా అది సాధించిన రోజున మాత్రమే... నా టీవీ జర్నలిజం ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సంతృప్తి, నమ్మకం సాధించాను కాబట్టే ఇప్పుడిలా ఉన్నాను.
ఈ వ్యాపారంలో ఆమె ప్రత్యేకత ఏంటి ?
'' నేను వాడే కొన్ని వస్తువులు చాలా ఖరీదైనవే కానీ, నా డెసర్ట్స్ అన్నీ ఖరీదైనవిగా ఉండాలని నేను అనుకోను. నేను కేవలం లగ్జరీ డెసర్ట్స్లను మాత్రమే తయారు చెయ్యాలనుకోను. నా కస్టమర్లకు సరసమైన ధరలోనే వారికి ఇవి అందివ్వాలనుకుంటాను. నా కేకుల్లో నేను ఇండియన్ చాక్లెట్లు వాడను ఎందుకంటే అవి నాణ్యతలో బెస్ట్ కాదు. నేను విదేశీ చాక్లెట్లు మాత్రమే వాడతాను. రాస్ బెర్రీ వంటి పళ్లను ఫ్రాన్స్ నుంచి తెప్పిస్తాను. నిమ్మకాయలైతే.. మా అమ్మ తోట నుంచి తెచ్చుకుంటాను.
ఈ వ్యాపారంలో రాణించాలనుకునే వారికి ఓ సలహా..
మీరు ఎన్ని ఆర్డర్లు సమర్థంగా పూర్తి చేయగలరో తెలుసుకునేంత వరకూ పెద్ద ఆర్డర్లు తీసుకోవద్దు. పెద్దగా ప్రకటలూ ఇవ్వవద్దు. మీరు చిన్నగా మొదలు పెడితే మరింత వృద్ది చెందే అవకాశం ఉంటుంది. అంతే కానీ మీరు పెద్దదిగా ప్రారంభించి చివరికి వ్యాపారాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం కాదు. మీ వరకూ ఉత్పత్తిలో, నాణ్యతలో ఉన్నత విలువలు పాటించండి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకోండి. నేనైతే... ఎప్పుడూ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత రోజు నా కస్టమర్లకు ఫోన్ చేసి అవి వాళ్లకు నచ్చాయో లేదో అని ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటాను. కొన్నిసార్లు ఆ కేకులు చాలా ముక్కలైపోయాయని, సరిగా లేవని అంటారు. అప్పుడు వాళ్ల అభిప్రాయాన్ని ఒకసారి చెక్ చేసుకుంటాను. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా తయారు చేశానా ? లేక కస్టమర్లు ఏమైనా వేరే రకం కత్తితో వాటిని కోశారా ? లేకపోతే కేక్ సరిగ్గా అమర్చడంలో తప్పు జరిగిందా ? ఇలా చెక్ చేసుకోవడం ద్వారా నా నాణ్యతను మరింత మెరుగుపర్చుకుంటాను. ఏ వ్యాపారంలో అయినా.. వినియోగదారుడి ఫీడ్ బ్యాక్ ను తక్కువ చేయకూడదు.
షాహిద్ కపూర్ పెళ్లికి ఆర్డర్ ఎలా వచ్చిందంటే...?
నాకు మీరా రాజ్ పుట్ చెల్లెలి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు ఉన్న కస్టమర్లలో ఒకరు ఆమెకు నన్ను రిఫర్ చేశారట. కానీ కొన్ని సోషల్ మీడియా సైట్లలో కొన్ని లింక్స్ చదివే వరకూ నేను ఇలాంటి సెలబ్రిటీల పెళ్లికి ఆర్డర్ తీసుకున్నానని తెలుసుకోలేకపోయాను. కానీ తెలిశాక ఒక్కసారిగా ఓ మైగాడ్ అని ఎగిరి గంతేశాను. ఆ ఫోన్ కాల్ పూర్తవ్వగానే ఆనందంతో డ్యాన్స్ చేశాను. నేను వాళ్లకు వంద చాక్లెట్లు తయారు చేసి ఇవ్వాలి. కానీ అప్పటికే నాకు ఎన్నో ఆర్డర్లు వచ్చి ఉన్నాయి. వాటికి అదనంగా ఇవీ తయారు చెయ్యాలి. వీటి తయారీకి నేనే స్వయంగా కొన్ని ర్యాపర్లు ప్రింట్ చేయడం కోసం ప్రింటర్‌తో తంటాలు పడ్డాను. వీటి తయారీ పూర్తయ్యాక... మీరాయే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంతే కాదు.. ఆ తర్వాత కూడా సుప్రియా పాథక్ అనే ఆమె నా చాక్లెట్ల గురించి అడిగారని, నా చాక్లెట్లు చాలా రుచికరంగా ఉన్నాయన్నారని ఆమె నాతో చెప్పారు.
నా వ్యాపారం బాగా సాగుతోంది. కానీ ప్రతి చెడు వెనుకా ఓ మంచి ఉంటుందని, అయినా మనం మాత్రం ఎప్పుడూ మనం చేసే పని నుంచి మాత్రం తప్పుకోకూడదని మా అమ్మ చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేను మర్నాడు కిచెన్ లో కేకుల తయారీలో బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తు చేసుకోడానికి మాత్రం కచ్చితంగా నాకు సమయం ఉండదు ''.