పసిప్రాయంలోనే పర్వతారోహణలో ప్రపంచ రికార్డు.. హైదరాబాద్ అమ్మాయి జాహ్నవికి జయహో !!
ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు..?
మగరాయుడిలా ఆ దూకుడేంటి..?
ఒక్కదానివే బయటకు వెళ్లకు..!
చీకటి పడేలోపు ఇల్లుచేరాలని తెలియదా..?
గద్దింపులు.. కట్టుబాట్లు.. ఆంక్షలు.. సంకెళ్లు..
ఎందుకంటే ఆడపిల్ల అని భయం..
ఎందుకంటే ఆడపిల్ల అని టెన్షన్..
ఎందుకంటే రోజులు బాలేవని ఆదుర్దా..
ఆల్మోస్ట్ దేశంలో సగటు ఆడపిల్లల తల్లిదండ్రులందరి భావజాలమూ ఇదే. అమ్మాయి ఎదుగుతున్నా కొద్దీ టెన్షన్. అమ్మాయి చదువుతున్నా కొద్దీ టెన్షన్. అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికొచ్చేదాకా భయం. అమ్మాయి ఆఫీసు నుంచి ఇల్లు చేరేదాకా టెన్షన్. ఇంకా అభద్రతాభావంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఫలానా ఆంబిషన్ మమ్మీ.. ఫలానా గోల్ డాడీ అంటే- నోర్మూసుకో.. పిచ్చివేషాలు వేయకు.. చెప్పింది చేయ్ అంటున్నారు.
ఫైనల్ గా, ఆడపిల్ల అంటే అణిగిమణిగి ఇంటిపట్టున ఉండాల్సిందేనా? చదువు, ఉద్యోగం అనేవి పేరెంట్స్ దయాదాక్షిణ్యాల మీదనే నడవాలా? ఈ పాతకాలంనాటి పరిస్థితులు మారేదెన్నడు..? అమ్మాయిల తల్లిదండ్రుల మైండ్ సెట్ చేంజ్ అయ్యేదెప్పుడు..? కృష్ణారావు గుండెను ఈ బాధ నిత్యం మెలిపెట్టేది. ఆడపిల్లకు చదువే మహాభాగ్యం అనుకునే దరిద్రపుగొట్టు సంప్రదాయం మారేదెన్నడని ఆవేదన చెందేవాడు. సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని తపన పడ్డాడు. నాకే గనుక కూతురు పుడితే.. ఆమెను ఎవరూ ఊహించని రీతిలో పెంచుతానని మనసులో గట్టిగా ఫిక్సయ్యాడు. ఆడపిల్ల పుడితే నింగీనేలా అమె సొంతమయ్యేలా తీర్చిదిద్దుతానని కంకణం కట్టుకున్నాడు.
అప్పుడప్పుడూ అనిపిస్తుంది.. పైన తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారని. అనుకున్నట్టే ఆడపిల్ల పుట్టింది. కృష్ణారావు ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆకాశమే హద్దుగా ఆమెను పెంచాలనుకున్నాడు. అనుకున్నట్టే అమ్మాయి జాహ్నవిని ఆకసాన నిలబెట్టాడు. నేలనుంచి నింగికి నిచ్చెన వేస్తే.. అడపిల్లల శక్తియుక్తులేంటో ప్రపంచానికి తెలుస్తాయని నిరూపించాడు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలు. పద్నాలుగేళ్లు కూడా నిండని పసిప్రాయం. ప్రపంచ రికార్డులను పాదాక్రాంతమవుతున్నాయి. మహామహా శిఖరాలు ఆమెకు దాసోహం అన్నాయి. గండశిలలు బండరాళ్లు వంగివంగి సలాం కొట్టాయి. ఇప్పటికే 3 ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి జాహ్నవి శక్తియుక్తులన్నీ కూడదీసుకుంటోంది.
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలి. పర్వాతారోహకులందరిదీ అదే లక్ష్యం. కానీ జాహ్నవి ఆలోచన వేరు. ఎవరెస్ట్ తో పాటు మిషన్ 7 సమ్మిట్‌లో భాగంగా 7 ఖండాల్లోని 7 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలి.. ప్రపంచంలోనే యంగెస్ట్ మౌంటెనీర్‌గా గుర్తింపు పొందాలి.. ఇదీ జాహ్నవి టార్గెట్.
అనుకున్నట్టే 2014 అక్టోబర్ 2న 12 ఏళ్ల వయసులో 5,895 మీటర్ల ఎత్తున్న ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి.. ప్రపంచంలోనే అతిపిన్న పర్వతారోహకురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. 2015 జులై 31న 5,642 మీటర్ల ఎత్తయిన యూరప్‌లోని ఎల్ బ్రూస్ మౌంటెయిన్‌ను కూడా అధిరోహించింది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని మౌంట్ కొజియోస్కోకో పర్వతంపై కాలుమోపి అతి చిన్న భారతీయురాలిగా చరిత్ర తిరగరాసింది. పైగా తండ్రితో కలిసి ఈ పర్వాతాన్ని ఎక్కి మరో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పాటు అస్సీ 10 ఛాలెంజ్‌గా పిలిచే 10 ఎత్తన పర్వత శిఖరాలను అధిరోహించి ఇంకో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.
