మధ్యలో కొన్ని ఛాదస్తాలు, మూఢనమ్మకాలు మహిళల్ని వంటింటికే పరిమితం చేశాయి కానీ.. వేదకాలం నాటి నుంచే ఆడవాళ్లకు అగ్రస్థానం ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు మహిళాలోకానికి పూర్వవైభవం వచ్చింది. గీసిన గీతల్ని చెరిపేస్తున్నారు. కట్టేసిన కట్టుబాట్లను తెంచేస్తున్నారు. అడ్డుగోడల్ని కూలదోస్తున్నారు. వంటిల్లుని, కత్తిపీటను అమాంతం విసిరికొట్టి- అనుకున్న రంగంలో సత్తా చూపిస్తున్నారు. అంతరిక్షంలో కాలు మోపినా, ఆంట్రప్రెన్యూర్ గా రాణించినా- తమదైన మార్కుతో దూసుకెళ్తున్నారు.
ఆడవాళ్లు అసహాయులు.. బిజినెస్ లో రాణించలేరు అనే అభిప్రాయం ఒక్కప్పుడు ఉండేది. అందుకే వ్యాపార బాధ్యతలను తండ్రి తర్వాత కొడుకులకి అప్పగించేవారు. ఇప్పుడు కాలం మారింది. కొడుకులతో సమానంగా కూతుళ్లు కూడా వ్యాపారాలను పరుగులు పెట్టిస్తున్నారు. కొడుకులకు ఏమాత్రం తీసిపోం అని నిరూపిస్తున్నారు ఈతరం కూతుళ్ళు. క్రియేటివ్ గా ఆలోచిస్తూ బుల్లెట్ లా దూసుకుపోతూ కార్పొరేట్ దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకుంటున్న బిజినెస్ డాటర్స్ గురించి తెలుసుకుందాం..
అనన్యశ్రీ బిర్లా...
వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ కార్పొరేట్ దిగ్గజం కుమార మంగళం బిర్లా. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్. ఆయన పెద్ద కూతురే అనన్యశ్రీ బిర్లా. వయస్సు 22 సంవత్సరాలు. చిన్నాటి నాటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడేది. సోషల్ ఆంట్రప్రెన్యూర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసింది. మైక్రో ఫైనాన్స్ రంగంలో తిరుగులేదని నిరూపించింది. కేవలం వ్యాపారమే కాదు సమాజ సేవలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. స్టాక్, వెంచర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అతి తక్కువ వడ్డీకే రుణాలను అందజేసి పేద మహిళల ఆర్దిక స్వావలంబనకు కృషి చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో ఎన్నో కంపెనీలు స్థాపించింది.
ఇషా అంబానీ
ముఖేష్ అంబానీ పేరు వినని వారెవరూ ఉండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత. ఆయన కూతురే ఇషా అంబానీ. వయసు 24 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన అమ్మాయి. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. అతి చిన్న వయసులోనే తండ్రి నడిపే సంస్థలకు బోర్డ్ డైరెక్టర్‌గా ఎన్నికైంది. పదహారేళ్ళ ప్రాయంలోనే ‘ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలియనీర్’గా ద్వితీయ స్థానం సంపాదించింది. ఇటీవలే ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన సర్వేలో పవర్ బిజినెస్ ఉమెన్‌గా ఎన్నికైంది. తనకు తానుగానే వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తూ 80 మిలియన్ డాలర్ల ఆస్తి సంపాదించుకుంది. రిలయన్స్ బోర్డ్‌లో చేరక ముందు వ్యాపార మెళకువల కోసం న్యూయార్క్ బిజినెస్ ఎనాలసిస్ట్ ఎంసీ కీన్‌సేన్‌తో కలిసి పనిచేసింది. కేవలం వ్యాపార విషయాలు మాత్రమే కాదు, చదువు, ఆటలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది. పియానో ప్లే చేయడమంటే ఇషాకు చాలా ఇష్టం. తండ్రి పేరు ప్రస్తావించకుండానే ఇషా సొంతంగా గుర్తింపు తెచ్చుకుందని ఆమె తల్లి నీతూ అంబానీ తెగ ముచ్చట పడిపోతూ ఉంటుంది. అంబానీ కూతురైనా సరే, సింపుల్‌గా అందరితో కలిసిపోతుంది. ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరిస్తుంది.
