అమెరికాలో ఎంఎస్.. హైదరాబాద్‌లో ఇడ్లీ,దోశ బిజినెస్ !
ఇడ్లీ, దోశ.. దక్షిణాది జనాలకు అత్యంత ఆప్యమైన బ్రేక్‌ఫాస్ట్. ఏ ఇంట్లో అయినా.. వారంలో ఒకటి రెండు సార్లు ఈ టిఫిన్లు లేకుండా ఉండవు అంటే అతిశయోక్తి కాదు. నూనె ఎక్కువ లేకుండా... పెద్దగా కల్తీ జరిగేందుకు అవకాశం లేని డిషెస్ ఇవి. అందుకే మన వాళ్లు ఎక్కడికెళ్లినా మొదట ఇష్టపడే వంటలు ఇవే. అలాంటి ఈ టిఫిన్లకు ఓ బ్రాండింగ్ తెచ్చి.. వాటికి వెరైటీ సొబగులు అద్దారు ఇద్దరు ఐటి ఇంజనీర్లు. మామూలు మసాలా దోశ, ఉల్లి దోశకు.. సహజ రంగులద్ది, కొత్త రుచులను పరిచయం చేశారు. స్ట్రీట్ ఫుడ్‌ను సిగ్నేచర్ స్టైల్‌లో అందిస్తున్న ఈ జంట ఆలోచన లక్షలు కురిపిస్తోంది. రాజమౌళి, అనుష్క సహా.. ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి కడుపారా.. ఇడ్లీలు, దోశలు తినివెళ్తారంటే నమ్మాల్సిందే. ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్‌ను హైదరాబాదీలకు పరిచయం చేసి.. హౌజ్ ఫుల్ బిజినెస్ చేస్తున్న 'దోశ ప్లేస్' ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.
శ్రీవిద్య, అజయ్.. వీళ్లద్దరి ఆలోచనే దోశ ప్లేస్. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన శ్రీవిద్య సిబిఐటిలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తర్వాత అమెరికాలో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ చేసి కొద్దికాలం పాటు బిజినెస్ ఎనలిస్ట్‌గా పనిచేశారు. నాలుగైదేళ్లు వివిధ కంపెనీల్లో పనిచేశారు. ఇక డిగ్రీ వరకూ అజయ్ నేపధ్యమంతా ఖమ్మం జిల్లా సింగరేణిలో సాగింది. ఆ తర్వాత అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఆరేళ్ల పాటు ఐటి సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఇండియా వచ్చి మరో కంపెనీలో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేశారు. ఐటి ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ ఇద్దరికీ వీకెండ్స్ అంటే ప్రాణం. శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు బైక్ ఎక్కి ఎక్కడెక్కడ ఏ ఫుడ్ ఫేమసో తెలుసుకుని మరీ అక్కడ వాలిపోయేవారు. కొత్త కొత్త రుచుల వెతుకులాటలో వీకెండ్స్ గడిచిపోయేవి. అయితే చాలా చోట్ల స్ట్రీడ్ ఫుడ్స్‌లో నాణ్యత పాటించకపోవడం, అక్కడి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం కాస్త ఆందోళనగా అనిపించేది. రుచి బాగున్నా.. అక్కడి వాతావరణం కాస్త ఇబ్బందిగా ఉండేది. అలా కొద్దికాలం తర్వాత ఇద్దరికీ ఫుడ్ స్టార్టప్ పెట్టాలనే ఆలోచన పుట్టింది. నాణ్యమైన ఆహారాన్ని, శుచిశుభ్రతతో అందిస్తే.. కస్టమర్లు క్యూ కట్టడంలో సందేహం లేదనిపించింది. అయితే ఇందుకోసం రెస్టారెంట్లకు బదులు స్ట్రీట్ ఫుడ్‌కే మొగ్గుచూపడం మేలని నిర్ణయించుకున్నారు.
''చదువు అనేది ఒక అసెట్. అది నాలెడ్జ్‌ను పెంచుతుంది. కానీ మనం చేసే పనికి దానికి సంబంధం లేదు. మన ప్యాషన్‌ను నెరవేర్చుకోవడానికీ చదువుకు సంబంధం లేదు. అంత చదువు చదివి ఈ వ్యాపారంలోకి రావడం వల్ల మాకేమీ చిన్నతనంగా లేదు'' - శ్రీవిద్య.
