Telugu

ఔను! ఈ రోడ్డు మన బాప్ జాగీరే..!

 

Ratna Shree
18th Dec 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అక్కడ ఆడిందే ఆట. పాడిందే పాట. బస్సు రాదు. కారు కనిపించదు. టూ వీలర్ హారన్ వినిపించదు. అసలు బండికే నో ఎంట్రీ. ఓన్లీ మనుషులు. ఎగరండి. దూకండి. పాడండి. పేలు చూసుకోండి. తొక్కుడు బిళ్ల ఆడండి. జోకుడుపుల్ల ఆడండి. పాత టైరు దొర్లించండి. లేదంటే కిందపడి దొర్లండి. మీ ఇష్టం. రాహ్ గిరీలో మీరేం చేసినా రాకింగే.

image


బీ హ్యాపీ. బీ హెల్దీ. ఈ రెండింటి కోసం ఏదైనా చేయాలి. ఎన్నాళ్లని ఉరుకుల పరుగుల జీవితంతో కుస్తీ పడతాం. బాధలు భయాలు రేపటి గురించి దిగులు రొటీన్‌గా ఉండేవే. ఒక్కరోజైనా వాటిని మరిచిపోదాం. డైలీ కుదరకపోయినా కనీసం వీకెండ్‌లలో అయినా. అదోరకపు సుందర ప్రపంచంలోకి అడుగు పెడదాం. సండే మార్నింగ్ ఒక నాలుగు గంటలు. ఏ పొగ వాసనా లేని ప్రపంచంలోకి. ఏ రణగొణధ్వనలు వినిపించని ఏరియాలోకి. మనుషులు మాత్రమే మసిలే వాతావరణంలోకి. హైదరాబాద్‌లోనే ఉన్నామా అని ఆశ్చర్యపోయే పరిసరాల్లోకి. వీలవుతుందా? వల్లవుతుందా?

ఆ.. ఇలాంటివి చాలా చూశాం బ్రో! ఏదో ఒకటి రెండు వారాలు. మొదట్లో జోష్‌లో కానిచ్చేస్తాం. ఆ తర్వాత ఫినిష్‌. ఎవరి బిజీ వారిది. రాహ్‌గిరీ కాన్సెప్టు హైదరాబాద్‌లో అనుకున్నప్పుడు అలాగే డిస్కరేజ్ చేసే మాటలు వినిపించాయి. పట్టించుకోలేదు. కట్ చేస్తే- వన్నియర్. నిర్విఘ్నం! నిరంతరాయం! ఆశ్చర్యం! ఒక కాన్సెప్టు. అందునా వీక్‌లో ఒకరోజు! అదికూడా జస్ట్‌ మూడు నాలుగు గంటలు. ఇంత సక్సెస్ ఫుల్‌గా సాగుతుందని అనుకోలేదు. హైదరాబాదీలు అంతే భయ్యా! అనుకుంటే సాధిస్తారు! మహామొండోళ్లు!

ఈ రోడ్డు మనదిరో! ఈ ఆట మనదిరో! నారాయణమూర్తి పూనితే ఎవరూ ఆపలేరు రాజా! గంగ్నమ్ స్టెప్పులేసినా, జుంబారే జుంబా అని బంజారా డాన్స్ వేసినా- అడిగేవారుండరు. చలీ ఎండా వానా జాన్తా నై! పొద్దున ఆరున్నర నుంచి పదిన్నర దాకా. మాదాపూర్ మైండ్ స్పేస్ నుంచి బయోడైవర్సిటీ కాంప్లెక్స్ వరకు. రోడ్డు మీద సరదాగిరీ! అక్కడ ఎవరికి వారే బాస్! ఎవరికి ఏది నచ్చితే అదే! ఎగురుతావా! దూకుతావా! పడుకొని దొర్లుతావా! నీ ఇష్టం. జుంబా డాన్స్ నుంచి జోకుడు పుల్ల వరకు! ఆటపాటల కలబోత. కాక్ టెయిల్ ధూంధాం!

imageఈ సండేమాత్రం మైండ్‌ స్పేసే డాడ్‌- ఒక యూకేజీ పిల్లాడి డిమాండ్‌! మళ్లీ రాహ్‌గిరీకి వెళ్దాం మమ్మీ- ఒక ఫిఫ్త్ క్లాస్ పాప ఆర్డర్‌! ఫలానా ఏజ్ గ్రూప్ అంటూ లేదు! పసిపాప నుంచి పండు ముసలి వరకు! రాహ్‌ గిరీ జిందాబాద్! డైలీ ఇందిరాపార్కులో వాకింగ్ మామూలే. అందుకే సండే సండే లొకేషన్ రాహ్‌ గిరీకి మార్చేద్దాం! షాపింగ్ మాల్‌లో ఒక వైఫ్ అండ్ హజ్బెండ్ తీర్మానం. రోజూ నెక్లెస్ రోడ్డేంటి మేస్టారూ.. ఆదివారం ఆదివారం రాహ్‌ గిరీకి పోదాం- కొంతమంది రిటైర్ పీపుల్ అనుకుంటున్న మాటలు. ఆంక్షల్లేవు. హద్దుల్లేవు. ఇలాగే ఉండాలన్న రూలేం లేదు. అందుకే అందరికీ కనెక్టయింది.

హైదరాబాద్‌లో- అందునా హైటెక్ సిటీలాంటి ఏరియాలో -ఒక నాలుగు గంటలపాటు బండి శబ్దమే వినిపించదంటే ఆశ్చర్యపోవాల్సిందే. పొగ కంటికే కనిపించదంటే అవాక్కవ్వాల్సిందే. అసలు బండే అగుపించదంటే వండరే. నల్లగా నిగనిగలాడే తారురోడ్డే మైదానం. అచ్చం పచ్చిక మీద ఆడినట్టే! ఉన్నట్టుండి పదిమంది అమ్మాయిలు బ్లాక్ అండ్ బ్లాక్‌లో ఫ్లాష్ మాబ్‌ చేస్తారు. వాళ్లను చూడగానే మనసు దూదిపింజంలా తేలియాడుతుంది. ఇంకోచోట ఎరోబిక్స్. స్టేజీమీద ఇన్ స్ట్రక్టర్ వన్ టూ త్రీ ఫోర్‌. అప్రయత్నంగానే అనుసరిస్తాం. యోగాసనాలు, సూర్యనమస్కారాలు. ఇంట్రస్టున్నవాళ్లంతా అటువైపు వెళ్తారు. మరో చోట విచిత్రమైన దృశ్యం. చిన్నప్పటి టైరాట! మళ్లీ ఇన్నాళ్లకు కనిపించింది. నోస్టాల్జియా. సర్రున బాల్యంలోకి జారుకుంటాం! పిచ్చిబంతి -దబిడి దిబిడి! స్కూల్ డేస్‌లో ఫ్రెండు వీపు పగలగొట్టిన గుర్తు ఠక్కున మనోఫలకం మీద మెరుస్తుంది! గోడకు వికెట్లు గీసి ఆడిన గల్లీ క్రికెట్ జ్ఞాపకం ఇక్కడ మళ్లీ కళ్లముందు కనిపిస్తుంది. డ్రమ్ముకో, అట్టకో మూడు వికెట్లు గీసి ఆడుతుంటే బాల్యపు గురుతు గుండెలో వంద ప్రింటవుట్లు ఒకేసారి ఇస్తుంది.

ఈ రోడ్డు నీ బాబుదా! ఔ బై! ఏ రాస్తా మేరా బాప్‌కా హై! దాదాగిరీ! రోడ్లను ఆట మైదానాలుగా మారుస్తున్న రాహ్ గిరీ! ఆధునిక జీవనశైలిలో యాంత్రీకరణను అడ్డుకుంటున్న విప్లవ దాదాగిరీ! పొగలుగక్కే వాతావరణాన్ని ఆడుతూ పాడుతూ ప్లెజంట్‌గా మార్చే ప్లే గిరీ! ఆధునికత వెంట సాగే వేలంవెర్రి ప్రయాణంలో ఏం కోల్పోతున్నామో, చివరికి పర్యావసానం ఏంటో తెలియదు. ఒకవేళ తెలిసినా ఆత్మవంచనతో బతికేస్తున్నాం. ప్రకృతిని చెరబట్టొద్దు. మహాపాపం. సమాజంలో బతుకుతున్నాం. ఆమాత్రం సామాజిక స్పృహ ఉండకుంటే ఎలా?

రాహ్ గిరీ కాన్సెప్టు అదే. వినోదమూ విజ్ఞానమూ సమాజమూ సంస్కారము. అన్నిటి కలబోత. యూనిక్ కాన్సెప్టు. 1976లో కొలంబియా రాజధాని బగోటాలో సైక్లోవియా పేరుతో మొదలయింది. ఇది ఒకరకంగా చెప్పాలంటే సామాజిక చైతన్యం. ప్రకృతి కోసం మొదలైన ఉద్యమం. రూల్ ప్రకారం ప్రతి ఆదివారం ఏదో ఒక రోడ్డుపై ఏ వాహనానికీ అనుమతి ఇవ్వరు. సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్ గట్రా చేస్తూ స్వేచ్ఛగా గడుపుతారు. 70వ దశకంలో మొదలైన ఈ ఈవెంట్ ఇప్పుడు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది.

image


ఖండాంతరాలు దాటిన ఈ యూనిక్ కాన్సెప్ట్ ఎన్నో అంతర్జాతీయ నగరాలను పలకరిస్తూ వచ్చింది. భారత్‌ లో రాహ్‌గిరిగా రోడ్డెక్కింది. 2013 నవంబర్‌లో గుర్గావ్‌లో మొదట ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ నగరాలకు వ్యాపించింది. ముంబైలో ఈ ఈవెంటును ఈక్వల్ స్ట్రీట్స్ అని పిలుస్తారు. సౌతిండియా విషయానికొస్తే తొలిసారిగా 2015 లో హైదరాబాద్‌లో రాహ్‌గిరి ఎంటరైంది. ప్రస్తుతం ఏడాది దాటింది రాహ్‌గిరీ మొదలై. అనుకున్న దానికంటే ఎక్కువే సక్సెస్ అయ్యింది. మొదట 500 మందితో ప్రారంభమైన ఈవెంట్ ఇప్పుడు సుమారు నాలుగు- ఐదువేల మందితో కొనసాగుతోంది. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎంతగానో సహకరిస్తున్నారు. వీలయినంత త్వరలో మిగిలిన ప్రాంతాలకూ విస్తరించాలన్నదే మా ఉద్దేశం అంటున్నారు రాహ్ గిరీ నిర్వాహకులు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags