చెత్తనుంచి డబ్బులు సంపాదిస్తున్న యువతి
సంపాదించిన సొమ్ముతో మురికివాడల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న వనిత..
దేన్నీ హీనంగా చూడొద్దంటారు శ్రీశ్రీ. ఆయన్ని మన దగ్గర చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. ప్రత్యక్షంగా కాకపోయినా అలాంటి కాన్సెప్ట్నే ఫాలో అయ్యే వ్యక్తి అమృతా ఛటర్జీ. మారుతున్న రోజుల్లో ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సౌత్ ఏషియన్ ఫోరం ఫర్ ద ఎన్వైర్మెంట్ (సేఫ్)కి ప్రాజెక్ట్ మేనేజర్ అమృతా ఛటర్జీ. చెత్తనుంచి సంపద సృష్టించచ్చు అంటారు ఆమె. ‘ట్రాష్ టు క్యాష్’ అనే మాట చెబుతున్న ఆమెను చూస్తే మనకు ఈ విషయం అర్థం అవుతుంది. చెత్తను రీ సైక్లింగ్ చేసి లక్షలు సంపాదిస్తోంది అమృతా ఛటర్జీ. తాను సంపాదించిన సొమ్మును మురికివాడల వారికీ పంచుతోంది. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. అవునా ఇది నిజమేనా.. ? సాధ్యమేనా అనే అనుమానం ఉంటే మీరే చూడండి.
చెత్త నుంచి రీసైక్లింగ్
చెత్తే కదా అని పారేయడం, పర్యావరణానికి ఎంతో ప్రమాదకరం అంటారు అమృతా ఛటర్జీ. నిరుపేదలు కొత్త ఆదాయ వనరుల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారికి మంచి దారి చూపిస్తారామె. చెత్తను రీసైక్లింగ్ చేయడం ఎలాగో ఆమె శిక్షణ ద్వారా మహిళలకు తెలియచేస్తారు. తాను చేసేది పర్యావరణానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం అంటారామె. ఈమధ్య జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్ (యుఎన్ఎఫ్సీసీ) సదస్సులో అమృతా ఛటర్జీ పాల్గొన్నారు. పెరూలో జరిగిన ఈ సదస్సులో మెట్రోపాలిటన్ నగరాలకు చెందిన ఎంతోమంది అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. చెత్తను విపరీతంగా బయట పారేయడం, నదులు, నీటిలో చెత్తను పారబోయడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, చెత్తను ఆదాయవనరుగా ఎలా మార్చుకోవాలనే అంశంపై... ఆమె అందరికీ ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
సరైన నిర్వహణ లేకపోతే నగరాలు డంపింగ్ యార్డులుగా మారిపోతాయని హెచ్చరిస్తారు అమృత. కోల్‌కతాలోనే రోజుకి 5వేల టన్నుల చెత్త తయారవుతోందని 2010 లో జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల 86 శాతం చెత్త ఎందుకూ పనికిరాకుండా పోతోందనేది ఆమె ఆందోళన. దీంతో ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావం ఉందని చెప్తారు.
బయో మెడికల్ వేస్ట్ వల్ల ఎన్నో అనర్థాలు
వ్యాపార సముదాయాలు, మార్కెట్ల నుంచి తయారయ్యే చెత్త వల్ల అంతగా ఇబ్బందులు ఉండవు. కానీ వివిధ ఆరోగ్యకేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వల్ల ఎన్నో ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. చెత్తను మంచి ఆదాయ వనరుగా మార్చాలన్నదే నా లక్ష్యం అంటారు అమృతా ఛటర్జీ. అందులో భాగంగానే ఓ కార్యక్రమం ప్రారంభించారు. అదే ‘ట్రాష్ టు క్యాష్’. ఈ పథకం ద్వారా ఆమె 2 నుంచి 5 శాతం బ్రోకరేజ్ ఆదాయం పొందుతున్నారు. 2011లో ప్రారంభమయిన ఈ పథకం ఎంతోమంది మురికివాడల వారికి ఆదాయంగా మారింది. కోల్‌కతాలోని ఎంతోమంది నిరుపేదల జీవితాలను మార్చేసింది.
మురికివాడలంటే మనదేశంలో ఎంతో అలుసు. అక్కడ నివసించేవారి దగ్గర మురికి తప్ప ఏమీ ఉండదని అంతా భావిస్తారు. అమృతా ఛటర్జీ స్థాపించిన ట్రాష్ టు క్యాష్ ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించాయి. మురికివాడలు మన ఆర్థిక వ్యవస్థను, తమ జీవితాలను మార్చగలవని నిరూపించారు. కోల్‌కతాలోని శాంటీ టౌన్లో ఇప్పుడు ఎంతోమంది మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతున్నారు. అంతేకాదు పిల్లలకు మంచి చదువులు చెప్పించగలుగుతున్నారు. అయితే గతంలో చెత్త పక్కనే నివసిస్తూ రెండోపూట తినలేని వారు... తమ జీవితాలు మార్చేది చెత్తే అని గ్రహించడానికి చాలాకాలం పట్టింది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.
