సంకలనాలు
Telugu

సెలబ్రిటీ ట్రెయినర్ కాడానికి ముందు ఒంటిమీద 120 సర్జరీలు! పడిలేచిన కెరటం ఈశ్వర్!!

ashok patnaik
20th Dec 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


ప్రభాస్ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ లోకనిపించడానికి కారణం ఏంటి? వెంకటేష్ ఇంకా యంగ్ గా కనిపించడానికి ఏం చేస్తాడు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తిలా మారిపోడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలకూ జవాబు ఒక్కటే. వారందరికీ పర్సనల్ ట్రెయినర్ ఒక్క వ్యక్తే. ఈ మాత్రం ఇంట్రడక్షన్ ఇస్తే ఈశ్వర్ గురించి చెప్పడానికి ఇంకేముంటుంది లే అనుకోవచ్చు. కానీ అతని జీవితంలో ఎదురు చూసిన పరిస్థితులు చూస్తే మాత్రం.. ఓ సాధారణ వ్యక్తికి సాధ్యపడని ఎన్నింటినో సాధించాడనే విషయం అర్థం అవుతుంది.

image


ఆర్మీ నేపథ్యం

చిన్నప్పటినుంచి స్పోర్ట్ మెన్ కావాలనుకున్న ఈశ్వర్ టీనేజికి వచ్చేటప్పటికీ బాడీ బిల్డర్ అయిపోయారు. జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ కైవసం చేసుకున్నారు. అప్పుడే ఇండియన్ నేవీకి సెలెక్ట్ అయ్యారు. అయితే హోం సిక్ తో ఇంటికి చేరిన ఈశ్వన్ ను కుటుంబసభ్యులు తిరిగి నేవీకి పంపలేదు. ఏడాది పాటు మళ్లీ బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఆర్మీ సెలెక్షన్ కు వెళ్లి అవలీలగా ఉద్యోగం సంపాదించుకున్నారు.

“ఆర్మీలో చేరిన తర్వాత మెడల్స్ సాధించడాన్ని అలవాటుగా చేసుకున్నా.” ఈశ్వర్

ఆర్మీ స్పోర్ట్స్ లో ఈశ్వర్ యాక్టివ్ అయిపోయారు. ఆర్మీ తరుపు నుంచి బాడీ బిల్డింగ్ లో ఎన్నో మెడల్స్ సంపాదించారు. ఏ ఈవెంట్ లో పాల్గొన్నా మెడల్ కంపల్సరీ అనేలా ఉండేదని సంతోషంగా చెప్పారు ఈశ్వర్. దాదాపు పదేళ్లు ఆర్మీఉద్యోగం చేసిన ఈశ్వర్ తర్వాత సెలబ్రిటీ ట్రెయినర్ గా మారారు.

image


సర్జరీలతో సావాసం

ఆర్మీ స్పోర్ట్స్ లో రాణిస్తున్న సమయంలోనే ఈశ్వర్ కు లైపోమాసిస్ అటాక్ చేసింది. ఈ వ్యాధి కారణంగా ఒంటినిండా కండలు పెరిగిపోయి పుండ్లు పుట్టినట్టు మారిపోతుంది. ఎంతో అందంగా ప్రాక్టీస్ చేసి సాధించుకున్న బాడీ అంతా అలా అందవికారంగా మారిపోవడం చూసి ఈశ్వర్ డిప్రెషన్ కు లోనయ్యారు. ఎంత మంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేదు. చివరిగా ఓ డాక్టర్ సలహాతో సర్జరీలకు సిద్ధపడ్డారు.

“ఒకేసారి 60 సర్జరీలు చేశారు. 6నెలలు మంచానికే పరిమితమయ్యా.” ఈశ్వర్

ఒకసారి 60, తర్వాత 30 ఆ తర్వాత మళ్లీ సర్జరీలు అలా దాదాపు 100కి పైగా సర్జరీలు చేశారు. ఐదారు నెలలు నాలుగు గోడల మధ్య మంచానికి పరిమితం అయిపోయాను. డిశ్చార్జ్ అయి బయటకి వచ్చి నన్ను నేను చూసుకొని భయపడ్డా. ఒంటినిండా గాట్లు, సన్నబడిన గాట్లు చూసి తానే భయపడ్డానని చెప్పుకొచ్చారు.

“మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టా. దాదాను 6నెలల్లో నేనొక మనిషినయ్యా.” ఈశ్వర్

6నెలలు ప్రాక్టీస్ చేసే గానీ తనని తాను అద్దం చూసుకొని శాటిస్ఫై కాలేదని చెప్పుకొచ్చారు. మళ్లీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అయ్యారట. ఇది జరుగుతున్న క్రమంలో ఓ భారీ యాక్సిడెంట్ జీవితాన్ని అథ:పాతాళానికి తీసుకెళ్లిపోయింది. స్పైనల్ కార్డ్ దెబ్బతిని నడవలేని పరిస్థితి. మరో 20 సర్జరీలయ్యాయి. డిశ్చార్జీ అయ్యాక కర్రతో నడుస్తూ గ్రౌండ్ కి వెళ్లేవాడిని. అక్కడ అంతా ఆడుతుంటే చూసి ఏడుపొచ్చేది. కానీ నడకతో ప్రారంభమైన నా ప్రయాణం తిరిగి రాకెట్ వేగం పుంజుకునేదాకా వెళ్లింది. మళ్లీ యథాస్థితికి రాడానికి మరో 4 నెలలు పట్టింది. పూర్తి స్థాయి బాడీబిల్డర్ కావడానికి ఏడాది సమయం పట్టింది. ఇక ఆర్మీలో చేయడానికి ఏమీలేదని భావించాను. బయట ప్రపంచానికి నా సేవలు ఉపయోగపడాలని ఓ గురువు సలహాతో ఆర్మీని విడిచిపెట్టా.

image


బాడీ బిల్డింగ్ సెలక్టర్ నన్ను రిజెక్ట్ చేశాడు

100 సర్జరీల తర్వాత తిరిగి ఎంతో కష్టపడి బాడీ బిల్డింగ్ చేసిన తనని సెలెక్టర్ రిజెక్ట్ చేశారట. ఒంటిపై గాట్లు ఉండటంతో ఆర్మీ స్పోర్ట్స్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సరిపోవని చెప్పడంతో చాలా బాధపడ్డానని ఈశ్వర్ అంటున్నారు.

“ఆత్మహత్య చేసుకుందామని చాలా సార్లు అనుకున్నా.కానీ అదే పరిష్కారం కాదనుకున్నా.” ఈశ్వర్

అన్ని ఆపరేషన్లు చవిచూసిన తర్వాత కూడా ఎంతో ప్రయాస పడి బాడీ బిల్డప్ చేశాను. కానీ సెలెక్టర్ నన్ను రిజెక్ట్ చేశాడు. ఇక జీవితంలో ఏమీ సాధించలేనని ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా. కానీ నా కుటుంబం, నాన్న గుర్తొచ్చేవారు. ఏ కారణం లేకుండా దేవుడు నన్నీ దుస్థితి తీసుకురాడని భావించా. ఆత్మహత్య పరిష్కారం కాదని భావించా. ఆర్మీలో లీవ్ తీసుకుని మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి మిస్టర్ ఇండియాలో పాల్గొన్నా.

“ఇంటర్ స్టేట్ గోల్డ్ మెడల్ సాధించింది అప్పుడే.” ఈశ్వర్

ఆర్మీలో సెలవు పెట్టి మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేశాను. గోల్డ్ మెడల్ వచ్చింది. ఇండియా మొత్తంలో ఫోర్త్ ప్లేస్ వచ్చింది. ఆసుపత్రి నుంచి బయటకి కొచ్చిన చాలాసార్లు నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేది. అలా చేసుకుని ఉంటే ఇప్పుడిలా మీతో మాట్లాడలేకపోయే వాడిని అని చిరునవ్వులు చిందించారు.

image


నాన్నకల నెరవేరిన వేళ

గొప్ప స్థాయికి చేరిన వారంతా గొప్ప లక్ష్యాలు పెట్టుకొని సాధించిన వారే. కానీ నా విషయంలో అలా కాదు. నేనొక పెద్ద స్పోర్ట్స్ మెన్ కావాలని నాన్న కలగన్నారు.

“నాన్న గారి కల సాధించడానికి నేను గోల్డ్ మెడల్ సాధించా.” ఈశ్వర్

చిన్నప్పటి నుంచి నేను గొప్పవాడిని అవుతానని నమ్మిన వ్యక్తి నాన్నే. ఒకసారి మా స్కూల్లో టీసి ఇచ్చి ఇంటికి పంపించినప్పుడు కూడా నాపై కోప్పడలేదు. నా జీవితానికి లక్ష్యాన్ని పెట్టుకోమని ప్రోత్సహించారు. స్కూల్ రోజుల నుంచే నాలో స్పోర్టివ్ స్పిరిట్ తో వుండాలని నేర్పించారు. నిజానికి నాకు మంచి స్కూల్లో చేర్పించడం నాన్న తాహతుకి చాలా ఎక్కువ. ఎందుకంటే వైజాగ్ లోని అల్లిపురం దగ్గర ఓ చిన్న టీ షాప్ మాది. టీ షాప్ లో కప్పులు కడుకునే ఓ సాధారణ కుటుంబ నేపథ్యం నాది.

“నేను చదువుల్లో రాణించాలి. ఐఏఎస్ కావాలని నాన్న కోరుకోలేదు. మంచి ఆటగాడిగా పేరుసాధించాలనుకున్నారు.” ఈశ్వర్

నేను స్కూల్లో ఉన్నప్పుడే గోల్డ్ మెడల్ సాధించాను. పేపర్ లో నా ఫోటో తో సహా మా నాన్న పేరు వచ్చింది. దాన్ని పట్టుకొని మా టీ షాపు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చూపించి ఎంతో సంతోష పడ్డారు. నేను స్పోర్ట్స్ క్యాంపులకు వెళ్లిన ప్రతిసారీ మాకు తెలిసిన వాళ్లు, రిలేటివ్స్ నాన్నను సవాలక్ష ప్రశ్నలతో వేధించేవారట. ఎందుకూ కాకుండా పోతున్నాను అని అనేవారట. కానీ మా నాన్నకి నేను ఏదో ఒక రోజు గొప్ప వాడినైతానని నమ్మకం ఉండేది. దాన్ని నిజం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈశ్వర్ అంటున్నారు.

image


సెలబ్రిటీ ట్రెయినర్ గా కెరియర్

యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్మీలో కొనసాగుతున్న రోజుల్లో ఈశ్వర్ కు ఓ రష్యన్ కోచ్ తో పరిచయం ఏర్పడింది. అతని సలహాతోనే సెలబ్రిటీ ట్రెయినింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. ఆర్మీ ఉద్యోగం విడిచిపెట్టాల్సి వచ్చింది. బాంబేలో కొన్నాళ్లు ట్రెయినర్ గా చేసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ ఓ జిమ్ లో కోచ్ గా చేస్తున్నప్పుడు హీరో వెంకటేష్ కు పర్సనల్ ట్రెయినర్ గా మారారు . చింతకాయల రవి సినిమాతో ఈశ్వర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అల్లూ అర్జున్ సినిమాలకు పనిచేశారు. అప్పుడే రానా లీడర్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత బిల్లా సినిమాతో ప్రభాస్ తో ప్రయాణం కొనసాగించారు. ఇటీవల సెలబ్రిటీ ట్రెయినర్ పీజీ చదవడానికి మలేషియా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారు.

చివరగా

ఓ చాయ్ అమ్మే వ్యక్తి మన దేశంలో ప్రధాని కాగలిగారు. అదే చాయ్ వాలా కొడుకు ఓ సెలబ్రిటీ ట్రెయినర్ కావడం పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ జీవితంలో చవిచూసిన పరిస్థితులు మాత్రం పూర్తి ప్రతికూలంగానే ఉన్నాయి. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కు పనిచేసిన అనుభం ఉన్నప్పటికీ ఎంతో సాధారణంగా కనిపిస్తారు ఈశ్వర్. ఫిలాసఫీ, ఓషో, శ్రీశ్రీ రచనల్ని ఎక్కువగా చదివే ఈశ్వర్ జీవితంలో ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలనే సందేశం ఇస్తున్నారు.

“వందల మెడల్స్, సెలబ్రిటీ హోదా ఇవ్వని సంతోషం నాన్నగారు శెభాష్ అనడంలో ఉందని ముగించారు ఈశ్వర్”
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags