ఆంట్రప్రెన్యూర్‌గా మారిన ఆర్టిస్ట్
యాక్టర్ నుంచి ఈవెంట్ మేనేజర్‌గా సుదీర్ఘ ప్రయాణం... మోడల్ కో -ఆర్డినేషన్‌లో హైదరాబాద్‌లో ది బెస్ట్ సంస్థగా లుక్స్..
ఆర్టిస్ట్ కాక ముందు మీరేం చేసే వారంటే నేనొక మోడల్‌ని అంటారు. మోడల్ కాక ముందు మీరేంటి అని అడిగితే నేనొక డిజైనర్‌ని అంటారు. ఇప్పుడీ సీక్వెన్స్‌లో మరో రెండు యాడ్ అయ్యాయి. అందులో యాక్టర్ తర్వాత ఈవెంట్ మేనేజర్ ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఓనర్ అండ్ ఆంట్రప్రెన్యూర్. 'ది లుక్స్' ప్రొడక్షన్ ఫౌండర్ కౌశల్ మండా గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే ఇది సరిపోతుంది. కానీ ఈ స్థాయికి రావడానికి తాను చేసిన ప్రయాణం గురించి అతన్నే అడిగితే.. చెమ్మగిల్లిన కళ్లతో ఆయన చెప్పే సమాధానం వింటే .. ఓ ఎమోషనల్ స్టోరీ మన మనసును తాకుతుంది.
'' సినిమా,ఫ్యాషన్, ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలంటే మన కంటికి కలర్‌ఫుల్ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని వెనుక గుండెలను పిండేసే అంత బాధ ఉందనే సంగతి అక్కడ పనిచేసే వారికి మాత్రమే తెలుసు '' - కౌశల్
ఎంతో మంది ఎన్నో రకాలుగా రిజెక్ట్ చేస్తే వాటన్నింటినీ సవాలుగా తీసుకొని తానీ స్థితికి వచ్చానని అంటారు కౌశల్. హైదరాబాద్ కేంద్రంగా 1999లో ప్రారంభమైన లుక్స్ దక్షిణాదిలోనే మొదటి మోడలింగ్ ఏజెన్సీ అని చెప్తారు కౌశల్. ఇప్పుడు అది ప్రీమియర్ మోడల్స్‌ను అందించే సంస్థగా అవతరించింది. పూర్తి స్థాయి యాడ్ కాన్సెప్ట్ డిజైనర్ , టీవీ యాడ్ ఫిల్మ్ మేకర్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్టూడియో, మీడియా ప్లానింగ్, ఔట్‌డోర్ షూటింగ్ యూనిట్, గ్రాఫిక్ డిజైనింగ్‌తోపాటు కొత్తగా మోడలింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే యువతీ, యువకులకు ట్రెనింగ్ ఇనిస్టిట్యూట్‌గా ‘ లుక్స్’ వ్యవహరిస్తోంది. మోడలింగ్‌కు సంబంధించి దేశ, విదేశాల్లో జరిగిన ఎన్నో ఈవెంట్లకు ఈ సంస్థ పనిచేసింది.
అంత ఈజీగా సక్సెస్ రాలేదు
తెలుగు టీవీ, సినిమాలు చూసే వారికి కౌశల్ కొత్తేం కాదు. టెలీ ఫిలిమ్స్ , సీరియళ్లు, యాడ్స్‌లో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై కనిపిస్తున్న కౌశల్ ఇప్పుడు సరికొత్తగా ఈవెంట్ మేనేజర్ అవతారమూ ఎత్తారు. మోడల్ కో-ఆర్డినేషన్‌తోపాటు ప్రొడక్షన్ సేవలనూ అందిస్తున్నారు. లుక్స్‌ను ప్రారంభించిన కొన్నేళ్ల వరకూ దానిపై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. నటుడిగా సినిమాలు, టీవీల్లో స్థిరపడుతున్న క్రమంలోనే లుక్స్ ద్వారా తన సొంత వ్యాపారాన్ని విస్తరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి ఈవెంట్ మేనేజ్‌మెంట్, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీగా జనం ముందుకు తీసుకొచ్చారు. పెద్దపెద్ద సెలబ్రిటీలు ఈ కంపెనీతో పనిచేస్తుండటం తనకు ఆనందాన్ని కలిగించిందంటున్నారు.
లుక్స్ ప్రారంభం
'' లుక్స్ ప్రారంభించిన రోజుల్లో నేనింకా మోడల్గా నిలదొక్కుకోలేదు. అప్పటికి మోడల్ కో-ఆర్డినేషన్ అనేది హైదరాబాద్ లో అంతగా ప్రాచుర్యమూ పొందలేదు. ముంబై నుంచి మోడల్స్ తెప్పించుకోవడమే సాంప్రదాయం. మార్కెట్‌లో నిలదొక్కు కోవడం అంత సులభంగా జరగలేదు. తర్వాత నేను మోడల్‌గా షోలల్లో కనిపించడంతో లీడ్స్ వచ్చేవి కానీ పూర్తి స్థాయిలో కాంట్రాక్టులు మాత్రం సాధ్యపడలేదు. ఆ తర్వాత బిజినెస్‌లో నష్టాలు లేకపోయినా లాభాలు మాత్రం రాలేదు. కానీ మార్కెట్లో మార్పు వస్తుందనే నమ్మాం. అది మాతోనే సాధ్యపడుతుందని విశ్వసించాం. ఇన్నేళ్ల మా నమ్మకం వమ్ము కాలేదని రుజువైంది. ఇంతకాలానికి సక్సస్‌ను ఆస్వాదిస్తున్నా '' అంటారు కౌశల్.
