విద్యారంగంలో విప్లవం సృష్టించబోతున్న వీడియో పాఠాలు...

విద్యారంగంలో విప్లవం సృష్టించబోతున్న వీడియో పాఠాలు...

Tuesday October 18, 2016,

4 min Read

రెండు మూడు తరాల క్రితం స్కూల్స్ పెద్దగా అందుబాటులో లేని పరిస్థితి... నిన్నమొన్నటి తరానికి మంచి ట్యూషన్ మాస్టర్ ని వెతుక్కోవటం ఓ పెద్దటాస్క్.. క్రమంగా గల్లీకో ట్యుటోరియల్ వచ్చి ఆ లోటుని తీర్చేసింది. కానీ, ఇప్పుడు నోకియా బేసిక్ ఫోన్ నుండి ఐఫోన్-6 వరకు స్మార్ట్ గా రోజులు మారాయి. అందుకే మీ లాప్ ట్యాప్ లోకి, మీ స్మార్ట్ ఫోన్ లోకే మీ టీచర్ అంటున్నారు. అవును. టెక్నాలజీ విద్యారంగాన్ని అనూహ్యంగా మార్చేస్తోంది. మంచి లెక్చరర్ ఏ ఊళ్లో ఉన్నా మీ ఇంట్లోకి లాక్కొస్తానంటోంది. పాఠాలు చెప్పిస్తానని ప్రామిస్ చేస్తోంది.. అభిషేక్ బజాజ్, రోహిత్ బజాజ్...ఇద్దరూ ఇదే బాటలో ఉన్నారు. అలా సీఏ పూర్తి చేశారో లేదో.. ఎడ్యూటెక్ ఫీల్డ్ లో తమ నసీబ్ చెక్ చేసుకోటానికి ఎంట్రీ ఇచ్చారు. 

జనవరి 2015.. జీరో ఇన్ఫీ.కామ్(zeroinfy.com). 

ఇది కోల్ కతా లో మొదలైన ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాం.. ఇందులో విద్యార్ధులు తమకు కావలసిన వీడియో పాఠాలు కొనుక్కునే అవకాశం ఉంది. అంతే కాదు.. తోటి విద్యార్ధులతో తమ అనుభవాలు, ఆయా పాఠాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ నేర్చుకునే అవకాశాన్ని కూడా ఈ ప్లాట్ ఫాం కల్పిస్తోంది. సీఏ, సీఎస్, సీఎస్ఏ, యూపీఎస్సీ, ఐఐటి-జెఈఈ మొదలైన కోర్సులకు సంబంధించి అనుభవజ్ఞులైన లెక్చరర్ల పాఠాలను అందజేస్తోంది. దీనికోసం అభిషేక్, రోహిత్ ఇద్దరూ కలిసి కోల్ కతా, ఢిల్లీ, ముంబయి, పూణె, చెన్నై, జైపూర్, జోధ్ పూర్ ఇలా ఇండియా అంతా తిరిగి... దేశ నలుమూలలనుంచి టీచర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

"టీచర్లంటే అలాంటిలాంటి వారు కాదు.. కనీసం ఐదేళ్లపాటు, మినిమమ్ ఓ వెయ్యిమంది విద్యార్ధులకు బోధించిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఎంక్వైరీలు చేసి.. నమ్మకం కలిగిన తర్వాతనే ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఆ విధంగా టై అప్ చేసుకున్న తర్వాత ఆయా టీచర్ల వీడియోలను జీరోఇన్ఫీ.కామ్ సర్వర్ లో పెడుతున్నాము. ఈ ప్లాట్ ఫాంని డెవలప్ చేయటానికి దాదాపు 6 నెలలు పట్టింది. ఆ తర్వాత మరో రెండు నెలలు బీటా వెర్షన్ రన్ చేశాము."- ఆదిత్య

ప్రణాళికనుంచి ప్రాక్టికల్ సీన్ వరకు...