శ్రుతి శిబులాల్
మొన్నటిదాకా ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవో బాధ్యతలు నిర్వహించిన ఎస్‌బీ శిబులాల్ తనయ- శ్రుతి శిబులాల్. శిబులాల్‌కు ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. దాదాపు 900 కోట్ల రూపాయల తండ్రి ఆస్తి ఉన్నప్పటికీ, తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని శ్రుతి భావించింది. నాన్ననే ఆదర్శంగా తీసుకుని అనుభవం లేకపోయినా, మూడేళ్ళ క్రితం కూర్గ్‌లో ‘56 రూమ్స్ రిసార్ట్’ను ప్రారంభించింది. ఆ తర్వాత వెంచర్ బిజినెస్‌కు శ్రీకారం చుట్టింది. ఇటీవలే తిరువనంతపురంలో ‘తామరా కూర్గ్ రిసార్ట్’ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్ట్‌లను పెట్టాలని చూస్తోంది. ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనలో కూడా ఉంది. డాన్స్, సినిమాలు అంటే శ్రుతికి చాలా ఇష్టం. ఈ రంగంలోకి రావడానికి కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఇంద్రానూయీ, శర్లీ శాండ్‌బర్గ్ వంటి వారు తనకు స్ఫూర్తి అని చెప్తోంది శ్రుతి.
నిసాబా గోద్రెజ్..
నిసాబా గోద్రెజ్. ఆమెను అందరూ నిసా అని ముద్దుగా పిలుస్తారు. ప్రతిష్టాత్మకమైన గోద్రెజ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. 1897లో స్థాపించిన గోద్రెజ్ కంపెనీకి ఈడీ అంటే మాటలు కాదు. అంత పెద్ద బాధ్యతను నిసాబా ఒక కమిట్మెంటుతో చేస్తోంది. ఎంతగా అంటే రెండేళ్ల క్రితం నిసా డెలివరీ అయింది. నెలరోజుల శిశువును వెంటబెట్టుకుని మరీ బోర్డు మీటింగుకి హాజరై అందరిని ఆశ్చర్యపరిచింది. వన్ మంథ్ మాత్రమే మెటర్నిటీ లీవ్ తీసుకుని మళ్లీ బాధ్యతల్లో తలమునకలైంది. నిసాబా అంటే కంపెనీలో అందరికీ గౌరవం.. ఇష్టమైన బాస్ కూడా!!
మానసి కిర్లోస్కర్
బెంగళూరు పారిశ్రామికవేత్తలు గీతాంజలి, విక్రం కిర్లోస్కర్‌ల గారాల పట్టి మానసి కిర్లోస్కర్. వయసు 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద ఆసక్తి చూపించేది. తల్లి నడిపే యాడ్ ఏజెన్సీని, తండ్రి బాధ్యతలను నిశితంగా గమనిస్తూ పెరిగింది. పెద్దయ్యాక వారికి చేతనైనంత సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐలాండ్‌లోని రోదే స్కూల్ ఆఫ్ డిజైన్‌లో శిక్షణ పొందింది. ఈ- కామర్స్ తరహా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది మానసి. ప్రస్తుతం ఫ్యామిలీ రన్ చేస్తున్న హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటోంది. చాలామందికి మెరుగైన వైద్యం లభించడం లేదని గుర్తించిన మానసి, ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ మధ్య బెంగళూరులో పదివేల పడకల ఆసుపత్రిని స్థాపించింది.
లక్ష్మి వేణు
టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి సతీమణి. ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి.. బ్రిటన్ వార్విక్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందింది. ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో డాక్టరేట్ సాధించింది. టివీఎస్ సంస్థను అభివృద్ధి చేయడంలో కీలక బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ప్రోడక్ట్ డిజైన్, సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ స్ర్టాటజీస్, కార్పొరేట్ అఫైర్స్ లాంటి అంశాలను పర్యవేక్షిస్తోంది.