కడు పేదరికం నుంచి కడుపునిండా తినే వరకూ...
చెత్త సేకరించడం, దాన్ని రీసైక్లింగ్ చేయడం మురికివాడల్లో ఎంతోమంది జీవితాలను బాగా మార్చేసింది. నగరంలో చెత్త సమస్యను తీర్చే చక్కని పరిష్కారంగా ఈ కార్యక్రమం రూపొందించారు. రీ సైక్లింగ్ అనేది ఒక కళ లాంటిది. దాన్ని సకాలంలో ఉపయోగించుకోగలిగితే పేదరికం మన దరిదాపులకు కూడా రాదు. ఇలాంటి రీ సైక్లింగ్ వల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఈ రీసైక్లింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ఈపి) ద్వారా రీసైక్లింగ్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు అమృతా ఛటర్జీ .
ఐక్యరాజ్యసమితీ ఆశ్చర్యపోయింది !
అమృతా ఛటర్జీ రూపొందించి అమలుచేస్తున్న రీసైక్లింగ్ ప్రక్రియకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు కూడా లభించింది. అది ఇప్పుడు మైక్రో ఎంటర్‌ప్రైజ్‌గా మారింది. అంతేకాదు వివిధ మురికివాడల్లో అవగాహన కోసం అమృతా ఛటర్జీ ప్రత్యేక వర్క్‌షాపులను కూడా నిర్వహిస్తోంది. సేకరించిన చెత్తను ఎలా విడగొట్టాలి, మనకు అవసరమయిన దాన్ని ఆదాయంగా ఎలా మార్చుకోవాలనే విషయాలను సమీప ప్రాంతాల ప్రజలకు ఆమె వివరిస్తూ ఉంటారు.
మేమూ మనషులమే అనిపిస్తోంది
మురికివాడల్లోని మహిళల పేరుమీద బ్యాంకు అకౌంట్లు ప్రారంభించారు అమృత. వారిని జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతో ఏర్పాటుచేసి పొదుపును ఆమె ఎంతగానే ప్రోత్సహించారు. యూకో బ్యాంకు అధికారులు ఆమె కృషిని ఎంతగానే మెచ్చుకున్నారు. అమృత ప్రోత్సాహంతో ఎంతోమందికి బ్యాంకు అకౌంట్లు ఇచ్చారు. ఇప్పుడు అక్కడున్న చాలామందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. అంతేకాదు వారికి ఓ గుర్తింపు ఉంది. అంతకుమించి గుర్తింపుకార్డులు కూడా తెచ్చుకోగలిగారు. అంతకుముందు తామంటే ఏంటో తమకే తెలియదని, అమృతా ఛటర్జీ చొరవ వల్ల తాము బ్యాంకు గుమ్మం తొక్కుతున్నామని అక్కడి మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రీసైక్లింగ్‌పై అవగాహన లేనివారికి అమృతా ఛటర్జీ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.
మార్కెటింగ్ మెళకువలు, లెక్కాపత్రాల నిర్వహణ. ఇంటి దగ్గర నుంచే సంపాదించడం ఎలాగో నేర్చుకున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడే మానసిక స్థైర్యం వారికి కలిగింది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ ఆఫీసులో చెత్త కాగితాలను ఓ కవర్ వేసి వీరికి అందచేస్తున్నారు. గతంలోలాగే చెత్త ఎక్కడబడతే అక్కడ వేయడం లేదు. జనంలో సామాజిక బాధ్యత కూడా బాగా పెరిగిందంటారామె.
చెత్త నుంచి రీ సైక్లింగ్ చేయగా వచ్చిన ముడి పదార్ధాలతో తయారుచేసిన వివిధ రకాల వస్తువులను గిఫ్ట్‌షాపుల్లో అమ్మకానికి పెడుతున్నారు. ట్రాష్ టు క్యాష్ ఇప్పుడు అంతా మహిళల నిర్వహణలోనే నడుస్తోంది. మధ్యలో స్కూల్ మానేసే వారి సంఖ్య ఈ ప్రాంతంలో చాలా తక్కువగా నమోదు అవుతోంది. తాగి తందనాలాడడం, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు తమ జీవితాలను మార్చుకున్నారు. 350 మంది చెత్త రిక్షాలు లాగేవారు ట్రాష్ టు క్యాష్‌ను ముందుకు నడిపిస్తున్నారు.
మహిళల స్వావలంబన దిశగా అడుగులు
ఆర్ధిక పరిపుష్టి సాధించిన మహిళలు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. వారి వల్ల సమాజం ముందడుగువేస్తుంది. రీసైక్లింగ్ విధానం వల్ల మురికివాడల్లోని మహిళలు తమ ఆదాయం గతంలో కంటే 35 శాతం బాగా పెరిగిందంటున్నారు. తమ జీవన ప్రమాణాల స్థాయి బాగా వృద్ధి చెందిందని చెబుతున్నారు. ట్రాష్ టు క్యాష్ కార్యక్రమం ఎంతో బృహత్తరమయింది. 400 మంది వివిధ ప్రాంతాలకు చెందిన, విభిన్న జీవన శైలిని ఆచరించేవారి ప్రమేయం ఉంది. మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా వీరికి అవసరమయిన సాయం చేస్తున్నాయి. మరో విశేషం ఏంటంటే టాటా ఏఐజీ లైఫ్ వారు వీరికోసం ప్రత్యేకంగా రిస్క్ ఫ్రీ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలు ప్రారంభించాయి.
పర్యావరణానికి రక్షణ
ట్రాష్ టు క్యాష్ కార్యక్రమం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది. పెరిగిపోతున్న కాలుష్యానికి కారణం రోజూ విడుదలవుతున్న చెత్తే కారణం అంటారు. చెత్తను సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయకపోతే ఎంతో ఇబ్బంది అంటారు అమృతా ఛటర్జీ. ప్రస్తుతం ఎన్నో ఆరోగ్య ఇబ్బందులకు చెత్త కారణం అంటారు వైద్యులు. అందుకే చెత్తను రీసైక్లింగ్ చేసే విధానాలకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకి రావాలంటారు.
ఎంతోమంది విజేతలు
ట్రాష్ టు క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది తమ జీవితంలో వచ్చిన మార్పులను పదిమందికీ తెలియచేస్తున్నారు. గతంలో చెత్త తీసుకుపోయే రిక్షా లాగే అల్లావుద్దీన్ షేక్ తన జీవితం ఎలా మారిపోయిందో ఆనందంగా చెబుతున్నాడు. 20 ఏళ్ళ క్రితం సుందర్బన్స్ ప్రాంతం నుంచి కోల్‌కతాకు వచ్చిన తాను ఇటీవలి కాలం వరకూ సరిగా సంపాదించలేకపోయేవాడినని అంటారు. ట్రాష్ టు క్యాష్ వల్ల తమ జీవితాలు ఎంతో మెరుగుపడ్డాయని ఆనందంగా చెప్తారు. ఒక రోజు తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తుకుతెచ్చుకుంటున్నాడు.
- ‘‘నేను చెత్త తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. అప్పుడే ఒకటి గమనించాను. ఈ ఆఫీస్ ముందు చాలామంది నిలబడి ఉన్నారు. వారి మెడల్లో ఐడెంటిటీ కార్డులున్నాయి. ఇలా తాము కూడా మారతామా అనిపించింది. అలా అనుకున్న కొన్నాళ్ళకే మా జీవితాల్లో మార్పులు ప్రారంభం అయ్యాయి. నేను ఎప్పటికైనా డయాస్ మీదికి ఎక్కి ఏదైనా మాట్లాడగలనా అనిపించింది. కానీ దానికి ఎంతో కాలం పట్టలేదు. యూనిఫాంలు కట్టుకుని మెడలో ఐడీ కార్డులు చూసిన రోజు ఎప్పటికైనా తాను కూడా ఇలా కావాలనుకున్నానని.. అది ఎంతో కాలం పట్టలేదంటాడు అల్లా వుద్దీన్.
- మాయా మండల్ అనే మహిళ కూడా తన విజయగాథను చెబుతోంది. చెత్త తీసుకుని రావడం వల్ల నెలకు 750 నుంచి 1800 రూపాయలు సంపాదించేవాళ్ళం. ఈ సంపాదనకు తోడు కొన్ని చర్మ సంబంధ ఇబ్బందులు తెగ బాధపెట్టేవి. ట్రాష్ టు క్యాష్ వచ్చాక మా జీవితాలు మారాయి. ఆదాయం బాగా పెరిగింది. గతంలో చేసే పనికి ఇప్పుడు రెట్టింపు ఆదాయం వస్తోంది. మా పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుకుంటున్నారని ఎంతోమంది చెబుతున్నారు.
అమృతా ఛటర్జీని కోల్‌కతాలోని మురికివాడల ప్రజలు ఆప్యాయంగా అక్కా అని పిలుస్తారు. ఆమె మాటలు వారికి శిరోధార్యం. ‘‘మీరు మాతో కలిసి వస్తే మీ జీవితాలను మారుస్తా. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇవాల్టి నుంచి మా సంస్థతో చేతులు కలపండి’’ అని చెప్పుకొచ్చేవారామె. అమృతా ఛటర్జీ మాటలు వారిని ముందుకి నడిపించాయి. పేపర్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్టు మురికివాడల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉందంటారు అమృతా ఛటర్జీ. అంతేకాదు బాగా తడిసిన చెత్త నుంచీ వర్మీ కంపోస్టు ఎరువును తయారుచేస్తున్నారు. దీన్ని వివిధ వ్యవసాయ క్షేత్రాలకు విక్రయిస్తున్నారు. వ్యవసాయరంగానికి అవసరమయిన చౌక అయిన ఎరువులు వీళ్ళు సరఫరా చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులను రీ సైక్లింగ్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ తయారుచేస్తున్నారు. హోం గార్డెన్లకు అవసరమయిన సరంజామా రూపొందిస్తున్నారు.