గ్రేడ్లు, ర్యాంకుల గోల లేని ఇన్నోవేటివ్ స్కూల్
రూపాయి ఫీజు లేదు.. బండెడు సిలబస్ అసలే లేదు
ఇవాళ రేపు ప్రైవేటు స్కూల్ అంటే అర్ధమే మారిపోయింది. విద్యావ్యవస్థను ఫక్తు కమర్శియల్ బిజినెస్‌గా మార్చిన ఘనత మన కార్పొరేట్ స్కూళ్లది. ఒకరకంగా చెప్పాలంటే అవి స్కూళ్లు కాదు. పిల్లల చేత బట్టీ పట్టించే కార్ఖానాలు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఇరుకైన తరగతి గదులు. ఆటస్థలం అత్యాశ. ఆటవిడుపు అందని ద్రాక్ష. ర్యాంకుల కొరడాలు పిల్లల్ని కలలో కూడా తరుముతుంటాయి. కానీ ఆ స్కూళ్లో అలాంటివేవీ కనిపించవు. ర్యాంకుల చర్నాకోల్ తరమదు. గ్రేడ్ల గోల వినిపించదు. పాఠాలు బట్టీ పట్టే విద్యార్థులు ఉండరు. 24 గంటలూ చదువంటూ విసిగించే ఉపాధ్యాయులు కనిపించరు. అన్నింటికీ మించి అందరికీ ఒకే రకమైన పాఠాలూ ఉండవు. ఎవరికి నచ్చింది వారు చదువుకోవచ్చు. పైగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్కేజీకే వేలకొద్దీ ఫీజులు ముక్కుపిండి వసూలు చేసి.. కిలోలకొద్దీ పుస్తకాల భారాన్ని పిల్లలపై మోపుతున్న ఈ రోజుల్లోనూ ఇలాంటి స్కూళ్లు ఉన్నాయా అంటూ మీరు ఆశ్చర్యపోవచ్చు. మైసూరు దగ్గర్లోని కెంచలగూడు గ్రామంలో ఉన్న ఆ స్కూలు పేరు ‘కలియువ మానే’.. దాన్ని నడిపిస్తున్న ఆ వ్యక్తి పేరు ఎంఆర్ అనంత్ కుమార్.
బాలీవుడ్ లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూసే ఉంటారు. మనదేశంలోని విద్యావ్యవస్థ లోటుపాట్లను కళ్లకు కట్టినట్లు చూపించింది ఆ సినిమా. ర్యాంకులు, గ్రేడ్లే తప్ప విద్యార్థుల ఇష్టాయిష్టాలను పట్టించుకోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తీరును ఎండగట్టిన సినిమా అది. సరిగ్గా ఆ సినిమాలోని హీరోలాగే కర్ణాటకలోనూ ఓ వ్యక్తి ప్రస్తుత విద్యావ్యవస్థపై పోరాడుతున్నారు. బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలని.. ర్యాంకులు, గ్రేడ్లు లేని స్కూళ్లు రావాలన్నది అతని లక్ష్యం. చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. తానే ప్రత్యేకంగా అలాంటి ఓ స్కూల్ స్థాపించారు. దాని పేరు కలియువ మానే. దీనర్థం ‘లెర్నింగ్ హోమ్’ అని. మైసూరుకు 15 కిలోమీటర్ల దూరంలోని కెంచలగూడు గ్రామంలో ఉందీ స్కూలు. ప్రయోగాత్మకంగా మొదలైన ఈ స్కూల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులే చదువుతున్నారు. ముందే నిర్ణయించిన సిలబస్ ప్రకారం పరీక్షలు పెట్టడాలు.. దాని ద్వారా విద్యార్థులను ర్యాంకులంటూ వేరు చేయడాలూ ఈ స్కూల్లో ఉండవు. ప్రతి విద్యార్థిని వాళ్ల విద్యాస్థాయిని బట్టి వర్గీకరిస్తారు. ఒకే స్థాయి ఉన్న పిల్లలను ఒక బృందంగా చేస్తారు. ఆ తర్వాత వారి స్థాయికి తగినట్లే ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తారు. బ్రుందాల పేర్లు కూడా వినూత్నంగా ఉంటాయి. చిన్నపిల్లల టీమ్ ను ‘చిలిపిలి’ అని, కొత్తగా నేర్చుకునే పిల్లలున్న టీమ్ కు ‘చిగురు’ అని పేరు. ఇలాగే ‘చేతన’, ‘ప్రజ్ఞ’, ‘పూర్ణ’, ‘ప్రతిభ’, ‘మైత్రి’, ‘శ్రద్ధ’ అంటూ వివిధ స్థాయిల్లో ఉన్న టీమ్స్ కు పేర్లు పెట్టారు.