కోల్ కతా సెయింట్ జేవియర్ కాలేజ్ లో చదివిన ఈ ఇద్దరు మిత్రులు 2015లో తమ సీఏ పూర్తి చేశారు.. ఈ ప్లాట్ ఫాంకు సంబంధించిన బీజం ఆదిత్య, రోహిత్ విద్యార్ధులుగా ఉన్నపుడే పడింది. ఓసారి ఇద్దరూ ట్యూషన్ ఫీజైతే కట్టారు కానీ, అటెండ్ కాలేకపోయారు. ఫీజు దండగ, టైమ్ వేస్ట్. మరో పక్క ఆన్ లైన్ పోర్టల్స్ ని ఆశ్రయిద్దామంటే ఒక్కో సబ్జెక్ట్ కి ఎంతో మంది టీచర్లు కనిపిస్తుంటే ఎవర్ని ఎంపిక చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్. అలా ఈ ప్లాట్ ఫాం ఆలోచన మొదలయింది..

మొదట మార్కెట్ ని సరిగ్గా అంచనా వేయలేకపోయినా, ఆ తర్వాత సరిచేసుకుని పక్కా లెక్కలతో, సరైన ప్రొడక్ట్ తో వచ్చారీ ఇద్దరు దోస్తులు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి పోగుచేసి పదిలక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ ప్లాట్ ఫాం ఇప్పటివరకు 8,500మంది విద్యార్ధులను ఆకట్టుకుంది. స్టూడెంట్స్ మొదట డెమో చూసి, నచ్చితే ఆయా కోర్సులకు సంబంధించిన వీడియో పాఠాలను కొనుక్కుంటారు. మొత్తం కోర్సు లేదా, విడివిడి పాఠాలను కూడా కొనుక్కునే అవకాశం ఉంది. వీటి విలువ 500నుండి 10,000 రూపాయల వరకు ఉన్నాయి. ఈ ఫీజు బయట క్లాసులకు కట్టాల్సిన దానికంటే దాదాపు సగం పైగా తక్కువగా ఉండటం విశేషం.. 

ప్రస్తుతం జీరో ఇన్ఫీలో 8 మంది ఉద్యోగులున్నారు. 25 మంది ఇన్స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. డిటిజల్ మార్కెటింగ్ ద్వారా ఈ ప్లాట్ ఫామ్ దుర్గాపూర్, భువనేశ్వర్, విజయవాడ, అసన్ సోల్ మొదలైన ద్వితీయ శ్రేణి నగరాల విద్యార్ధులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత డిసెంబర్ లో, జనవరి2016లో 3.2లక్షల ఆదాయాన్ని కూడా సంపాదించారు. ఈ నెలలో రెండున్నరలక్షలు సాధించగలరని భావిస్తున్నారు. 

భవిష్యత్తు చాలా ఉంది.. 

రాబోయే కొద్ది నెలల్లో జీరోఇన్ఫీ.కామ్ మార్కెటింగ్ పై మరింత దృష్టి పెట్టే యోచనతో ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మార్కెట్ లో సింహభాగం సాధించటమే కాదు.. ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికైతే ఫేస్ బుక్ ద్వారా విద్యార్ధులను చేరేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాదు.. ఆయా కళాశాలల్లో అవేర్ నెస్ పెంచటానికి సెమినార్లు కూడా నిర్వహిస్తోంది. 

ఎంత ఆన్ లైన్ పాఠాలైనా, సీడీలు అమ్మేశామా... ఫీజు తీసుకున్నామా అన్నట్టు కాకుండా విద్యార్ధులకు ఉపయోగపడే ప్లాన్స్ చాలా సిద్ధం చేస్తోంది జీరోఇన్ఫీ. ఇందులో భాగంగా మార్చ్ మొదటి వారంలో స్టార్టప్ మెంటర్ మాడ్యూల్ ని విడుదల చేయాలని చూస్తోంది. దీనికోసం సీఏ టాప్ ర్యాంకర్లు, ఐఐటి ర్యాంకర్లతో టై అప్ కూడా పెట్టుకున్నారు. జీరోఇన్ఫీలో కోర్సు కొనుగోలు చేసిన ప్రతి విద్యార్ధికీ ఓ మెంటార్ ని ఎసైన్ చేస్తారు. ఇది విద్యార్ధుల ప్రగతిని మానిటర్ చేసేందుకు ఉపయోగపడుతుంది..

