ఒకప్పుడు గాజులు అమ్మిన కుర్రాడు.. నేడు ఐఏఎస్ అయ్యాడు!!
ఆశయం ముందు ఓడిన అంగవైకల్యం..కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరానికి చేరిన ఐఏఎస్ రమేష్ గోలప్
సంకల్ప బలం ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. నిజాయితీగా ప్రయత్నించాలే గానీ ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోవచ్చు. అందుకు ఉదాహరణ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం. Dreaming small is crime అన్నది కలాం చెప్పిన మాట. అందుకే పెద్ద కలలు కనడమే కాదు.. అకుంఠిత దీక్షతో వాటిని సాకారం చేసుకున్నాడు రమేష్ గోలప్.
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా వార్సీకి చెందిన రమేష్ గోలప్ ది పేద కుటుంబం. చిన్నప్పుడే ఎడమ కాలికి పోలియో సోకింది. అయినా అతనిలో ఆత్మ విశ్వాసంతో ఏమాత్రం తగ్గలేదు. చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్. తండ్రి గోరఖ్ గోలప్ సైకిల్ రిపేర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతనికున్న తాగుడు అలవాటుతో ఆరోగ్యం దెబ్బతిని కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో రమేష్ తల్లి విమల చుట్టుపక్కల గ్రామాల్లో గాజులమ్మేది. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేది. ఆమెకు రమేష్, అతని తమ్ముడు సాయం చేసేవారు.
రమేష్ ఊరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో పై చదువుల కోసం బాబాయి దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా మిగతా విద్యార్థుల కన్నా రమేష్ ముందుండేవాడు. 2005లో రమేష్ 12వ తరగతి చదువుండగా తండ్రి చనిపోయిన వార్త తెలిసింది. ఆ సమయంలో మోడల్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వా లేదు. ఊరెళ్లేందుకు బస్ ఛార్జీ కోసం 7రూపాయలు కావాలి. రమేష్ కు ఫిజికల్లీ హ్యాండీక్యాప్ బస్ పాస్ ఉంది. అయినా టికెట్ కోసం 2రూపాయలు కావాలి. స్నేహితులు సాయం చేయడంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణం రమేష్ ను బాగా కుంగదీసింది. అయితే తల్లి బలవంతం మేరకు తండ్రి చనిపోయిన నాలుగు రోజులకు కెమిస్ట్రీ మోడల్ ఎగ్జామ్ రాశాడు. మిగతా పరీక్షలకు మాత్రం అటెండ్ కాలేదు. కెమిస్ట్రీ టెస్టులో రమేష్ కు 40కి 35 మార్కులొచ్చాయి. దీంతో అతను చదువుతున్న స్కూల్ టీచర్ అందించిన ప్రోత్సహంతో రమేష్ 12వ తరగతి పరీక్షల్లో 88.5శాతం మార్కులు సాధించాడు.
ఉన్నత చదువులు చదవాలని ఉన్నా అందుకు పెద్ద మొత్తంలో డబ్బుకావాలి. అందుకే తక్కువ ఖర్చుతో పూర్తవడమే కాకుండా సులువుగా ఉద్యోగం దొరికే డీఎడ్ (Diploma in Education) లో చేరాడు. అదే సమయంలో ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. 2009లో ఓ స్కూల్ లో టీచర్ గా జాయినయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ రమేష్ కు సంతృప్తి లేదు. తాను కోరుకున్న ఉద్యోగం అదికాదు.
రమేష్ తల్లి, తమ్ముడితో కలిసి పిన్ని వాళ్లింట్లోనే ఒక రూములో ఉండేవాడు. ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరైన రెండు గదుల ఇళ్లు అది. తమకంటూ సొంత ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో రమేష్ తల్లి కాలికి బలపం కట్టుకుని గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరిగింది. కటిక పేదరికంలో ఉన్నా పథకం పరిధిలోకి రారంటూ ఇళ్లు మంజూరు చేయలేదు. ఇలా ప్రభుత్వ అధికారులు పేదలపట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో రమేష్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. BPL స్కీం కింద ఇంటి కేటాయింపు విషయం.. రేషన్ షాపులో కిరోసిన్ కోసం పడ్డ ఆరాటం.., తండ్రి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్ల ప్రవర్తన.. అన్నీ రమేష్ కు గుర్తున్నాయి.
కాలేజ్ లో ఉండగా స్టూడెంట్ యూనియన్ లీడర్ అయిన రమేష్.. పనిమీద తరుచూ తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో తహసీల్దార్ అయితే అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టొచ్చన్న నిర్ణయానికొచ్చాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.
“జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. ఇంట్లో తినేందుకు తిండి లేక కాలే కడుపుతో పడుకున్న రోజులున్నాయి. డబ్బు పెట్టి చదువుకునే స్థోమత లేదు. ఒకసారి స్వయం సహాయక బృందం తరఫున అమ్మకు గేదెలు కొనుక్కునేందుకు 18వేల రూపాయల రుణం ఇచ్చారు. ఆ డబ్బుతో కోచింగ్ తీసుకున్నా. మొదట మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించా. ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారినయ్యా.”- రమేష్ గోలప్
తన కల నిజం చేసుకునే దిశగా 2009లో తొలి అడుగువేశాడు రమేష్. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణె వెళ్లి యూపీఎస్సీ ఎగ్జామ్ కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. 2010లో గ్రామపంచాయితీ ఎన్నికల్లో తల్లిని సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిపాడు. కానీ కొన్ని ఓట్ల తేడాతో గెలవలేకపోయాడు.
“2010లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేలా అమ్మను ప్రోత్సహించా. గ్రామస్థుల సహకారం ఉంటుందని ఆశించా. కానీ అమ్మ ఓడిపోయింది. ఈ ఘటన నాలో కసి పెంచింది. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాకే మళ్లీ ఊరిలో అడుగుపెట్టాలని ఆ రోజే నిర్ణయించుకున్నా.”-రమేష్ గోలప్.
ఆ తర్వాత రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీ పట్టాడు రమేష్. కష్టానికి ఫలితం దక్కింది. 2012 యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో జాతీయ స్థాయిలో 287వ ర్యాంకు సాధించాడు. అనుకున్నది సాధించిన అతడి మనసులో చెప్పలేనంత ఆనందం. 2012 మే 4న ఐఏఎస్ అధికారి హోదాలో మళ్లీ ఊరిలో అడుగుపెట్టాడు. గాజులమ్మిన కుర్రాడు, ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో తిరిగిరావడంతో రమేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచిన ఆయనను గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తాడు.
ప్రస్తుతం రమేష్ జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. విధి నిర్వాహణలో కఠినంగా వ్యవహరించే ఆయన తన బాల్యంలో ఎదురైన అనుభవాలను మర్చిపోలేదు. అందుకే అవినీతికి పాల్పడే అధికారులకు సింహస్వప్నంగా మారి వృత్తిలో నిబద్ధత చాటుకుంటున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని కలలుకంటున్న ఎంతో మంది యువతకు ప్రేరణనిచ్చే ప్రసంగాలతో వారికి మార్గదర్శనం చేస్తున్నాడు రమేష్.
పేద కుటుంబంలో పుట్టి, అంగవైకల్యాన్ని జయించి లక్ష్యాన్ని సాధించిన రమేష్ కృషి, పట్టుదల నిజంగా అభినందనీయం.