అమెజాన్‌ లో తెలంగాణ బ్రాండ్ గోల్కొండ హస్తకళలు

అమెజాన్‌ లో తెలంగాణ బ్రాండ్ గోల్కొండ హస్తకళలు

Sunday March 06, 2016,

1 min Read

తెలంగాణ హస్త కళాకారులకు మంచిరోజులు వచ్చాయి. ఇన్నాళ్లూ కళాత్మక ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ లేక కూనారిల్లిన కళాకారుల జీవితాలు బాగుపడబోతున్నాయి. నిర్మల్ కొయ్యబొమ్మల దగ్గర్నుంచి హైదరాబాద్ బిద్రీ క్రాఫ్ట్స్ వరకు అమెజాన్ లో అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. మార్చి 15 లోగా చేనేత ఉత్పత్తులు కూడా ఆన్‌లైన్‌ లోకి తేవాలని నిర్ణయించింది.

నిర్మల్‌ కొయ్య బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్‌, పెంబర్తి ఇత్తడి వస్తువులు, టెర్రకోట బొమ్మలు, పూసలు అల్లికలు, తోలు వస్తువులు, కరీంనగర్‌ ఫిలిగ్రి కళాకృతులు, హైదరాబాద్‌ బిద్రీ క్రాఫ్ట్స్ వంటి హస్తకళా వస్తువులకు ఇన్నాళ్లూ సరైన ప్రచారం లేకపోవడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 8 జిల్లాలకు చెందిన లక్షమందికి పైగా కళాకారులు, దాదాపు 180 రకాల ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తుల్ని రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండ కొనుగోలు చేసి విక్రయిస్తోంది.

అయితే ఆశించిన రీతిలో గోల్కొండ క్రాఫ్ట్స్ అమ్మకాలు లేవు. దీంతో పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను అమ్మాలని భావించింది. ఈ మేరకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్పత్తుల్ని పరిశీలించిన అమెజాన్‌ ప్రతినిధులు.. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు అంగీకరించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ లోగోతో పాటు ఆన్‌లైన్‌ సేవల్ని ప్రారంభించారు. అమెజాన్‌తో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ గోల్కొండ కుదుర్చుకున్న ఒప్పందం కళాకారులకు ఊతమిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ హస్తకళా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు.

image