ఆసక్తి మేరకు పాఠాలు
ఈ స్కూల్లో 15-16 ఏళ్లు చదివిన విద్యార్థులకు స్టేట్ లెవల్ బోర్డు ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటివరకు ఇలా పరీక్షలు రాసిన విద్యార్థులంతా మంచి ఫలితాలు సాధించడం విశేషం. ‘మా స్కూల్లో గ్రేడ్ పద్ధతి ఉండదు. విద్యార్థి వ్యక్తిగత స్థాయితో సంబంధం లేకుండా ముందే నిర్ణయించిన సిలబస్ ను బలవంతంగా చదివించడం వల్ల వారి ఆసక్తి తగ్గిపోతుంది. మా స్కూల్లో చదివే వారిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే. రెగ్యులర్ స్కూళ్లలో చదివే కొంతమంది కూడా అక్కడి ఒత్తిడిని తట్టుకోలేక మా దగ్గర చేరారు’ అంటున్నారు స్కూల్ ను నడిపిస్తున్న దివ్యదీప చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అనంత్ కుమార్. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకత. అలాగే వాళ్లు పెరిగిన వాతావరణం కూడా భిన్నమేనని అనంత్ కుమార్ బలంగా నమ్ముతారు. అందుకు తగినట్లే వాళ్ల నేర్చుకునే స్థాయి కూడా వేర్వేరుగానే ఉంటుందంటారు. ‘గ్రేడ్లుగా విభజించి విద్యార్థుల్లో ఒక రకమైన అభద్రతభావాన్ని నింపడాన్ని ఆయన వ్యతిరేకిస్తారు. ప్రతి విద్యార్థిని వారి స్థాయిని బట్టి నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీర్ఘకాలంలో ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అని అనంత్ కుమార్ చెబుతున్నారు.
ప్రాక్టికల్ చదువులకే పెద్దపీట
‘కలియువ మానే’ బట్టీ చదువులకు పూర్తి వ్యతిరేకం. వారి సిలబస్ ఆచరణాత్మకంగా ఉంటుంది. తప్పనిసరిగా చదవాల్సిన వాటితో పాటు ఐచ్ఛిక పాఠ్యప్రణాళిక కూడా ఉంటుంది. విద్యార్థులు వాళ్ల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా చదివేందుకు వీలుగా ఈ ఆప్షనల్ సిలబస్ కూడా పెట్టారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మొత్తం 102 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 34 మందికి ట్రస్టే వసతి ఏర్పాట్లు కూడా చేసింది. అయితే సాంప్రదాయేతర పాఠశాల కావడంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు దొరకడం కూడా కష్టంగా మారింది. ఫౌండర్ అనంత్ కుమార్ కూడా స్కూల్ మొదలుపెట్టే ముందు ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చింది. ‘మా సాంప్రదాయేతర పద్ధతులను అలవాటు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే మా సిద్ధాంతాలు, బోధనా పద్ధతులకు మెల్లగా అలవాటు పడిన తర్వాత బోధించడం కాస్త సులువైంది’ అని ఆయన చెప్పారు.
అనంత్ విజన్ అద్భుతం
ఇంజినీరింగ్ చదివిన అనంత్ కుమార్ మొదట్లో 12 ఏళ్లు రకరకాల ఉద్యోగాలు చేశారు. ఎప్పుడైతే కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ఏడాదిన్నరపాటు గడిపారో అక్కడే ఆయన ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ముఖ్యంగా వివేకానందుని సిద్ధాంతాలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. చదువు సాధారణ మనిషిని మానవ వనరుగా మారుస్తుందని అప్పుడే అనంత్ కుమార్ బలంగా విశ్వసించారు. 1992 ఆగస్ట్ లో మైసూరు శివార్లలోని శ్రీరామ్ పుర అనే గ్రామంలో అనంత్ కుమార్ స్థిరపడ్డారు. అప్పటి నుంచే గ్రామీణ విద్యార్థుల కోసం ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించారు. బతుకుతెరువు కోసం ఓ కోచింగ్ సెంటర్ లో లెక్చరర్ గా పనిచేసేవారు. గ్రామాల్లో ఉండే పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారానే తన డ్రీమ్ స్కూల్ కలియువ మానేను ప్రారంభించారు. అలా 2005, జూన్ లో కలియువ మానే 14 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఇందులో అనంత్ కుమార్ కొడుకుతోపాటు శ్రీరామ్ పురకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆయన భార్య కూడా అదే స్కూల్లో వలంటీర్ గా పనిచేస్తున్నారు. ప్రారంభంలో కొన్నేళ్లు వ్యక్తిగత విరాళాల ద్వారా స్కూల్ నడిచింది. ‘ప్రయోగాత్మక స్కూల్ కావడంతో మొదట్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చింది. అయితే కాలం గడుస్తున్నకొద్దీ పేరెంట్స్ అర్థం చేసుకున్నారు. తగిన గుర్తింపు ఇచ్చారు. నిజంగా విద్యావ్యవస్థను మార్చాలనుకుంటున్న ఆయన విజన్ అద్భుతమనే చెప్పాలి. కలియువ మానేలాంటి స్కూళ్లు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. గ్రేడ్లు, ర్యాంకులే లక్ష్యంగా సాగుతున్న మన విద్యావ్యవస్థ మారాలి.