ఇప్పటికే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుండి పెట్టుబడి వసూలు చేశారు...కానీ, వ్యాపారం అభివృద్ధి చెందాలంటే మరింత పెట్టుబడి కావాలి. దీనికోసం కొత్త ఇన్వెస్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. అంతే కాదు...వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 కోట్ల రెవిన్యూ కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.

image


విద్యారంగం+సాంకేతిక ప్రగతి....

స్మార్ట్ ఫోన్లు, నోట్ బుక్స్, పామ్ టాప్స్ లాంటి అందుబాటులోకి వచ్చి విద్యారంగాన్ని సమూలంగా మార్చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్లాస్ రూమ్ పాఠాల రెగ్యులర్ చదువులో ఇప్పుడో విప్లవమే రాబోతోంది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ 2017కల్లా 40 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనాలున్నాయి. రియల్ టైమ్ బుక్ అప్ డేట్స్, ఆన్ లైన్ ట్యూషన్లు, ఎడ్యుటెయిన్ మెంట్, హెచ్ డీ క్వాలిటీ ఎడ్యుకేషనల్ వీడియోలు, ఆన్ లైన్ టెస్టుల ద్వారా ఎడ్యుకేషన్ స్టార్టప్స్ విద్యార్ధులను అనూహ్యంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి నగరాలనుండి, చిన్న పట్టణాలకు సైతం వేగంగా విస్తరిస్తున్నాయి.

వేదాంతు, సింప్లిలెర్న్, బైజు, టాపర్, ఐప్రాఫ్ లెర్నింగ్ సొల్యూషన్స్, ఎడ్యూకార్ట్, టాలెంట్ ఎడ్జ్, సూపర్ ప్రాఫ్, ఎంబైబ్.కామ్... మొదలైన సంస్థలు ఇప్పుడు ఎడ్యుటెక్ రంగంలో పోటీపడుతున్నారు. ఫ్యూచర్ గ్రోత్ ని వివరిస్తూ పెద్ద కంపెనీల నుండి పెట్టుబడులు పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. వేదాంతు ఇప్పటికే 5మిలియన్ డాలర్లను టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్టనర్స్ నుండి పొందింది. టాపర్ 10మిలియన్ డాలర్లను ఎస్ ఏఐఎఫ్, హీలియన్, ఫిడెలిటీ గ్రోత్ నుండి, మెరిట్ నేషన్ 5 మిలియన్ డాలర్లను ఇన్ఫో ఎడ్జ్ నుండి, సింప్లి లెర్న్ 15 మిలియన్ డాలర్లను మే ఫీల్డ్ ఫండ్ మరియు కలారి క్యాపిటల్ నుండి, ఎడ్యుకార్ట్ 1మిలియన్ డాలర్లను యు వియ్ క్యాన్ విన్ వెంచర్స్ మరియు యునైటెడ్ ఫిన్సెక్ నుండి పెట్టుబడులు సంపాదించాయి.

"అంతా స్మార్ట్ మయమై, స్టార్ ఫ్టోన్లను అటు విద్యార్థులు, ఇటు టీచర్లు మాధ్యమంగా వాడుతున్న సందర్భంలో స్టూడెంట్ ప్రతిభ, టీచర్ చొరవ రెండిటినీ సరిగ్గా అంచనా వేసే వీలు కలుగుతోంది. రాబోయే కాలమంతా ఈ ఎడ్యూ టెక్ రంగానిదే అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు- మనీష్ శర్మ, చీఫ్ రెవిన్యూ ఆఫీసర్, విజ్ ఐక్యూ, క్లౌడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాం..