మా వెబ్ సైట్ ఓపెన్ చేస్తే మీకు నోరూరుతుంది!
ఎప్పుడైనా.. ఎక్కడికైనా కోరుకున్న వంటకం..
ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే కోల్ కతాలో కూర్చొని హైదరాబాద్ కరాచీ బేకరీ బిస్కెట్స్ రుచి చూడవచ్చు. ఆగ్రాలో ఉన్నా ఊటీ చాక్లెట్స్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మచేతి వంట కమ్మదనాన్ని అందివ్వకపోయినా.. మీరు ఎక్కడున్నా మీ స్థానిక వంటల రుచులు మాత్రం మీ దగ్గరికి తెచ్చిపెడుతుంది. ఉద్యోగం కోసమో, ఉన్నత చదువు కోసమో ఊరు కాని ఊరు వెళ్లి తమ స్థానిక వంటకాల రుచుల కోసం ఆరాటపడుతున్న వారికి ‘అపెటీ.ఇన్’ వెబ్ సైట్ ను చూస్తే చాలు కడుపు నిండుతుంది. ఐఐటీ కాన్పూర్ విద్యార్థి నితేష్ ప్రజాపత్ చేసిన సరికొత్త ఆలోచనకి రూపమే అపెటీ.
ఐఐటీ కాన్పూర్ లో చదివేటప్పుడే ఇంటి వంటను ఎంతగా మిస్ అవుతున్నాడో నితేష్ కు ప్రాక్టికల్ గా తెలిసింది. ఇంటి నుంచి తెచ్చుకున్న కాసిన్ని చిరుతిళ్లు అయిపోయి.. లోకల్ లో దొరికే వంటకాల రుచి నచ్చక తెగ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కూడా హీరో మోటో కార్ప్ లో ఉద్యోగం చేసే సమయంలోనూ నెలకు రెండుసార్లు దేశంలోని వివిధ నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. స్వతహాగా భోజనప్రియుడైన నితేష్.. అక్కడి స్థానిక వంటకాలు రుచులు చూడటం అలవాటు చేసుకున్నాడు. తనలా అటూఇటూ తిరగలేని వాళ్లకు ఆ రుచులన్నీ వారున్న చోటుకే తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. దాన్ని అంకుల్ నరేంద్ర ప్రజాపతితో పంచుకున్నాడు. అలా 2015, ఫిబ్రవరిలో ‘అపెటి’ మొదలైంది.
అభిరుచితో మొదలైన అపెటి
ఓ ఎమ్మెన్సీ. నెలకు ఆరెంకల జీతం. సాధారణంగా ఐఐటీ, ఐఐఎమ్ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల లక్ష్యం ఇదే. కానీ నితేష్ మాత్రం ఇందుకు భిన్నం. ఐఐఎమ్ కోల్ కతాలో చదివే సమయంలోనే తన అభిరుచి ఏంటో అందులోనే తన కెరీర్ ను వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. తన బ్యాచ్ లోని 500 మంది విద్యార్థుల్లో - ఏ క్యాంపస్ ప్లేస్ మెంట్ లోనూ చేరని విద్యార్థి అతనొక్కడే. అంటే అతని లక్ష్యం ఎమ్మెన్సీ కాదని అర్ధం చేసుకోవచ్చు. అందుకే తన కలల స్టార్టప్ కోసం అప్పటి నుంచే ప్లాన్స్ వేయడం ప్రారంభించాడు. ప్రాజెక్ట్ కు సాయపడే కోర్సులను మాత్రమే చదివేవాడు. అపెటీని నడపడానికి ఇబ్బంది అనిపిస్తే తన చదువును పక్కనపెట్టాలని కూడా ముందే నిర్ణయించుకున్నాడు నితేష్.
ఎక్కడి రుచులు అక్కడి నుంచే..
