లాస్ట్ మినిట్ హోటల్ రూం బుకింగ్ స్పెషలిస్ట్ 'హోటల్స్ ఎరౌండ్యూ'
చాలామంది ఉద్యోగస్తులు తమ టూర్లను ఆఖరి నిమిషంలోనే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ హడావిడి ప్రయాణం కారణంగా హోటల్ రూమ్ ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా అనుకోకుండా చేసే ప్రయాణాల్లో ఒకోసారి హోటల్స్‌ను వెతుక్కోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు స్నేహితులు కలిసి 'హోటల్స్ఎరౌండ్యూ'ను ప్రారంభించారు. గమ్యస్థానాన్ని చేరుకునే రోజునైనా సరే.. మొబైల్ యాప్‌తో హోటల్ రూమ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం దీని ప్రత్యేకత. అది కూడా తక్కువ రేట్లకు రూమ్స్‌ను అందించడం 'హోటల్స్ ఎరౌండ్యూ'లో అదనపు ఆకర్షణ.
ఇలా మొదలైందీ ప్రయాణం
హర్ష నల్లూర్, మెహ్సిన్ దింగాకర్, అనిమేష్ చౌదరిలు.. 2013లో 'హోటల్స్ఎరౌండ్యూ'ని ప్రారంభించారు. మొదట లాస్ట్ మినిట్ హోటల్ బుకింగ్స్ ఆలోచనతో వెబ్‌సైట్‌ని ప్రారంభించినా.. 2014చివర్లో మొబైల్ యాప్‌ను లాంఛ్ చేశారు. నవంబర్ 2104లో ఐఓఎస్ వెర్షన్, ఫిబ్రవరి 2015లో అండ్రాయిడ్ వెర్షన్ రిలీజ్ అయ్యాయి. “ప్రస్తుతం ముంబై, పూణె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో సేవలు అందిస్తున్నాం. త్వరలో మరో నాలుగు సిటీలతోపాటు.. మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సర్వీసులు స్టార్ట్ చేస్తాం” అన్నారు హర్ష.
ఇదీ హోటల్ రూమ్స్ లెక్క
తమ హోటల్స్‌లో బుక్ కాకుండా మిగిలినపోయిన రూమ్స్ వివరాలను ఏరోజుకు ఆరోజు 'హోటల్స్ఎరౌండ్యూ'కు అందిస్తారు వాటి నిర్వాహకులు. ఆ రోజు రూమ్స్ ఫిల్ అయిన విధానం, డిమాండ్‌ను అనుసరించి.. డైనమిక్ ప్రైసింగ్ ద్వారా రేట్లు నిర్ణయిస్తుంది 'హోటల్స్ఎరౌండ్యూ'. “ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు ఇలాంటి రూమ్స్ వివరాలను ప్రైసింగ్తో సహా లిస్టింగ్ చేస్తాం. అదే రోజుకు సంబంధించిన బుకింగ్స్‌ని మధ్యాహ్నం 2 గంటలవరకూ చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, ధరలు రియల్ టైం ప్రకారమే ఉంటాయ”ని చెప్పారు హర్ష.
పగటి పూట బుకింగ్స్‌కి సౌకర్యంతో కూడిన ప్రత్యేకమైన సర్వీసును అందిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు చెకిన్ చెకౌట్ చేసేవారి కోసం.. 4 గంటలు, 12 గంటల బుకింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ ఫెసిలిటీ కేవలం సింగిల్‌గా రూమ్ తీసుకునేవారికి మాత్రమే.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులతో పాటు.. అదే నగరాల్లో ఉంటూ మీటింగ్స్ వంటివి నిర్వహించుకునేవారి కోసం ఇలాంటి సర్వీస్ స్టార్ట్ చేశామని చెబ్తున్నారు హోటల్స్ఎరౌండ్యూ నిర్వాహకులు. “ తక్కువ సమయం కోసం అందుబాటు ధరల్లో ఆయా రూమ్స్‌ను కేటాయించేందుకు హోటల్ నిర్వాహకులను ప్రోత్సహించాం. కాసేపు ఫ్రెష్ అవడానికో, అపాయింట్మెంట్స్ మధ్య సమయంలో రెస్ట్ తీసుకునేందుకో.. రోజు మొత్తానికి రెంట్ కట్టేందుకు బదులుగా 4 గంటలపాటు రూమ్ తీసుకుంటే సరిపోతుంది. ఇందుకు ₹700 నుంచి ప్రైసింగ్ ప్రారంభమవుతుంది” అని చెప్పారు హర్ష.
ఇలా ఆలోచన వచ్చింది
ఉద్యోగ విధులతోపాటు ఇతర అవసరాల కోసం.. ఈ ముగ్గురికీ ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అనేక మార్లు చివరి నిమిషంలోనే హోటల్ రూమ్ బుకింగ్స్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే.. ఇప్పడు ఇదే తరహా సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఏవీ కూడా.. ఇలాంటి లాస్ట్ మినిట్ బుకింగ్స్‌కు అనువైనవి కాదు. సరైన సరసమైన ధరల్లో హోటల్స్ వెతుక్కోవడం కూడా ఇబ్బందికరమే. అదో బడా చెయిన్ హోటల్ కంపెనీ అయితే తప్ప.. అక్కడ ఉంటే శుభ్రత, సర్వీసుల్లో నాణ్యత వంటివి తెలుసుకునే అవకాశం లేదు. అంతే కాదు ఇలా చివరినిమిషంలో వెతుక్కోవడం కూడా క్లిష్టమైన వ్యవహారమే.
“ఓ ప్రఖ్యాత హోటల్ రూం బుకింగ్ పోర్టల్ ద్వారా ఓసారి రూమ్ బుక్ చేసుకున్నాం. తర్వాత అరగంట సమయంలోనే చెకిన్ చేశాం. అయితే.. వారి దగ్గర మేం బుక్ చేసుకున్న వివరాలు లేవు. మేం హోటల్‌కి చేరుకున్నాక రెండు గంటలపాటు వెయింటింగ్ చేయించి కానీ.. మాకు రూం కీస్ ఇవ్వలేదంటే పరిస్థితి అర్ధమవుతుంది" అంటూ తాము ఎదుర్కున్న ఇబ్బందిని హర్ష వివరిచారు.
ఈ సంఘటనతో వారికో విషయం అర్ధమైంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలు.. ప్రజలకు బుకింగ్ విషయంలో మాత్రమే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ విధానంలో చాలా లోపాలున్నాయి. వీటిని అధిగమించాల్సిన అవసరముంది. ఇలా హోటల్స్‌పై పరిశోధన చేస్తూ.. నిర్వాహకులతో మాట్లాడుతున్న సమయంలో.. సగటున 30శాతం హోటల్ రూమ్స్ ఖాళీగానే ఉంటున్నాయనే విషయం అర్ధమైంది. దీంతోపాటు ఆయా హోటల్స్ ఎదుర్కునే మరో సమస్య.. ఏ పేజీలో వారి హోటల్‌కి సంబంధించిన వివరాలు ఉన్నాయో తెలుసుకోవడం.. ఆయా డీటైల్స్ ఇచ్చిన వారికి కూడా కష్టమే.
ఇవే ప్రధాన సవాళ్లు
ఈ వెంచర్‌ని ప్రారంభించినపుడు.. వీరి దగ్గర కొన్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఇప్పటికీ ఎవరి దగ్గరా సమాధానం లేకపోవడం విశేషం. "చాలా మంది హోటల్ నిర్వాహకులు మా సర్వీసులను ఓసారి ప్రయత్నించేందుకు ముందుకు రావడం లేదు. అనేక మందిని మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా.. వారెవరూ మా మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదు” అంటారు హర్ష.
అయినా సరే ఆయా హోటల్స్‌తో వేరేవేరు ఒప్పందాలు చేసుకునే విషయంలో 'హోటల్స్ఎరౌండ్యూ' వ్యవస్థాపకులు ముగ్గురికీ స్పష్టమైన విజన్ ఉంది. ఇదే రంగంలోని ఇతర సంస్థల మాదిరిగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలతో కాకుండా.. తామే టైఅప్స్ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ భాగస్వాముల సంఖ్యను పెంచుకునేందుకు సొంతగానే కష్టపడుతున్నారు.
“నాస్కామ్ ఎంపిక చేసిన 10వేల స్టార్టప్‌లలో మేం కూడా ఎంపికయ్యాం. ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్స్ ద్వారా వెంచర్ కేపిటలిస్ట్లకు చేరువయ్యాం” అన్నారు హర్ష.
వ్యాపార వృద్ధికి నిధులు
సప్లయ్ విభాగంలో 'హోటల్స్ఎరౌండ్యూ' టీం ఇప్పటికే 350కి పైగా హోటళ్లతో ఒప్పందాలు చేసుకుంది. డిమాండ్ పరంగా 20వేల మంది కస్టమర్ల మార్క్‌ను దాటడం విశేషం. ప్రతీ నెలా ఈ సంఖ్య 120శాతం పెరుగుతుండడం విశేషం.
నాణ్యమైన హోటల్స్ ఎంపిక విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు ఈ మిత్రత్రయం. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న త్రీ, ఫోర్, ఫైవ్ స్టార్ హోటల్స్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ఏ రోజుకైనా సరే కొన్ని హోటల్ రూమ్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
వెంచర్ నర్సరీ నిర్వహించే స్టార్టప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌లో 'హోటల్స్ఎరౌండ్యూ' కూడా భాగమే. ఇప్పటికే ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి సీడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించారు.
“మరిన్ని నగరాల్లోకి విస్తరించడం ద్వారా పోర్ట్‌ఫోలియోలోకి మరిన్ని హోటల్స్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడబోం. మరింత సులభంగా బుకింగ్ పూర్తయ్యేలా మరిన్ని సౌకర్యాలు అందించబోతున్నాం” అన్నారు హర్ష.
'హోటల్స్ఎరౌండ్యూ' యాప్ చాలా సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేజ్‌ను కలిగి ఉంటుంది. చూడగానే ఉపయోగించేందుకు ఎంతో సులభం అనే ఫీలింగ్ కల్పిస్తుంది. ఓయో రూమ్‌ను కూడా బుక్ చేసుకునేందుకు ఈ యాప్ అవకాశమిస్తుంది.