ఫుడ్ స్టార్టప్ అయితే ఓకే అనుకున్నారు కానీ.. ఏం పెట్టాలనే సందేహం చాలాకాలం వేధించింది. మొదట్లో బిర్యానీ వంటివి అనుకున్నారు. అయితే ఎక్కువ సేపు వాటిని తాజాగా ఉంచలేకపోవడం, వడ్డించేది తాజాదో కాదో అనే అనుమానం కస్టమర్లలో కలిగే అవకాశం ఉండడంతో - బిర్యానీ పాయింట్ ఆలోచన మానుకున్నారు. ప్రతీ రోజూ తినే ఇడ్లీలు, దోశలనే వినూత్నంగా పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ? ఈ రెండు ఐటమ్స్ వాళ్ల కళ్ల ముందు తయారు చేసి ఇస్తాం కాబట్టి వేడిగా ఉండడంతో పాటు కస్టమర్లకూ నమ్మకం ఉంటుందనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా కొంత మంది చెఫ్‌లతో మాట్లాడి వివిధ రకాల దోశల మెనూ తయారు చేశారు. పిజ్జా దోశ, తీన్ మార్ దోశ, కేరళ ఓపెన్, పావ్ బాజీ దోశ వంటి చిత్రవిచిత్రమైన పేర్లు, రుచులతో 111 దోశల మెనూ రెడీ అయింది. ఇప్పుడు వాటిన్నింటినీ ఎక్కడ పెట్టాలి, ఎలా అమర్చాలి.. అనే సమస్య మరొకటి. అమెరికాలో మాదిరి ఏదైనా ట్రక్‌లో వీటన్నంటినీ పెట్టాలనుకున్నారు. ఇందుకోసం ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయిన శ్రీవిద్య.. అజయ్‌తో కలిసి అనేక డిజైన్లు వేశారు. దోశ పెన్నాలు, గిన్నెలు, పిండి, నీళ్లు, వాటర్ ట్యాంకర్, గ్యాస్ స్టౌ వంటివన్నీ.. అందులో ఇమిడిపోవాలనుకున్నారు. నెలరోజుల పాటు రాత్రింబవళ్లూ ఇదే పనిగా డిజైన్లు గీశారు. తీరా దాన్ని పట్టుకుని ఫ్యాబ్రికేటర్ దగ్గరికి వెళ్తే ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క ట్రక్ కోసం అంత కష్టపడలేమని తేల్చేశారు. చివరకు ఓ ఫ్యాబ్రికేటర్ ముందుకొచ్చి.. రెండు నెలల టైం తీసుకుని.. ఫుడ్ ట్రక్ డిజైన్ చేసి ఇచ్చాడు.
వి1, వి2,వి3 ట్రక్స్
వినూత్న కాన్సెప్ట్‌తో ఫుడ్ ట్రక్స్ డిజైన్ అయ్యాయి. ఓ చిన్నపాటి రెస్టారెంట్‌కు సరిపోయే సామానంతా అందులో ఇమిడిపోతుంది. ఎన్ని వందల మంది వచ్చినా వాళ్లందరికీ వడ్డించగల సామర్ధ్యం ఆ ట్రక్స్‌కు ఉంది. ఐదారు వందల దోశలను అవలీలగా వేసేయగల సరుకు అందులో ఎప్పటికీ ఉంటుంది. అందులోనే చిన్నపాటి వాటర్ ట్యాంకర్, పవర్ వంటివన్నీ ఇమిడిపోయాయి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి వాటికి వర్షన్ 1, వర్షన్ 2 మాదిరి.. వి1, వి2, వి3లుగా ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ట్రక్స్ రెడీ.. ఫుడ్ రెడీ.. కానీ.. ఎక్కడ ఏర్పాటు చేయాలి ? అనే ఆలోచన. ఐటి జనాలు ఎక్కువగా ఉన్నా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మొదటి ట్రక్ ఏర్పాటైంది. ఆఫీసులు వదిలిన తర్వాత జనాలు ఈ ఫుడ్ ట్రక్స్‌ను చూసుకుంటూ వెళ్లేవారే కానీ వచ్చిన వాళ్ల సంఖ్య తక్కువే. కొంత మందే డిఫరెంట్‌గా ట్రై చేద్దామని అనుకున్నారు. అలా అలా మెల్లిగా మౌత్ పబ్లిసిటీ రావడంతో ఈ దోశలు పాపులర్ అయ్యాయి. రొటీన్ వాటికి భిన్నంగా రుచికరంగా ఉండడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎలాంటి రంగులూ వాడకపోవడం, బొగ్గుల పొయ్యిలపై దోశలు వేయడం, అవసరాన్ని బట్టి ఆలివ్ ఆయిల్ వాడడం వంటివన్నీ అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. మామూలు రోజుల్లో రోజుకు 250 నుంచి 300 దోశల ఆర్డర్ ఉంటే.. వీకెండ్స్ ఇది రెట్టింపవుతూ ఉంటుంది. నలభై రూపాయలతో మొదలై రూ.150 వరకూ వివిధ రేట్లలో దోశలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.
మొదట 15 లక్షల రూపాయల పెట్టుబడితో వీటిని ప్రారంభించినప్పుడు ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య డెభ్బైకి పెరిగింది. ఒక్క ట్రక్‌తో మొదలైన వ్యాపారం మూడు ఫుడ్ ట్రక్స్ స్థాయికి ఎదిగింది. ఒకటి మాదాపూర్‌లో రెగ్యులర్‌గా ఉండే, రెండోది గేటెడ్ కమ్యూనిటీల దగ్గరికి వెళ్తే.. మూడో ట్రక్ మాత్రం పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలు ఇలా.. ఆర్డర్‌ను బట్టి రోమింగ్ మోడ్‌లో ఉంటుంది.