ఎక్కడి స్థానిక వంటకాలను అక్కడి నుంచే తెచ్చి అందించడం అపెటీ ప్రత్యేకత. అది హైదరాబాద్ కరాచీ బేకరీ బిస్కెట్స్ అయినా, గుజరాతీ ఖాక్రాస్ అయినా, ఆగ్రా పేటాస్ అయినా, కేరళ అరటికాయ చిప్స్ అయినా. మీరున్న చోటికే తెచ్చిపెడుతుంది. దేశంలోని 14 నగరాల్లో 27 మంది విక్రేతలతో అపెటీ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్, ఆగ్రా, మైసూర్, ఇండోర్, పుణె, ఆగ్రా, అహ్మదాబాద్, కోల్ కతా, గోవాలకు చెందిన 240 రకాల రుచులు, ఉత్పత్తులను కస్టమర్లకు అందజేస్తుంది. ‘భారత్ లో ఎక్కడున్నా వాళ్ల సాంప్రదాయ, స్థానిక వంటకాల రుచిని వందశాతం వారికి అందించే బాధ్యతను మేము తీసుకున్నాం’ అని నితేష్ చెబుతున్నారు. ప్రస్తుతం వీళ్ల టీమ్ లో పది మంది ఉన్నారు. ఇందులో ఏడుగురు ఫ్రీలాన్సర్లు. వెబ్ సైట్ కార్యకలాపాలు, వివిధ నగరాల్లోని ఆర్డర్స్ చూసుకుంటారు. ఏడు నుంచి పది రోజుల పాటు- పాడు కాకుండా ఉండే వంటకాలను మాత్రమే అమ్ముతామని నితేష్ తెలిపారు. ఆర్డర్లను కచ్చితంగా నాలుగు రోజుల్లోపు చేరవేసేలా కొరియర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది అపెటీ. ఈ సమయాన్ని రెండు రోజులకు తగ్గించే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఆహారం పాడుకాకుండా ఉండేలా నాణ్యమైన ప్యాకేజింగ్ కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థతోనూ కలిసి పనిచేస్తున్నారు. ఆహారంతోపాటు అది ఏ నగరం నుంచి వచ్చింది, దాని పూర్తి వివరాలు ప్యాకేజింగ్ తో అందజేస్తారు. ప్రస్తుతానికి అపెటీ వెబ్ సైట్ ను రెండువేల మంది సందర్శించగా, వెయ్యి వరకు డౌన్ లోడ్స్ చేసుకున్నారు. 700 మంది చందాదారులు కూడా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
మెరుగ్గానే ఆదాయం
ఈ దీపావళి సమయానికి వెబ్ సైట్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ఇప్పటికే 400 ఆర్డర్లు పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి దానిని 500కు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదంతా ఎలాంటి మార్కెటింగ్ లేకుండా సాధించిందేనని నితేష్ గర్వంగా చెబుతారు. ఒక్కో ఆర్డర్ సగటు రూ.600 కాగా.. అందులో 10-15 శాతం అపెటీ లాభం వస్తోంది . అయితే అది ఆర్డర్ సైజ్ ను బట్టి ఉంటుందని నితేష్ చెప్పారు. ఆర్డర్ విలువ 500 కన్నా తక్కువ ఉంటే లాజిస్టిక్స్ ఖర్చు రూ.50 కస్టమరే భరిస్తుండటంతో తమ లాభశాతం 30 నుంచి 35 వరకు ఉంటుందని తెలిపారు. మరోవైపు ఒప్పందం కుదుర్చుకున్న విక్రేత కూడా 40 నుంచి 45 శాతం డిస్కౌంట్ కే అపెటీకి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. దీంతో నవంబర్ నెలలో ఈ సంస్థ రూ.80 వేల లాభాన్ని ఆర్జించింది.
విదేశాల్లోనూ పాగా వేయాలని..
వచ్చే ఆర్నెళ్లలో 25 మంది పూర్తిస్థాయి ఉద్యోగులతో దేశంలోని 28 నగరాలకు తమ సేవలను విస్తరించాలని అపెటీ భావిస్తోంది. 600 రకాల వంటకాలను అందించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విదేశాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. లండన్, న్యూయార్క్, పెన్సిల్వేనియా లాంటి చోట్ల భారతీయ రుచులను అందించడానికి ప్రణాళికలు రచిస్తోంది. తొందరగా పాడయ్యే ఆహార పదార్థాలను నగరంలోనే ఒక చోటు నుంచి మరో చోటికి తరలించే ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జోధ్ పూర్, జైపూర్, కోల్ కతాలలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. అపెటీ వెబ్ సైట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫుడ్ వెండర్లకు క్లాసిఫైడ్ గా కూడా పనిచేస్తోంది. అంతేకాదు టైర్ టూ, త్రీ సిటీస్ లోని గృహిణులను ప్రోత్సహించి వారి వంటకాలను కూడా విక్రయించేందుకు అపెటీ ప్రయత్నిస్తోంది.
ముందుంది అసలైన సవాల్..
అపెటీ స్టార్టప్ ప్రస్తుతానికి విజయపథంలోనే వెళ్తున్నా దీర్ఘకాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని యువర్ స్టోరీ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రస్తుతం ఫుడ్ టెక్ స్టార్టప్స్ కు కష్టకాలం నడుస్తోంది. డాజో, స్పూన్ జాయ్ లాంటి కంపెనీలు ఈ ఏడాది మూతపడ్డాయి. టైనీవోల్ కేవలం ముంబై, బెంగళూరు నగరాలకే పరిమితమైంది. పెట్టుబడుల్లోనూ భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఏడు ఒప్పందాలతో 74 మిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడి, ఆగస్ట్ నాటికి ఐదు ఒప్పందాలతో 19 మిలియన్ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్లో అది రెండు ఒప్పందాలకు పరిమితమైంది. ఈ రంగంలో విస్త్రుతమైన అవకాశాలు ఉన్నా.. దానికి పెట్టుబడిదారుల మద్దతు కావాలి. భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ప్రారంభమైన కొన్ని నెలల్లోనే లాభాల బాటలో ఉన్న అపెటీ ఫుడ్ టెక్ రంగంలో ఆశలు రేపుతున్నా ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారులను సమకూర్చుకోవడమే వాళ్లకు సవాలు. కనీసం పదేళ్లు నిలదొక్కుకుంటేనే ఈ రంగంలో సక్సెస్ సాధించవచ్చని ఇండియా కోషెంట్ ఫౌండర్ ఆనంద్ లూనియా చెబుతున్నారు. దానికి డబ్బే కాదు అభిరుచి కూడా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అపెటీని ప్రారంభించిన నితేష్ ప్రజాపత్ కి అది కావాల్సినంత ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.