ఆటాడుకుందాం రా.. అంటున్న ప్లేయర్స్ విల్లా!
సిటీల్లో ఔట్‌డోర్ స్పోర్ట్స్ వివరాలను అందిస్తున్న ప్లేయర్స్ విల్లా..
అలసిపోయిన శరీరాలకు కాస్తంత స్వాంతన కావాలి. అందుకు ఒకొక్కరూ ఒకొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతమందికి మ్యూజిక్ వింటే మైండ్ రిలాక్సవుతుంది. కొంతమందికి టీవీ చూస్తే టెన్షన్స్ మర్చిపొతారు. మరికొంతమంది గేమ్స్ ఆడితే రిలాక్సేషన్ పొందుతారు. బాగానే ఉంది, ఎవరితో ఆడాలి? అర్బనైజేషన్ పుణ్యమా అని ఉన్న నాలుగు గ్రౌండ్లలో అపార్ట్మెంట్లు వచ్చేశాయి. ఇళ్ల మధ్య కాసేపు షటిల్ ఆడదామంటే ఖాళీ స్ధలం కనబడే ముచ్చటే లేదు. ఇక హైదరాబాద్, ముంబైలాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే.. పొద్దున అదో పెద్ద పనిలా బయల్దేరి వెళితే కానీ.. గంట స్పోర్ట్స్ ఆడే అవకాశం లేదు. ఏం చేయాలి? ఎవరితో ఆడాలి? కనీసం కోచ్‌లు ఎక్కడ దొరుకుతారో కూడా తెలియదు. సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఆ సమస్యకు పరిష్కారంగా లాంచ్ అయిందే.. ప్లేయర్స్ విల్లా.
"గత ఏడాది కార్పొరేట్ వాల్డ్ నుంచి బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. స్పోర్ట్స్ నా అభిరుచి. బ్యాడ్మింటన్ క్రాష్కోర్స్లో జాయిన్ అయ్యి.. చుట్టుపక్కల జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో పాల్గొందామని అనుకున్నాను. ఆన్లైన్లో వెతికితే.. ఏ సమాచారం కూడా పక్కాగా లేదు. లోకల్ ప్లేయర్స్‌ని ఎలా కలుపుకోవాలో.. ట్రైనింగ్ ఎలా తీసుకోవాలో ఇన్ఫర్మేషన్ దొరకలేదు" అంటారు ప్లేయర్స్ విల్లా ఫౌండర్ 33 ఏళ్ల శేఖర్ పాణిగ్రాహి.
ముంబై కేంద్రంగా 2015 మార్చ్‌లో శేఖర్.. తన మిత్రుడు సలీమ్‌ఖాన్‌తో కలిసి ప్లేయర్స్ విల్లాను మొదలుపెట్టారు. మీ చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్ల వివరాలు, కోచ్‌ల వివరాలతో పాటు.. గ్రౌండ్స్, అక్కడ ఉండే సదుపాయాలు.. ఇలా స్పోర్ట్స్‌కు సంబంధించిన సమస్త లోకల్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో దొరుకుతుంది.
ప్లేయర్స్ విల్లా మొదలుపెట్టకముందు.. సలీం ఫుడ్‌పాండాలో పనిచేశారు. శేఖర్‌కు విప్రో, అల్ట్రాటెక్లలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతానికి స్పోర్ట్స్ విల్లాలో ఆరుగురు ఫుల్‌టైమ్ ఎంప్లాయీస్‌తో పాటు ముగ్గురు ట్రైనీలు పనిచేస్తున్నారు. సేల్స్ మార్కెటింగ్ టీమ్‌ను త్వరలోనే తీసుకుంటామని అంటున్నారు ఫౌండర్స్.
టీవీలో క్రికెట్ మినహా.. స్పోర్ట్స్‌కి మన దేశంలో ఆదరణ తక్కువనే చెప్పాలి. అందుకే.. ఈ కాన్సెప్ట్‌లో మార్కెట్‌ను వెతకడం కాస్త కష్టమైంది. అన్నిటికంటే.. ప్లాట్‌ఫాంకు యూజర్స్‌ని తీసుకురావడం అతిపెద్ద సమస్య అయింది. అయితే, ఆలోచనపై కాన్ఫిడెన్స్ పెట్టుకుని.. ప్లేయర్స్ విల్లా టీమ్.. మార్కెట్లో సర్వేచేసింది. ఎక్కువ శాతం మందికి ఈ కాన్సెప్ట్ నచ్చడంతో ఎలాగైనా చేయాలని ఫిక్సయ్యారు. కేవలం 30 నుంచి 50 మంది యూజర్స్‌తో మొదలైన ఈ వెబ్సైట్లో.. ఇప్పుడు 600 మందికిపైగా ఉన్నారు.
ప్రస్తుతానికి ముంబైలోని ములుంద్, సియోన్, కుర్లా, గట్కోపర్, అంధేరి, బోరివిల్లీ, పోవై ఏరియాలను ప్లేయర్స్విల్లా కవర్ చేస్తోంది. త్వరలో బెంగళూరు, పుణెలను కలపాలని అనుకుంటున్నారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్వెస్టర్ ద్వారా రూ.25లక్షలు ఫండింగ్ దక్కించుకున్న ఈ కంపెనీ.. రాబోయే రోజుల్లో మరో రౌండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను తీసుకోబోతోంది.
ఎలా పనిచేస్తుంది?
చాలా సింపుల్. స్పోర్ట్స్‌కి సంబంధించి ఎలాంటి అవసరాలున్నా ఈ సైట్ అందిస్తుంది. ప్రస్తుతానికి బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, టెన్నిస్, టేబుల్ టెన్సిస్, జుంబా గేమ్స్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ను పెట్టారు.
సైట్లో నాలుగు రకాల సేవలు ఉన్నాయి. కోచ్‌కు వెతుక్కోవచ్చు. గ్రౌండ్‌ని బుక్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనచ్చు. మిగతా ఆటగాళ్లతో కనెక్ట్ కావచ్చు.
అకాడమీలు, కోచ్‌ల దగ్గర్నుంచి కమీషన్ తీసుకోవడంతో పాటు.. గ్రౌండ్స్ బుక్ చేసినప్పుడు పర్సెంటేజ్.. యాడ్లు ఇవ్వడం.. ఇలా రకరకాల రెవెన్యూ మోడల్స్‌తో ప్లేయర్స్ విల్లా సక్సెస్‌బాటలో పరిగెడుతోంది.
యువర్‌స్టోరీ విశ్లేషణ
ఇదే కాన్సెప్ట్ మీద కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. బెంగళూరులో పాయో, జాయిన్ మై గేమ్, ప్లే యువర్ స్పోర్ట్ లాంటి కంపెనీలు ఇలాంటి సర్వీసులనే అందిస్తున్నాయి. హైదరాబాద్ ఇన్వెస్టర్ల నుంచి ప్లే యువర్ స్పోర్ట్ ఈ మధ్యనే రూ.10లక్షల ఫండింగ్ దక్కించుకుంది. మరికొన్ని కొత్త కంపెనీలు ఇదే కాన్పెప్ట్ మీద రాబోతున్నాయి. ఔట్‌డోర్ స్పోర్ట్స్ సెక్టార్‌కు భవిష్యత్తు కనిపిస్తున్నాయి.. దక్కించుకునే ఫండింగ్ మీదే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.