హైదరాబాదులో అట్టహాసంగా మొదలైన ఇండియన్ ఏవియేషన్ షో-2016

హైదరాబాదులో అట్టహాసంగా మొదలైన ఇండియన్ ఏవియేషన్ షో-2016

Tuesday March 15, 2016,

4 min Read


భారీ బోయింగ్ విమానాలు.. బుల్లి ఛార్టర్డ్ ఫ్లైట్లు.. రకరకాల హెలికాప్టర్లు.. పెద్దపెద్ద కార్గో ఫ్లయిట్స్.. నిత్యం గగనతలంలో విహరించే లోహ విహంగాలు నేలమీద వాలిపోయాయి. అందంగా ముస్తాబై అన్నీ ఒక్కచోట చేరి కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ బేగం పేట్ ఎయిర్ పోర్టులో 5వ ఇండియన్ ఏవియేషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిక్కీ ఆధ్వర్యంలో ఇండియన్ ఏవియేషన్ షో-2016 ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తోపాటు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్చి 16 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో వివిధ దేశాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.

image


మొత్తం ఐదు రోజుల పాటు ఏవియేషన్ షో జరుగుతుంది. మొదటి మూడు రోజులు బిజినెస్ సమ్మిట్స్ ఉంటాయి. ఒక అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల సీఈవోలు, విమానయాన సంస్థలు, ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారులు, ట్రైనింగ్ సంస్థలు, కార్గో ప్రతినిధులు పాల్గొంటారు. ఐదు రోజుల్లో రెండుసార్లు వైమానిక విన్యాసాలు ప్రదర్శిస్తారు. యూకే నుంచి వచ్చిన మార్క్ జెఫ్రిస్ ఏరోబాటిక్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

వైమానిక రంగంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో భారత్ 9వ స్థానంలో ఉందని.. 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విమాన సేవలు విస్తరించాలని కోరారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమన్నారు సీఎం కేసీఆర్. రెండు ఏరో స్పేస్ పార్కులతో పాటు అనేక రక్షణ సంస్థలు హైదరాబాదులో ఉండటం విమానయాన రంగానికి మంచి అడ్వాంటేజ్ అన్నారు. ఏవియేషన్ షో విజయవంతం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇండియాలో ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. హైదరాబాద్ వేదికగా ఏవియేషన్ షో జరగడం సంతోషంగా ఉందన్నారు. ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామన్నారు.

image


బడా బడా బోయింగ్ ల దగ్గర్నుంచి బుల్లి బుల్లి ఛార్టర్డ్ ఫ్లైట్ల వరకు రకరకాల లోహ విహంగాలను ప్రదర్శనకు ఉంచారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్, టెక్స్ ట్రాన్, ఎంబార్, గల్ఫ్ స్ట్రీమ్, దస్సాల్ట్ తదితర దిగ్గజ కంపెనీలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ బోయింగ్ ఏ-380, ఎయిర్ బస్ 747, ఏ-800, హాల్ కంపెనీ డార్నియర్, ట్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన టీఏసీ 003, పవన్ హన్స్ ఎంఐ 172, ఖతర్ ఎయిర్ వేస్‌కు చెందిన ఏ-350, ఎయిర్ ఏషియా విమానం ఏ 330-300, లెగసీ 500-650, ఎథాద్ బీ-787, భెల్ 439 హెలికాప్టర్, అగస్టా వెస్ట్ లాండ్ 109 ఎస్పీ తదితర లోహ విహంగాలు షోలో కొలువుదీరాయి. వీటితోపాటు ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైన సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవియేషన్, రోల్స్ రాయిస్ తదితర కంపెనీల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. షో మొత్తానికి ఎయిర్ బస్-380 హెలైట్ అని చెప్పొచ్చు! ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం కూడా ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చివరి రెండు రోజులు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. టికెట్ ధర 300 రూపాయలు. ఏవియేషన్ షో డాట్ కామ్ తోపాటు యాక్సిస్ బ్యాంకులో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రదర్శనకు ఉంచిన విమానాలు, హెలికాప్టర్‌లను 30 అడుగుల దూరంలో ఉన్న బారికేడ్ల అవతలి నుంచి మాత్రమే చూడాలి. ఏవియేషన్ షోకు పటిష్టమైన భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మెట్రో రైలు పనుల కారణంగా ఏవియేషన్ షోకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. మొత్తం 600 మంది రాష్ట్ర పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందితో వైమానిక ప్రదర్శనకు భద్రత కల్పిస్తున్నారు.

image


ఇకపోతే ఏవియేషన్ షో సందర్భంగా మరో అంతర్జాతీయ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. ప్రఖ్యాత ఫ్లై దుబాయ్ సంస్థ 100 కోట్ల పెట్టుబడితో ఇక్కడ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఫ్లై దుబాయ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ప్రాథమిక స్థాయి చర్చలు జరిపింది. దుబాయ్ ప్రభుత్వానికి చెందిన ఫ్లై దుబాయ్ సంస్థ 90 దేశాల్లో వైమానిక సేవలను అందిస్తున్నది. అంతటి దిగ్గజ కంపెనీ తన ఏకైక టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం! ఈ ఒప్పందం కుదిరిన అనంతరం ఫ్లై దుబాయ్ కంపెనీ జీఎంఆర్ సంస్థతో కలిసి ట్రిపుల్ ఐటీ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకోనుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ ద్వారా వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రపంచ ఏవియేషన్ మార్కెట్లో ఇప్పుడు ఇండియాది 9వ స్థానం. 2020 నాటికి అమెరికా, చైనా తర్వాత థర్డ్ ప్లేస్ లో నిలవడానికి భారత్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఇండియన్ ఏవియేషన్ షోను వేదికగా మలుచుకుంది. దేశ విదేశీ ఏవియేషన్ రంగ దిగ్గజాలు తరలివచ్చే ఈ ప్రదర్శన ద్వారా ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ ను మరింతగా విస్తరించుకోవచ్చని భారత పౌర విమానయాన శాఖ భావిస్తోంది. ఎనిమిదేళ్ల కిందట తొలిసారిగా ఇండియన్ ఏవియేషన్ షోకు అంకురార్పణ జరిగింది.

image


2008లో బేగంపేట్ ఎయిర్ పోర్టు వేదికగా మొట్టమొదటి వైమానిక ప్రదర్శన జరిగింది. ఇండియాలో పౌర విమానయానం, ఏరో స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి ఇదే అతి పెద్ద షో కావడం విశేషం! ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. అందునా ఇండియన్ ఏవియేషన్ షో లాంటి భారీ ప్రదర్శనకు భాగ్యనగరమే శాశ్వత వేదిక కావడం- బ్రాండ్ హైదరాబాద్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం. హైదరాబాద్ విశ్వనగర బాటలో ఇండియన్ ఏవియేషన్ షో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.