మొదటి షాక్
అంతా సాఫీగా సాగితే ఏదైనా స్టార్టప్ ఎందుకవుతుంది. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాక మరింత రాటుదేలడం దాన్నుంచి నేర్చుకోవడం అనేది స్టార్టప్ సింపుల్ కాన్సెప్ట్. ట్రక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండండతో ఎంతో మంది అక్కడ వాలిపోయారు. ట్రక్‌కు ఎంత ఖర్చైంది, బిజినెస్ ఎలా ఉంది అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఒకరిద్దరిని నమ్మి కొన్ని వివరాలు చెప్పేశారు. ఇంకేముంది రెండు, మూడు వారాలు తిరగక ముందే అదే ఫ్యాబ్రికేటర్ దగ్గరి నుంచి సేమ్ కలర్స్, సేమ్ స్పెసిఫికేషన్స్‌లో మరికొన్ని ఫుడ్ ట్రక్స్ రోడ్డుపై దిగిపోయాయి. వాటిని చూసి వీళ్లకు దిమ్మతిరిగినంత పనైంది. వాటి నుంచి తేరుకునే లోపే.. ఆరు నెలల్లో దాదాపు 26 వాహనాలు సేమ్ టు సేమ్.. అలాంటివే వివిధ ఏరియాల్లో దిగిపోయాయి. ఇక చేసేదేమీ లేక నాణ్యతను కాపాడుకుంటూ రావడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకున్నారు. దోశలతోపాటు 'ఐటి' పేరుతో మరో ట్రక్ కూడా రెడీ అయింది. ఇందులో ఇడ్లీ, టీ మాత్రమే అమ్ముతారు. వేడి వేడి ఇడ్లీలు, నెయ్యి ఇడ్లీలు, తీన్మార్ ఇడ్లీలు ఇక్కడి స్పెషాలిటీ.
అజయ్ కోనేరు.. స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడంతో తానే స్వయంగా పిక్స్ తీసి ఫేస్ బుక్ వంటి సామాజిక సైట్లలో ప్రమోషన్ చేసేవారు. ఐటి జనాల ఆదరణ, మౌత్ పబ్లిసిటీతో ఇప్పుడు దోశ ప్లేస్ ఓ హాట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారిపోయింది.
ఈ విజయమే స్ఫూర్తిగా ..
దోశ ప్లేస్ సక్సెస్ కావడంతో అజయ్, శ్రీవిద్యతో జత కలిసేందుకు కొంత మంది ముందుకు వచ్చి... పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో పొందిన విజయంతో చెన్నై, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో విస్తరణకు చూస్తున్నారు. అయితే దీన్నో ఫ్రాంచైజీ మోడల్‌లో కాకుండా.. పార్ట్‌నర్‌షిప్ పద్ధతిన చేయాలనేది వీళ్ల కాన్సెప్ట్. విదేశాల్లో ఇండియన్ ఫుడ్‌కు మంచి గిరాకీ ఉండడంతో అమెరికా నుంచి కూడా అనేక ప్రతిపాదనలు వస్తున్నట్టు అజయ్ చెబ్తున్నారు. ఆద్యా రెస్టారెంట్స్ పేరుపై మొదలైన ఈ ఫుడ్ బిజినెస్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. 'హట్ 7' పేరుతో మల్టిక్యూసిన్ రెస్టారెంట్, 'ఛార్జర్' పేరుతో మోడ్రన్ ఇండియన్ కాఫీ షాప్ ప్రారంభించారు. త్వరలో 'స్కైజోన్'ను కూడా మిత్రులతో కలిసి లాంఛ్ చేయబోతున్నారు. ఫుడ్ బిజినెస్‌లో ఉన్న అపార అవకాశాల వల్ల ఇందులోనే వృద్ధిని వెతుక్కుంటున్నామని అజయ్ అంటున్నారు. 'దోశ ప్లేస్' విస్తరణకు శ్రీలంక, అమెరికా మొదటి టార్గెట్ అని వివరించారు. కోట్ల రూపాయల టర్నోవర్ సహా 200 మందికి ఉపాధిని కల్పించడమే తర్వాతి లక్ష్యంగా వీళ్లు ముందుకు సాగుతున్నారు.
''ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయిన తర్వాత మేం వేగంగా విస్తరించాలని అనుకుంటున్నాం. వివిధ దేశాల్లో మా బ్రాండ్ ఉండాలనేది నా ఆలోచన. వచ్చిన ఆదాయాన్ని, మళ్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. పెద్ద ఉద్యోగాన్ని, ఎన్నో సదుపాయాలనూ వదులుకుని వచ్చినందుకు ఏ మాత్రం బాధలేదు'' - అజయ్, ఆద్యా రెస్టారెంట్స్ సిఈఓ