జాహ్నవికి పర్వతారోహణపై ఆసక్తి ఎలా కలిగింది? ఆమెను ఆ దిశగా ప్రేరేపించింది ఎవరు? ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం.. తండ్రి కృష్ణారావు. 10 నెలల వయసులోనే వీపుపై ఒక స్పెషల్ బ్యాగ్‌లో కూర్చొబెట్టుకుని చిన్నారిని ట్రెక్కింగ్ కు తీసుకెళ్లారు. అలా జాహ్నవి రెండేళ్ల వయసు నుంచి తండ్రితో కొండలు ఎక్కడం మొదలు పెట్టింది. క్రమంగా బరువులు మోస్తూ చిన్న చిన్న బండరాళ్లపై బుడిబుడి అడుగులు వేసింది. పర్వత ప్రాంతాల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితును తట్టుకోవడం కోసం యోగా, రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది. అలా 9 ఏళ్లు వచ్చే సరికి వేల అడుగుల ఎత్తున పర్వతాలను అవలీలగా ఎక్కే స్థాయికి చేరింది. జాహ్నవి తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని 16వేల అడుగుల ఎత్తున్న రూప్‌కుండ్ పర్వతం ఎక్కింది. ఆ తర్వాత చలికాలంలో గడ్డకట్టే హిమాలయాల్లో సాహస యాత్ర చేసింది. స్పెషల్ పర్మిషన్ తీసుకుని లేహ్‌లో ఎంతో కష్టమైన 20 వేల అడుగులు ఎత్తున్న స్టోక్ కాంగ్రి పర్వతంపై కాలు మోపింది. ఆ తర్వాత నేపాల్ లోని 5 వేల 520 మీటర్ల ఎత్తైన యాలా పర్వతాన్ని అధిరోహించింది.
వచ్చేనెల అంటే ఏప్రిల్ మొదటి వారంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు సమాయత్తమవుతోంది. తర్వాత దక్షిణ అమెరికాలోని 6వేల 962 మీటర్ల ఎత్తున్న మౌంట్ అకన్ కాగ్వా, అంటార్కిటికాలోని 4,897మీటర్ల ఎత్తైన మౌంట్ మిన్సన్ మాస్సిఫ్, నార్త్ అమెరికాలోని 6,194 మీటర్ల ఎత్తున్న మౌంట్ మెక్ కీన్లే ఎక్కాలన్నది తర్వాతి గోల్. అదిగనుక సాధిస్తే ప్రపంచంలోనే అతిచిన్న వయసున్న సాహస యాత్రికురాలిగా జాహ్నవి ప్రపంచ రికార్డులు తిరగరాస్తుంది.
హైదరాబాదులో పుట్టిపెరిగిన జాహ్నవి హిమాలయన్ మౌంటెనరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పెయింటింగ్ వేయడం, కథలు రాయడమంటే ఇష్టం. భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది.
ఇదంతా నాకోసం కాదు... సమాజంలో అమ్మాయిల శక్తి సామర్ధ్యాలేంటో ప్రపంచానికి చాటిచెప్పాలనేదే నా ప్రయత్నం- జాహ్నవి.
కఠోర శ్రమ, మానసిక స్థయిర్యం.. కాసింత ప్రోత్సాహం ఇస్తే చాలు అమ్మాయిలు సాధించలేనిది ఏమీ లేదనే మెసేజ్ పాస్ చేయాలనేదే జాహ్నవి లక్ష్యం. సమాజంలో ఆ మార్పు రావాలనే కష్టపడుతున్నానని చెప్తోంది జాహ్నవి. తెలంగాణ అమ్మాయిగా, అందునా హైదరాబాదీగా ఈ ఫీట్ సాధించినందుకు, సాధించబోతున్నందుకు గర్వంగా ఉందని చెమర్చిన కళ్లతో చెప్తోంది. ఎవరెస్టు ఎక్కేముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకుంటానంటోందీ బ్రేవ్ గాళ్. ప్రస్తుతం జాహ్నవి మూడు ప్రపంచ రికార్డులతో నిలబడింది. మరో రికార్డు కోసం పట్టుదలతో ఉంది.
ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును దూరం చేసేందుకే తన కూతుర్ని మౌంటెనర్‌గా తీర్చిదిద్దామంటున్నారు జాహ్నవి తండ్రి కృష్ణారావు. అయితే ఇంతకాలం సొంత ఖర్చులతో ఎలాగోలా నెట్టుకొచ్చినా, రెండు నెలల పాటు సాగే ఎవరెస్ట్ అధిరోహణ పూర్తి చేసేందుకు ఎవరైనా ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు
లక్ష్యంవైపు వడివడిగా అడుగులేస్తున్న జాహ్నవికి స్వశక్తి స్మార్ట్ అనే స్వచ్ఛంద సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న జాహ్నవి.. ఎంతో మందికి అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోందని.. అందుకే ఎన్జీవోలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆమెకు సపోర్ట్ చేయాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.
నిజమే, అమ్మాయిలకు ఫ్రీడం ఇచ్చి ప్రోత్సహిస్తే అబ్బాయిలకంటే ఏం తక్కువ కాదని నిరూపిస్తారు. అందుకు నిదర్శనమే జాహ్నవి. అలా అని ప్రతీ అమ్మాయి హిమాలయాలే ఎక్కాలని రూలేం లేదు. వివక్ష లేకుండా ఆడపిల్లను అంతెత్తున చూసే పెద్దమనసుంటే చాలు. సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది. ఆ రోజు కూడా ఎంతో తొందరలో లేదనిపిస్తోంది.. జాహ్నవి ఫాదర్ కృష్ణారావుని చూశాక..