“ నటుడిగా స్టేజీపై లైవ్ షోను రన్ చేయడం లేదా స్క్రిప్ట్ అందిస్తే కేమెరా ముందు డైలాగ్ చెప్పడం , సీన్‌లోయాక్ట్ చేయడం చాలా సులభం. కానీ ఈవెంట్ ఆర్గనైజర్‌గా బ్యాక్ స్టేజీలో ఉండి నడిపించడం అంత ఈజీ అయితేకాదు ” కౌశల్
టీవీ, సినిమాల్లో పూర్తి స్థాయిలో రాణిస్తున్న సమయంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోకి రావడం కూడా ఓ పెద్ద సవాలే. ఎందుకంటే నటుడిగా ఓ స్టేటస్ ఉంటుంది. క్లెయింట్స్‌తో మాట్లాడేటప్పుడు ఏదో మొహమాటం అడ్డుపడుతుంది. కానీ చేసే పనిని ఇష్టపడుతున్నప్పుడు, అది ఎలాంటి పని అయినా రాణించొచ్చని కౌశల్ నిరూపిస్తున్నారు. చేసే పని చిన్నదైనా, పెద్దదైనా సిగ్గుపడితే రాణించలేం. ఎవరు తక్కువ చేసి మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిలో క్లారిటీ ఉన్నప్పుడు అది చేసుకుంటూ పోవాలి. విజయం సాధించిన తర్వాత వాళ్లే వెంటపడతారు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయని చిరునవ్వులు చిందిస్తారు కౌశల్.
లుక్స్ అందించే సేవలు
మోడల్ కో ఆర్డినేషన్ ఏజెన్సీగా మొదలైన లుక్స్ ప్రస్థానం ఎన్నో సేవలను అందించే స్థాయికి చేరింది. యాడ్ ఫిల్మ్ మేకింగ్, కార్పొరేట్ ఫిల్మ్ , ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటి వాటిల్లో ప్రొఫెషనల్ చేసే ఆర్గనైజేషన్‌గా లుక్స్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. మొదటి నుంచి ఉన్న మోడల్ కో-ఆర్డినేషన్, కాస్టింగ్ ఎలాగూ ఉంది. ఫోటోగ్రఫీ, ప్రింట్ యాడ్స్ సేవలనూ అందిస్తోంది. పెప్సీ,కోక కోలా, బజాజ్, ఎల్జీ, ఫాస్టర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, నోకియా వంటి వాళ్లు లుక్స్ క్లెయింట్ల జాబితాలో ఉన్నారు. స్టార్టప్ కంపెనీలకు కావల్సిన ప్రోడక్ట్ లాంచ్, ప్రమోషనల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. కాన్సెప్ట్ డిజైనింగ్, ప్రింట్ యాడ్స్ లాంటి వాటిల్లో లుక్స్‌ది అందే వేసిన చేయి. హైదరాబాద్‌లో ప్రారంభం అవుతున్న ఎన్నో స్టార్టప్ కంపెనీలకు ప్రమోషన్ అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు కౌశల్.
భవిష్యత్ ప్రణాళికలు
మోడల్స్ అంటే బాంబే దాకా వెళ్లాలనే సాంప్రదాయాన్ని మార్చిన మొదటి సంస్థ లుక్స్ అని గర్వంగా చెప్పుకుంటారు కౌశల్. బాంబే కంపెనీలకే ఇక్కడి నుంచి మోడల్స్‌ను పంపించే సాంప్రదాయాన్ని అలవాటు చేయడం మొదలు పెట్టారు. బడా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో పోటీ పడే స్థాయికి ఇంకా లుక్స్ రాకపోయినా.. భవిష్యత్ లో వాటిని మించే స్థాయికి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టే యోచనలో ఉంది. బాలీవుడ్‌లో కూడా సినిమాలు తీసే ఆలోచనతో అడుగులేస్తోంది లుక్స్.
కళ్లకు కనిపించే అంత కలర్‌ఫుల్‌గా ఈవెంట్స్ ఉంటాయనుకోవడం తప్పు. ఈవెంట్స్ అంటే ఇష్టం ఉంటేనే ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి. ఏదో సంపాదించుకుందాం. చేస్తే బాగుంటుంది అనుకొని మాత్రం ఈ ఫీల్డ్‌లోకి రావొద్దు. ఈవెంట్స్‌ని ఇష్టంగా చేద్దామనే వారికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి - కౌశల్